కాకులు హత్యలు చేస్తాయా!
అరణ్యం
కాకులు ఎంత తెలివైనవంటే... శత్రువుల దాడి నుంచి తప్పించుకోవడానికి, తమ అసలు గూటికి దగ్గర్లో కొన్ని డూప్లికేట్ గూళ్లని నిర్మిస్తాయి. వాటిలో ఏమీ లేకపోవడం చూసి తన గూటి జోలికి ఎవరూ రారని వాటి ప్లాన్!
కాకులు చీమలను చంపి, నలిపి, ఆ మిశ్రమాన్ని ఒళ్లంతా పూసుకుంటాయని పరిశోధనల్లో తేలింది. చీమల్లో ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పరాన్న జీవులను మన దగ్గరకు రాకుండా చేస్తుంది. అందుకే పురుగూ పుట్రా తమ దగ్గరకు రాకుండా కాకులు అలా చేస్తాయట!
ఆడకాకులు నిజాయితీగా ఉంటాయి. ఒక్కసారి ఒకదానితో జతకడితే, జీవితాంతం దానితోనే ఉంటాయి. కానీ మగకాకులు అలా కాదు. వేరేది నచ్చితే వెళ్లిపోతాయి!
కాకులు ఒకదాన్నొకటి పొడుచుకుని చంపుకుంటాయి. అలా ఎందుకు చేస్తాయో కనిపెట్టలేకపోయారు శాస్త్రజ్ఞులు!
పురుగులు, పండ్లు, గుడ్లు, చేపలు, కప్పలు, ధాన్యం... మొత్తం వెయ్యి రకాల ఆహార పదార్థాలను తింటాయివి!
ఆహారం విషయంలో కాకులకు స్వార్థం ఎక్కువే. తమ ఆహారాన్ని మరేదైనా ఎత్తుకుపోవాలని చూస్తోందని తెలిస్తే, వెంటనే ఓ రహస్య ప్రదేశంలో గొయ్యి తీసి పాతిపెడతాయి. తర్వాత కావలసినప్పుడు తీసుకుని తింటాయి!
వాల్‌నట్స్, బాదం కాయల వంటి వాటిని పగులగొట్టుకుని, లోపలి పప్పు తినాలన్న విషయం తెలుసు కాకులకు. అందుకే వాటిని ఎత్తై ప్రదేశాల నుంచి వదిలి, కిందపడి పగిలాక పప్పును తింటాయి. మరీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే... వాల్‌నట్స్‌ను వాహనాల చక్రాల కింద పడేస్తాయి. కారు చక్రాల కింద పడి పగులుతాయని!
ఆంగ్లతార ఇంట్లో యువరాణి!
ప్యారిస్ హిల్టన్. ఆంగ్ల సినిమాలు చూసేవారికి ఈమెని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. హాలీవుడ్ పాపులర్ హీరోయిన్లలో ఒకరైన హిల్టన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అయితే ఆమె మాత్రం జంతువులను ఫాలో అవుతుంటారు.
హిల్టన్‌కి జంతువులంటే ఎంతో ప్రేమ. పెటా కార్యకర్త అయిన ఆమె, ఏమాత్రం తీరిక దొరికినా... రోడ్ల మీద తిరిగే కుక్కల దగ్గర్నుంచి, అంతరించిపోతోన్న జంతువుల సంరక్షణ వరకు... అన్ని కార్యక్రమాల మీదా దృష్టి పెడుతుంటారు.
హిల్టన్ దగ్గర చాలా రకాల కుక్కలు ఉన్నాయి. అవి ఇల్లంతా తిరుగుతూ భలే సందడి చేస్తుంటాయి. కొన్ని రకాల చిలుకలు ఉన్నాయి. అయితే అన్నిటికంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది... హిల్టన్‌కి ప్రాణప్రదమైన పందిపిల్ల గురించి. ఇదంటే ఆమెకి ఎంత పిచ్చి అంటే, ఎక్కడికి వెళ్లినా దాన్ని తనతో తీసుకెళ్తూ ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా దుస్తులు కుట్టిస్తుంది. నగలు వేస్తుంది. లిప్‌స్టిక్ కూడా పూస్తుంటుంది. దాన్ని చూసి అందరూ యువరాణిలా ఉంది అంటూ ఉంటారు. అందుకే దాని పేరు ‘ప్రిన్సెస్ పిగ్లెట్’గా స్థిరపడిపోయింది!