బాలలకు భరోసా | Cyberabad Police Running Women Safety Wing In Hyderabad | Sakshi

బాలలకు భరోసా

Jan 19 2020 1:12 AM | Updated on Jan 19 2020 1:12 AM

Cyberabad Police Running Women Safety Wing In Hyderabad - Sakshi

పిల్లలు అంటే బాలురు, బాలికలు  (పోక్సో), మహిళల మీద  జరుగుతున్న అఘాయిత్యాలు జరిగితే  కేసు నమోదు చేయడంలో సహాయపడ్డం నుంచి తీర్పు వరకు సమస్తం ఒకే చోట అందించడానికి ఏర్పడిందే ‘భరోసా’.  లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన పిల్లలు.. పోలీసులు, కేసులు, కోర్టులు, నిందితుల గుర్తింపు మొదలైన ప్రక్రియలో మానసికంగా మరింత నలిగిపోయే ప్రమాదం ఉంది.  అలాంటి ఇబ్బందులను తప్పించడానికి.. పోలీస్‌ యూనిఫామ్, గంభీరమైన కోర్టు హాలు, తికమక పెట్టే డిఫెన్స్‌ వాదన, నిందితుడి కసి చూపులు, ఆసుపత్రికి వెళ్లడాలు వంటివన్నీ లేకుండా.. ఇంటిలాంటి వాతావరణంలో సమస్తం సమకూరుస్తోంది భరోసా. మెడికల్‌ ఎగ్జామినేషన్‌ కోసం క్లినిక్‌ కూడా ఉంది మెడికల్‌ ఎగ్జామినేషన్‌ అక్కడే జరిగేలా. ఇందుకోసం హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ తరపున ఒక డాక్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

అంతేకాదు సంఘటన తాలూకు  ట్రామా నుంచి బయటపడి, న్యాయవిచారణలో సహకరించేలా  సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌ కూడా ఉంటుంది.  అన్నిటికన్నా ముఖ్యం.. కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు పిల్లలకు నిందితుడు కనిపించనివిధంగా ఏర్పాటు ఉంటుంది. కోర్టు కూడా పెద్ద హాలులా కాకుండా.. డ్రాయింగ్‌ రూమ్‌లా  కట్టారు. అవసరమైన పిల్లలకు పునరావాసాన్నీ కల్పిస్తారిక్కడ.  ఈ భరోసా సెంటర్‌లు  ప్రస్తుతం హైదరాబాద్, వికారాబాద్‌లో ఉన్నాయి. త్వరలోనే హైదరాబాద్‌ కమిషనరేట్‌లో మరొకటి, సైబరాబాద్‌ కమిషనరేట్‌లో రెండు, రాచకొండ కమిషనరేట్‌లో, ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట, వరంగల్,  సంగారెడ్డిలో ఏర్పాటు చేయనున్నారు. ఇంకో ముఖ్య విషయం.. ఈ భరోసా సెంటర్‌లోని కోర్టుకు రెండు  ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం కేవలం జడ్జి, బాధిత పిల్లలకు మాత్రమే.  ఇంకో ద్వారం మిగిలిన అందరికోసం. అంటే  పిల్లలు ఎక్కడా  నిందితుల కంటపడకుండా అన్నమాట.

పోర్న్‌ వలలో పిల్లలు
►ప్రపంచంలో అత్యధిక పిల్లల జనాభా కలిగిన దేశం మనదే. ప్రపంచవ్యాప్తంగా పోర్న్‌ సైట్స్‌కు సరుకుగా మారుతున్నదీ మన పిల్లలే! 
►ఒడిశా వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో తల్లిదండ్రులు తెలిసే తమ పిల్లలను పోర్న్‌కు ముడిసరుకుగా మారుస్తున్నారనేది కఠోర వాస్తవం. ఆ రాష్ట్రాల్లోని కొన్ని ఊళ్లల్లో పూరిగుడిసెల్లో సైతం కెమెరాలుంటాయి. విదేశాల నుంచి క్లయింట్స్‌ ఎప్పుడు పింగ్‌ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి.. క్లయింట్స్‌ ఎలా కావాలంటే అలా యాక్ట్‌ చేస్తూంటారు పిల్లలు. 
►లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన బాలికలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది.  ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగానే 25 వేలు, చార్జిషీట్‌ వేశాక 50 వేలు, తీర్పు వెలువడ్డాక 25 వేలు.. ఇలా మొత్తం లక్ష రూపాయల వరకు నష్టపరిహారం ఉంటుంది. బాలికలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారైనా లేదా దారుణమై పరిస్థితిల్లో ఉంటే ఆయా పరిస్థితులను బట్టి ఈ నష్టపరిహారం 3 నుంచి 8 లక్షల రూపాయాల దాకా కూడా ఉండొచ్చు. 
►ఈ చట్టం ప్రకారం.. నేరాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నిందితుడిదే. ఇదివరకు తమకు అన్యాయం జరిగిందని నిరూపించుకోవాల్సిన బాధ్యత బాధితులపైనే ఉండేది. 
►అలాగే పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లల మీద అఘాయిత్యం జరిగినా, లేదా వాళ్లే ఏదైనా నేరం చేసినా.. వాళ్ల పేర్లు, వ్యక్తిగత వివరాలేవీ కూడా పోలీస్‌ రికార్డుల్లో, కోర్ట్‌ రికార్డుల్లో నమోదు చేయకూడదు. కోడ్‌ నంబర్స్‌ ఉండాలి. అలాగే మూడేళ్ల వరకు మాత్రమే ఆ నేరం గురించి రికార్డుల్లో ఉండాలి. తర్వాత ఆ వివరాలను తొలగించాలి.

తెలంగాణ పోలీస్‌ ‘విమెన్‌ సేఫ్టీ వింగ్‌’ ఆధ్వర్యంలో నడుస్తున్న  భరోసా సెంటర్‌లు హైదరాబాద్‌లో ఒకటి,  సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కొండాపూర్‌లో ఒకటి, అల్వాల్‌లో ఒకటి ఉన్నాయి. ఈ ఏడాదిలో జీడిమెట్ల, పేట్‌ బషీరాబాద్, శంషాబాద్, షాద్‌నగర్, రాజేంద్రనగర్‌లలోనూ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి నేర బాధితులకు భరోసా? లైంగికదాడి, లైంగిక వేధింపులు, గృహహింస, పోక్సో కేసులకు సంబంధించి న్యాయ, వైద్య సహాయాలు అందిస్తుంది. 
భరోసాను సంప్రదించు నంబర్లు: 040 – 29882977, వాట్సప్‌ నం: 9490617124

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement