తొలినాళ్లలో జాగ్రత్త తప్పదు!
వాయనం
తొలిసారి తల్లయినపుడు ఆనందంతో పాటు టెన్షన్ కూడా ఉంటుంది. బిడ్డని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి అని రకరకాల ఆలోచనలు. బిడ్డకు సంబంధించిన ప్రతి అంశం మీదా రకరకాల సందేహాలు. మరీ అంత కంగారుపడాల్సిన పనయితే లేదు. అలాగని అలక్ష్యమూ తగదు. తొలిరోజులు కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకుంటే చాలు!
కొత్తలో బిడ్డ ఏడిస్తే ఏదైనా నొప్పి వస్తోందేమో అని భయపడతారు. కానీ ప్రతిసారీ ఏడుపు వెనుక కారణం నొప్పే కానక్కర్లేదు. నిద్ర చాలకపోవడం, ఆకలి వంటి చాలా కారణాలు ఉండవచ్చు. బట్టలు మార్చండి, ఒళ్లు తుడవండి, పాలు పట్టి నిద్రపుచ్చడానికి ప్రయత్నించండి. అప్పటికీ ఊరుకోకపోతే డాక్టర్‌ని సంప్రదించండి!
పిల్లలకు బాత్ టబ్స్ వస్తున్నాయి. వాటితో స్నానం సులభమవుతుంది. లేదంటే కాళ్లమీద పడుకోబెట్టి చేయించవచ్చు. అయితే తల ఎత్తులో ఉంచాలి. నీళ్లు మరీ వేడిగాను, మరీ చల్లగాను ఉండకూడదు. ఆ వయసులో అతి చల్లదనమూ, అతి వేడీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.
సబ్బులు, బాడీ షాంపూలు వచ్చినప్పటికీ... నలుగు తప్పక పెట్టాలి. దానివల్ల ఒంటిమీది నూగు పోయి, చర్మం నున్నగా, ఆరోగ్యంగా తయారవుతుంది. నలుగులో పసుపు తప్పక కలపండి. యాంటీ బయాటిక్ కాబట్టి క్రిములను దూరం చేస్తుంది!
సీజన్‌ని బట్టి దుస్తులు వేయాలి. పసిబిడ్డ కదా అని వేడిమిలో కూడా ఒళ్లు పూర్తిగా కప్పేస్తే వారికి చిరాకు పుడుతుంది. కాబట్టి పల్చటి, కాటన్ జుబ్జాలు వేయండి. చలిగా ఉంటే మాత్రం వెచ్చని ఉన్ని దుస్తులు వాడండి. గ్లౌజులు, సాక్స్ తప్పక వేయండి, చెవులను కప్పివుంచండి. ఏది వేసినా, ఆ క్లాత్ వల్ల బిడ్డకు ర్యాష్‌గానీ వస్తుందేమో గమనించుకోండి. అన్ని వస్త్రాలూ పిల్లలకు పడవు!
ఎప్పుడూ డైపర్ వేసి ఉంచొద్దు. ర్యాష్ రావడం, ఒరిసిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి తప్పదు అనుకున్నప్పుడు డైపర్ వేసి, మిగతా సమయాల్లో పల్చని క్లాత్ ఏదైనా కట్టి వదిలేయండి!
టైమ్ ప్రకారం పాలు ఇస్తున్నా కూడా ఒక్కోసారి పిల్లలు ఆకలికి ఏడుస్తుంటారు. అలాంటప్పుడు మీరిచ్చే పాలు సరిపోవడం లేదేమో చూసుకోండి. కొన్నిసార్లు పాలు సరిపడినన్ని రావు. అవి తల్లులు గమనించుకోరు. విషయం డాక్టర్‌కి చెబితే, పాలు సమృద్ధిగా రావడానికి మార్గం చెబుతారు. లేదంటే బిడ్డకు వేరే ఆహారాన్ని సూచిస్తారు!
పాలు పట్టిన తర్వాత బిడ్డను భుజాన వేసుకుని తేనుపు వచ్చేవరకూ తిప్పండి. ఎందుకంటే పాలతో పాటు పిల్లలు కొన్నిసార్లు గాలిని కూడా మింగేస్తారు. దానివల్ల కడుపునొప్పి రావచ్చు!
బిడ్డకు సంబంధించిన ఏ వస్తువును ముట్టుకోవాలన్నా, బిడ్డను ఎత్తుకోవాలన్నా ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాల్సిందే... మీతో సహా!
అనుభవం ఉన్నవాళ్లు కదా అని, అన్నీ బిడ్డ మీద ప్రయోగించవద్దు. ఏదైనా డాక్టర్‌ని అడిగి, వారు చేయమంటేనే చేయండి. డాక్టర్‌ని తరచూ మార్చవద్దు. ఒక్క డాక్టరుకే చూపించండి!