డ్యూస్ | a story about tennis players | Sakshi
Sakshi News home page

డ్యూస్

Published Sun, Dec 15 2013 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

డ్యూస్

డ్యూస్

సృజనం
 సాయి బ్రహ్మానందం గొర్తి
  యూసెమెటీలో నాలుగు రోజుల కాంపింగ్ తరువాత మధ్యాహ్నమే తిరిగొచ్చాం. మా ఆవిడా పిల్లలూ మధ్యాహ్నం బయల్దేరుదామన్నా వినకుండా ఉదయాన్నే ప్రయాణం కట్టించాను. మా పెద్దాడయితే నిద్రకళ్లతోనే కారెక్కాడు. రెండోవాడు మాత్రం నా ప్లాను పసిగట్టాడు. ‘‘డాడ్‌కి టెన్నిస్ ఉండుంటుంది!’’ అని ముక్తాయించే సరికి, అనిత ఒంటికాలిపై లేచింది. టెన్నిస్ శాపనార్థ స్తోత్రం చదివి అక్షింతలు వేసేసింది. ఏం చెయ్యను? టెన్నిస్ ఆట నా బలహీనత. వారానికి కనీసం అయిదు రోజులైనా ఆడి తీరాలి. లేకపోతే ఒంట్లో తేళ్లు, జైలు పాకినట్లుంటుంది.
 
 ఇంటికి చేరుకున్న వెంటనే ఈమెయిల్ కోసం కంప్యూటర్ ఆన్ చేశాను. రోజూ క్లబ్బు నుండి కనీసం పాతికకు పైగా టెన్నిస్ మెయిళ్లే ఉంటాయి. నాలాంటి టెన్నిస్ పిచ్చోళ్లు మా క్లబ్బుల్లో చాలామందే ఉన్నారు. మా ఇంటి దగ్గర్లోనే కుపర్టినో టెన్నిస్ క్లబ్బుంది. కాంపింగులో నా ఐఫోను బ్యాటరీ చచ్చింది. అందువల్ల ఈమెయిల్ చూసుకోవడం కుదర్లేదు. తీరా మెయిల్ ఓపెన్ చేస్తే, ఒక్క టెన్నిస్ మెయిల్ కూడా లేదు. ఆశ్చర్యం వేసింది. పనికిరాని మెయిల్స్ చాలా వచ్చాయి. ఏమయ్యిందని క్లబ్బుకి కాల్ చేశాను. క్లబ్బు తెరిచే ఉందని, ఆడుతున్నారని తెలిసింది. వెంటనే జాన్‌కి కాల్ చేశాను. అతను ఎత్తలేదు. ఇంకో చైనీస్ మిత్రుడు మింగ్‌కి కాల్ చేశాను. వెంటనే మరో ఫ్రెండ్ గౌతమ్‌కి కాల్ చేశాను. ఫలితం శూన్యం. వెంటనే కాల్ చెయ్యమని మెసేజ్ పెట్టాను. స్నానం చేసి క్లబ్బుకి బయల్దేరుతూండగా గౌతమ్ కాల్ చేశాడు.
 
 ‘‘ఏమయ్యిందిరా? మన టెన్నిస్ లీగ్ నుండి ఒక్క మెయిలూ లేదు?’’ నా ట్రిప్ విశేషాలు గౌతమ్ అడిగినా, దాని దాటేస్తూ అడిగాను. అవతలివైపు నుండి సమాధానం లేదు. మరోసారి గట్టిగా రెట్టించేసరికి మెల్లగా చెప్పాడు.
 
 ‘‘క్లబ్బులో ఇటుపైన నీతో ఎవరూ టెన్నిస్ ఆడరు. మన లీగ్‌లో అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. నువ్వు కెప్టెన్సీ చేస్తున్న టీమ్‌లో కూడా ఎవరూ ఆడరు!’’ఒక్కసారి అవాక్కయ్యాను. నాకేమీ అర్థం కాలేదు. గౌతమ్ మీద చికాకూ కోపం వచ్చాయి. ఒకటికి పదిసార్లు అవే మాటలు చెబుతున్నాడు కానీ, ఎందుకు నన్ను బహిష్కరించారో చెప్పడానికి జంకుతున్నాడు. గట్టిగా గదమాయిస్తే, అసలు విషయం చెప్పాడు.
 ‘‘నీ వల్ల జాన్ ఆసుపత్రిపాలయ్యాడు. అతని పక్కటెముకలు విరిగాయి. కనీసం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా నువ్వు చెయ్యలేదు,’’ ఈసారి గౌతమ్ గొంతు మారింది.
 
 ‘‘యూసెమెటీ వెళ్లగానే నా ఐఫోన్ పాడయ్యింది. ట్రెక్కింగులో ఉండగా మా బ్యాగొకటి పోయింది. అందులో మా ఆవిడ ఫోన్, మా అబ్బాయి ఫోన్ ఉన్నాయి. వచ్చీరాగానే ఫోన్ చేశాను. నిజంగా నాకు జాన్ గురించి తెలీదు,’’ మెల్లగా చెప్పాను.
 
 నేను యూసెమెటీ వెళ్లడానికి ఒకరోజు ముందు జాన్, నేను టెన్నిస్ ఆడుతుండగా జాన్ నేను కొట్టిన ఒక షాట్ తీయబోయి కిందపడిపోయాడు. కాస్త భారీ కాయం కావడం వల్ల, పక్కకు ఒరిగిపోయాడు. మోచేయి కొట్టుకుపోయి రక్తం వచ్చింది. నాతో ఆడే ఇంకో ఇద్దరూ వాపు తగ్గుతుందని ఐస్ చేతిమీద పెట్టారు. చెయ్యి కొద్దిగా వాచింది. నేను వెంటనే సారీ చెప్పాను. మా వాళ్లందరూ నామీద విరుచుకుపడ్డారు. ‘‘ఆడుతూంటే నీకు ఒళ్లు తెలీదు. నువ్వేమైనా రోజర్ ఫెడరెర్‌వా? మనం ఆడే ఆట కాలక్షేపానికి. ఎవరూ ఒక్క పైసా కూడా ఇవ్వరు,’’ అంటూ నామీద కోప్పడ్డారు.
 
 నేను ఆట ఆడుతూంటే అందులో పూర్తిగా నిమగ్నమైపోతాను. అది నా బలహీనత. ఆటయ్యాకే నేను మామూలు ప్రపంచంలోకి వస్తాను. మొదట్లో అందరూ నాకు ఆటలో ఆవేశం ఎక్కువా అంటే గత మూడేళ్లుగా అంతా తగ్గించుకున్నాను. నిజానికి ఆ రోజు నేను అంత గట్టిగా కొట్టలేదు. యాంగిల్ ఎక్కువగా ఉండటం వల్ల, జాన్ ఆ బంతి అందుకోబోయి కిందపడ్డాడు. నేను వెంటనే క్షమాపణలు చెప్పాను. అతను బాగానే ఉన్నాడు అప్పుడు. పక్కటెముకలు విరగడం అన్నది ఆశ్చర్యం కలిగించింది నాకు.
 ఇంటికెళ్లాక రాత్రికి రాత్రి ఎమర్జెన్సీకి తీసుకెళ్లారనీ, హాస్పిటల్లో పరీక్షలు చేశాక పక్కటెముకలు రెండు చిన్నగా విరిగాయనీ గౌతమ్ చెప్పాడు. దీనిక్కారణం నేనేనని మా క్లబ్బు మెంబర్లందరూ నామీద కోప్పడ్డారనీ చెప్పాడు.
 
 ఫోన్ పెట్టేసే ముందు- ‘‘అయినా, నీకు జాన్ గురించి తెలిసీ నువ్వు అంత తీవ్రంగా ఆడటం ఏమిట్రా? యూ ఆర్ యాన్ ఈడియట్!’’ అంటూ గట్టిగా తిట్టాడు. నేనేమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. నిజమే. నా పొరపాటే! కాస్త మెల్లగా ఆడుండాల్సింది.
 టెన్నిస్‌కి వెళ్లబోయిన నేను వెనక్కి రావడంతో అనిత ఆశ్చర్యపోతూ వెటకారంగా అంది, ‘‘ఏం టెన్నిస్‌వాళ్లు రావద్దన్నారా?’’
 
 నేనేమీ సమాధానం ఇవ్వకుండా లోపలికి వెళ్లడంతో, అనితకి అనుమానం వచ్చి మళ్లీ అడిగింది. అయిదు రోజుల క్రితం టెన్నిస్ ఆటలో జాన్ గాయం గురించి చెప్పాను. గౌతమ్ చెప్పిన వివరాలూ చెప్పాను.
 ఎప్పుడూ టెన్నిస్ గురించి నన్ను తిట్టే అనిత, ఈసారి వాళ్లమీద మండిపడింది.
 ‘‘అతను పడిపోతే మీరేం చేస్తారు? ఆటన్నాక జాగ్రత్తగా ఉండాలి!’’ అంటూ కోపంగా అంది.
 ‘‘జాన్ అందరిలాంటివాడు కాదు,’’ మెల్లగా అన్నాను. ఆశ్చర్యంగా నాకేసి చూసింది.
 ‘‘అతనికి ఒక కాలు లేదు. మోకాలి కింద భాగం ఆర్టిఫీషియల్ మెటాలిక్ లెగ్!’’
 
 గౌతమ్ చెప్పిన తరువాత హాస్పిటల్‌కి వెళ్లి జాన్‌ని పరామర్శిద్దామనుకున్నాను. కానీ ఎందుకో మనసొప్పలేదు. ఆ సాయంత్రం క్లబ్బుకి వెళ్లాను, కనీసం ఎక్సర్‌సైజయినా చేద్దామని. ఒకళ్లిద్దరు పరిచయస్తులు కనిపించి విష్ చేశారు కానీ ఎవరూ మాట్లాడలేదు. నాకూ మనసు బాగోలేదు. తిరిగి వచ్చేస్తూండగా, మింగ్ కనిపించాడు. విష్ చేసి, జాన్ గురించి అడిగాను. జాన్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడనీ, ఇంకో నాలుగు రోజుల్లో ఇంటికి పంపిస్తారనీ చెప్పాడు. వెళ్లబోతూ - రేపు మా క్లబ్బు మెంబర్లందరూ చూడ్డానికి వెళుతున్నారనీ, నన్ను మాత్రం పిలవద్దన్నారనీ చెప్పాడు.
 
 ‘‘యూ ఆర్ ఏ వియర్డ్ ప్లేయర్! జాన్‌కి ఒక కాలు లేదని తెలిసీ నువ్వు అంత దుర్మార్గంగా ఆడటం అన్యాయం. అందుకే నీతో ఎవరూ ఆడ్డానికి ఇష్టపడటం లేదు,’’ అంటూ తీవ్ర పదజాలంతో తిట్టాడు.
 ఏం చెప్పాలో తెలియలేదు. వాళ్ల దృష్టిలో ప్రస్తుతం నేనొక విలన్ని. ఏం చెప్పినా వినే పరిస్థితిలో వాళ్లు లేరు.
 ‘‘మింగ్! నేను కావాలని కొట్టలేదు. ఆడుతుంటే అతనికి కాలుందా లేదన్నది నాకు స్ఫురించదు. అయినా మీ అందరి దృష్టిలో అతనికి కాలు లేదు. నాకైతే అలా అనిపించదు,’’ నా మనసుకనిపించింది చెప్పాను.
 ‘‘యూర్ ఆర్ యే జెర్క్!’’ అనేసి విసురుగా వెళ్లిపోయాడు.
 
 జాన్‌కి ఒక కాలు ఆర్టిఫీషియల్ లెగ్ అన్నది మా క్లబ్బంతటికీ తెలుసు. మొదట్లో ఫుల్ టెన్నిస్ ప్యాంట్ వేసుకుని ఆడినప్పుడు నాకు తెలియలేదు. తరువాత అతన్ని చిన్న నిక్కరులో చూసినప్పుడు తెలిసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అతను మా అందరిలాగే పరిగెడతాడు. జాన్‌ని ఇంటికొచ్చాక కలుద్దాములే అనుకున్నాను. కానీ వీళ్లే ఇలా ఉంటే, అసలు గాయపడ్డ జాన్ నా గురించి ఏమనుకుంటాడో ఊహించగలను. నేను జాన్‌ని చూడ్డానికి వెళ్లాలనిపించినా, వెళ్లలేదు.
 
 ఆ తరువాత మా టెన్నిస్ ఫ్రెండ్స్ నన్ను ఆటకి పిలవటం మానేశారు. కొంతమంది కలిసినప్పుడు విష్ చేసి పక్కకి వెళ్లిపోయేవారు. నా టెన్నిస్ ఆటకి గండి పడింది.
 జాన్ గాయపడి ఆడలేకపోయాడు. నేను ఆడగలిగీ గాయపడ్డాను.
 
 ఆ తరువాత నేను టెన్నిస్ ఆడటం మానేశాను. నాకు తెలీకుండానే, నాకు లేని గిల్టీని అందరూ నాపై రుద్దేశారనిపించింది.
 ఓ నెల రోజుల తరువాత, ఊహించని ఒక సంఘటన ఎదురయ్యింది. జాన్ నుండి ఫోన్ కాల్ వచ్చింది!
 ‘‘హాయ్- రావీ! ఎలా ఉన్నావు?’’ అంటూ పలకరించాడు. నేను నా తరఫున మరోసారి క్షమాపణలు కోరుతూ- ‘‘జాన్! యిట్ ఈజ్ మై ఫాల్ట్! అపాలజీస్!’’ అని చెప్పాను.
 
 ‘‘నో! నో! నీ తప్పేమీ లేదు. అదలా జరగాల్సింది. జరిగింది. అంతే!’’ అంటూ నా గురించి అడిగాడు.
 ‘‘రావీ! మన ఫ్రెండ్స్ అందరూ చూడ్డానికి వచ్చారు. నువ్వూ వస్తావనుకున్నాను. ఎందుకు రాలేదోననుకున్నాను. తరువాత మింగ్ భార్యతో వచ్చినప్పుడు తెల్సింది,’’ అని ఆగిపోయాడు.
 ‘‘ఏం తెల్సింది?’’ అని అడిగితే, ‘‘వాళ్లందరూ నిన్ను పిలవకూడదనుకున్నారని చెప్పాడు. నాకెందుకో అది స్టుపిడ్‌గా అనిపించింది,’’ అన్నాడు.
 
 జాన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడనీ, టెన్నిస్ ఆటకి రెడీ అని చెప్పాడు. నేను ఆడటం మానేశానని చెప్పాను.
 ‘‘ఆ రోజు మింగ్ నాతో ఒక మాట చెప్పాడు. అది విన్నాక నువ్వంటే నా అభిప్రాయం మారిపోయింది. నాకు ఆర్మీలో కాలు పోయాక, బయట నన్నెవరైనా ఆర్టిఫీషియల్ లెగ్‌తో కనిపించినప్పుడు నాకేసి జాలిగా చూసేవారు.  కాలు లేదన్న బాధ కన్నా ఆ జాలి చూపులు నన్ను దహించేవి. అందుకే కసిగా ఆర్టిఫీషియల్ లెగ్‌తో పరిగెత్తడం అలవాటు చేసుకున్నాను. అదే నా టెన్నిస్ ఆటకి ఆలంబన అయ్యింది. నాతో ఆడినప్పుడు నన్ను కాలు లేనివాడిగా అనుకునే అందరూ ఆడుతారన్నది నాకు తెలుసు. నువ్వు మాత్రం అలా అనుకోవనీ, అందుకే అంత తీవ్రంగా ఆడావనీ చెప్పినప్పుడు నాకెంతో సంతోషం కలిగింది. నన్ను, అందరిలాగే చూశావు, థాంక్యూ!’’ అన్నాడు. చివరి మాటలు పలికేటప్పుడు అతని గద్గద స్వరాన్ని గమనించాను.
 జాన్ మాటలు విన్నాక మనసు తేలికపడింది. నా ఆటా, ఆలోచనా గాడి తప్పలేదన్న నమ్మకం కలిగింది.
 
 టెన్నిస్‌కి వెళ్లబోయిన నేను వెనక్కి రావడంతో అనిత ఆశ్చర్యపోతూ
 వెటకారంగా అంది,
 ‘‘ఏం టెన్నిస్‌వాళ్లు రావద్దన్నారా?’’
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement