తన కుమారుడిని అంతమొందించడంలో ప్రధాన పాత్ర పోషించాడని అనుమానం పెంచుకున్నాడు.. పోలీసులు విచారణలో అతడి ప్రమేయం లేదని తేలినా.. నమ్మలేదు.. పైగా ప్రతికారేచ్ఛతో రగిలిపోయాడు.. అదును కోసం వేచిచూసాడు.. బంధువులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా కడతేర్చాడు..ఇదీ..నేరేడుచర్ల మండలం శూన్యపహాడ్‌లో ఇటీవల వెలుగుచూసిన హత్యోదంతం వెనుక ఉన్న ప్రధాన కారణం.
- హుజూర్‌నగర్
హత్య కేసులో ఏడుగురు నింది తులను అరెస్ట్ చేసినట్టు సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు, హత్యోదంతానికి గల కారణాలను సీఐ వివరించారు. శూన్యపహాడ్‌కు చెందిన రమావత్ నాగు గత నెల 2వ తేదీన దామరచర్ల సమీపంలో రైల్వేట్రాక్ వద్ద హత్యకు గురయ్యాడు. తన కుమారుడిని గ్రామానికి చెందిన గొట్టెముక్కల రామాచారి, రమావత్ అనిల్, రాజులే పథకం ప్రకారం హత్య చేశారని ఆరోపిస్తూ నాగు తండ్రి బగన నేరేడుచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశా డు. కాగా, పోలీసుల అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో రమావత్ అనిల్‌పై నేరం రుజువు కావడంతో మిగిలిన రామాచారి, రాజులను విడిచిపెట్టారు.
పోలీసుల సూచనలను
పెడచెవిన పెట్టి..
కేసు విచారణలో ఉందని గ్రామానికి వెళ్ల వద్దని పోలీసులు రామాచారి, రాజులకు సూచించారు. అయితే పోలీసుల సూచనలను రామాచారి పెడచెవిన పెట్టిన ఈ నెల 2వ తేదీన గ్రామానికి వచ్చి భార్య, పిల్లలతో ఉంటున్నాడు.
అదును చూసి..వేటేసి..
తన కుమారుడి హత్య వెనుక రామా చారి కూడా ప్రధాన పాత్ర పోషించాడని కక్ష పెంచుకున్న బగన అదును కోసం చూడసాగాడు. ఈ నేపథ్యంలో రామాచారి గ్రామానికి వచ్చి ఉంటున్నాడని తెలుసుకుని అతడిని మట్టుబెట్టాలని పథకం రచించాడు. ఈ నేపథ్యంలోనే బగన తన తమ్ముడు బాలు, బంధువులు పీత్యా, మోత్యా, బాలు, నాగరాజు, కేలి, విజయ, బుజ్జి, సైదా కలిసి రామాచారి ఇంటిపై మారణాయుధాలతో దాడి చేశారు. అతడి ఇం టి తలుపులు, కిటికీలు ధ్వంసం చేశా రు. ఇంట్లో నిద్రిస్తున్న రామాచారిని బయటకు ఈడ్చుకు వచ్చి దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా అతడి భార్య సునీతపై కూడా దాడిచేసి వివస్త్రను చేసి పారిపోయారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యోదంతంలో పాల్గొన్న పది నింది తులో పీత్యా, మోత్యా, నాగరాజులు మినహా మిగతా ఏడుగురు గ్రామంలో ఉండగా వెళ్లి అరెస్ట్ చేసినట్టు సీఐ వివరించారు. అరెస్ట్ చేసిన నిందితులను హుజూర్‌నగర్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. సమావేశంలో నేరేడుచర్ల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఐడీ పార్టీ సిబ్బంది పెరుమాళ్ల శ్రీనివాస్, కత్తుల రాంబాబు, దొంగరి నాగేశ్వరరావు, మండవ వెంకటేష్‌గౌడ్, నాగరాజు, అశోక్, అలీంబాషా,జ్యోతి పాల్గొన్నారు.
అనుమానంతోనే ఘాతుకం
Published Sun, Jul 12 2015 2:45 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement