చెట్ల పొదల్లో యువకుని మృతదేహం
హత్య కేసుగా నమోదు
మృతుడు చిన్నఅంజయ్యగా గుర్తింపు
కురిచేడు : ఆవులమంద రహదారిలో కొండపై చెట్లపొదల్లో యువకుని మృతదేహం ఉన్నట్లు పొలాలకు వెళ్లే రైతులు గుర్తించారు. పొలాల్లోకి వేసిన మట్టి రోడ్డు పక్కన గుంతలో నుంచి దుర్వాసన వస్తుండడంతో గమనించిన రైతులు పాత్రికేయులకు సమాచారం అందించారు. ఈ వార్త గ్రామంలో దావానంలా వ్యాపించింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. మృతదేహం లభ్యమైన చోటుకు పక్కనే ఉన్న పంట పొలంలోని వేప చెట్టు కింద ఖాళీ మద్యం బాటిళ్లు, డిస్పోజబుల్ గ్లాసులు లభ్యమయ్యాయి. అక్కడ సుత్తి, కర్ర లభ్యమైంది. అక్కడ నుంచి రక్తం మరకలు కొంత దూరం కనిపించారు. అక్కడ నుంచి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి లాక్కెళ్లిన గుర్తులు ఉన్నాయి.
మృతదేహం ప్యాంటు జేబులో సెల్‌ఫోన్ ఉంది. కాళ్ల చెప్పులు, టోపీ అక్కడక్కడా లభించాయి. మృతదేహం వద్ద హెక్సాబ్లేడు, మామూలు బ్లేడు పడి ఉన్నాయి. మృతుని గొంతుపై కోసిన గాటు కనిపిస్తోంది. మృతదేహం పూర్తిగా ఉబ్బి ఉంది. హత్య చేసి పడేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారం రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడు బ్లూరంగుపై తెల్ల గీతల చొక్కా ధరించి ఉన్నాడు. నలుపు రంగు ప్యాంటు వేసుకున్నాడు.
కుడిచేతికి దారం కట్టిఉంది. మృతుని వయసు సుమారు 25-30 మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం ప్యాంటు జేబులోని సెల్‌ఫోన్ లో ఉన్న సిమ్ కార్డుల ఆధారంగా మృతునిది త్రిపురాంతకం మండలం ఉమ్మడివరంగా, అతని పేరు మెడబలిమి చిన్నఅంజయ్యగా తేలింది. అతని అత్తగారిది కురిచేడు మండలంలోని దేకనకొండ గ్రామంగా తెలిసింది. మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మృతదేహాన్ని పరిశీలించిన సీఐ
చిన్నఅంజయ్య మృతదేహాన్ని దర్శి సీఐ కేవీ రాఘవేంద్ర, దర్శి ఎస్సై ఎస్.సుబ్బారావు పరిశీలించారు. మృతుని అత్తామామను, తల్లిదండ్రులను పిలిపించి వివరాలు నిర్ధారించినట్లు సీఐ రాఘవేంద్ర తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.