
సాహసాలు చేయిస్తున్న సౌందర్యకాంక్ష
విపరీతం
‘అందం దేవుడిచ్చిన వరం’ అంటుంటారు. అసలు దేవుడు ఏది ఇచ్చినా, ఏదో ఒక రూపంలో అదొక వరంలానే మనిషి భావించాలి. అయితే సియోల్అమ్మాయిలు ‘అందం మాత్రమే అసలైన వరం’ అని భావిస్తున్నారు. తమకు నచ్చిన విధంగా తమ ముఖాలను మలుచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. మితి మీరిన సౌందర్యకాంక్షతో... ఒక విధంగా దుస్సాహసాలు చేస్తున్నారు!
ప్రపంచంలో ఎక్కడా లేనంతగా దక్షిణ కొరియాలో ప్లాస్టిక్ సర్జరీపై మోజు పెరుగుతోంది! తక్కువ ధర, నాణ్యత, సులువుగా అయిపోవడం... అనే మూడు ప్రలోభాలతో మగువలు కోరుకున్న ముఖ వర్చస్సును ప్రసాదిస్తున్నాయి కొరియన్ సర్జరీ క్లినిక్కులు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రస్తుతం వీధికో ప్లాస్టిక్ సర్జరీ కేంద్రం ఉందంటే నమ్మి తీరాల్సిందే.
ఒక సర్వే ప్రకారం 2009 నాటికే సియోల్‌లో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఏదో ఒకరకమైన ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు తేలింది. అంతేకాదు, అక్కడ దాదాపు ప్రతి సెలబ్రిటీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నవారేనట. 2012 మిస్ కొరియా కూడా తాను కొద్దిపాటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చెప్పుకోవడం విశేషం అని ఆ సర్వే పేర్కొంది. ఇక అక్కడి ప్రతి అమ్మాయీ లైట్ స్కిన్, సన్నటి నాజూకు ముక్కు, పెద్దపెద్ద కళ్లు, వి-షేప్‌లోని చిన్నటి గడ్డం కోసం ప్రయత్నిస్తోందనీ, వారి దేశానికి చెందిన అంతర్జాతీయ మోడల్ ‘కిమ్ తై హీ’ లా తమ ముఖాలను మలచుకోడానికి ఎక్కువ మంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది. అమెరికాలో పది వేల డాలర్ల ఖర్చయ్యే ప్లాస్టిక్ సర్జరీ ఇక్కడ 2-3 వేల డాలర్లకే అందుబాటులో ఉండడం కూడా ఇందుకో కారణం అని సర్వే పేర్కొంది.
సర్జరీపై ఒక రియాలిటీ షో!
ఇదిలా ఉంటే, సియోల్‌లోని స్థానిక టీవీ ఛానెల్ ‘స్టోరీ ఆన్’లో ప్లాస్టిక్ సర్జరీ లపై ప్రస్తుతం ఒక రియాలిటీ షో నడుస్తోంది. అసలది రియాలిటీ షోలకే పరాకాష్టగా నిలుస్తోంది. నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ రియాలిటీ షోలో ముఖానికి అక్కడికక్కడే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. ఇది పూర్తిగా ఉచితం కూడా. కాకపోతే ఆ షోలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వారి అందానికి సంబంధించిన అన్ని హక్కులు ఆ ప్రోగ్రాం నిర్వాహకులకు ఉంటాయి. అంటే ఇక అప్పట్నుంచి వారి ప్రకటనలకు వీళ్ల ముఖార విందాలను వాడుకుంటారు. ఈ విషయాన్ని సర్జరీకి ముందే చెబుతారు. సర్జరీ మొత్తం షో వేదికపైనే జరుగుతుంది. సర్జరీ ముగిశాక... పాల్గొన్నవారి మునుపటి విజువల్స్‌ని, సర్జరీ అనంతర విజువల్స్‌ను చూపిస్తారు. అయితే ఈ రియాలిటీ షో భారీ క్రేజును సంపాదించడమే కాకుండా, పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఇటీవల ఈ షోలో ఒకేలా ఉన్న కవల పిల్లలకు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇద్దరిని వేర్వేరు రూపంలోకి తెచ్చారు. అది మోస్ట్ పాపులర్ ఎపిసోడ్ అట!!
విపరిణామాలు
దక్షిణ కొరియాలోని ఈ సర్జరీల ధోరణి అనారోగ్యకరమైన పోటీని పెంచుతోంది. తల్లిదండ్రులు ఇతర పిల్లల కంటే తమ పిల్లలు అందంగా ఉండాలని సర్జరీల మీద సర్జరీలు చేయిస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ సర్జరీ సెంటర్లు ప్రతి వీధిలోనూ పెద్దపెద్ద హోర్డింగులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నాయి. ఈ పరిణామం చివరకు అప్పులకు, తద్వారా సామాన్యుల ఆర్థిక కష్టాలకు దారితీస్తోంది. దీంతో ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ఈ హోర్డింగులు పెట్టడాన్ని ఇటీవల నిషేధించింది. కాగా 2013 లో మిస్ కొరియా పోటీలకు వచ్చిన వారిలో ఎక్కువమంది మొహాలు ఒకేవిధంగా ఉన్నట్టు అనిపించడంతో వారిలో చాలామంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారేమో అనే అనుమానాలు తలెత్తాయి. వైద్యం కోసం కనిపెట్టిన కొన్ని ప్లాస్టిక్ సర్జరీలను అందం కోసం ఇలా వాడేస్తున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. అందులో ఒకటి డబుల్ జా సర్జరీ. ఈ సర్జరీల కారణంగా కొందరు శాశ్వతంగా నంబ్‌నెస్ (స్పర్శ మొద్దుబారడం)కు గురవుతున్నా, ‘చూడటానికి బాగుంటే చాలు’ అనే స్థాయికి వెళ్లిపోతున్నారు.
ఏదైనా ఇది మంచి ధోరణి కాదనీ, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం భవిష్యత్తులో పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొరియన్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.