వీళ్లు పుడుతూనే సెలెబ్రిటీలు!
కొందరికి సాధన ద్వారా కళలు అలవడితే... మరికొందరు పుట్టుకతోనే కళాకారులుగా పుడతారు. లేదంటే చిన్న చిన్న పిల్లలు... అంత అద్భుతంగా ఎలా నటించగలుగుతారు! ప్రస్తుతం సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్టులకు డిమాండ్ ఎక్కువే ఉంది. సీరియళ్లన్నీ కుటుంబాల కథల చుట్టూ తిరుగుతాయి. కుటుంబమన్నాక పిల్లలు ఉంటారు కదా! హీరో హీరోయిన్ల చిన్ననాటి పాత్రలు ఎలానూ ఉంటాయి. వాటన్నిటి కీ చైల్డ్ ఆర్టిస్టులు అవసరం. ఈ అవసరం పిల్లల్లోని టాలెంట్‌ను వెలికి తీస్తోంది. ‘ముద్దుబిడ్డ’ చిన్నపిల్లల కథతోనే ప్రారంభమయ్యింది. ఆ తర్వాత తరాలు మారినప్పుడల్లా చిన్నపిల్లలు రంగ ప్రవేశం చేశారు. ‘రాధాకళ్యాణం’లో కళ్లతోనే సెంటిమెంటును కుమ్మరించిన బెంగళూరు అమ్మాయి శ్రేయను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇక మాస్టర్ సాయి హరీష్ గురించి చెప్పనక్కర్లేదు.
హైస్కూల్, శుభాకాంక్షలు, గోరంత దీపం లాంటి చాలా సీరియళ్లలో మంచి మంచి పాత్రలు చేసి సినిమాల్లోకి కూడా వెళ్లిపోయాడు. ఇంత చిన్న వయసులో అంత గొప్పగా ఎలా నటించగలడా అనిపిస్తుంది తనని చూస్తే. ఇంకా ఇలాంటి చిన్నారులు చాలామంది ఉన్నారు. అయితే పిల్లల చుట్టూనే తిరిగే సీరియళ్లు తక్కువే. అప్పుడెప్పుడో వచ్చిన ‘కిట్టిగాడు’ లాంటివి ఇప్పుడు రావడమే లేదు. హిందీవాళ్లు మాత్రం పిల్లలనే ప్రధాన పాత్రధారులుగా పెట్టి కొన్ని సీరియల్స్ తీస్తున్నారు. పిల్లలూ అదరగొడ్తున్నారు. ఝాన్సీ రాణిగా ఉల్కాగుప్తా, మహరాణా ప్రతాప్‌గా ఫైసల్‌ఖాన్, ‘జై శ్రీకృష్ణ’గా ధృతీ భాటియాల నటనకు జనం జేజేలు పలికారు. ‘బడే అచ్చే లగ్‌తే హై’లో ‘పీహూకపూర్’గా అమృతా ముఖర్జీ, ‘యే హై మొహొబ్బతే’లో ‘రూహీ భల్లా’గా రుహానికా ధావన్, ‘ఉతరన్’లో ‘ఇచ్ఛా’గా స్పర్శ్ ఖాన్‌చందానీ, ‘వీరా’లో అన్నాచెల్లెళ్లుగా భవేష్ బాల్‌చందానీ, హృశితా ఓఝాల నటనకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి. దేవత పాత్రలు పోషించడంలో సిద్ధహస్తురాలైన అన్షూర్ కౌర్ అయితే ఇప్పటికే ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇక సాధిల్ కపూర్, శివాంశ్ కోటియా లాంటి చిచ్చర పిడుగుల గురించి చెప్పనక్కర్లేదు.
సీరియళ్ల షూటింగ్ అంటే... ఒక్కరోజులో బోలెడన్ని సీన్లు తీసేస్తుంటారు. తమ షాట్ వచ్చే వరకూ ఓపిగ్గా ఉండాలి. పెద్ద పెద్ద డైలాగులు బట్టీ పట్టాలి. కానీ ఇవేవీ బుజ్జిగాళ్లని భయపెట్టడం లేదు. పెద్దవాళ్లతో సమానంగా పని చేసేస్తున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇంకా ప్రపంచం గురించి సరిగ్గా తెలియకముందే యావత్ ప్రపంచాన్నీ కట్టి పడేస్తున్నారు ఈ బుల్లి స్టార్స్. వాళ్ల ముద్దొచ్చే మోములను, చిలిపి అల్లర్లను, సమ్మోహితపరిచే వారి అద్భుత నటనను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. పది కాలాలు పచ్చగా ఉండమంటూ దీవిస్తున్నారు!