వడ్డీ వ్యాపారి వేధింపులతో మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీన్‌దయాల్‌నగర్‌లోని మారుతి అపార్ట్‌మెంట్‌లో నివాసముండే బి.నీరజ(36), నరేందర్ భార్యాభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నరేందర్ బెంగళూరులో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. నీరజ పిల్లలతో దీన్‌దయాల్‌నగర్‌లో ఉంటున్నారు. కాగా నీరజ హిల్‌కాలనీ వాసి రాముయాదవ్ వద్ద రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నారు. కొన్ని రోజులుగా అప్పు తిరిగి ఇవ్వాలని నీరజను రాము వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి నీరజ ఇంటికి వచ్చిన రాము తీసుకున్న డబ్బు వడ్డీతోసహా రూ.1.5 లక్షలు వెంటనే ఇవ్వాలని పట్టుబట్టాడు. శనివారం ఉదయం కూడా ఆమె ఇంటికి వెళ్లి డబ్బుల కోసం గొడవ చేశాడు. దీంతో మనస్తాపం చెందిన నీరజ శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వడ్డీ కింద ఇల్లు స్వాధీనం
తీసుకున్న అప్పునకు ఇల్లు, ప్లాటు రాయించుకోవడమే కాకుండా వడ్డీ కింద మరో ఇల్లు కూడా ఇవ్వాలంటూ బంజారాహిల్స్ శ్రీకృష్ణానగర్ ఏ బ్లాక్‌లోని ఓ నివాసం వద్ద వడ్డీ వ్యాపారులు భయాందోళనలు సృష్టించారు. శ్రీకృష్ణానగర్‌లో నివాసముండే టి.ప్రసాదరాజు 2012లో నార్కెడ్‌పల్లికి చెందిన వడ్డీ వ్యాపారుల నుంచి రూ.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇందుకుగాను శ్రీకృష్ణానగర్‌లోని ఒక ఇంటితో పాటు శంషాబాద్‌లోని మరో ప్లాట్‌ను అగ్రిమెంట్ చేసి ఇచ్చాడు. ఇవి కాకుండా వడ్డీ కింద మరో ఇల్లు కూడా ఇవ్వాలంటూ ఆ వ్యాపారులు మందీ మార్బలంతో శనివారం ఉదయం ప్రసాదరావు ఇంట్లోకి చొరబడ్డారు. ఆయన ఉంటున్న ఇంటికి తాళాలు వేసి అద్దెకుండేవారిని వెళ్లగొట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.