బిడ్డను కనే అదృష్టం లేదా?
సందేహం
నా వయసు 31. ఎత్తు ఐదడుగుల రెండంగుళాలు. బరువు 56 కిలోలు. మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. సంవత్సరానికే గర్భం దాల్చాను. కానీ బిడ్డ పుట్టీ పుట్టగానే చనిపో యాడు. రెండోసారి బిడ్డను కన్నప్పుడు ఐదు రోజులకు చనిపోయాడు. ఎందుకు అని డాక్టర్‌ని అడిగితే open meningomyelocele సమస్య వల్ల అని చెప్పారు. అసలా సమస్య ఎందుకు వస్తుంది? మళ్లీ గర్భం దాల్చితే కూడా అలాగే అవుతుందా? అలా అవ్వకుండా ముందుగానే ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా?
- వి.సుహాసిని, కావలి
meningomyelocele, meningocele, spina bifida అనే సమస్యలన్నీ కడుపులో బిడ్డ తయారయ్యేటప్పుడు జరిగే లోపాల వల్ల వెన్నుపూసలో ఏర్పడే అవయవ లోపాలు. వెన్ను పూసలో ఎక్కడో ఒక దగ్గర సరిగ్గా మూసుకోక పోవడం వల్ల అక్కడ ఓపెన్‌గానే ఉండి, వెన్నుపూస లోపల ఉండే స్పైనల్ కార్డ్, స్పైనల్ ఫ్లూయిడ్, దాని నుంచి వచ్చే నరాలు వెన్నుపూస బయటకు వచ్చి కన బడటం జరుగుతుంది. దీనివల్ల నరాలు, స్పైనల్ కార్డ్ దెబ్బతినడంతో పాటు వాటికి ఇన్ఫెక్షన్ సోకి, అది మెదడుకి మిగతా అవ యవాలకి పాకి బిడ్డ చనిపోవడం జరుగుతుంది.
ఒకవేళ బిడ్డ బతికినా, వెన్నుపూస నరాలు దెబ్బ తినడం వల్ల కాళ్లు పని చేయకపోవడం, మల మూత్ర విసర్జన సమస్యలు, మెదడులో లోపాలు, బుద్ధి మాంద్యం వంటి ఎన్నో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. జన్యుపరమైన సమ స్యలు, ఫోలిక్ యాసిడ్ లోపం, కొన్ని రకాల మందులు (మూర్ఛకి వాడేవి), మరికొన్ని తెలియని కారణాల వల్ల ఈ సమస్యలు వస్తాయి. నివారించడానికి కారణాలకీ చికిత్స ఉండదు.
గర్భం దాల్చ డానికి మూడు నెలల ముందు నుంచీ ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున భార్యాభర్తలిద్దరూ వేసుకోవడం మంచిది. గర్భానికి ప్రయత్నించే ముందు మూర్ఛవ్యాధికి సంబంధించి కాని, మరే ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు గానీ మందులు వేసుకోవాల్సి వస్తే... డాక్టర్‌ని సంప్రదించి, వాళ్లు చెిప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయత్నం చేయాలి. దాని వల్ల చాలావరకు వెన్నుపూస లోపాలను నివారించవచ్చు. కానీ వందశాతం నివారించలేం. బిడ్డ పుట్టిన తర్వాత ఆపరేషన్ చేసి సరిచేసే ప్రయత్నం జరుగుతుంది.
కానీ దాని ఫలితం... నరాలు ఎన్ని దెబ్బ తిన్నాయి అన్నదాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి లోపాన్ని ముందే తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది. చాలావరకు ఈ లోపాలను ఐదోనెలలోనే టిఫా స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే అరుదుగా మాత్రమే కొందరిలో స్కానింగ్‌లో మిస్ కావచ్చు. ముందుగానే లోపం గురించి తెలుసుకుంటే... అబార్షన్ చేయించేసుకోవడం ఉత్తమం.
బిడ్డ పుట్టాక అవస్థ పడటం కంటే ముందే పాశాన్ని తెంచుకోవడం మంచిది కదా! అలా అని అధైర్య పడకండి. కొన్ని నెలలు ఆగి... మీరిద్దరూ ఫోలిక్ యాసిడ్ మాత్రలు 5ఝజ రోజుకొకటి చొప్పున మూడు నెలల పాటు తీసుకోండి. ఆ తర్వాత గర్భానికి ప్రయ త్నించండి. రెండుసార్లు సమస్య వచ్చి నంత మాత్రాన మళ్లీ రావాలనేం లేదు. కాకపోతే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు. గర్భం దాల్చిన తర్వాత కూడా ఫోలిక్ మాత్రలు వాడుతూ, మూడో నెల చివర్లో చివర్లో డబుల్ మార్కర్ టెస్ట్, ఎన్టీ స్కాన్, ఐదో నెలలో ట్రిపుల్ మార్కర్ టెస్ట్, టిఫా స్కాన్ చేయించుకోండి.
నా వయసు 22. ఇప్పుడు నేను ఏడో నెల గర్భంతో ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ డెలివరీ దగ్గరపడేకొద్దీ భయమేస్తోంది. నొప్పులు తట్టుకోగలనా లేదా అనిపిస్తోంది. మావారేమో, నొప్పులు రాకుండా ఇంజెక్షన్ వచ్చిందట, అది చేయించుకుందువు గాని అంటున్నారు. అది నిజమేనా? అలాంటి ఇంజెక్షన్ ఉందా? చేయిచుకుంటే నొప్పి తెలియదా?
- స్వాతి, విజయవాడ
కాన్పు సమయంలో నొప్పులు అందరికీ ఒకేలా ఉండవు. నొప్పులు ఎక్కువగా ఉంటాయని ఎవరో చెప్పారనో లేక ఇంటర్నెట్‌లో వీడియోలు చూసో భయపడాల్సిన అవసరం లేదు. బిడ్డ బరువును బట్టి, బిడ్డ వచ్చే దారిని బట్టి, బిడ్డ పొజిషన్, ఉమ్మనీరు శాతం, తల్లి ఆరోగ్య స్థితి, నొప్పులు వచ్చే తీరు వంటి అనేక అంశాలను బట్టి సాధారణ కాన్పు అయ్యే అవకాశాలను అంచనా వేయడం జరుగుతుంది. ఇవి తొమ్మిదో నెల చివరికి గాని ఒక కొలిక్కి రావు.
ఆ సమసయానికి బిడ్డ బరువు ఎక్కువ ఉన్నా, దారి చిన్నగా ఉన్నా, బిడ్డ పొజిషన్ సరిగ్గా లేకపోయినా నొప్పులు వచ్చే వరకూ ఆగకుండా ముందే ఆపరేషన్ చేసి బిడ్డను తీసేస్తారు. పైన చెప్పిన అంశాలు మధ్య రకంగా ఉంటే కనుక... నొప్పులు వచ్చిన తర్వాత అవి వచ్చే తీరు, తీవ్రతను బట్టి సాధారణ కాన్పు అయ్యే అవకాశాలు 50-50 శాతం ఉంటాయి. కడుపులో ఉండే శిశువు నొప్పుల ఒత్తిడిని తట్టుకుని, హార్ట్ బీట్ తగ్గకుండా మరీ పెరిగిపోకుండా ఉన్నంత వరకు ప్రయత్నించవచ్చు.
నొప్పులు ఎక్కువ తెలియకుండా చేసే ఇంజెక్షన్లు రకరకాలు ఉన్నా, అవి అందరికీ ఒకే రకంగా పని చేస్తాయని చెప్పలేం. వీటిలో భాగంగా epidural analgesia, అంటే వెన్నుపూసలోకి ఇంజెక్షన్‌ద్వారా నొప్పి తెలియకుండా చేసే మందును పంపుతాం. నొప్పి తీవ్రతను బట్టి, సమయాన్ని బట్టి, మందును మళ్లీ మళ్లీ వెన్నులోకి పంపిం చడం జరుగుతుంది. ఈ మందును తల్లి ఆరోగ్యస్థితి, బీపీ, పల్స్ రేట్ వంటివి బేరీజు వేసుకుంటూ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు తల్లి ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి రావచ్చు.
కొందరిలో అయితే ఈ మందు ఇచ్చాక, నొప్పులు తెలియకపోవడం వల్ల, బిడ్డ తల బయటకు వచ్చేటప్పుడు నొప్పి తీయక పోవడం వల్ల ఫోర్సెప్స్ వేసి బిడ్డను బయ టకు తీయవలసి వస్తుంది. దీనివల్ల కింద ఎక్కువగా చీరుకుపోయి, కుట్లు కాస్త ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఏ చికిత్సలో అయినా కాస్త మంచి, కాస్త చెడు ఉంటాయి.
వాటిని బట్టి నిర్ణయం తీసుకో వాల్సి ఉంటుంది. కొంతమందికి వాళ్ల శరీర తత్వాన్ని బట్టి, బిడ్డ బరువుతో పాటు మరికొన్ని అంశాలను బట్టి నొప్పులు ఎక్కువ లేకుండానే కాన్పు అయిపోతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే భయపడ కుండా... రోజూ ఉదయం, సాయంకాలం కొద్దిగా వాకింగ్, ప్రాణాయామం వంటి బ్రీతింగ్ వ్యాయామాలు, అలసటగా లేక పోతే చిన్నపాటి వ్యాయామాలు చేయండి. దీనివల్ల తేలికగా ఉంటుంది. నొప్పులను సులువుగా తట్టుకోడానికి శక్తి వసుంది.
నా వయసు 24. నా కుడివైపు ఓవరీలో ఏదో సమస్య ఉందని ఈ మధ్యనే ఆపరేషన్ చేసి తీసేశారు. నా అనుమానం ఏమిటంటే... ఒక్క ఓవరీ ఉంటే పిల్లలు పుడతారా? పైగా ఉన్న ఆ ఓవరీలో నీటి బుడగలున్నాయి. మందులు వాడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనడం సాధ్యపడేదేనా?
- ఎల్.పావని, భీమవరం
గర్భాశయానికి ఇరువైపులా ఒక్కొక్క అండాశయం చొప్పున రెండు అండా శయాలు ఉంటాయి. ఏ సమస్యా లేని వారిలో అండాశయాల నుంచి ప్రతి నెలా అండం తయారై విడుదలవుతూ ఉంటుంది (ఒకనెల ఒక వైపు మరో నెల మరోవైపు). హార్మోన్లు సక్రమంగా విడు దలవుతున్నప్పుడు, ఒక అండాశయం లేకపోయినా గర్భం రావడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఒక్కోసారి రెండు అండాశయాలున్నా కూడా హార్మోన్ల అసమతుల్యత వల్ల రెండు అండాశయాల నుండీ విడుదల అవ్వక గర్భం రావడానికి ఇబ్బంది కలగవచ్చు. ఇప్పుడు మీకు ఒక అండాశయం ఉంది కానీ దానిలో నీటి బుడగలున్నాయి. మందులు వాడు తున్నారు కాబట్టి హార్మోన్లు సక్రమంగా పనిచేసే అవకాశం ఉంది.
కాబట్టి మీరు ఇప్పటినుంచే పిల్లల గురించి బెంగ పడాల్సిన అవసరం లేదు. అయితే మీరు పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా, బరువు ఎంత ఉన్నారు అనేది రాయలేదు. బరువు ఎక్కువ ఉంటే, తగ్గడానికి ప్రయ త్నించండి. ఎందుకంటే బరువు ఎక్కువ ఉన్నా నీటి బుడగలెక్కువయ్యి, హార్మోన్ల అసమతుల్యత పెరిగే అవకాశం ఉంది. ఏమాత్రం అధైర్య పడకుండా పెళ్లి చేసు కోండి. తర్వాత ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ప్రయత్నించినా గర్భం కనుక రాకపోతే... గైనకాలజిస్టు పర్య వేక్షణలో అండం విడుదల కావడానికి మందులు వాడవచ్చు.
నా వయసు 26. ఎత్తు ఐదడుగుల మూడంగుళాలు. బరువు 65 కిలోలు. నాకు థైరాయిడ్ ఉంది. సంవత్సరం నుంచి Eltron 100 mcg వాడుతున్నాను. మందులు మొదలు పెట్టిన కొత్తలో బాగానే ఉంది. కానీ రానురాను పీరియడ్స్ క్రమం తప్పాయి. ఇప్పుడసలు మందులు వేసుకుంటే కానీ నెలసరి రావడం లేదు. దాంతో పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడం కుదరడం లేదు. నేనేం చేయాలి?
- వి.రజని, కాకినాడ
మీ ఎత్తుకి 47 నుంచి 57 కిలోల బరువుంటే సరిపోతుంది. మీరు ఐదు కిలోలు ఎక్కువ ఉన్నారు. ఇలా బరువు ఎక్కువ ఉండటం వల్ల కూడా కొందరిలో థైరాయిడ్ హార్మోన్ తో పాటు మిగతా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి, పీరి యడ్స్ సక్రమంగా రావు. అండాశయాల్లో నీటి బుడగలు వంటివి ఉండటం వల్ల కూడా పీరియడ్స్ సరిగ్గా రాకపోవచ్చు. ఓసారి థైరాయిడ్ ఉండాల్సిన స్థాయిలో ఉందో లేదో పరీక్ష చేయించుకోండి. కంట్రోల్‌లో లేకపోతే మాత్ర డోస్ పెంచాల్సి వస్తుంది. అలాగే ఓసారి గైన కాలజిస్టును కలిసి స్కాన్ చేయించుకుని...
గర్భాశయం, అండాశయాల్లో ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకుని, అవస రాన్ని బట్టి చికిత్స తీసుకోండి. ఆపైన పిల్లల కోసం కూడా ప్రయత్నం చేయ వచ్చు. CBP, Sr-FSH, RBS తదితర రక్త పరీక్షలు కూడా చేయించుకుని, ఏదైనా సమస్య ఉంటే చికిత్స తీసుకోండి. ఇవన్నీ చెయ్యించు కుంటూ మితాహారం తీసుకుంటూ, వాకింగ్ తదితర వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గితే మంచి ఫలితాలుంటాయి.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్