pawnbroker
-
వ్యాపారి
‘‘చిక్కినట్లే చిక్కి పారిపోయారు’’ చెప్పుకుంటూ పోతున్నాడు అశోక్. ‘‘ఎంత దారుణం... ఎంత దారుణం’’ అని ఒకరంటే... ‘‘ఇది కాలనీయా? అడవా?’’ అని ఇంకొకరు ఆక్రోశిస్తున్నారు.రాత్రి జరిగిన మల్లికార్జున్ హత్య గురించి తలా ఒకరకంగా మాట్లాడుకుంటున్నారు. అరవై రెండు సంవత్సరాల మల్లికార్జున్ ఆ కాలనీలో ప్రతి ఇంటికీ సుపరిచితుడే. దీనికి కారణం... అతడి మంచితనం కాదు. మల్లికార్జున్ వడ్డీ వ్యాపారి. దీంతో పాటు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. ఎవరికి ఏ అవసరం వచ్చినా మల్లికార్జున్ ఇంటి తలుపులు తడుతుంటారు. ఎండాకాలం కావడంతో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఆరోజు రాత్రి కూడా కరెంట్ పోయింది. కరెంట్ పోయిన సమయంలో... పెరట్లో మంచం వేసుకొని పడుకున్న మల్లికార్జున్‌ను ఎవరో కాల్చి చంపారు. అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. ఈలోపే... అక్కడిని నుంచి ఉడాయించాడు హంతకుడు. ‘‘ఎవరి మీదైనా అనుమానం ఉందా?’’ మల్లికార్జున్ భార్య జానకిని అడిగాడు ఇన్స్పెక్టర్ నరసింహ.‘‘చీమకు కూడా హాని తలపెట్టని దేవుడు నా భర్త...’’ అంటూ శోకాలు తీయడం తప్ప...‘ఫలానా వ్యక్తి మీద అనుమానం ఉంది’ అని చెప్పలేదు ఆమె. ఈలోపు అక్కడ ఉన్నవారిలో ఒకరు... ‘‘ఈయన వడ్డీవ్యాపారం చేస్తాడండీ. దీంతో రోజూ తగాదాలతోనే గడుపుతుంటాడు. ఈ ఫీల్డ్‌లో ఇవి మామూలే అనుకోండి. అందుకే... అనుమానించదగిన వ్యక్తి అని ఎవరి వంకా వేలెత్తి చూపలేం. ఈ వడ్డీ వ్యాపారంలో తగాదాలు ఎంత సహజమో...ఆ మరుసటి రోజు స్నేహం కూడా అంతే సహజం...’’ అన్నాడు అతడు. ‘‘ఈయన మీకేమవుతారు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘ఏమీ కాడండీ. స్నేహితుడు మాత్రమే. నా పేరు శంకర్రావు’’ అన్నాడు ఆ వ్యక్తి.‘‘శంకర్రావు గారు... అలా నీడ పట్టున కూర్చొని మాట్లాడుకుందాం’’ అంటూ తీసుకెళ్లాడు ఇన్స్పెక్టర్.‘‘మల్లికార్జున్ గురించి ఇంకేమైనా చెబుతారా?’’ సిగరెట్ ముట్టిస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘చెప్పడానికి ఏముందండీ... ఈ మల్లికార్జున్ పచ్చి దుర్మార్గుడని అందరూ అనుకుంటారు. ప్రజల రక్తాన్ని తాగి ఆస్తులు కూడబెట్టుకున్నాడని కూడా అంటుంటారు... ఎవరి అభిప్రాయం వారిది. కాని నా దృష్టిలో ప్రజలు అనుకుంత దుర్మార్గుడేమీ కాదు మల్లికార్జున్...’’ చెప్పుకుంటూ పోతున్నాడు. శంకర్రావు వాలకం చూస్తే... ప్రజలు నిజంగానే తిట్టారా? లేకపోతే వారి పేరు చెప్పి ఈయన తిడుతున్నాడా? అనిపించింది. ఈలోపు అక్కడికి వేరే వ్యక్తి వచ్చి... ఇన్స్పెక్టర్ను విష్ చేసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ‘‘నాగరాజు గారు... మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘ఎవరినని అనుమానిస్తామండీ... వడ్డీ వ్యాపారం అన్నాక శత్రువులు ఉంటారు. మిత్రులు ఉంటారు. తగాదాలు ఉంటాయి. అంతెందుకు... మీ పక్కన కూర్చున్న శంకర్రావు, మల్లికార్జున్ నిన్నగాక మొన్న నా ముందే గొడవ పడ్డారు. అంతమాత్రాన శంకర్రావును అనుమానించలేము కదా’’ అన్నాడు నాగరాజు.‘‘మీతో కూడా గొడవ అయిందని చెప్పలేదేం?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘అబ్బే... అదంత చెప్పుకోదగ్గ విషయమేమీ కాదండి. ఏదో చిన్న తగాదా..’’ చెప్పడానికి వెనకడుగు వేస్తున్నాడు శంకర్రావు. ‘‘అసలు దేని గురించి మీకు తగాదా వచ్చింది?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘ఆయనకు ఇవ్వాల్సి డబ్బు టైమ్‌కు ఇవ్వలేదని నా మీద ఫైర్ అయ్యాడు... అంతే... అంతకు మించి ఏమీ లేదు’’ అన్నాడు శంకర్రావు. రకరకాల వ్యక్తుల గురించి ఆరా తీసిన తరువాత, మాట్లాడిన తరువాత ముగ్గురి మీద ఇన్స్పెక్టర్కు అనుమానం వచ్చింది. ఆ ముగ్గురిలో శంకర్రావు కూడా ఉన్నాడు.హత్య జరిగిన ప్రదేశానికి దగ్గరిలో ఒక పాత టార్చిలైట్ దొరికింది. దాన్ని ‘ఫింగర్ ప్రింట్స్’ కోసం పంపారు.అయితే... హంతకుడు గ్లోవ్స్ ధరించడం వల్ల ‘ఫింగర్ ప్రింట్స్’ కనిపించలేదు. టార్చిలైట్‌ను చూస్తున్న ఇన్స్పెక్టర్ నరసింహకు ఠక్కున ఒక ఆలోచన వచ్చింది. మరోసారి టార్చిలైట్‌ను ‘ఫింగర్ ప్రింట్స్’ కోసం పంపాడు. ఈసారి మాత్రం... అవి దొరికాయి!ఆ ఫింగర్ ప్రింట్స్ శంకర్రావువే అని నిర్ధారణ జరిగింది. హంతకుడు గ్లోవ్స్ ధరించి టార్చిలైట్‌ను ఉపయోగించాడు కదా. మరి... ఫింగర్ ప్రింట్స్ ఎలా దొరికాయి? -
12 మంది వడ్డీ వ్యాపారులపై కేసు
అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్న 12 మందిపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు కేసులు పెట్టారు. స్థానికులైన బాధితులు కొందరు బుధవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపించిన సీఐ పాండురంగారెడ్డి 12మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
వడ్డీ వ్యాపారి వేధింపులతో మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీన్దయాల్నగర్లోని మారుతి అపార్ట్మెంట్లో నివాసముండే బి.నీరజ(36), నరేందర్ భార్యాభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నరేందర్ బెంగళూరులో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. నీరజ పిల్లలతో దీన్‌దయాల్‌నగర్‌లో ఉంటున్నారు. కాగా నీరజ హిల్‌కాలనీ వాసి రాముయాదవ్ వద్ద రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నారు. కొన్ని రోజులుగా అప్పు తిరిగి ఇవ్వాలని నీరజను రాము వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి నీరజ ఇంటికి వచ్చిన రాము తీసుకున్న డబ్బు వడ్డీతోసహా రూ.1.5 లక్షలు వెంటనే ఇవ్వాలని పట్టుబట్టాడు. శనివారం ఉదయం కూడా ఆమె ఇంటికి వెళ్లి డబ్బుల కోసం గొడవ చేశాడు. దీంతో మనస్తాపం చెందిన నీరజ శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వడ్డీ కింద ఇల్లు స్వాధీనం తీసుకున్న అప్పునకు ఇల్లు, ప్లాటు రాయించుకోవడమే కాకుండా వడ్డీ కింద మరో ఇల్లు కూడా ఇవ్వాలంటూ బంజారాహిల్స్ శ్రీకృష్ణానగర్ ఏ బ్లాక్‌లోని ఓ నివాసం వద్ద వడ్డీ వ్యాపారులు భయాందోళనలు సృష్టించారు. శ్రీకృష్ణానగర్‌లో నివాసముండే టి.ప్రసాదరాజు 2012లో నార్కెడ్పల్లికి చెందిన వడ్డీ వ్యాపారుల నుంచి రూ.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇందుకుగాను శ్రీకృష్ణానగర్‌లోని ఒక ఇంటితో పాటు శంషాబాద్‌లోని మరో ప్లాట్‌ను అగ్రిమెంట్ చేసి ఇచ్చాడు. ఇవి కాకుండా వడ్డీ కింద మరో ఇల్లు కూడా ఇవ్వాలంటూ ఆ వ్యాపారులు మందీ మార్బలంతో శనివారం ఉదయం ప్రసాదరావు ఇంట్లోకి చొరబడ్డారు. ఆయన ఉంటున్న ఇంటికి తాళాలు వేసి అద్దెకుండేవారిని వెళ్లగొట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళను వివస్త్రను చేసేందుకు యత్నించి వ్యాపారి
-
మహిళను వివస్త్రను చేసేందుకు యత్నించిన వ్యాపారి
శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజూకు పెరిగి పోతున్నాయి. తాజాగా శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద మొత్తం బాకీ చెల్లించాలంటూ మహిళను వివస్త్రను చేసేందుకు వడ్డీ వ్యాపారి యత్నించాడు. దీంతో సదరు మహిళ బిగ్గరగా కేకలు వేసింది. దాంతో స్థానికులు చుట్టుముట్టడంతో వడ్డీ వ్యాపారి అక్కడి నుంచి పరారైయ్యాడు. బాధితురాలు శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న బండారి శ్రీనివాస్ వద్ద సదరు మహిళ అప్పు చేసింది. అందుకు సంబంధించి ప్రతి నెల వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఈ నెల వడ్డీ కట్టేందుకు నగదు లేకపోవడంతో తన వద్దనున్న బంగారం కుదవ పెట్టి....రూ. 40 వేలు వడ్డీ వ్యాపారికి ఇచ్చింది. ఇంకా రూ.10 వేలు ఇవ్వాలంటూ ఆమెను ప్రశ్నించాడు. మిగిలిన పైకం తర్వాత ఇస్తానంటూ ఆమె చెప్పడంతో వడ్డీ వ్యాపారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఆమెను వివస్త్రను చేసేందుకు యత్నించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. వడ్డీ వ్యాపారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. -
బాకీ తీర్చలేదని కొడుకు, కూతురు కిడ్నాప్!
మెదక్: బాకీ తీర్చలేదని అప్పు తీసుకున్న వ్యక్తి కొడుకుని, కూతురిని వడ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. గాదిరెడ్డిపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్వామి అనే వ్యక్తి తన అవసరాల నిమిత్తం నిజామాబాద్‌కు చెందిన ఒక వడ్డీ వ్యాపారి వద్ద కొంత డబ్బు తీసుకున్నాడు. అయితే అతను ఆర్థిక ఇబ్బందువల్ల తీసుకున్న అప్పును సకాలంలో తీర్చలేకపోయాడు. దాంతో ఆ వడ్డీ వ్యాపారి స్వామి కొడుకుని, కూతురిని కిడ్నాప్ చేశాడు. బాధితుడు మెదక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
వడ్డీ వ్యాపారిని రాళ్లతో కొట్టి చంపారు
జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండూరులో దారుణం జరిగింది. వడ్డీ వ్యాపారి చంద్రశేఖర్‌ను గ్రామానికి చెందిన కొందరు మంగళవారం అర్ధరాత్రి రాళ్లతో కొట్టి చంపారు. బకాయిల విషయమై తలెత్తిన వివాదమే దీనికి కారణంగా తెలుస్తోంది. స్తానికుల సమాచారంతో బుధవారం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వడ్డీ వ్యాపారి దారుణ హత్య
బెంగళూరులో పట్టపగలు దారుణం ఆటోతో ఢీకొని...కారంపొడి చల్లి మారణాయుధాలతో నరికి చంపారు బెంగళూరు : నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై వడ్డీ వ్యాపారిని అతి దారుణంగా మారణాయుధాలతో నరికి హత్య చేసిన సంఘటన ఇక్కడి కాటన్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాటన్‌పేట ఓటీసీ రోడ్డు రెండోక్రాస్లో నివాసముంటున్న బాబుసింగ్ (42)ను శనివారం దారుణంగా నరికి హత్య చేసి పరారయ్యారు. వివరాలు... వడ్డీ వ్యాపారం చేసే బాబుసింగ్‌కు నగరంలో అనేక ఇళ్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి సమీపంలోని బెస్కాం కార్యాలయంలో కరెంటు బిల్లులు కట్టడానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో ఓటీసీ రోడ్డులో వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఆటోలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బాబుసింగ్‌ను వెంబడించారు. ఓటీసీ రోడ్డులో వెనుక నుంచి ఆటోతో నడిచి వెళ్తున్న బాబుసింగ్‌ను ఢీకొన్నారు. కిందపడిన బాబుపై కారంపొడి చల్లి మారణాయుధాలు తీసుకుని దారుణంగా నరికి క్షణాల్లో పరారయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఓటీసీ రోడ్డులో హత్య జరగడంతో స్థానికులు హడలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు బాబు సింగ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉంటే హత్య జరిగిన ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో హత్య సంఘటన రికార్డు కావడంతో వాటి ఫుటేజీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్, డీసీసీ లాబురామ్ తదితరులు పరిశీలించారు. బాబు సింగ్ హత్య వార్త తెలుసుకున్న ఆయన భార్య, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. ఆర్థికలావాదేవీలు, పాతకక్షల కారణంగానే బాబుసింగ్‌ను హత్య చేసి ఉంటారని త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని కాటన్‌పేట పోలీసులు తెలిపారు. -
ఏదో ఆశ...
బళ్లారి అర్బన్ : నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని అశ్రద్ధ చేయకుండా దైవంతో సమానంగా పూజించాలని విజయవాడకు చెందిన విమలానంద ఆధ్యాత్మిక పరిశోధన సంస్థ వ్యవస్థాపకుడు నందిగామ హరేరామ శర్మ పేర్కొన్నారు. నగరంలోని బాలాంజనేయ దేవస్థానంలో నందిగామ హరేరామ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న లలితా వైభవ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం రాత్రి మాతృపూజ, గోమాత, భూమి పూజ, గంగామాత, తులసీ పూజలు నిర్వహించారు. బుధవారం లలితా శాస్త్రనామ స్తోత్రనామ ప్రవచనాన్ని నిర్వహించారు. అంతకుముందు మంగళవారం రాత్రి ఆయన మాట్లాడుతూ తల్లిలో దైవాన్ని చూసే సంస్కృతిని పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలన్న ఉద్దేశ్యంతో మాతృపూజ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. గురువారం గురుపాద పూజ, శుక్రవారం వర మహాలక్ష్మీ పూజలను పురస్కరించుకుని కనకధార దేవి పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కులమత బేధాలు పేద, ధనిక అనే తేడా లేకుండా పూజల్లో పాల్గొనడం సంతోషం కలిగించిందన్నారు. కార్యక్రమంలో బాలాంజినేయస్వామి శిష్యులు బాలానందస్వామి, హరేరామ శర్మ శిష్యులు, నారాయణస్వామి, కాండ్ర సతీష్ బాబు, భక్తులు పాల్గొన్నారు. -
అప్పు తీర్చమన్నందుకే అంతం చేశారు
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: వడ్డీ వ్యాపారి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. రుణం తీసుకున్న వారే అతనికి మద్యం తాపి హత్య చేసినట్లు నిర్ధారించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు పూర్వాపరాలను మెదక్ రూరల్ సీఐ కృష్ణకుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం...మెదక్ మండల పరిధిలోని కప్రాయిపల్లి గ్రామానికి చెందిన బోయిని లచ్చయ్య(32) రాజిపేట గ్రామంలో నివాసం ఉంటున్నాడు. రైతులు బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను చెల్లించేందుకు వారం, పదిరోజులకు డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడు. పంటరుణం రెన్యూవల్ కాగానే వారి వద్ద డబ్బులు వసూలు చేసుకునేవాడు. ఈ క్రమంలోనే ఆరునెలల క్రితం లచ్చయ్య రాజిపేటతండాకు చెందిన బోడ రవికి రూ. 40వేలు, అదేతండాకు చెందిన కాట్రోత్ సరియాకు రూ. 20 వే లు అప్పుగా ఇచ్చాడు. అయితే చెప్పిన గడువు దాటినా బోడ రవి, కాట్రోత్ సరియా డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో లచ్చయ్య డబ్బులు చెల్లించాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చాడు. వెంటనే తన అప్పు తీర్చకపోతే వారి పశువులను తీసుకుపోతానంటూ బెదరించాడు. దీంతో రవి, సరియాలు ఓ పథకం పన్నారు. లచ్చయ్యను హత్య చేస్తే అప్పు తీర్చే బాధ తప్పుతుందని భావించారు. అందులో భాగంగానే రవి, సరియాలు గతనెల 23వ తేదీన అప్పుగా తీసుకున్న డబ్బులను ఇస్తామని లచ్చయ్యకు తెలిపారు. సమయానికి ఆదుకున్నందున దావత్ కూడా ఇస్తామని అతన్ని నమ్మించారు. వారి మాటలు నమ్మిన లచ్చయ్య వారు చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. ముగ్గురూ మెదక్‌లోని ఓవైన్స్లో మద్యాన్ని తీసుకుని మెదక్-బోదన్ ప్రదాన రహదారి పక్కన ఉన్న బొగుడభూపతిపూర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి మందు తాగారు. అయితే రవి, సరియాలు తమ పథకంలో భాగంగా లచ్చయ్యకు ఎక్కువగా మద్యాన్ని తాగించారు. కొద్దిసేపటి తర్వాత రవి, సరియాలు లేచి మద్యం మత్తులో ఉన్న లచ్చయ్య గొంతుకు టవల్ బిగించి చంపారు. అనంతరం లచ్చయ్య జేబులో ఉన్న రూ. 25 వేలను తీసుకుని మృతదేహాన్ని కొంతదూరం ఈడ్చుకు వచ్చారు. అనంతరం లచ్చయ్య ముఖంపై మిగిలిన మద్యాన్ని పోసి తగులబెట్టారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రించేందుకు లచ్చయ్య మృతదేహంపై అతని బైక్‌ను పడేసి వెళ్లిపోయారు. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత లచ్చయ్య మృతదేహాన్ని చూసిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు ఆధారాలు సేకరించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించి లచ్చయ్య వద్ద అప్పు తీసుకున్న బోడ రవి, సరియాలే అతన్ని హత్య చేసినట్లు తెలుసుకున్నారు. ఈ మేరకు వారిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదును రికవరీ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్ఐ వేణుకుమార్తోపాటు పలువురు కానిస్టేబుళ్లు ఉన్నారు.