కాలాతీతం: బార్బీ గర్ల్... ఎప్పుడూ యంగే! | Barbie girl to be young always | Sakshi
Sakshi News home page

కాలాతీతం: బార్బీ గర్ల్... ఎప్పుడూ యంగే!

Published Sun, Apr 6 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

కాలాతీతం: బార్బీ గర్ల్... ఎప్పుడూ యంగే!

కాలాతీతం: బార్బీ గర్ల్... ఎప్పుడూ యంగే!

బార్బీ డాల్ గురించి కొత్తగా ఎవరికైనా పరిచయం చేస్తే... పెద్ద చెప్పొచ్చారు అంటూ పైకి కిందకు చూస్తారు. అంటే బార్బీ గురించి తెలియని వారు చాలా అరుదని. పెద్దలు అభిమానించేవి వేర్వేరు విషయాల్లో వేర్వేరుగా ఉండొచ్చేమో గాని... ప్రపంచంలో ప్రతి చిన్నారికీ బార్బీ డాల్ అంటే ప్రేమ, ఇష్టం. మరో  మాటలో చెప్పాలంటే... బార్బీ డాల్‌ను తాకని ఈతరం బాలికలు ఉండనే ఉండరనుకోండి! కానీ అలాంటి బార్బీ డాల్ గురించి మీరు ఎపుడూ వినని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!  
 
 సుమారు 55 ఏళ్ల క్రితం రూత్ హ్యాండ్లర్ అనే అమెరికన్ మహిళ తన కూతురు  కాగితపు బొమ్మలతో ఆడుకుంటూ, మధ్యమధ్యలో వాటితో మాట్లాడ ం చూసి మురిసిపోయింది. అంతేకాదు, మనుషులను పోలిన బొమ్మలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ‘మాటెల్’ (టాయ్స్ కంపెనీ) సహ వ్యవస్థాపకుడైన తన భర్తకు చెబితే ఆయన పెదవి విరిచాడు. అయినా ఆమె నిరుత్సాహ పడలేదు. తన ఆలోచనకు ప్రతిరూపంగా ఓ బొమ్మను రూపొందించింది. కూతురు ‘బార్బారా’ పేరు మీదే దానికి ‘బార్బీ’ అని నామకరణం చేసింది.
   -   1959లో బార్బీడాల్ వెలుగులోకి వచ్చింది. తొలిసారి న్యూయార్క్‌లో దీనిని అమ్మారు. మొదటి బొమ్మను మూడు డాలర్లకు అమ్మారు.
-      అమెరికా వ్యక్తి ఆలోచన అయినా బార్బీ డాల్ ఉత్పత్తి జపాన్‌లో మొదలైంది. తొలుత దానికి చేతితో తయారుచేసిన బట్టలు తొడిగేవారు. 1972 వరకు అవి జపాన్‌లో ఉత్పత్తయ్యేవి.
 -     బార్బీ ఉత్పత్తి దారుల చెప్పేదానిని బట్టి బార్బీ రూపురేఖలు ఓ పదిహేడేళ్ల ఫ్యాషన్ మోడల్‌వి.
 -     బార్బీపై మరింత ఆకర్షణ పెంచడానికి, జనంలోకి చొచ్చుకు పోవడానికి చేసిన ప్రయోగమే బార్బీ సిస్టర్స్. బార్బీకి మొత్తం ఏడుగురు సిబ్లింగ్స్ (తోడబుట్టిన వారు). వారి పేర్లు స్కిప్పర్, స్టాసీ, చెల్సియా, క్రిస్సీ, కెల్లీ, ట్యూటి, టాడ్.
 -     బొమ్మలు అమ్మే విధానంలో విప్లవాత్మక నిర్ణయాలకు బార్బీ కారణమైంది. అది ఎప్పటికీ ఆకర్షణీయంగా ఉండేలా ఉత్పత్తిదారులు ఆలోచన చేశారు. అందులో భాగంగా కొత్త క్యారెక్టర్లలో బార్బీ కనిపిస్తూ అన్ని తరాల పిల్లలను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇప్పటి వరకు బార్బీ 130 ఉద్యోగాలు (పాత్రలు) చేసింది.  ఆస్ట్రోనాట్, మెక్‌డొనాల్డ్ క్యాషియర్, డాక్టరు, టీచరు ఇలా ఎన్నో కొత్తకొత్త పాత్రల్లో బార్బీ బొమ్మలు విడుదలయ్యాయి.
-  బార్బీకి ఓ బాయ్‌ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పుట్టిందండోయ్. అతగాడి పేరు ‘కెన్’. వాళ్లిద్దరూ పెళ్లి డ్రస్సుల్లో ఉన్న బొమ్మలు చూసే ఉంటారు కదా.. వారిద్దరికీ పెళ్లి కాలేదు. అది ఒక ఫ్యాంటసీ అట. వారిప్పటికీ డేట్ మీదే ఉన్నారు.
-  వారిద్దరికీ ఓ కారుంటే బాగుంటుందని అనుకోవడమే కాదు ఆస్టిన్ పేరుతో బార్బీ కారు కూడా వచ్చేసింది.
-  కొందరు పిల్లలకు కుక్కలంటే ఇష్టం. ఇంకొందరికి, పిల్లులు. మరికొందరికి చిలుకలు ఇలా ఉంటాయి కదా. మరి అన్ని వర్గాల పిల్లలను అలరించే బార్బీకి ఏ ఒక్కటో ఉంటే ఎలా? అందుకే ఆమెకు ఇంతవరకు 50 పెట్స్ తయారుచేశారు. వాటిలో గుర్రం, కుక్క, పిల్లి, చింపాంజీ, పాండా, చిలుక, సింహం పిల్ల, జిరాఫీ, జీబ్రా. చూశారా.. అన్నీ పిల్లలకు ఇష్టమైనవే.
-  బార్బీ ఎక్కువగా బ్రౌన్ కలర్ ఐ షాడోలో దొరుకుతుంది.
-  అమ్మాయిలకు జుట్టు ఎంత ఇష్టమో తేల్చిన బొమ్మ కూడా బార్బీనే. పొడవాటి, ఒత్తై జుట్టుతో 1992లో ఓ బార్బీ డాల్‌ను విడుదల చేశారు. 130 బార్బీ పాత్రల్లో అత్యధికంగా అమ్ముడైన డాల్... జుట్టున్న బార్బీనే.
-  బార్బీ పాశ్చాత్యురాలు కదండీ. బాయ్ ఫ్రెండ్‌తో పడకపోయినా అతడితోనే ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే అతనికి బై చెప్పి బ్లెయినీ అనే మరో అబ్బాయితో జతకట్టింది.
-  ప్రపంచంలో ప్రతి మూడు సెకన్లకు ఒక బార్బీ అమ్ముడుపోతోందట.
 చూశారా ఇన్ని విశేషాలతో నిత్యం వార్తల్లో ఉండి ఎప్పుడూ అందంగా ముద్దుగా ఉండే బార్బీ అంటే ఎవరికీ ఇష్టముండదు చెప్పండి. ఇంకో సంగతి. బార్బీ డాల్ శరీర కొలతలు మరీ ఫాంటసీ. అలాంటి పాత్ర నిజ జీవితంలో ఉంటుందా అని ఈ మధ్యనే కొందరు ప్రశ్నిస్తున్నారట. సరే వారి ముచ్చట కాదనడం ఎందుకని బార్బీ డాల్... వాస్తవానికి దగ్గరగా ఉండే ఆకారంలో తయారై రానుంది. దీనికింకో కారణం కూడా ఉంది. టీనేజ్ అమ్మాయిలు కొందరు బార్బీ లాగా తయారుకావాలని... అలా ముచ్చటైన కందిరీగ నడుము ఉండాలని తినీతినకుండా ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారట. వారికి బార్బీ కూడా సామాన్యురాలే అని చెప్పడానికి వాస్తవానికి దగ్గరగా తయారుచేస్తున్నారేమో.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement