కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. ఓ రోజు మధ్యాన్నం భోజనం చేశాక నా బృందంతో పాటు విశాఖపట్నం బయలుదేరాను. కొద్దిరోజుల క్రితమే కొనుక్కున్న కొత్త కారులో ప్రయాణం చాలా ఆహ్లాదంగా, ఉత్సాహభరితంగా ఉంది. రాత్రి జరగబోయే మీటింగ్ పైనే నా ఆలోచనలు దొర్లుతున్నాయి. నిజమైన క్రిస్మస్ గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించాలన్నదే నా ఆలోచన. సరిగ్గా ఆ సమయంలో ఒకచోట రోడ్డు మీద జనం గుమిగూడారు. కారును వేగం తగ్గించి, అద్దంలో నుండి బయటకు చూసేసరికి ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారిద్దరూ తండ్రీకొడుకులని తర్వాత తెలిసింది. స్పృహలో లేరు. వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గబగబా బయటకు వచ్చి చుట్టూ చూశాను. ‘‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’’ అన్న క్రీస్తు మాటలు మదిలో మెదిలాయి. ఇంతమంది చుట్టూ ఉన్నారుగా, మనకెందుకు అనుకోలేదు. ఎంతమంది ఉన్నా సహాయం చేయడానికి ఒక్క అడుగు ముందుకేద్దాం అంటూ సహాయం అందించాం.
అందరూ చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్న ఆ క్షణంలో పడి ఉన్న ఆ ఇద్దరినీ మా కారులో ఎక్కించాము. కొత్తకారంతా రక్తపు మరకలే! అయినా ప్రాణం కన్నా విలువైనది ఏముంది? మీరలా తీసుకెళ్లద్దు. అనవసరంగా సమస్యల్లో చిక్కుకుంటారు అనే హెచ్చరికలు నన్ను ఏమాత్రం వెనక్కు లాగలేదు. దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లి డాక్టరు చేతికి వారిని అప్పగించాను. కాపాడమని దేవుణ్ణి ప్రార్థించాను. కొద్దిగా ఆలస్యమైతే ఏమయ్యేదో అని ఆ వైద్యబృందం మాట్లాడుకుంటుంటే మనస్సులోనే దేవుణ్ణి స్తుతించాను. ఇంకేం ఫర్వాలేదు అని తెలిసిన తర్వాత నా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాను.
అది క్రిస్మస్ రోజు. మా చర్చిలో వేలాదిమంది క్రీస్తును ఆరాధించేందుకు సిద్ధమయ్యారు. ‘క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడమే నిజమైన క్రిస్మస్’ అంటూ నా సందేశం కొనసాగింది. భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే ప్రేమమార్గమే సరైనదంటూ నేను చేసిన ప్రసంగం అనేకులను ఆలోచింపజేసింది. క్రిస్మస్ అనంతరం ఇద్దరు భార్యాభర్తలు పుష్పగుచ్ఛంతో ముందుకు వచ్చి నాకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి కన్నీళ్లు కారుస్తున్నారు. అనురాగంతో వారిని హత్తుకుని కారణం అడిగాను. ‘ఆనాడు మీరు చూపిన ప్రేమను మర్చిపోలేకపోతున్నాము. మేమెవరమో తెలియకపోయినా మీరు చేసిన సహాయం రెండు బతుకులను నిలబెట్టింది. ప్రాణాలు దక్కించుకున్న మా కుమారుడు నేడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు’ అని చెబుతుంటే ఎంత సంతోషించానో! అవును! దేవుని పేరిట మనస్ఫూర్తిగా చేసే ఏ చిన్న కార్యమైనా అపరిమితమైన ఆనందాన్ని మోసుకొస్తుంది.
సాటివ్యక్తి బాధలను గుర్తించక ఏరులై పారుతున్న కన్నీళ్లను అవహేళన చేస్తూ, దైవప్రేమను గుర్తించక దారితప్పిపోతున్న సమాజానికి ఓ అమూల్యమైన దిశానిర్దేశం చేసే పండుగే క్రిస్మస్. భూమికి మధ్య ప్రాంతమైన బెత్లెహాములో దేవుడు శరీరధారిగా రావడం ద్వారా మనిషికి ఎన్నో మేళ్లు చేకూర్చబడ్డాయి. చితికిపోయిన జీవితాలను పునఃప్రతిష్ఠ చేసి వారిని నిలబెట్టాలనే సదాశయంతో దేవుడు భూమ్మీదకు వచ్చాడు. కర్కశలోకంలో కారుణ్యం విరబూసింది. సొమ్మసిల్లిన బతుకులకు ఆశ్రయం లభించింది. ‘ఓ దేవా! నేను అసత్యంలో ఉన్నాను. నన్ను సత్యంలోనికి నడిపించు! చీకటిలో ఉన్నాను. వెలుగులోనికి నడిపించు! మరణంలో ఉన్నాను. జీవంలోనికి నడిపించు!’ అని మనిషి చేస్తున్న ప్రార్థనకు జవాబివ్వడానికి పరమాత్ముడు పశుశాలలో పవళించాడు. దీనులైన సామాన్య గొర్రెల కాపరులకు సృష్టికర్తను చూడగలిగే భాగ్యం లభించింది. మనిషిలో మానవత్వాన్ని మేల్కొల్పడానికి దేవుడే మనిషిగా వచ్చాడు. పశువుల శాల వంటి జీవితాలలో జన్మిస్తూ, పాపాన్ని పారద్రోలుతూ, మనిషిని పావనం చేస్తున్నాడు. మానవత్వం రెండు కళ్లూ మూసుకుపోయి పైశాచికంగా బతుకీడుస్తున్న మనిషికి ‘నిజమైన మనిషి’గా ఎలా బతకాలో చేసి చూపించడానికి క్రీస్తు నరావతారుడయ్యాడు. జడత్వంలో నిండిన ఇంద్రియాలను చైతన్య పరచి సమ సమాజ నిర్మాణానికి బాటలు వేశాడు.
క్రిస్మస్ అనగా ప్రేమను వ్యక్తీకరించే పండుగ. క్షణికమైన అనురాగాలు, ఆవిరి వంటి ఆప్యాయతలు. అవసరాల అభిమానాలు. నిలిచిపోయే అనుబంధాలు నేటి ప్రపంచానికి స్వచ్ఛమైన, నిత్యమైన ప్రేమను కనబరచడానికి క్రీస్తు వచ్చాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడమేగాక ఆ ప్రేమను క్రియల్లో నెరవేర్చాడు. ‘ఉత్తమ వ్యక్తిత్వం అంటే అందచందాలు కాదు! భౌతికమైన భోగభాగ్యాలు కాదు! దేవుని ప్రేమతో నింపబడి సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేవాడే ఉత్తమ వ్యక్తిత్వం కలవాడు. ప్రేమతోనే ప్రపంచంలో ఓ గొప్ప మార్పును తీసుకురాగలము’ అని మదర్ థెరిస్సా చెప్పిన మాటలు కచ్చితంగా అభినందనీయం. ఆచరణీయం. ‘‘మనుష్యులు మీకెలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి’’ ‘‘మీకు మేలు చేయువారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును?’’‘‘మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి’’అని క్రీస్తు బో ధించాడు. ఆ బోధనలను అనుసరించడమే నిజమైన క్రిస్మస్! మానవత్వాన్ని పెంపొందించుకుంటూ, ప్రతి ఒక్కరినీ సన్మానిస్తూ, ప్రేమిస్తూ దేవుడు మెచ్చే క్రిస్మస్‌ను జరుపుకుందాం! జాన్‌వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్
ప్రేమను పంచండి
Published Sat, Dec 22 2018 11:58 PM | Last Updated on Sat, Dec 22 2018 11:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment