క్రిస్మస్ పండుగకు ముందటి ఒక జ్ఞాపకమిది: ఇంటికి సున్నాలు, ఒంటికి కొత్త బట్టలూ, పంటి కిందికి కేకులూ, రోజ్ కుకీలూ... అబ్బో సందడే సందడి. కొత్తబట్టలు కొనుక్కోవడానికి విజయనగరం ట్యాక్సీలో వెళ్లడం మరుపురాని అనుభూతైతే, ఆ బట్టలు వైజాగ్‌లో కుట్టించుకోవడం ఇంకో మరిచిపోలేని జ్ఞాపకం. కాని, ఒక్క తలకత్తిరింపు ప్రహసనమే మరచిపోలేని పీడకల మాకు. పండక్కి మూడురోజుల ముందు మా ఆస్థాన క్షురకుడు వెంకటేశ్వర్లు మా ఇంటికి వచ్చి నాన్నకీ, నాకూ, మా తమ్ముడికి వరసగా క్షౌరం చేసి వెళ్ళిపోవడం ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఆ సంవత్సరం ఆ సంప్రదాయానికి చరమగీతం పాడి, షాపు కెళ్ళి తల కత్తిరించుకోవాలనేది మా తమ్ముడి ప్రయత్నం. ఎందుకంటే అక్కడ అమ్మ ఆజమాయిషీ ఉండదు గనుక వాడిష్టం వచ్చినట్లు కత్తిరించుకోవచ్చని వాడి ఆశ.అదెలా సాధించాలా అనే ఆలోచనలోనే వాడుండగానే ఇరవైరెండో తేదీ వచ్చేసింది. కత్తులూ కత్తెర్లూ చేత్తో పట్టుకొని వెంకటేశ్వర్లు మా ఇంటిముంగిట్లో వాలిపోయాడు మాకు కటింగ్ చేయడానికి. వెంకటేశర్లుని చూడగానే మా వాడి ముఖం బ్రహ్మరాక్షసిని చూసినట్లు భయంతో పాలిపోయింది.
సరే, ముందుగా నాన్న కూర్చున్నాడు కత్తిరింపుకి. నాన్న తల కత్తిరిస్తున్నంత సేపూ అక్కడే కూర్చొని వెంకటేశ్వర్లుతో బేరాలాడుతూనే ఉన్నాడు మా తమ్ముడు జుత్తు ఎక్కువ తగ్గించేయవద్దని. వెంకటేశ్వర్లు మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా తల కత్తిరించడంలో నిమగ్నమైనట్లు యమ యాక్షన్ చేస్తున్నాడు.నేను కొంచెం దూరంగా కూర్చొని పేపర్ చదువుతున్నట్టు నటిస్తూ జరుగుతున్న ప్రహసనాన్ని గమనిస్తున్నాను.అమ్మకు అర్థమైపోయింది తమ్ముడేదో ప్లాన్ చేస్తున్నట్లు.అందుకే ఆ చుట్టుపక్కలే తచ్చాడుతోంది ఏదో పని ఉన్నట్లు.వాడేమో అమ్మ అక్కడకు వచ్చినప్పుడు నోరుమూసుకొని, కొంచెం అటువైపు వెళ్లగానే మళ్లీ బ్రతిమిలాడడం మొదలుపెడుతున్నాడు జాలిగా దీనంగా. నాన్నేమో ఇవేమీ అస్సలు పట్టించుకోకుండా తల అప్పచెప్సేసి కళ్లు మూసుకు కూర్చున్నారు అలవాటు ప్రకారం.అరగంట గడిచింది భారంగా.నాన్న జుత్తు కత్తిరింపు అయిపోయింది. తర్వాత వంతు మా తిప్పడిదే. తిప్పడు తెగించేవాడు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దపడిపోయాడు. అందరికీ... ముఖ్యంగా అమ్మకి వినిపించేలా గట్టిగా....‘‘వెంకటేశ్వర్లూ నా జుత్తు ఎక్కువ తగ్గించకు. కొంచెం పైపైన తీసేసి వదిలెయ్యి చాలు. చెవుల మీదకు అసలు తీయవద్దు’’ అన్నాడు. అంతే!అమ్మ రయ్యిమని దూసుకొచ్చేసింది స్పాట్‌లోకి.దూసుకొచ్చి భయంకరమైన హుకుం జారీ చేసింది...‘‘వెంకటేశ్వర్లూ వాడికి కటింగ్ ఎప్పుడూ చేస్తున్నట్టే చెయ్యి. ఏమీ మార్చకు. జుత్తు బాగా పెరిగింది. బాగా చెవుల మీదికి తీసెయ్యి’’ అని.అంతే..మా తిప్పడి ముఖం నల్లగా మాడిపోయింది. కళ్లలోకి సర్రన కోపం, చివ్వున కన్నీరూ ఎగదన్నుకొచ్చేసాయి. విసురుగా లేచిపోయాడు స్టూల్ మీద నుండి జుత్తు చెవుల మీదకి ఉంచుకోవడానికి కుదరకపోతే అసలు జుత్తే కత్తిరించుకోనంటూ. దాంతో అమ్మకు పూనకం వచ్చేసింది.
‘‘ఇంట్లో నా మాటకి విలువేమైనా ఉందా. అసలిదంతా ఆ పెద్దవెధవ వల్లే వచ్చింది. డిగ్రీ చదువుతున్న ఆ గాడిదకెలూగు చెప్పలేను. తొమ్మిదో క్లాసు చదువుతున్న ఆ చిన్నగాడిదకి కూడా...’’ ఇలా సాగిపోతుంది వాక్‌ప్రవాహం.నాన్న మాత్రం తమ్ముడి బాధ పడలేక...‘‘పోనిలేవే పాపం. క్రిస్మస్ కదా ఈ ఒక్కసారీ వాడి ఇష్టం వచ్చినట్టు కట్ చేయించుకోనివ్వకూడదూ. వాడూ పెద్దోడవుతున్నాడు కదా’’ అని అన్నారో లేదో దాడి మొత్తం ఆయన మీదికి మళ్లింది.‘‘నేను చెప్తూనే ఉన్నాను కదా...మీ వల్లే ఈ గాడిదలు ఇలా భయం, భక్తీ లేకుండా తయారవుతున్నారని. క్రమశిక్షణ లేకుండా పోతుంది బొత్తిగా! (ఇది మాఅమ్మ ఫెవరెట్ డైలాగ్). వీళ్లిలా తయారవడానికి కారణం మీరే. మీ వల్లే ఇదంతా’’ఇక తమాయించుకోవడం నా వల్ల కాలేదు.గట్టిగా నవ్వడం మొదలు పెట్టాను.నాతో పాటు నాన్న కూడా.అంతే మా తమ్ముడి సహనం చచ్చిపోయింది. అమ్మని ఎదిరించి ఇటువంటి విషయాల్లో వాడే కాదు నాన్న కూడా ఏమీ చేయలేరన్న విషయం చాలా స్పష్టంగా ఇంకొకసారి అవగతం అయ్యింది. క్రిస్మస్‌కి కనీసం చెవుల ఉప్పెనలా నిరాశ, నిస్పృహ ఆవహించి, తల విషయం తన తల రాతకి, భగవంతుడికీ వదిలేసి...‘‘వెంకటేశ్వర్లూ ఇంకా చెక్కేయ్. నీ ఇష్టం వచ్చినట్టు చెక్కేయ్. నేనేమైనా అంటే నీ చెప్పిచ్చుకు కొట్టు. కానీయ్’’ అని తల వంచుక్కూర్చున్నాడు.ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వెంకటేశ్వర్లు తన కత్తెరతో వాడి తల మీద విలయతాండవం చేయించాడు. వాడి జుట్టు గుప్పెటకందనంత పొట్టిగా, చెవులకి అంగులంమీదుగా గొరిగేసాడు. చూస్తుండగానే మా తిప్పడి బుర్ర పంపరపనసకాయలా గుండ్రంగా రూపాంతరం చెందింది. దాన్ని చూసిన అమ్మ ముఖం ఆనందంతో దీపావళి మతాబులా వెలిగితే మా తిప్పడిముఖం మాత్రం చీదేసిన చిచ్చుబుడ్డిలా మాడిపోయింది. వాడి క్రిస్మస్ సర్దా అంతా మా ఊరి ఉప్పుటేట్లో కలిసిపోయింది.
– పి.కృపాకర్, హైదరాబాద్
క్రమశిక్షణ లేకుండా పోతుంది... బొత్తిగా!
Published Sun, Jan 20 2019 1:13 AM | Last Updated on Sun, Jan 20 2019 1:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment