అపురూపం: చేయూత...
సినిమాని ఆదరించేది... ఆడించేదీ ప్రజలు!
సినిమావాళ్లని ప్రేమించేదీ... కొలిచేదీ ప్రజలే!!
ఆ ప్రజలు కరువులు, యుద్ధాలు, ఉప్పెనల వంటి ఇబ్బందులెదుర్కొన్నప్పుడు వారికి అండగా సినీ పరిశ్రమ చేయూతనందివ్వడానికి ముందుకు రావడం ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. అలనాటి ప్రముఖ తారలు ఈ విషయంలో ఎప్పుడూ ముందుండేవారు. విపత్తు సమయాలలో ఊరూరా తిరిగి, తమ వినోద ప్రదర్శనలతో విరాళాలను సేకరించి కొన్నిసార్లు, వ్యక్తిగతంగా కొన్నిసార్లు విరాళాలను ఇచ్చి ఆదుకునేవారు.
1977లో కృష్ణా జిల్లాలోని దివిసీమ ఉప్పెన వల్ల కనీవినీ ఎరుగని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఆ సందర్భంగా నాటి అగ్ర హీరోలు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తమ బృందంతో ఊరూరా తిరిగి, విరాళాలను సేకరించారు. దాదాపు పదిహేను లక్షల రూపాయలను ఈ సందర్భంగా సేకరించి, వారు ప్రభుత్వానికి అందించడం జరిగింది.
1965లో పాకిస్తాన్‌లో యుద్ధం వచ్చినప్పుడు దేశరక్షణ నిధి కోసం విరాళాల సేకరణ నిమిత్తం చెన్నై వచ్చిన నాటి దేశ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రికి సినీ ప్రముఖులు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలను తమ ప్రదర్శనల ద్వారా సేకరించి అందించారు. వ్యక్తిగతంగానూ విరాళాలిచ్చారు కొందరు తారలు. ఆ సందర్భంగా మహానటి సావిత్రి తన ఒంటిపైనున్న బంగారు నగలన్నింటినీ తీసి విరాళంగా ఇచ్చారు.
లాల్‌బహదూర్‌శాస్త్రి (కుడిచివర), సావిత్రి తదితరులు
ఈ విధంగా 1971లో మళ్లీ ఇండో-పాక్ యుద్ధం జరిగినప్పుడు అనేక మంది అగ్రతారలు నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి హైదరాబాద్‌లో తమ విరాళాలను అందజేశారు. తన వంతు విరాళాన్ని ఊర్వశి శారద అందించారు.
ఇందిరాగాంధీ, ఊర్వశి శారద
ఇలా కష్టసమయాల్లో తమ వంతు చేయూతనందించి, తమ సామాజిక బాధ్యతను నెరవేర్చేవారు మన తారలు!
ఇలా తారలు - ప్రజలు...
ఒకరి కోసం ఒకరుండటం
ఒకరికి అండగా ఒకరుండటం...
అభినందనీయం... మానవీయం!
- సంజయ్ కిషోర్