శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజూకు పెరిగి పోతున్నాయి. తాజాగా శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద మొత్తం బాకీ చెల్లించాలంటూ మహిళను వివస్త్రను చేసేందుకు వడ్డీ వ్యాపారి యత్నించాడు. దీంతో సదరు మహిళ బిగ్గరగా కేకలు వేసింది. దాంతో స్థానికులు చుట్టుముట్టడంతో వడ్డీ వ్యాపారి అక్కడి నుంచి పరారైయ్యాడు.
బాధితురాలు శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న బండారి శ్రీనివాస్ వద్ద సదరు మహిళ అప్పు చేసింది. అందుకు సంబంధించి ప్రతి నెల వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఈ నెల వడ్డీ కట్టేందుకు నగదు లేకపోవడంతో తన వద్దనున్న బంగారం కుదవ పెట్టి....రూ. 40 వేలు వడ్డీ వ్యాపారికి ఇచ్చింది.
ఇంకా రూ.10 వేలు ఇవ్వాలంటూ ఆమెను ప్రశ్నించాడు. మిగిలిన పైకం తర్వాత ఇస్తానంటూ ఆమె చెప్పడంతో వడ్డీ వ్యాపారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఆమెను వివస్త్రను చేసేందుకు యత్నించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. వడ్డీ వ్యాపారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.