హత్య కేసు నిందితుల అరెస్టు
పుట్టపర్తి అర్బన్ : యువకుడి హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీధర్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన కథనం మేరకు... పుట్టపర్తి మండలం బొంతలపల్లి గ్రామానికి చెందిన పుణ్యవతితో అదే గ్రామానికి చెందిన కోలాల చెన్నకేశవులు (27)కు వివాహేతర సంబంధం ఉండేది. ఈ క్రమంలో ఆమెకు బొంతలపల్లెకే చెందిన నగేష్‌తో పెళ్లి చేశారు. అప్పటి నుంచి పుణ్యవతి వివాహేతర సంబంధం కొనసాగించలేదు. దీనిపై చెన్నకేశవులు ఆమెతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఈ విషయమై పంచాయతీ పెట్టించి గ్రామ పెద్దలతో చెప్పించినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు.
ఈ నేపథ్యంలో పుణ్యవతి, నగేష్ తమ బంధువులైన రామచంద్ర, ఎర్లపల్లి చెన్నకేశవులుతో కలిసి పథకం ప్రకారం కోలాల చెన్నకేశవులును ఈ నెల 13న పొలం వద్దకు పిలిపించారు. అక్కడ రాళ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లారు. క్షతగాత్రుడిని గమనించిన గ్రామస్తులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన బంధువులు కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో ఈనెల 19న మతి చెందాడు. మతుని తల్లి ఎరికలమ్మ ఫిర్యాదు మేరకు నిందితులైన పుణ్యవతి, నాగేష్, రామచంద్ర, ఎర్లపల్లి చెన్నకేశవులుపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు శనివారం సామాన్లు సర్దుకుని బెంగళూరుకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ రాఘవరెడ్డి, కొత్తచెరువు ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.