మెదక్ రూరల్, న్యూస్‌లైన్: వడ్డీ వ్యాపారి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. రుణం తీసుకున్న వారే అతనికి మద్యం తాపి హత్య చేసినట్లు నిర్ధారించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు పూర్వాపరాలను మెదక్ రూరల్ సీఐ కృష్ణకుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం...మెదక్ మండల పరిధిలోని కప్రాయిపల్లి గ్రామానికి చెందిన బోయిని లచ్చయ్య(32) రాజిపేట గ్రామంలో నివాసం ఉంటున్నాడు. రైతులు బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను చెల్లించేందుకు వారం, పదిరోజులకు డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడు. పంటరుణం రెన్యూవల్ కాగానే వారి వద్ద డబ్బులు వసూలు చేసుకునేవాడు.
ఈ క్రమంలోనే ఆరునెలల క్రితం లచ్చయ్య రాజిపేటతండాకు చెందిన బోడ రవికి రూ. 40వేలు, అదేతండాకు చెందిన కాట్రోత్ సరియాకు రూ. 20 వే లు అప్పుగా ఇచ్చాడు. అయితే చెప్పిన గడువు దాటినా బోడ రవి, కాట్రోత్ సరియా డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో లచ్చయ్య డబ్బులు చెల్లించాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చాడు. వెంటనే తన అప్పు తీర్చకపోతే వారి పశువులను తీసుకుపోతానంటూ బెదరించాడు. దీంతో రవి, సరియాలు ఓ పథకం పన్నారు. లచ్చయ్యను హత్య చేస్తే అప్పు తీర్చే బాధ తప్పుతుందని భావించారు.
అందులో భాగంగానే రవి, సరియాలు గతనెల 23వ తేదీన అప్పుగా తీసుకున్న డబ్బులను ఇస్తామని లచ్చయ్యకు తెలిపారు. సమయానికి ఆదుకున్నందున దావత్ కూడా ఇస్తామని అతన్ని నమ్మించారు. వారి మాటలు నమ్మిన లచ్చయ్య వారు చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. ముగ్గురూ మెదక్‌లోని ఓవైన్స్‌లో మద్యాన్ని తీసుకుని మెదక్-బోదన్ ప్రదాన రహదారి పక్కన ఉన్న బొగుడభూపతిపూర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి మందు తాగారు. అయితే రవి, సరియాలు తమ పథకంలో భాగంగా లచ్చయ్యకు ఎక్కువగా మద్యాన్ని తాగించారు. కొద్దిసేపటి తర్వాత రవి, సరియాలు లేచి మద్యం మత్తులో ఉన్న లచ్చయ్య గొంతుకు టవల్ బిగించి చంపారు.
అనంతరం లచ్చయ్య జేబులో ఉన్న రూ. 25 వేలను తీసుకుని మృతదేహాన్ని కొంతదూరం ఈడ్చుకు వచ్చారు. అనంతరం లచ్చయ్య ముఖంపై మిగిలిన మద్యాన్ని పోసి తగులబెట్టారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రించేందుకు లచ్చయ్య మృతదేహంపై అతని బైక్‌ను పడేసి వెళ్లిపోయారు. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత లచ్చయ్య మృతదేహాన్ని చూసిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు ఆధారాలు సేకరించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించి లచ్చయ్య వద్ద అప్పు తీసుకున్న బోడ రవి, సరియాలే అతన్ని హత్య చేసినట్లు తెలుసుకున్నారు. ఈ మేరకు వారిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నారు.
దీంతో పోలీసులు వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదును రికవరీ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్‌ఐ వేణుకుమార్‌తోపాటు పలువురు కానిస్టేబుళ్లు ఉన్నారు.
అప్పు తీర్చమన్నందుకే అంతం చేశారు
Published Sat, Oct 26 2013 1:42 AM | Last Updated on Sat, Aug 11 2018 8:12 PM
Advertisement