పూలతోట | Flower garden story | Sakshi
Sakshi News home page

పూలతోట

Published Sun, May 24 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

పూలతోట

పూలతోట

కథ
‘జీవితం అందరికీ అన్నీ ఇవ్వదు. ఏదో పొందుతూ ఉంటాం, ఇంకేదో కోల్పోతూ ఉంటాం. లెక్కలు, కారణాలు, అర్థాలు... అంటూ జీవితానికేమీ పట్టవు. అదొక అంతులేని ప్రవాహంలా సాగుతూ ఉంటుందంతే!’ ఆమె పుస్తకం చదవడం అయిపోయింది. ఆఖరి వాక్యాలు  మళ్లీ చదివి, పుస్తకం మూసి, చిన్నగా నిట్టూరుస్తూ బెడ్ మీద నుండి లేచి పెరటి వైపు కెళ్లింది. అక్కడ తను పెంచుతున్న పూలతోటలోని పూలు ఆమె రాకకోసమే ఎదురుచూస్తున్నాయి.

సమయం మధ్యాహ్నం నుండి సాయంత్రంలోకి రూపం మార్చుకుంటోంది. పువ్వులను ఆమె సుకుమారంగా చూసుకుంటూ పాదులు సరిచేస్తోంది.ఇంతలో ఇంటివాకిట గేటు చప్పుడయ్యింది. ఆమెకు ఎవరొచ్చారో తెలుసు. గేటు తీసుకుని అతను నేరుగా పెరటివైపు వచ్చాడు. ఆమె ఇప్పుడెక్కడ ఉంటుందో అతనికీ తెలుసు.
 ‘‘ఏం చేస్తున్నారు?’’ అలవాటుగా ప్రశ్నించాడతను.
 ‘‘కూర్చోండి’’ అంటూ ఆమె మొక్కలను సరిచేస్తోంది.
 ఆమెను చూస్తున్నాడతను.
 
లేత ఆకుపచ్చరంగు చీర, వదులుగా అల్లిన నల్లని జడ, ఎరుపు, పసుపు కలిసిన మేని ఛాయతో తెల్లగా నవ్విందామె అతని వైపు చూసి, ఇంద్రధనుస్సులా.
 కొద్దిగా తత్తరపడ్డాడు ఆమె నవ్వు చూసి. మళ్లీ తేరుకుని... ‘‘నేనడిగిన విషయం...’’ అంటూ సూటిగా విషయంలోకొచ్చాడు.
 ‘‘సమయం కావాలన్నానుగా’’ ఆమె పువ్వుల వైపు చూస్తూ చెప్తోంది.
 ‘‘మీకోసం ఎంత సమయమైనా... నాకేం అభ్యంతరం లేదు’’ అన్నాడతను.
 ఆమె లేచి, ‘‘కాఫీ తాగుతారా?’’ అనడిగింది.
 తల ఊపాడతను.
 
ఐదు నిమిషాల్లో కాఫీ కలుపుకొచ్చిందామె. ఒకటి అతనికిచ్చి తను ఒకటి తీసుకుంది.
 కాసేపు మాటల్లేవు.
 ఆమె కాఫీ కప్పు కింద పెడుతూ, ‘‘మీరు బాగా ఆలోచించారా?’’ అనడిగింది.
 ‘‘ఆలోచించడానికేం లేదు’’ అతని స్పష్టమైన సమాధానం.
 ‘‘అయితే, ఎప్పుడో ఒకసారి మీవాళ్లదగ్గరికెళ్దాం’’ అందామె.
 అతను సంతోషంగా లేచి నిలబడి, ‘‘మీ తోటలో ఒక పువ్వు కోసుకోవచ్చా?’’ అనడిగాడు.
 అలాగే అంటూ తలూపిందామె.
 అతను నెమ్మదిగా ఒక రోజాపువ్వు కోసి ఆమెకే ఇచ్చాడు.
 ‘‘తీస్కోండి, ఇదే తొలి కానుక’’ అన్నాడు.
 ఆమె నవ్వుతూ తీసుకుంది.
 ‘‘వస్తానండీ, మళ్లీ కలుస్తాను’’ అంటూ వెళ్లిపోయాడతను ఆనందంగా.
 అప్పుడే పూస్తున్న పువ్వుని మృదువుగా చూసుకుంటూ లోపలికెళ్లిందామె.
 ఆమె తోటలో సగం పువ్వులు వెలుతురులోను, సగం పువ్వులు నీడలోను ఉన్నాయి.
   
 ఆమె ఆ రాత్రి మిద్దెమీద నిలబడ్డప్పుడు వెన్నెలంతా తనకోసమే కురుస్తున్నట్లు అనిపించిందామెకి. నల్లని పూలున్న తెల్లని చీరతో ఆకాశానికి పోటీగా నిలబడిందామె. కానీ ఆ వెన్నెల పక్కన చీకటిలాగా గతం తాలూకు జ్ఞాపకాలు కమ్ముకుంటున్నాయి ఆమెని చేదుగా...
 ఆమెకిదివరకే పెళ్లయింది. కానీ అసలు జీవితం అంటూ ఏమీ చూడకుండానే పెళ్లయిన సరిగ్గా వారంలోపే ఆమె భర్త మరణించాడు. తన ఫ్రెండ్స్‌కి పెళ్లి పార్టీ ఇచ్చి వస్తూ, దారిలో కారు యాక్సిడెంట్‌లో మరణించాడు.
 తర్వాత అంతా మామూలే. తలా ఒక మాట అన్నారు, తలా ఒక దారి పట్టారు ఆమెని ఒంటరిని చేస్తూ. ఆమెకు మొన్నటివరకూ అమ్మ అయినా ఉండేది అండగా. కానీ ఆమె కూడా ఈ మధ్యే చనిపోయింది. ఇప్పుడామె పూర్తిగా ఒంటరి. అందుకే తను చేస్తున్న ఉద్యోగంలో అడిగి మరీ మారుమూల ప్రాంతానికి బదిలీ చేయించుకుని వచ్చేసింది.
 ఆమె అప్పటినుండి పుస్తకాల్లోన్నే ప్రపంచం చూస్తోంది. పువ్వులతోనే నేస్తంగా ఉంటోంది.
 ఆమె తోటలోని పువ్వులు మొగ్గలు తొడిగే సమయానికి ఆమెకి నిద్రపట్టింది.
   
 ఆమె తయారయ్యింది చక్కగా. వివేక్ వాళ్లింటికెళ్లాలిప్పుడు. వాళ్ల అమ్మగారు రమ్మన్నారు మాట్లాడ్డానికి. ఆమెకు మనసులో ఒకింత బెరుకుగానే ఉంది. బయల్దేరి వెళ్లింది.
 వివేక్ ఆమెకోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆమె వెళ్లగానే సాదరంగా ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టాడు.
 వివేక్ వాళ్ల అమ్మగారు వచ్చాక, పలకరింపులు, కాఫీలు, కొంత సమయం అయ్యాక, ‘‘అమ్మా నీ గురించి మావాడు అంతా చెప్పాడు. నాకు మొదట్లో కొంచెం ఇబ్బందనిపించిన మాట వాస్తవమే. కానీ నిన్ను చూసి, నీతో మాట్లాడాక, నా అనుమానాలు, అపార్థాలు తొలగిపోయాయి. మావాడి ఇష్టమే నా ఇష్టం. ఏదో ఒకసారి నీ ప్రమేయమే లేకుండా జరగరానిది జరిగిందని నీ జీవితాన్ని బలిచేసుకోకుండా నువ్వు కూడా మంచి నిర్ణయమే తీసుకున్నావు. మా ఇంట్లోకి రావటానికి ఇక నీకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంది వివేక్ వాళ్ల అమ్మగారు.
 ఆమె కళ్లల్లో సన్నటి నీటిపొర. ఇంకా ఇంత మంచివాళ్లు తన చుట్టూ ఉన్నందుకు. ఆమె వాళ్లమ్మగారి ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయింది.
 ఆమె పెరట్లో సగం కాసిన పువ్వులు ఆమెకోసం ఎదురుచూస్తున్నాయి.
   
 ‘‘మన పెళ్లి జరగదు వివేక్‌గారూ’’ మళ్లీ గట్టిగా చెప్పిందామె.
 ‘‘అదే, ఎందుకని అడుగుతున్నాను’’ ఆవేశంగా ఉన్నాడతను.
 ‘‘అన్నింటికీ కారణాలు చెప్పలేను, కానీ జరగదంతే’’ గట్టిగా చెప్పిందామె.
 ‘‘అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సడన్‌గా కాదంటే నేనేం కావాలి, అసలిదంతా ఏమిటి?’’ గట్టిగానే అరుస్తూ అడుగుతున్నాడు వివేక్.
 ‘‘చూడండి వివేక్, నా రాత అంతే. నేనేదన్నా ఇష్టపడే లోపే నాకది దూరం అయిపోతుంది. అదీ మంచిదే, పూర్తిగా ఇష్టపడ్డాక పోతే బాధ మరింత ఎక్కువగా ఉంటుంది.’’
 అవును, నేనేమీ మిమ్మల్ని చూడగానే ప్రేమించలేదు. నా జీవన ప్రయాణంలో మీరు కలిశారు. మంచివారు, కలిసి నడుద్దాం అనుకున్నాను. కానీ కుదరడం లేదు. అందుకే ఒంటరిగానే ముందుకెళ్దామనుకుంటున్నాను. మీరు కూడా నన్ను సులభంగానే మర్చిపోవచ్చు. ఎందుకంటే మనమేం చిన్నపిల్లలం కాదు కదా, పైగా ప్రేమికులం అంతకన్నా కాదు’’ ఒత్తి పలికింది ఆఖరి వాక్యాలు.
 అతను విసిగిపోయాడు. ‘‘అసలిదంతా ఎందుకు? ఒక్క సరైన కారణం చెప్పండి, ఈ పెళ్లి వద్దు అనటానికి. నేనే మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాను’’ వివేక్ కళ్లు, మాటలు ఎర్రబడ్డాయి.
 ఒక్క క్షణం నిశ్శబ్దం.
 ఆమె నెమ్మదిగా ‘‘వివేక్‌గారూ! నాకు మరొకరితో సంబంధం ఉంది’’గద్గద స్వరంతో చెప్పింది. ఆమె కళ్లల్లో నీళ్లు జలజలా రాలుతున్నాయి. ఆమె మాటల అబద్ధపు సాక్ష్యాలుగా.
 ‘‘మరి నాతో పెళ్లికి ఒప్పుకోవటం, మా ఇంటికి రావటం... ఇదంతా..’’ అతని గొంతు వణుకుతోంది.
 ‘‘ఆ తర్వాతే... అంతా జరిగింది. ఇక ఇంతకన్నా ఇప్పుడు ఏం చెప్పలేను. ప్లీజ్. వెళ్లిపోండి. దయచేసి మళ్లీ కనిపించకండి.’’
 ఆమె మనసు, శరీరం అంతా దుఃఖంతో నింపుకుని లోపలికెళ్లిపోయింది.
 అతను ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిలబడిపోయాడు అచేతనంగా. ఆమె తోటలో సగం పూసిన పూలు ఎందుకో వాడిపోయాయి.
    నీ ప్రమేయమే లేకుండా జరగరానిది జరిగిందని నీ జీవితాన్ని బలిచేసుకోకుండా నువ్వు కూడా మంచి నిర్ణయమే తీసుకున్నావు’’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంది వివేక్ వాళ్ల అమ్మగారు.
 కాలం గడుస్తోంది. మనుషులు, వాళ్ల ఇష్టాలు, కష్టాలు, ఆలోచనలు, విలువలు ఇవేమీ పట్టనట్టుగా, కఠినంగా. మళ్లీ దాదాపు రెండేళ్ల వరకు వివేక్ కనపడలేదామెకు. నిజానికి ఆమే వివేక్‌కి దూరంగా తప్పించుకు తిరిగింది.
 ఆ రోజు ఆమె ఉంటున్న ఊరు నుండి కొద్ది దూరంలో ఉన్న నగరానికి వెళ్లిందామె నచ్చిన పుస్తకాలు కొనుక్కోవడానికి.
 పుస్తకాలు చూస్తుండగా ఎవరో పక్కన నిలబడ్డట్టు అనిపించి చటుక్కున అటు తిరిగి చూసిందామె. పక్కన వివేక్...
 ఆమె ఆశ్చర్యంతో అతన్ని చూస్తుండగా, ‘‘బావున్నారా?’’ అడిగాడు వివేక్ మర్యాదగా.
 ‘‘ఆ...’’ అంటూ తలూపిందామె.
 ‘‘బైదిబై ఈమె నా మిసెస్. పేరు కల్పన. అఫ్‌కోర్స్ తను నా మేనమామ కూతురే’’ అంటూ ఆమెకు కల్పనను పరిచయం చేశాడు.
 ఆమె నమస్కరించింది కల్పనకు.
 ముగ్గురికీ పరిచయాలయ్యాక, ఆ పక్కనే ఉన్న కాఫీ హోటల్‌లో కూర్చుని కాఫీ తాగారు మామూలు కబుర్లతో.
 కాఫీలయ్యాక, కల్పన, వివేక్ ముందు నడుస్తుండగా, ఆమె వెనకాలే వస్తోంది. వివేక్ గమనించకుండా కల్పన ఒక చిన్న కాగితాన్ని చుట్టి ఆమె మీదకు విసిరింది.
 అది తీసి చదివిందామె - ‘థాంక్యూ ఫర్ గివింగ్ బ్యాక్ మై లైఫ్ టు మి’ అని రాసుందందులో. ఆమె చిన్నగా నవ్వుకుంది అది చూసి. ఆ నవ్వులో తృప్తి ఉందో, వేదన ఉందో వెతకటం కష్టమే.
   
 అసలేం జరిగిందంటే...
 ఆమె వివేక్‌వాళ్ల అమ్మగారితో మాట్లాడి వచ్చిన రెండ్రోజులకు... ‘‘మీరేనా మా బావని పెళ్లిచేసుకోబోతున్నది’’ అంటూ సూటిగా దూసుకొచ్చింది కల్పన ఆమె ఇంట్లోకి.
 ‘‘అసలు మీరెవరు?’’ అడిగిందామె ఆశ్చర్యంగా.
 ‘‘నేను వివేక్ మరదలిని’’ అంది కల్పన.
 ‘‘ఓహ్! అయామ్ సారీ. నాకు తెలీదు, కూర్చోండి’’ అందామె.
 ‘‘మీతో ఒక విషయం మాట్లాడాలి’’ పూర్తిగా ఒక నిర్ధారణతో మాట్లాడుతోంది కల్పన.
 ‘‘చెప్పండి.’’
 ‘‘నేను మా బావని ప్రేమిస్తున్నాను. ఎంతగా అంటే ప్రాణం పెట్టేంతగా.’’
 ఆశ్చర్యంగా చూసిందామె.
 ‘‘అవునండీ, నాకు మా బావంటే చిన్నప్పటినుండీ ఇష్టం. చాలా ఇష్టపడ్డాను. కానీ తన అభిప్రాయమే సరిగ్గా తెలుసుకోలేకపోయాను. ఇదిగో ఇప్పుడు మీరంటే ఇష్టపడుతున్నాడని తెలిసింది. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను’’ అంది కల్పన.
 ‘‘ఏం మాట్లాడాలి?’’ ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదామె.
 కల్పన ఒక్క క్షణం ఆగి చెప్పనారంభించింది.
 ‘‘మీకిదివరకే పెళ్లయింది. కానీ దురదృష్టవశాత్తూ ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు మీకు జీవితాన్నిస్తానంటూ మా బావ వచ్చాడు. నా మాట ఒకటి శ్రద్ధగా వినండి.’’
 ఆమె వింటోది.
 ‘‘మీ చెదిరిన జీవితానికి ఆసరాగా ఒక తోడు కావాలి మీకు. నిజమే. అది మా బావ కావొచ్చు. మరొకరు కావొచ్చు. తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని ఇష్టపడి, అర్థం చేసుకునే వ్యక్తి కావాలి మీకు. అంతే. కానీ నా విషయం అలా కాదు, నా బలం, బలహీనత అన్నీ మా బావే నాకు. నా సర్వస్వం అతనే. మీరు మా బావని వదులుకుంటే ఒక మంచి మనిషిని దూరం చేసుకుంటారు అంతే, మరేమీ కాదు. ఎందుకంటే మీరేం ప్రేమికులు కాదు కదా! కానీ నేను మా బావని వదులుకుంటే నన్ను నేను పూర్తిగా కోల్పోయినట్లే. నేనున్నా లేనట్లే. మీరు మా బావని మర్చిపోవాలంటే కొన్ని జ్ఞాపకాలు వదులుకుంటే చాలు. నేను మర్చిపోవాలంటే నా జీవితాన్నే వదులుకోవాలి’’ కల్పన కళ్లల్లో కన్నీళ్లు.
 ‘‘అయితే ఇప్పుడేమంటావ్?’’ అడిగిందామె కల్పన దగ్గరికొస్తూ.
 ‘‘నా జీవితాన్ని నాకివ్వండి’’ అంటూ ఆమె చేతులు గట్టిగా పట్టుకుంది కల్పన.
 ఆమె కల్పన చేతుల్ని గట్టిగా నొక్కింది అభయమిస్తున్నట్లుగా.
   
 ఆ రాత్రి ఆమె నగరంలో వివేక్ వాళ్లని కలిసి ఇంటికొచ్చాక, అన్యమనస్కంగా పనులు చేసుకుంటోంది. ఇంతలో ఆమె సెల్‌కి ఏదో మెసేజ్ వచ్చినట్లుంటే యథాలాపంగా చూసింది. అందులో ‘‘నిండు జీవితం అంటూ ఏమీ ఉండదు. ఉండే జీవితంలోని గుర్తులు, జ్ఞాపకాలు మన వెంట తీపిగా, చేదుగా వస్తూనే ఉంటాయి. అవి మనసుకు తీసుకోవడం, తీసుకోకపోవడం మన ఇష్టం. అవి మీకు బాగా తెలుసు. అందుకే ఏదైనా తీసుకోగలరు, ఏదైనా వదులుకోగలరు. మీ వ్యక్తిత్వానికి మరొకసారి జోహార్లు.
 అయినా ఒక చిన్న సలహా. మీరు మళ్లీ మళ్లీ మరో కల్పనను ఉద్ధరించే పని మాత్రం పెట్టుకోకండి. ఒక్క వివేక్ చాలు బలి కావడానికి. అందరూ మీలాగా ఉండలేరు. టేక్ కేర్ సంధ్యగారూ..’’
 అది వివేక్ నుండి వచ్చిన మెసేజ్. అది చదివిన ఆమెకు వివేక్‌కి అంతా తెలిసిందని అర్థమైంది. ఆమె మెసేజ్ చదువుతూ పెరటివైపు వెళ్లింది. అక్కడ ఆమె పూలతోటంతా చీకటి కప్పుకుని రోదిస్తోందో, విశ్రమిస్తోందో తెలియటం లేదు.
 - తడకపల్లి ఫణిశేఖర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement