టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు) | Astrology Weekly Horoscope In Telugu | Sakshi
Sakshi News home page

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

Published Sun, Jul 7 2019 11:22 AM | Last Updated on Sun, Jul 7 2019 11:24 AM

Astrology Weekly Horoscope In Telugu - Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
సంయమనం పాటించడం ద్వారా సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. సానుకూల దృక్పథంతో ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు. మిత్రుల సహకారంతో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. వ్యసనాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతికి అవరోధాలు ఎదురు కావచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో జాప్యం తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు అందుకుంటారు.
లక్కీ కలర్‌: రాగి రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
కొత్త పనులు ప్రారంభించడానికి పూర్తి సానుకూలమైన సమయం. ఇప్పటి వరకు ప్రణాళికలకే పరిమితమైన పనులను ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టండి. సత్ఫలితాలను పొందగలరు. వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక ప్రయోజనాలు, పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. పని మీద మరింతగా దృష్టి సారిస్తారు. పురోగతిలో వేగం పెంచుకోవడానికి కృతనిశ్చయంతో దూసుకుపోతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న బంధువులను ఆదుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఏర్పడిన అపార్థాలు తేలికగా సమసిపోతాయి.
లక్కీ కలర్‌: నీలం

మిథునం (మే 21 – జూన్‌ 20)
అనవసరంగా అభద్రతాభావానికి లోనవుతారు. మీ అతిజాగ్రత్త ఇతరులకు చాదస్తంగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని భయాల వల్ల చిన్న చిన్న విషయాల్లో కూడా నిర్ణయాలను జాప్యం చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలకు కూడా అతిగా చింతిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయలేకపోతారు. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం కొంత ఊరటనిస్తుంది. ఆత్మస్థైర్యం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఇంతకాలం ఎలాంటి విజయాల కోసం అర్రులు చాస్తూ వచ్చారో, అలాంటి విజయాలను అందుకుంటారు. చాలా విషయాల్లో చెక్కుచెదరని పట్టుదలతో ఉంటారు. కోరుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటాయి. పనిలో భాగంగా దూరప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులపై మంచి లాభాలను అందుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. పెద్దలను సంతోషపెడతారు. గురువుల ఆశీస్సులు పొందుతారు.
లక్కీ కలర్‌: ఎరుపు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
జీవితంలో అనూహ్యమైన మార్పులు ఎదురవుతాయి. ఈ మార్పులతో ఉద్విగ్నత చెందుతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట తారసపడే సూచనలు ఉన్నాయి. ప్రేమానుబంధాలు మీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. పెరిగిన బాధ్యతలకు తగినట్లుగానే ఆదాయం కూడా పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. తీరిక దొరక్కపోవడం వల్ల భోజనాన్ని నిర్లక్ష్యం చేసే సూచనలు, ఫలితంగా ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. మార్పులను స్వీకరించడం ద్వారా అభివృద్ధిలో వేగాన్ని పెంచుకుంటారు.
లక్కీ కలర్‌: జేగురు రంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
త్వరలోనే దశ తిరగబోతోంది. ఒక అద్భుతమైన కొత్త అవకాశం అనుకోకుండా అందివస్తుంది. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన ఘనవిజయాలు మీ శ్రమను మరిపిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. నాయకత్వ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమలో పడతారు. ప్రియతముల సమక్షం ఉత్సాహాన్నిస్తుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జనాకర్షణ గణనీయంగా పెరుగుతుంది.
లక్కీ కలర్‌: తెలుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు.
లక్కీ కలర్‌: లేత గులాబి

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు.
లక్కీ కలర్‌: నారింజ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్‌: మీగడ రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది.
లక్కీ కలర్‌: ఇటుక రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
తలపెట్టని పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ కలర్‌: పసుపు

- ఇన్సియా, టారో అనలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement