Gemini tv
-
కొత్త సీరియల్ సివంగి.. ఎప్పటినుంచి ప్రారంభమంటే?
సీరియల్స్ అంటే ఆడవాళ్లకు ఎంతో ఇష్టం. అందుకే వారికి నచ్చేలా, వారు మెచ్చేలా ఎన్నో రకాల సీరియల్స్ తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో జెమిని టివి "సివంగి” అనే సరికొత్త సీరియల్ తీసుకొస్తోంది. దీన్ని మార్చ్ 25 నుంచి ప్రసారం చేయనుంది. కథేంటంటే.. ఒక పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టి, ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ అమ్మానాన్నలకు ఆర్థికంగా సహాయపడుతూ , స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడిపే అమ్మాయి ఆనంది. ఊళ్లో ఎవరికీ ఏ కష్టం వచ్చినా సొంత మనిషిలా వెళ్లి సహాయపడుతుంది. అక్క పెళ్లిలో ఏర్పడిన అనుకోని పరిస్థితుల వల్ల ఒక కొడుకులా ఇంటి బాధ్యతలు భుజాన వేసుకొని, అవి నెరవేర్చడానికి సిటీకి ప్రయాణమవుతుంది. సిటీకి వెళ్లిన ఆనంది ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తన అక్క పెళ్లి చేయగలిగిందా? తిరిగి తన ఊరు వెళ్లగలిగిందా? అనేది తెలియాలంటే సివంగి సీరియల్ చూడాల్సిందే! ఈ ధారావాహిక మార్చి 25న ప్రారంభమవుతోంది. ప్రతిరోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రసారం కానుంది. "సివంగి” సీరియల్లో ప్రతిమ, రేణుక, నటకుమారి, చంద్రశేఖర్, శ్రీ ప్రియ తదితర నటీనటులు నటించారు. -
గణేష్ మండపాల వద్దకు టీవీ సీరియల్ నటీనటులు.. ఎవరో తెలుసా?
హైదరాబాద్‌లో వినాయకుడి పండుగ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగా బొజ్జ గణపయ్య మండపాలు వేల సంఖ్యలో ఉంటాయి. వినాయకుడి పండుగ సందర్భంగా జెమిని టీవీలో ప్రసార అయ్యే 'ఒంటరి గులాబి' సీరియల్ టీమ్ వారు ఒక విభిన్నమైన ప్రచారానికి తెరలేపారు. వారందరూ కలిసి హైదరాబాద్‌లోని ప్రతి వినాయకుడి మండపాన్ని సందర్శించనున్నారు. నగరంలోని నలుమూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా వారు సందర్శించనున్నారు. అంతేకాకుండా అక్కడ గణేష్ పూజలో పాల్గొని.. అక్కడి నిర్వాహకులతో పాటు భక్తులను స్వయంగా కలిసి వారితో ముచ్చటిస్తారు. అలా మీ ప్రేక్షక అభిమాన నటినటులు మీ వీధి, మీ కాలనీ, మీ గల్లికీ త్వరలో రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా దిల్సుఖ్నగర్ వివేకానంద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్, సరూర్ నగర్ నవజీవన్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపాలను 'ఒంటరి గులాబి' సీరియల్లో లీడ్ రోల్లో నటించిన నటీనటులు సందర్శించారు. ఈ సీరియల్లో హీరో,హీరోయిన్గా నటిస్తున్న బాలు (రాహుల్ రవి), రోజా (సుప్రిత) నేరుగా గణేష్ మండపానికి వచ్చి సందడి చేశారు. వారితో ఫోటోలు దిగిన స్థానికులు ఎంతో సంబరపడుతున్నారు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీరియల్ మేకర్స్‌కు వచ్చిన విభిన్నమైన ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
ఆకాశవాణి... యూఎస్ కేంద్రం!
ఆకాశవాణి శ్రోతలకు ఆమె గొంతు సుపరిచితం. తొలితరం తెలుగు టీవీ ప్రేక్షకులకు ఆమె నటన చిరపరిచితం. ఇరవయ్యేళ్ల కిందట తెలుగు చిత్ర కథానాయికల గళం ఆమె. పేరు... ఉదయగిరి రాజేశ్వరి. ఇప్పుడు... యూఎస్‌లో తెలుగు వాణి ఆమె. యూఎస్ తెలుగు రంగస్థల నిర్మాత. ప్రాక్– పశ్చిమ తెలుగుకు సాంస్కృతిక వారధి. ‘‘నాకు స్టేజి ముందున్న జ్ఞాపకం లేదు. ఎప్పుడూ స్టేజి మీదనే ఉండేదాన్ని. అమ్మ రచయిత. ఆమె రాసిన నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యేవి. అలా నాకు చిన్నప్పుడే రేడియోతో పరిచయం ఏర్పడింది. స్కూల్ ప్రోగ్రామ్స్‌లో కూడా తప్పకుండా పాల్గొనేలా చూసేది అమ్మ’’ అంటూ తన ఎదుగుదలలో తల్లి అత్తలూరి విజయలక్ష్మి పాత్రను గుర్తు చేసుకున్నారు ఉదయగిరి రాజేశ్వరి. ‘‘రేడియోలో నా ఎంట్రీ కూడా అమ్మ నాటకంతోనే. ఆ నాటకం కోసం ఆడిషన్స్ జరిగినప్పుడు నేను ‘బి’ గ్రేడ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యాను. ఆ తర్వాత ‘ఏ’ గ్రేడ్‌కి ప్రమోట్ అయ్యాను. అమ్మ ఎప్పుడూ ‘నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్. అందుకే నిన్ను స్టేజ్ మీదనే పెంచాను’ అంటుండేది. బాల్యంలో సరైన ఎక్స్పోజర్ లేకపోతే ఆ భయం ఎప్పటికీ వదలదేమోనని ఆందోళన ఆమెకి. అందుకే నన్ను ఊహ తెలిసేటప్పటికే స్టేజి మీద నిలబెట్టింది. రేడియో తర్వాత టీవీకి కూడా పరిచయం చేసింది. జెమినీ టీవీలో ‘బిజినెస్ ట్రాక్స్, యువర్స్ లవింగ్లీ వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేశాను. స్వచ్ఛమైన తెలుగు, మంచి డిక్షన్ ఉండడంతో ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా రాణించగలిగాను. మొదట్లో నాకు ఆన్ స్క్రీన్ మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ అమ్మ సరదా కొద్దీ యాంకరింగ్ చేశాను. ప్రముఖుల పరిచయాల్లో భాగంగా యండమూరి వీరేంద్రనాథ్గారిని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడాయన సీరియల్స్‌లో చేయమని అడగడంతో కొద్దిపాటి సందిగ్ధతతోనే ‘ప్రియురాలు పిలిచె’లో నటించాను. శాంతి నివాసం, ఎడారి కోయిలలో కూడా మంచి పాత్రలే వచ్చాయి. స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తే అది ఎలా ఉందనేది ప్రేక్షకులు చెప్తారు. కెమెరా ముందు ప్రోగ్రామ్ చేసిన తర్వాత అది ప్రసారం అయ్యేటప్పుడు ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూడడం చాలా థ్రిల్లింగ్‌గా ఉండేది. మా ఇంట్లో అందరిదీ ఒక్కటే ఫార్ములా. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్నింటిలో చురుగ్గా ఉన్నా సరే... చదువును నిర్లక్ష్యం చేయకూడదు. అందుకేనేమో నాకు చదువు మీద ఫోకస్ తగ్గకుండా అమ్మ చాలా జాగ్రత్త పడింది. అయితే నాకు ఆన్ స్క్రీన్ ఆసక్తి పెరిగే సమయంలో అమ్మ మాట మీద కొంతకాలం నటనకు దూరంగా ఉండి చదువుకే పరిమితమయ్యాను. ఎంసీఏ తర్వాత వెబ్స్మార్ట్లో ఉద్యోగంతో కొత్త జీవితం మొదలైంది. చదువుకుంటూ కూడా సినిమాల్లో డబ్బింగ్ చెప్పడం మాత్రం వదల్లేదు. ఇడియట్, శివమణి, ఏ ఫిల్మ్ బై అరవింద్ వంటి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. పెళ్లి, పాపకు తల్లి కావడం, సింగపూర్‌లో ఉద్యోగం, అక్కడి నుంచి 2005లో యూఎస్‌కి... అక్కడ బాబు పుట్టడం, ఉద్యోగం– కుటుంబాన్ని బాలెన్స్ చేసుకోవడం అనే ఒక రొటీన్ చక్రంలో కొంతకాలం గడిచిపోయింది. అయితే అంత బిజీలో కూడా నాకు కొంత వెలితిగా అనిపించేది. రేడియో నాటకాలు, టీవీ షోలు, సినిమా డబ్బింగ్‌ల మధ్య జీవించిన ప్రాణం కదా మరి’’ అన్నారామె నవ్వుతూ. అమ్మ చెప్పింది అమెరికాలో రాజేశ్వరి నివసిస్తున్న డాలస్‌లో కూడా తెలుగు రేడియో ఉందని, వీలయితే ప్రోగ్రామ్స్ చేయమని తల్లి సూచించడంతో ఆమెలోని కళాకారిణి ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఆమె సాహిత్యకాంక్ష ఆకాశంలో రెక్కలు విచ్చుకుంది. అలా 2006లో అమెరికా ఆకాశవాణితో గళాన్ని సవరించుకున్నారు రాజేశ్వరి. వారాంతాల్లో ప్రోగ్రామ్‌లు చేయడంతో అమెరికాకు చక్కటి తెలుగు భాషను వినిపించారు. ఆటా, తానా వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా అక్కడ మన భాష, సంస్కృతులకు జీవం పోస్తున్నారు. ప్రస్తుతం ఆమె సొంతంగా ‘రేడియో సురభి’ అనే ఎఫ్ఎమ్ రేడియోను రోజుకు ఇరవై నాలుగ్గంటల కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. ‘సరసిజ’ పేరుతో నాటకసంస్థను కూడా ప్రారంభించారామె. ‘‘విజయా వారి మిస్సమ్మ సినిమాను నాటకంగా ప్రదర్శించిన నా ప్రయోగం విజయవంతమైంది. సినిమాను స్టేజ్ మీద నాటకంగా ప్రదర్శించడం ప్రపంచంలో అదే మొదలు. అలాగే అమ్మ రాసిన ద్రౌపది అంతః సంఘర్షణ నాటకంలో ద్రౌపది పాత్ర పోషించాను. ‘అనగనగా ఒక రాజకుమారి, పురూరవ నాటకాలు కూడా అంతే ప్రజాదరణ పొందాయి. యూఎస్‌లో భారతీయ నాటకరంగం అనగానే మన వాళ్లందరికీ హిందీ నాటకాలే గుర్తుకు వసాయి. తెలుగుకు పెద్ద ఆదరణ ఉండదనే అపోహ ఉండేది. మనం చక్కగా ప్రదర్శిస్తే ఆదరణ ఎందుకు ఉండదు... అని చాలెంజ్‌గా తీసుకుని చేశాను. ప్రతి సన్నివేశానికి ముందు ఆడియోలో ఇంగ్లిష్‌లో నెరేషన్ చెప్పి ప్రదర్శించడం ద్వారా ఇతర భాషల వాళ్లు కూడా మన నాటకాన్ని ఆదరించారు. అలా నేను న్యూయార్క్‌లో ‘ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్’లో తెలుగు నాటకాన్ని ప్రదర్శించాను’’ అని తన కళాప్రస్థానాన్ని వివరించారామె. హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్‌లో బుధవారం (20–7–2022) నాడు ‘లేఖిని– వంశీ’ సంయుక్తాధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి రాజేశ్వరికి ‘సురభి జమునారాయలు– వంశీ రంగస్థల పురస్కారం, లేఖిని ఆత్మీయ పురస్కార ప్రదానం జరిగింది. ఆ సందర్భంగా సాక్షితో ముచ్చటించారామె. ‘‘మాడపాటి హనుమంతరావు గరల్స్ హైస్కూల్ నాకు మంచి తెలుగు భాషను నేర్పింది. చక్కటి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసింది’’ అంటూ తన ఎదుగుదలలో తాను చదువుకున్న స్కూల్ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు రాజేశ్వరి. రెండు గంటలు ఎవరూ కదల్లేదు యూఎస్... అన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కలిసి నివసిస్తున్న ప్రదేశం. అక్కడ అందరూ వాళ్ల వాళ్ల సంస్కృతిని పరిరక్షించుకుంటూ యూఎస్వాసులుగా కొనసాగుతుంటారు. మనవాళ్లు మాత్రమే త్వరగా మన సంస్కృతిని వదిలేస్తున్నారనిపించింది. నాకు చేతవచ్చినది ఏదో ఒకటి చేయాలని కూడా అనిపించింది. నాటకం మీద నాకున్న అభిలాషకు అది చక్కటి వేదిక అయింది. మొదట్లో స్టేజ్ షోకి ఎవరూ రారేమోననే భయంతో మిస్సమ్మ నాటకాన్ని ఫ్రీ షో వేశాం. ఏడువందల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం నిండిపోయింది. రెండు గంటల సేపు కదలకుండా చూశారు. పురూరవ నాటకాన్ని పిక్టోరియల్గా చిత్రీకరించి అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడం కూడా ఓ ప్రయోగమే. మన నాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. – ఉదయగిరి రాజేశ్వరి, రంగస్థల కళాకారిణి – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి. -
టీవీల్లో సందడి చేయనున్న 'శ్యామ్ సింగరాయ్'.. ఆరోజే ప్రసారం
నేచురల్ స్టార్ నాని, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవిల అద్భుతనటనగల ప్రేమ కావ్యం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 26న థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తర్వాత కొద్ది రోజులకు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ అనూహ్యమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ మూవీస్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఏకైక భారతీయ సినిమాగా గుర్తింపు కూడా పొందింది. ఈ సినిమా ప్రేమకథా అనేక ప్రేక్షక జనానికి ఎంతో నచ్చి ప్రశంసలు కురింపించారు. తాజాగా ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇక సినిమాను టీవీ ఆడియెన్స్ వీక్షించనున్నారు. ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో 'శ్యామ్ సింగరాయ్' ప్రసారం కానుంది. అంటే థియేటర్, ఓటీటీలో చూడని వీక్షకులు టీవీ ద్వారా ఈ సినిమాను వీక్షించవచ్చు. సుమారు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్లలో విడుదలైంది. పూర్వజన్మ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవితోపాటు కృతి శెట్టి, మడోన్నాసెబాస్టియన్లు హీరోయిన్లుగా అలరించారు. Story of Aspiring film maker haunted hy his past Shyam Singha Roy | April 3 | 6 PM#GeminiTV#UgadiwithShyamSinghaRoy #KrithiShetty @IamKrithiShetty@Sai_Pallavi92@NameisNani pic.twitter.com/DVeuYy0a4J — Gemini TV (@GeminiTV) April 1, 2022 -
జూ.ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్ ధరెంతో తెలుసా?
తమకు నచ్చిన హీరోల విషయంలో అభిమానులు ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందు ఉంటారు. తమ హీరోలకు సంబందించిన ప్రతి అప్ డేట్స్ గురుంచి అందరికంటే ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. ఎన్టీఆర్ ఏమి చేసినా కూడా అభిమానుల ప్రతి క్షణం అనుసరిస్తూ ఉంటారు. గతంలో రాజమౌళి కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు దాదాపు రూ.25 లక్షలకు పైగానే ఉంటుందని చెప్పారు. అలాగే, దర్శకుడు సుకుమార్ కూతురు వేడుకలో ఎన్టీఆర్ వేసుకున్న మాస్క్ గురించి ఆరా తీసి మరి అది యుఏ స్పోర్ట్స్ మాస్క్ అని అభిమానులు తెలిపారు. దాని ధర సుమారు రూ.2,340. ఎన్టీఆర్ ధరించిన మాస్క్ బ్రాండ్ కు సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆయన బ్లేజర్‌పై ఫ్యాన్స్ కన్ను పడింది. జెమిని టీవీలో వచ్చే "ఎవరో మీలో కోటీశ్వరులు" కార్యక్రమం కోసం ప్రోమోలో వేసుకున్న బ్లేజర్ గురుంచి చర్చ జరుగుతుంది. ఈ బ్లేజర్ ఖరీదు ఏకంగా 90 వేల రూపాయలు అని సమాచారం. ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం మనీష్ మల్హోత్రానే క్యాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో -
కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే..
మెరుపు తీగలా వచ్చిపోయే షోలు కొన్నైతే ప్రేక్షకుల మదిలో ముద్రించుకుపోయే షోలు మరికొన్ని. మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా ఇదే కోవలోకి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విజయవంతమైన ఈ షో హిందీలో కౌన్ బనేగా కరోడ్‌పతిగా ప్రసారమవుతోంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో అక్కడ సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో దీన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో ఇక్కడ కూడా విజయవంతమైంది. ఎవరు మీలో కోటీశ్వరులు | Gemini TV మీ జీవితాలని మార్చే గేమ్ షో , మీ ఆశలని నిజం చేసే గేమ్ షో "ఎవరు మీలో కోటీశ్వరులు " త్వరలో మీ జెమినీ టీవీ లో రాబోతుంది సిద్ధంగా ఉండండి . #ఎవరుమీలోకోటీశ్వరులు#GeminiTV #EvaruMeeloKoteeswarulu#EMKonGeminiTV#EvaruMeeloKoteeswaruluonGeminiTV pic.twitter.com/CpFuZtmrwm — Gemini TV (@GeminiTV) March 7, 2021 తాజాగా మరో కొత్త సీజన్‌ను ప్రారంభింబోతున్నారు. కాకపోతే ఈసారి జెమిని టీవీ షో పేరును కొంత మార్చి ఎవరు మీలో కోటీశ్వరులుతో ముందుకు వస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. 'సామాన్యుల జీవితాలను మార్చే గేమ్ షో, మీ ఆశలను నిజం చేసేందుకు జెమిని టీవీలో రాబోతోంది..' అంటూ వీడియో వదిలింది. కాగా ఈ సీజన్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన రంగంలోకి దిగితే టీఆర్పీలు ఆకాశాన్ని అంటడం ఖాయమని చెప్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ షో ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: రానా: త్వరలోనే సీజన్-3 ప్రారంభం -
నాతిచరామి
తెలుగువారి మనసు దోచే మెగా సీరియల్స్‌తో వినోదాన్ని అందించే జెమిని టీవీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మెగా సీరియల్ ‘నాతిచరామి’. ఎన్నో అద్భుతమైన పాత్రలతో సినీ ప్రపంచంలో సితారగా వెలుగొందిన భానుప్రియ, విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న సురేశ్ ప్రధాన పాత్రలుగా ఈ సీరియల్ జెమిని టీవీలో ప్రసారం అవుతోంది. భార్యాభర్తల అద్భుత మైన బంధానికి దృశ్య రూపం ఇస్తూ, ఒక ఆవేశ పూరితమైన నిర్ణయం వల్ల రెండు జీవితాల్లో ఎలాంటి సంఘర్షణలు రేగాయి? అనే కథనం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. మీ మనసుల్ని దోచుకోవటానికి వస్తోంది ‘నాతిచరామి’.. సోమ - శుక్ర రా.7 గం॥మీ జెమిని టీవీలో.... -
కాస్మొటిక్స్ విక్రయించిన సమంత
మాసబ్‌ట్యాంక్: ఓ కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ‘మేము సైతం’ ద్వారా అందాల తార సమంత చేసిన వినూత్న ప్రయత్నాన్ని జెమిని టీవీ శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న సూర్య ప్రకాష్ కుటుంబం కోసం లేడీస్ కాస్మొటిక్స్, మహిళల అలంకరణ వస్తువులను విక్రయించడం ద్వారా ఆమె చేయూతనందించింది. వెంకటేశ్వరరావు కొడుకు సూర్యప్రకాష్ రెండు కిడ్నీలు పాడవడంతో తన కిడ్నీ ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇన్ఫెక్షన్తో ఆ కిడ్నీ కూడా చెడిపోవడంతో అప్పు చేసి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయనకు ‘మేముసైతం’ బాసటగా నిలిచింది. సమంత చేసిన వినూత్న ప్రయత్నం జెమినిలో శనివారం ప్రేక్షకులు ముందుకు రానుంది. -
టీవీక్షణం: వంట.. జీవితాన్నే మార్చేస్తుంది !
వంట... అరవై నాలుగు కళల్లో ఒకటి. కానీ అది దైనందిన కార్యక్రమాల్లో ఒకటిగా ఇన్నాళ్లూ ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే ఓ కళగా నిజమైన గుర్తింపు పొందుతోంది. దానికి కారణం... టీవీ చానెళ్లు. మీ ఇంటి వంట, మా ఊరి వంట, ఘుమఘుమలు, స్వీట్‌హోమ్ అంటూ పలు రకాల కుకరీ షోలకు తెర తీశాయి మన తెలుగు చానెళ్లు. అయితే జెమిని టీవీలో వస్తోన్న ‘వంటింట్లో వండర్స్’ వీటన్నిటికీ భిన్నమైనది. ఇది వంటల ప్రోగ్రామ్ కాదు... వంటల పోటీ. కాస్త వైవిధ్యంగా ఉండటంతో బాగానే సక్సెస్ అయ్యింది. అయితే ఇది మనకు కొత్తేమో గానీ, ఉత్తరాది వారికి కాదు. ఎందుకంటే అక్కడ ఇలాంటి ఒక పోటీ సంచలనం సృష్టించింది. వంట చేసేది కడుపు నింపుకోవడానికే కాదు, అది జీవితాన్నే మార్చేయగలదు అన్న భావన తీసుకొచ్చింది. కుకరీ షోలకి కొత్త అర్థం చెప్పిన ఆ ప్రోగ్రామ్.. మాస్టర్ చెఫ్! కొందరు పోటీదారులు. అందరూ చక్కగా వండగలిగినవారే. పలు రౌండ్స్‌లో వారందరి పాక నైపుణ్యాన్నీ పరీక్షిస్తారు. మారుమూల గ్రామాల వంటకాల నుంచి, విదేశాల్లోని స్టార్ హోటళ్లలో లభించే అరుదైన డిషెస్ వరకూ... దేనినైనా చేయాల్సి రావచ్చు. చేస్తేనే గెలుపు. అయితే కొన్నిసార్లు కొందరు బాగా తెలిసిన వంటకాన్ని తయారు చేయడంలో సైతం విఫలమవుతారు. అందుకే వారానికొకరు ఎలిమినేట్ అవుతారు. చివరకు మిగిలినవారు మాస్టర్ చెఫ్ టైటిల్‌ని గెలుచుకుంటారు. కోటి రూపాయల నగదు, స్టార్ హోటల్లో చెఫ్‌గా ఉద్యోగం, తమ వంటల్ని పుస్తకంగా ముద్రించుకునే అవకాశంతో పాటు విదేశీయానం తదతర బహుమానాలు వచ్చి విజేత ఒళ్లో వాలతాయి. కలర్స్ చానెల్లో ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ ఇప్పటికే మూడు సిరీస్‌లు పూర్తి చేసుకుంది. పంకజ్ భదోరియా, షిప్రా ఖనా, రిపూదమన్ హాండాలు విజేతలు. మొదటి సిరీస్‌కి ఒకప్పుడు చెఫ్‌గా పని చేసిన హీరో అక్షయ్‌కుమార్‌తో పాటు చెఫ్ అజయ్ చోప్రా, కునాల్ కపూర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తే... రెండో సిరీస్‌కి అజయ్, కునాల్‌లతో పాటు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వికాస్‌ఖన్నా జడ్జిగా వ్యవహరించారు. మూడో సిరీస్‌కి కునాల్, వికాస్‌లతో మన దేశ నంబర్వర్ చెఫ్ సంజీవ్ కపూర్ జతకట్టారు. ఇప్పుడు జరుగుతున్న మాస్టర్ చెఫ్ జూనియర్స్ నడుస్తోంది. అనుభవం గల చెఫ్‌ల ఆధ్వర్వంలో జరగడంతో పాటు, గెస్టులుగా వచ్చే సినీ తారలు ప్రోగ్రామ్‌కి మరింత క్రేజ్‌ను తీసు కొచ్చారు. అందుకే దీనికి ప్రాచుర్యం ఎక్కువ. టీఆర్పీ కూడా ఎక్కువే. నిజానికి మాస్టర్ చెఫ్ వెనకాల పెద్ద చరిత్రే ఉంది. 1990లో యూకేకి చెందిన ఫ్రాంక్ రోడమ్ మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్‌కి రూపకల్పన చేశారు. అది విజయవంతం కావడంతో పలు దేశాల చానెళ్లు ఈ ప్రోగ్రామ్ని మొదలుపెట్టాయి. ఇప్పుడు మొత్తం ముప్ఫై అయిదు దేశాల్లో ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతోందంటే అర్థం చేసుకోవచ్చు... అది జనాన్ని ఎంతగా ఆకర్షించిందో! ప్రతి దేశంలోనూ ప్రోగ్రామ్ ఫార్మేట్ ఒకటే. లోగో కూడా ఒకటే. ఎలాంటి మార్పులూ లేకుండా, ఇన్ని దేశాల్లో ఒకే విధంగా ప్రదర్శితం కావడం, ఒకే రకమైన క్రేజ్ సంపాదించడం... బహుశా మాస్టర్ చెఫ్‌కి మాత్రమే చెల్లిందేమో!