
టీవీక్షణం : అందమైన ‘కుటుంబం’
ఒకప్పుడు సీరియల్ తారలు సినిమాల్లోకి వెళ్లాలని ఉవ్విళ్లూరేవారు. కానీ ఇప్పుడు సినిమా తారలే సీరియళ్లవైపు వచ్చేస్తున్నారు.
తాజాగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ‘కుటుంబం’ అనే సీరియల్ జెమినీ చానల్లో ప్రారంభమయ్యింది. గతంలో కూడా ఆమె నటించిన సీరియల్స్ కొన్ని ప్రసారమయ్యాయి. అయితే ఈ సీరియల్‌లో విజయ్‌కుమార్, కె.ఆర్.వత్సల లాంటి ప్రముఖ నటీనటులంతా ఉండటంతో ఈ సీరియల్‌పై మరింత ఆసక్తి ఏర్పడింది ప్రేక్షకులకి. అయితే ఎంతమంది ఉన్నా... రమ్యకృష్ణే సెంటరాఫ్ అట్రాక్షన్. తల్లిదండ్రులకు ముద్దుల కూతురిగా... ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మెండుగా ఉన్న అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకుంటోంది. టీఆర్పీతో పాటు ప్రేక్షకుల ఉత్కంఠను కూడా పెంచుతోంది. సినిమాల్లో టాప్ స్టార్‌గా వెలిగిన రమ్యకృష్ణ, ఈ సీరియల్‌తో టెలివిజన్ రారాణిగా కూడా వెలిగిపోతుందేమో చూడాలి మరి!
తీరని వ్యథ
బానీ, ఆమె సోదరి రజ్జీ జీవితాలు పెళ్లి కారణంగా చిన్నాభిన్నమవుతాయి. బానీని పెళ్లాడినవాడు విదేశాలకు వెళ్లినట్టు నటించి ఆమెను వదిలేస్తే, రజ్జీని పెళ్లాడినవాడు తాను బానీని ప్రేమిస్తే నిన్నిచ్చి పెళ్లి చేశారంటూ వేధిస్తుంటాడు. బానీ పుట్టింట్లో చెప్పకుండా భర్తను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. రజ్జీయేమో... పక్కనే ఉన్న భర్తను ఆకట్టుకోలేక అల్లాడుతుంటుంది.
కలర్‌స చానెల్లో ప్రసారమయ్యే ‘బానీ’ సీరియల్... పెళ్లి పేరుతో మోసపోయే ఆడపిల్లల జీవితాలను, వారి ఆవేదనను కళ్లముందు నిల్పుతోంది. మరి బానీ, రజ్జీల జీవితాలు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో... వారి కష్టాలు ఎప్పటికి గట్టెక్కుతాయో!