అసత్యాలు ప్రసారం చేస్తే కేసులు పెడతాం | KTR Warns YouTube Channels Against Airing Malicious Content On BRS Party, Details Inside - Sakshi
Sakshi News home page

అసత్యాలు ప్రసారం చేస్తే కేసులు పెడతాం

Published Mon, Mar 25 2024 4:02 AM | Last Updated on Mon, Mar 25 2024 3:01 PM

KTR Warns YouTube Channels Against Airing Malicious Content on BRS - Sakshi

యూట్యూబ్‌ చానళ్లకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: వ్యక్తిగతంగా తనతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీని దెబ్బతీయాలనే కుట్రతో కొన్ని యూట్యూబ్‌ చానళ్లు పనిచేస్తున్నా­యని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న చానళ్లపై ఇప్పటికే యూట్యూబ్, గూగుల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్‌ చానళ్లపై పరువు­నష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు పెడతామని చెప్పారు. ఈ తరహా చానళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో కేటీఆర్‌ పలు వ్యాఖ్యలు చేశారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్‌ చానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని  కేటీఆర్‌ పేర్కొన్నారు.  ‘ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్‌ నెయిల్స్‌ పెడుతూ వార్తల పేరిట పచ్చి అబద్ధాలను చూపిస్తున్నాయి. మాపై గుడ్డి వ్యతిరేకత లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలు, ఫేక్‌ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతోంది.  ప్రజలను అయోమయానికి గురిచేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యలుగా వీటిని భావిస్తున్నాం.’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

 వారిపై చర్యలు తప్పవు
‘గతంలో మాపై అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాం. కొన్ని యూట్యూబ్‌ చానల్స్‌ ప్రస్తుతం చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఇప్పటికైనా ఈ చానళ్లు తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్‌ చానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్‌ హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement