కాఫీ కప్పులు
విడ్డూరం
ఇదిగో ఈ ఫొటోల్లో కనిపిస్తున్నవి అచ్చంగా కాఫీ కప్పులు. మాకు తెల్దేంటి అని కోప్పడిపోకండి. వీటిలో కాఫీ మాత్రమే తాగాలనే రూలేమీ లేదు. నిక్షేపంగా టీ కూడా తాగొచ్చు. ఊరకే సోదంతా దేనికి గానీ విషయానికి రమ్మంటారా..? ఆగండాగండి... విషయానికే వచ్చేద్దాం. ఇంతకీ విషయం ఏమిటంటారా? ఇవి పింగాణీ కప్పులో, గాజు కప్పులో కావు. కనీసం మట్టితో తయారు చేసి, రంగు పూసినవి కూడా కాదు. కాఫీతో తయారు చేసిన అచ్చమైన కాఫీ కప్పులు ఇవి.
కాఫీ గింజలను మిషన్‌లో వేసి తయారు చేసుకున్నా, ఇంట్లో డికాక్షన్ కాచుకుని ఫిల్టర్ కాఫీ తయారు చేసుకున్నా, అడుగున మిగిలిపోయిన కాఫీ పొడిని సాధారణంగా చెత్తబుట్టలో పారేస్తూ ఉంటాం. కొందరు పర్యావరణ ప్రేమికులు మాత్రం ఆ పొడిని చెత్తబుట్టలో పడేయకుండా మొక్కలకు గత్తంగా కూడా వాడుతూ ఉంటార్లెండి. అది వేరే విషయం. కాఫీ కాచుకున్నాక మిగిలిపోయిన పొడిని చెత్తబుట్టలో పడేయడమో, గత్తంగా వాడటమో కాకుండా వెరైటీగా ఏదైనా చేయాలని ఆలోచించింది ‘కాఫీ ఫార్మ్’ అనే జర్మన్ కంపెనీ.
ఆలోచన వచ్చిందే తడవుగా వృథాగా మిగిలిన కాఫీ పొడితో కప్పుల తయారీకి ప్రయోగాలు చేసింది. ఎట్టకేలకు ప్రయోగాలు విజయవంతమై చూడచక్కని కాఫీ కప్పులు తయారయ్యాయి. అలాగని ఇవి వాడి పారేసే ‘యూజ్ అండ్ త్రో’ కప్పుల్లాంటివి కావు. పింగాణీ, గాజు కప్పుల మాదిరిగానే మన్నికగా ఉంటాయి.