టీవీక్షణం: వంట.. జీవితాన్నే మార్చేస్తుంది !
వంట... అరవై నాలుగు కళల్లో ఒకటి. కానీ అది దైనందిన కార్యక్రమాల్లో ఒకటిగా ఇన్నాళ్లూ ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే ఓ కళగా నిజమైన గుర్తింపు పొందుతోంది. దానికి కారణం... టీవీ చానెళ్లు. మీ ఇంటి వంట, మా ఊరి వంట, ఘుమఘుమలు, స్వీట్‌హోమ్ అంటూ పలు రకాల కుకరీ షోలకు తెర తీశాయి మన తెలుగు చానెళ్లు. అయితే జెమిని టీవీలో వస్తోన్న ‘వంటింట్లో వండర్స్’ వీటన్నిటికీ భిన్నమైనది. ఇది వంటల ప్రోగ్రామ్ కాదు... వంటల పోటీ. కాస్త వైవిధ్యంగా ఉండటంతో బాగానే సక్సెస్ అయ్యింది. అయితే ఇది మనకు కొత్తేమో గానీ, ఉత్తరాది వారికి కాదు. ఎందుకంటే అక్కడ ఇలాంటి ఒక పోటీ సంచలనం సృష్టించింది. వంట చేసేది కడుపు నింపుకోవడానికే కాదు, అది జీవితాన్నే మార్చేయగలదు అన్న భావన తీసుకొచ్చింది. కుకరీ షోలకి కొత్త అర్థం చెప్పిన ఆ ప్రోగ్రామ్.. మాస్టర్ చెఫ్!
కొందరు పోటీదారులు. అందరూ చక్కగా వండగలిగినవారే. పలు రౌండ్స్‌లో వారందరి పాక నైపుణ్యాన్నీ పరీక్షిస్తారు. మారుమూల గ్రామాల వంటకాల నుంచి, విదేశాల్లోని స్టార్ హోటళ్లలో లభించే అరుదైన డిషెస్ వరకూ... దేనినైనా చేయాల్సి రావచ్చు. చేస్తేనే గెలుపు. అయితే కొన్నిసార్లు కొందరు బాగా తెలిసిన వంటకాన్ని తయారు చేయడంలో సైతం విఫలమవుతారు. అందుకే వారానికొకరు ఎలిమినేట్ అవుతారు. చివరకు మిగిలినవారు మాస్టర్ చెఫ్ టైటిల్‌ని గెలుచుకుంటారు. కోటి రూపాయల నగదు, స్టార్ హోటల్లో చెఫ్‌గా ఉద్యోగం, తమ వంటల్ని పుస్తకంగా ముద్రించుకునే అవకాశంతో పాటు విదేశీయానం తదతర బహుమానాలు వచ్చి విజేత ఒళ్లో వాలతాయి.
కలర్స్ చానెల్లో ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ ఇప్పటికే మూడు సిరీస్‌లు పూర్తి చేసుకుంది. పంకజ్ భదోరియా, షిప్రా ఖనా, రిపూదమన్ హాండాలు విజేతలు. మొదటి సిరీస్‌కి ఒకప్పుడు చెఫ్‌గా పని చేసిన హీరో అక్షయ్‌కుమార్‌తో పాటు చెఫ్ అజయ్ చోప్రా, కునాల్ కపూర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తే... రెండో సిరీస్‌కి అజయ్, కునాల్‌లతో పాటు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వికాస్‌ఖన్నా జడ్జిగా వ్యవహరించారు. మూడో సిరీస్‌కి కునాల్, వికాస్‌లతో మన దేశ నంబర్‌వర్ చెఫ్ సంజీవ్ కపూర్ జతకట్టారు. ఇప్పుడు జరుగుతున్న మాస్టర్ చెఫ్ జూనియర్స్ నడుస్తోంది. అనుభవం గల చెఫ్‌ల ఆధ్వర్వంలో జరగడంతో పాటు, గెస్టులుగా వచ్చే సినీ తారలు ప్రోగ్రామ్‌కి మరింత క్రేజ్‌ను తీసు కొచ్చారు. అందుకే దీనికి ప్రాచుర్యం ఎక్కువ. టీఆర్పీ కూడా ఎక్కువే.
నిజానికి మాస్టర్ చెఫ్ వెనకాల పెద్ద చరిత్రే ఉంది. 1990లో యూకేకి చెందిన ఫ్రాంక్ రోడమ్ మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్‌కి రూపకల్పన చేశారు. అది విజయవంతం కావడంతో పలు దేశాల చానెళ్లు ఈ ప్రోగ్రామ్‌ని మొదలుపెట్టాయి. ఇప్పుడు మొత్తం ముప్ఫై అయిదు దేశాల్లో ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతోందంటే అర్థం చేసుకోవచ్చు... అది జనాన్ని ఎంతగా ఆకర్షించిందో! ప్రతి దేశంలోనూ ప్రోగ్రామ్ ఫార్మేట్ ఒకటే. లోగో కూడా ఒకటే. ఎలాంటి మార్పులూ లేకుండా, ఇన్ని దేశాల్లో ఒకే విధంగా ప్రదర్శితం కావడం, ఒకే రకమైన క్రేజ్ సంపాదించడం... బహుశా మాస్టర్ చెఫ్‌కి మాత్రమే చెల్లిందేమో!