
క్రిస్మస్... ఓ ఆనందం, ఓ సంతోషం - జెనీలియా
తారాస్వరం
క్రిస్‌మస్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పట్నుంచీ ఆ పండుగ కోసం ఎదురు చూడటం అలవాటు నాకు. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు... అన్నిచోట్లా క్రిస్‌మస్ సందడే కనిపిస్తుంది. క్రిస్‌మస్ స్పిరిట్ అలా గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో క్రిస్‌మస్ ట్రీ పెట్టడం ఎంత సరదాగా ఉంటుందో! ఒక్కసారి స్టార్ పెట్టామో... ఇక క్రిస్‌మస్ వచ్చేసినట్టే. అమ్మకి కేక్ తయారీలో సాయం చేయడం, అన్నయ్యతో కలిసి ఇల్లు అలంకరించడం, పండుగకి షాపింగ్ చేయడం, నాకా డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి అంటూ అమ్మానాన్నలను సతాయించడం... ఎంత మంచి జ్ఞాపకాలో అవన్నీ.
నా వరకూ నాకు క్రిస్‌మస్ అంటే ఓ ఆనందం. ఓ సంబరం. ఆ రోజు ఉన్నంత సంతోషం మరెప్పుడూ ఉండదేమో. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ విందు ఆరగించడంలో ఉండే సంతోషమే వేరు. నాకు తెలిసి... ఆ రోజు ఉన్నంత రుచిగా అమ్మ వంట మరెప్పుడూ ఉండదు. మనసులో నిండిన క్రిస్‌మస్ జాయ్... అన్నిటినీ అలా మధురంగా మార్చేస్తుందనుకుంటా. అందుకే అస్సలు మిస్ అవను నేను. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా...
ఆ రోజున ఇంట్లోవాళ్ల దగ్గర వాలిపోవాల్సిందే!
క్రిస్‌మస్ పండుగలో నాకు నచ్చిన మరో విషయం... అందరికీ పంచడం. బహుమానాలు కొనడం, అందరికీ ఇవ్వడం, లేనివాళ్లకు మన దగ్గర ఉన్నదాన్ని పంచి ఇవ్వడం ఎంతో సంతోషాన్నిస్తుంది. నిజమైన క్రిస్‌మస్ స్పిరిట్ అదే!
ముద్దుపేర్లు: జెన్నీ, జీనూ
పుట్టినరోజు: ఆగస్టు 5, 1987
జన్మస్థలం: బాంద్రా, ముంబై
మాతృభాష: కొంకణి
చదువు: బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ
నచ్చే ఆహారం: బిర్యానీ, రెడ్ మసాలా ఫిష్ కర్రీ
నచ్చే రంగులు: పసుపు, ఎరుపు
నచ్చే దుస్తులు: ప్యాంట్స్, టాప్స్. లాంగ్ స్కర్టులు కూడా చాలా ఇష్టం.
నచ్చిన సినిమాలు: హోమ్ అలోన్, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే
నచ్చే హీరోలు: షారుఖ్, సల్మాన్, ఆమిర్
నచ్చే హీరోయిన్లు: మాధురీ దీక్షిత్, కాజోల్
నచ్చే దర్శకుడు: ఇంతియాజ్ అలీ
నచ్చే సింగర్‌స: మడొన్నా, లక్కీ అలీ
నచ్చే ఆట: ఫుట్‌బాల్. నేను జాతీయస్థాయి ఫుట్‌బాల్ ప్లేయర్‌ని.
ఫిట్‌నెస్ సీక్రెట్: కొద్దిగా వ్యాయామం, కొంచెం ఆహార నియంత్రణ. అంతే. అయినా లేని అందం ఏం చేసినా రాదు. ఉన్నదాన్ని
కాపాడుకోవడానికి మరీ అంత కష్టపడిపోవాల్సిన అవసరమూ లేదని అనుకుంటాను.
తీరిక వేళల్లో: పాత పాటలు వింటూ హ్యాపీగా గడిపేస్తా.
నటి కాకపోయి ఉంటే: కచ్చితంగా ఏ కంపెనీలోనో ఉద్యోగం చేసుకుంటూ ఉండేదాన్ని. లేదంటే ఏదైనా చిన్న వ్యాపారమైనా చేసేదాన్ని.
కానీ ఏం చేసినా సక్సెస్ అయి ఉండేదాన్ని.
నమ్మే సిద్ధాంతం: జీవించు, జీవించనివ్వు.
భవిష్యత్ ప్రణాళిలు: వ్యక్తిగత జీవితం సంతోషంగా సాగిపోతోంది. అందుకే ఇక వృత్తిగత జీవితం మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను.
ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమా చేస్తున్నాను. త్వరలోనే అన్ని భాషల్లోనూ నటించేలా ప్లాన్ చేసుకుంటున్నాను. మిగిలినదంతా దేవుడి దయ. నేను ఆయనకు ప్రియమైన బిడ్డని. నేనేం చేయాలో ఆయనే నిర్ణయిస్తాడు. ఎక్కడికి చేరాలో అక్కడికే చేర్చుతాడు. అది నా నమ్మకం!