
సాక్షి,హైదరాబాద్: తమపై అసత్య ప్రచారం చేస్తున్న పలు టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. మొత్తం 10 సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లతో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చారు.
కేవలం ఒక కుట్ర, ఎజెండాలో భాగంగా తమపై ఈ ప్రచారం జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. తమకు సంబంధం లేని విషయాలలో, తమ పేరును, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానళ్లపై న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు.
గతంలోనూ తమపై అసత్య ప్రచారం చేస్తున్న పలు సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఆయా సంస్థలు తప్పును సరిదిద్దుకొని, అసత్యపూరిత వీడియోలను తీసివేస్తున్నామని ప్రకటించాయి.