సాంకేతికం: బెంగళూరా? సింగపూరా?
మన తెలుగువారు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల రీత్యా వెళ్లి వస్తున్నా... అన్నిట్లోకీ సింగపూరే ప్రత్యేకమైనదనే భావన అందరిలోనూ కనిపిస్తుంది. చిన్నదేశమైనా, స్వతంత్రంగా ఎదిగి వెలుగుతున్న దేశమది. అందులోనూ ఆ దేశ రాజధాని సింగపూర్ సిటీ మరీను. అటువంటి సిటీని ఎన్నో విషయాల్లో మన దేశంలోని బెంగళూరు సిటీ దాటేసింది! ప్రపంచాన్ని ఆకర్షించే సింగపూర్ కంటే ‘గ్రేడ్ ఎ’ ఆఫీసులు అత్యధికంగా ఉన్నది బెంగళూరులోనే!
ఆధునికుడు ఉద్యోగ జీవి. అతనికేం కావాలి? మంచి ఉద్యోగం కావాలి. బెంగళూరులో దొరుకుతోంది. ఆధునికుడు జల్సా జీవి. అతనికేం కావాలి? మంచి వినోదం కావాలి. బెంగళూరులో దొరుకుతోంది. ఆధునికుడు మంచి వ్యాపారి. అతనికేం కావాలి? అద్భుతమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు కావాలి. అవన్నీ బెంగళూరులో దొరుకుతున్నాయి. ఇటీవల ప్రపంచానికి బెంగళూరు కళ్లు తెరిపించిన విషయం ఏంటంటే... అంతర్జాతీయ సంస్థల విస్తరణ, కొత్త సంస్థల స్థాపనకు అనువుగా ఉండే ‘గ్రేడ్ ఎ’ ఆఫీసుల లభ్యతలో బెంగళూరు ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండడం! మొదటి స్థానంలో చైనాలోని షాంఘై ఉండగా మూడో స్థానంలో సింగపూర్ ఉంది.
గ్రేడ్ ఎ ఆఫీసు అంటే అంతర్జాతీయ ప్రమాణాలున్న, సెంట్రల్ ఎయిర్‌కండిషనింగ్‌తో కూడిన అత్యాధునిక భవనాలు, వాటి ఆవరణలు, ప్రామాణిక శాశ్వత నిర్వహణ తీరు వంటివి ఉన్న ఆఫీసులు. గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ రీస్ట్రక్చరింగ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ (గిరెన్) తాజా అధ్యయనం ప్రకారం ఇండియా ‘అత్యంత ఆకర్షణీయ వాణిజ్య కేంద్రం’ కాగా దేశంలోని మొత్తం ఎ గ్రేడ్ స్పేస్‌లో 24 శాతం ఒక్క బెంగళూరే కలిగి ఉంది. సైన్స్ సిటీ, ఉద్యాన నగరంగా వెలుగొందిన బెంగళూరు వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఖ్యాతిని ఐటీ సర్వీసుల ద్వారా సంపాదించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ ఐటీ సంస్థలు ఇక్కడి నుంచి ఎదగడంతో ఐటీ, ఐటీఈఎస్ సంస్థలకు భారతదేశంలో ఇది రాజధానిగా మారింది.
ఉన్నత శ్రేణి జనాభా (విద్యావంతులైన అప్పర్ మిడిల్ క్లాస్) ఎక్కువగా ఉన్న నగరం బెంగళూరు. అంటే పది లక్షలు అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారు ఇక్కడ మిగతా అన్ని నగరాల కంటే ఎక్కువ. దేశంలో కొన్ని మాల్స్ కొన్ని నగరాల్లో ఉండవు. కానీ, బెంగళూరులో అన్ని అంతర్జాతీయ మాల్స్ తమ శాఖలను స్థాపించాయి. అందుకే అక్కడ వేతనాలు, ఉపాధి లభ్యత ఎక్కువ. ఆహారం, నివాసం, దుస్తులు, రవాణా, పర్సనల్ కేర్, వినోదం వంటివన్నీ సింగపూర్ నాణ్యతతో అంతకంటే తక్కువ ధరకు ఇక్కడ దొరుకుతున్నాయి. దీనికి అదనంగా నాణ్యమైన మానవ వనరుల లభ్యత మిగతా చాలా ప్రపంచ నగరాల కంటే బెంగళూరుకు ఎక్కువగా ఉంది. బెంగళూరు సింగపూర్ కంటే సంతోషంగా బతుకుతోంది అని చెప్పడానికి మరో ఉదాహరణ ఏంటంటే... పలు రకాల ధరల్లో బెంగళూరు నగరం కంటే 200 నుంచి 900 శాతం ఎక్కువగా ఉండే సింగపూర్‌లో లోకల్ పర్చేజింగ్ పవర్... బెంగళూరు కంటే పన్నెండు శాతం తక్కువ కావడం!
సింగపూర్ విదేశీయులకు స్వర్గంగా, స్వదేశీయులకు కష్టంగా ఉంటే... బెంగళూరు ఇద్దరికీ అందుబాటులో ఉంటోంది. బెంగళూరులో కన్నడిగుల శాతం సగానికంటే తక్కువ. స్వదేశీయులు, విదేశీయులు ఇక్కడ పెద్దసంఖ్యలో స్థిరపడటంతో అసలైన కాస్మోపాలిటన్ లక్షణాలున్నాయి. ఇక యూరోపియన్ మూలాలున్న జనాభా 8 శాతం ఉంది. జపాన్‌లోని ఒసాకా తర్వాత అత్యధికంగా సాఫ్ట్‌వేర్ నిపుణులున్న నగరం బెంగళూరే. ఆసియాలోనే అత్యధిక పబ్‌లు ఇక్కడ ఉన్నాయి. శుభ్రతలోనూ ఇండియాలో ఇది టాప్.