డయాబెటిక్ చిన్నారులు...
జాగ్రత్తలు
చిన్నారుల్లో సాధారణంగా కనిపించే టైప్-1 డయాబెటిస్ అకస్మాత్తుగా బయటపడుతుంది. అందువల్ల ముందుగానే దీనిని గుర్తించే అవకాశాలు తక్కువ. సాధారణంగా ఏడు నుంచి పద్నాలుగేళ్ల లోపు వయసు ఉన్న పిల్లల్లో కనిపించే టైప్-1 డయాబెటిస్, అత్యంత అరుదుగా కొందరిలో పుట్టుక నుంచే కనిపించవచ్చు. టైప్-1 డయాబెటిస్ ఉన్న పిల్లలు ఒక్కోసారి అకస్మాత్తుగా మైకం కమ్మి పడిపోతారు. కళ్లు తేలేస్తారు. నిమిషాల్లో తలెత్తే డీహైడ్రేషన్ కారణంగా వాళ్ల శరీరమంతా ఎండిపోయినట్లు అయిపోతుంది. ఈ లక్షణాలన్నీ ఒకేసారి బయటపడతాయి. అలాంటప్పుడు ఏమాత్రం జాప్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. రక్తపరీక్ష, మూత్రపరీక్షల ద్వారా డాక్టర్లు వ్యాధి నిర్ధారణ చేసి, పరిస్థితిని బట్టి తగిన చికిత్స చేస్తారు. చిన్నారులకు టైప్-1 డయాబెటిస్ సోకినట్లు తెలిసినా తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. దీనివల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. అందువల్ల ఇలాంటి చిన్నారుల తల్లిదండ్రులు ఈ సూచనలు పాటిస్తే చాలు... తమ పిల్లల ఆనందానికి లోటు లేకుండా వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
చక్కెర వ్యాధి గురించి పిల్లలకు అతిగా చెప్పి వాళ్లలో భయాందోళనలు రేకెత్తించవద్దు. ఇదంతా చిన్న లోపమని, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతూ వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేయాలి.
చక్కెర వ్యాధి ఉంది కదా అని వాళ్లకు ఎలాంటి ఆంక్షలూ విధించవద్దు. అందరు పిల్లల్లానే వాళ్లనూ ఆటలు ఆడుకోనివ్వాలి. మామూలు దినచర్యనే పాటించనివ్వాలి.
ఆహారం విషయంలోనూ ఆంక్షలు వద్దు. పిల్లల ఎదుగుదలకు అన్ని రకాల పదార్థాలతో కూడిన సమతుల ఆహారం అవసరం కాబట్టి అన్నీ తిననివ్వాలి.
చాక్లెట్లు, స్వీట్లు పూర్తిగా మానేయాలని కట్టడి చేయడం కంటే తక్కువ మోతాదులో వాటిని కూడా రుచి చూడనివ్వాలి. అయితే అలాంటి సందర్భాల్లో డాక్టర్ల సలహాపై ఇన్సులిన్ మోతాదును పెంచితే సరిపోతుంది.
సెరులిన్‌తో మరో సరికొత్త చికిత్స
సెరులిన్ అనేది రెండు అమినో ఆసిడ్స్ మధ్య ఉండే ఒకరకం బంధంతో ఏర్పడే మాలిక్యూల్. ఈ మాలిక్యూల్‌ను రోగి శరీరంలోని పాంక్రియాస్ వద్ద వెలువరిస్తే... అది క్రమంగా పాంక్రియాస్‌లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా సెల్స్ అభివృద్ధి అయ్యేలా చేస్తుంది. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్-బర్న్‌హామ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శిశువైద్య పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఈ విధంగా సెరులిన్ మాలిక్యూల్‌ను ప్రవేశపెట్టే పద్ధతి ద్వారా పాంక్రియాస్‌లోని బీటా కణాలను పునరుత్తేజితం చేయడం, కొత్త బీటా కణాలు పుట్టుకొచ్చేలా చేయడం ద్వారా టైప్-1 డయాబెటిస్‌తో బాధపడే చిన్నారుల రక్తంలో చక్కెర స్థాయి ని గణనీయంగా అదుపు చేయగలిగారు. ఈ ప్రక్రియను అనసరిస్తూ టైప్-1 డయాబెటిస్ చిన్నారులకు ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చే ఇన్సులిన్ మోతాదును క్రమంగా తగ్గించే అవకాశం ఉందని స్టాన్‌ఫోర్డ్-బర్న్‌హామ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఈ పద్ధతిలో ఒక ఇబ్బంది ఉంది. సెరులిన్‌ను ప్రవేశపెట్టే క్రమంలో ఒక్కోసారి పాంక్రియాస్‌కు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం లేకపోలేదు. దీనిని అధిగమించే దిశగా పరిశోధనలను సాగిస్తున్నామని వారు చెబుతున్నారు.
టైప్-1 డయాబెటిస్ చికిత్సలో సరికొత్త విధానాలు
టైప్-1 డయాబెటిస్ చికిత్సలో సరికొత్త విధానాలు సమీప భవిష్యత్తులోనే రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాధిని అదుపులో ఉంచడానికి, రోగి జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడానికి దోహదపడగల ఈ అత్యధునాతన చికిత్సా విధానాలేమిటో తెలుసుకుందాం...
ఎన్‌క్యాప్సులేటెడ్ బీటా సెల్ రీప్లేస్‌మెంట్ థెరపీ:
క్లోమగ్రంథిలో (పాంక్రియాస్) ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదపడే బీటా సెల్స్‌ను దాతల వద్ద నుంచి సేకరించి రోగి పాంక్రియాస్ వద్ద ప్రవేశపెడతారు. ఇవి క్రమంగా క్రియాశీలమై, రోగి రక్తంలోకి ఎంత మొత్తంలో చక్కెర విడుదలవుతోందో గ్రహించి, దానిని నియంత్రించడానికి కావలసినంత పరిమాణంలో ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. అయితే, బయటి దాతల నుంచి సేకరించిన బీటా సెల్స్‌ను రోగి శరీరంలోకి ప్రవేశపెట్టేటప్పుడు ఒక్కోసారి రోగిలోని రోగనిరోధక శక్తి వాటిని శత్రుకణాలుగా భావించి, నాశనం చేసే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికే మూలకణాలను (స్టెమ్‌సెల్స్) వయాసైట్స్ అనే తొడుగుతో రోగి చర్మం కింద పాంక్రియాస్ వద్ద ప్రవేశపెడతారు. సురక్షితమైన ఈ తొడుగు కారణంగా రోగనిరోధక కణాలు వాటిని నాశనం చేయలేవు. క్రమంగా ఈ స్టెమ్‌సెల్స్ పరిపూర్ణమైన బీటా సెల్స్‌గా మారి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. ఈ చికిత్సా విధానం ఎఫ్‌డీఏ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఎఫ్‌డీఏ అనుమతి లభించిన వెంటనే ఈ విధానం రోగులకు అందుబాటులోకి రానుంది.
డయాబెటిక్ న్యూరోపతి
డయాబెటిక్ రోగులు కొందరిలో చేతుల్లోని నరాలు లాగినట్లుగా ఉండటం, చేతుల చివర్లు తిమ్మిరెక్కినట్లుగా ఉండటం, స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇలాంటి లక్షణాల ద్వారానే రోగిలోని చక్కెర వ్యాధి బయటపడుతుంది. రక్తంలో పరిమితికి మించి చేరిన చక్కెర ఇతర అవయవాల మాదిరిగానే నరాలనూ దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితినే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. దీనిని కనుగొనేందుకు వైద్యులు ట్యూనింగ్ ఫోర్క్ టెస్ట్, మోనోఫిలమెంట్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేస్తారు. ఇలాంటి పరీక్షలేవీ చేయించుకోకుండా వదిలేస్తే వ్యాధి ముదిరిపోయి, స్పర్శ కోల్పోయిన శరీరభాగం కుళ్లిపోవచ్చు. ఆ భాగాన్ని శస్త్రచికిత్సతో తొలగించాల్సి కూడా రావచ్చు.
కరోనరీ ఆర్టరీ డిసీజెస్
చక్కెరజబ్బు ఉన్నవాళ్లకు శరీరంలో ఎక్కడ సమస్య ఉన్నా నొప్పి పెద్దగా తెలియదు. గుండె కూడా ఇందుకు మినహాయింపు కాదు. దాంతో లక్షణాలను పసిగట్టి, అది గుండెజబ్బు అని తెలుసుకునే లోపే జరగాల్సిన అనర్థం జరిగే ప్రమాదాలు ఉంటాయి. డయాబెటిస్ రోగుల్లో గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఏడాదికి ఒకసారైనా ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహాపై జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్
రక్తంలో చక్కెర ఎక్కువైతే, అది చిక్కబడి అక్కడక్కడా క్లాట్స్ ఏర్పడే పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి క్లాట్స్ మెదడులో ఏర్పడితే స్ట్రోక్ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. శరీరం అంతటా విస్తరించి ఉండే రక్తనాళల్లో ఎక్కడ ఇలాంటి అవరోధాలు ఏర్పడినా ఇబ్బందులు తప్పవు. కాళ్లు, చేతుల్లోని రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడితే ఆ అవయవాలు మొద్దుబారిపోయి గ్యాంగ్రీన్‌కు (కుళ్లిపోవడం) గురవుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అవయవాలను తొలగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి నివారించడానికి శరీర అవయవాలన్నింటికీ రక్తం సక్రమంగా సరఫరా అవుతోందో లేదో తెలుసుకునేందుకు ‘యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్’ (ఏబీఐ) అనే పరీక్ష నిర్వహిస్తారు. కాళ్లు, చేతులకు సరైన రీతిలో రక్తసరఫరా జరుగుతున్నదీ, లేనిదీ తెలుసుకునేందుకు ‘డాప్లర్ టెస్ట్’ నిర్వహిస్తారు. డయాబెటిస్ రోగులు అవసరం మేరకు ఈ పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
అధిక రక్తపోటు
డయాబెటిస్ రోగులకు స్థూలకాయం, డయాబెటిక్ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నట్లయితే, అలాంటి వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. రక్తపోటు పరిస్థితిని తెలుసుకునేందుకు చక్కెర జబ్బు ఉన్నవారు కనీసం మూడు నెలలకు ఒకసారైనా పరీక్షలు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు జాగ్రత్తగా ఆహారంలో ఉప్పును తగ్గించుకోవడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే అధిక రక్తపోటు ఒత్తిడికి మూత్రపిండాల్లోని సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం లేకపోలేదు.గుండెకు సంబంధించిన కరోనరీ ఆర్టరీ డిసీజెస్, అధిక రక్తపోటు, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వంటి సమస్యలను మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్‌గా పరిగణిస్తారు.