వ్యాపారి | crime stories | Sakshi
Sakshi News home page

వ్యాపారి

Published Sat, Dec 10 2016 11:43 PM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

వ్యాపారి - Sakshi

వ్యాపారి

‘‘చిక్కినట్లే చిక్కి పారిపోయారు’’ చెప్పుకుంటూ పోతున్నాడు అశోక్. ‘‘ఎంత దారుణం... ఎంత దారుణం’’ అని ఒకరంటే... ‘‘ఇది కాలనీయా? అడవా?’’ అని ఇంకొకరు ఆక్రోశిస్తున్నారు.రాత్రి జరిగిన మల్లికార్జున్ హత్య గురించి తలా ఒకరకంగా మాట్లాడుకుంటున్నారు. అరవై రెండు సంవత్సరాల మల్లికార్జున్ ఆ కాలనీలో ప్రతి ఇంటికీ సుపరిచితుడే. దీనికి కారణం... అతడి మంచితనం కాదు. మల్లికార్జున్ వడ్డీ వ్యాపారి. దీంతో పాటు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి.  ఎవరికి ఏ అవసరం వచ్చినా మల్లికార్జున్ ఇంటి తలుపులు తడుతుంటారు. ఎండాకాలం కావడంతో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఆరోజు రాత్రి కూడా కరెంట్ పోయింది. కరెంట్ పోయిన సమయంలో... పెరట్లో మంచం వేసుకొని పడుకున్న మల్లికార్జున్‌ను ఎవరో కాల్చి చంపారు. అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. ఈలోపే... అక్కడిని నుంచి ఉడాయించాడు హంతకుడు. ‘‘ఎవరి మీదైనా అనుమానం ఉందా?’’ మల్లికార్జున్ భార్య జానకిని అడిగాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ.‘‘చీమకు కూడా హాని తలపెట్టని దేవుడు నా భర్త...’’ అంటూ శోకాలు తీయడం తప్ప...‘ఫలానా వ్యక్తి మీద అనుమానం ఉంది’ అని చెప్పలేదు ఆమె.
 
 ఈలోపు అక్కడ ఉన్నవారిలో ఒకరు...
 ‘‘ఈయన వడ్డీవ్యాపారం చేస్తాడండీ. దీంతో రోజూ తగాదాలతోనే గడుపుతుంటాడు. ఈ ఫీల్డ్‌లో ఇవి మామూలే అనుకోండి. అందుకే... అనుమానించదగిన వ్యక్తి అని ఎవరి వంకా వేలెత్తి చూపలేం. ఈ వడ్డీ వ్యాపారంలో తగాదాలు ఎంత సహజమో...ఆ మరుసటి రోజు స్నేహం కూడా అంతే సహజం...’’ అన్నాడు అతడు. ‘‘ఈయన మీకేమవుతారు?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్.
 
 ‘‘ఏమీ కాడండీ. స్నేహితుడు మాత్రమే. నా పేరు శంకర్రావు’’ అన్నాడు ఆ వ్యక్తి.‘‘శంకర్రావు గారు... అలా నీడ పట్టున కూర్చొని మాట్లాడుకుందాం’’ అంటూ తీసుకెళ్లాడు ఇన్‌స్పెక్టర్.‘‘మల్లికార్జున్ గురించి ఇంకేమైనా చెబుతారా?’’ సిగరెట్ ముట్టిస్తూ అడిగాడు ఇన్‌స్పెక్టర్.‘‘చెప్పడానికి  ఏముందండీ... ఈ మల్లికార్జున్ పచ్చి దుర్మార్గుడని అందరూ అనుకుంటారు. ప్రజల రక్తాన్ని తాగి ఆస్తులు కూడబెట్టుకున్నాడని కూడా అంటుంటారు... ఎవరి అభిప్రాయం వారిది. కాని నా దృష్టిలో ప్రజలు అనుకుంత దుర్మార్గుడేమీ కాదు మల్లికార్జున్...’’  చెప్పుకుంటూ పోతున్నాడు.
 
 శంకర్రావు వాలకం చూస్తే... ప్రజలు నిజంగానే తిట్టారా? లేకపోతే వారి పేరు చెప్పి ఈయన తిడుతున్నాడా? అనిపించింది. ఈలోపు అక్కడికి వేరే వ్యక్తి వచ్చి... ఇన్‌స్పెక్టర్‌ను విష్ చేసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ‘‘నాగరాజు గారు... మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్.‘‘ఎవరినని అనుమానిస్తామండీ... వడ్డీ వ్యాపారం అన్నాక శత్రువులు ఉంటారు. మిత్రులు ఉంటారు. తగాదాలు ఉంటాయి. అంతెందుకు... మీ పక్కన కూర్చున్న శంకర్రావు, మల్లికార్జున్ నిన్నగాక మొన్న నా ముందే గొడవ పడ్డారు. అంతమాత్రాన శంకర్రావును అనుమానించలేము కదా’’ అన్నాడు నాగరాజు.‘‘మీతో కూడా గొడవ అయిందని చెప్పలేదేం?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్.‘‘అబ్బే... అదంత చెప్పుకోదగ్గ విషయమేమీ కాదండి. ఏదో చిన్న తగాదా..’’ చెప్పడానికి వెనకడుగు వేస్తున్నాడు శంకర్రావు.
 
 ‘‘అసలు దేని గురించి మీకు తగాదా వచ్చింది?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్.‘‘ఆయనకు ఇవ్వాల్సి డబ్బు టైమ్‌కు ఇవ్వలేదని నా మీద ఫైర్ అయ్యాడు... అంతే... అంతకు మించి ఏమీ లేదు’’ అన్నాడు శంకర్రావు. రకరకాల వ్యక్తుల గురించి ఆరా తీసిన తరువాత, మాట్లాడిన తరువాత ముగ్గురి మీద ఇన్‌స్పెక్టర్‌కు అనుమానం వచ్చింది. ఆ ముగ్గురిలో శంకర్రావు కూడా ఉన్నాడు.హత్య జరిగిన ప్రదేశానికి దగ్గరిలో ఒక పాత టార్చిలైట్ దొరికింది. దాన్ని ‘ఫింగర్ ప్రింట్స్’ కోసం పంపారు.అయితే... హంతకుడు గ్లోవ్స్ ధరించడం వల్ల ‘ఫింగర్ ప్రింట్స్’ కనిపించలేదు. టార్చిలైట్‌ను చూస్తున్న ఇన్‌స్పెక్టర్ నరసింహకు ఠక్కున ఒక ఆలోచన వచ్చింది. మరోసారి టార్చిలైట్‌ను ‘ఫింగర్ ప్రింట్స్’ కోసం పంపాడు. ఈసారి మాత్రం... అవి దొరికాయి!ఆ ఫింగర్ ప్రింట్స్ శంకర్రావువే అని నిర్ధారణ జరిగింది. హంతకుడు గ్లోవ్స్ ధరించి టార్చిలైట్‌ను ఉపయోగించాడు కదా. మరి... ఫింగర్ ప్రింట్స్ ఎలా దొరికాయి?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement