పెంట్‌హౌస్‌ రాబరీ | Funday crime story | Sakshi
Sakshi News home page

పెంట్‌హౌస్‌ రాబరీ

Published Sun, Sep 9 2018 1:04 AM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

Funday crime story - Sakshi

మూడున్నరకే చీకటి పడిపోయినట్టుగా కనిపిస్తోంది.  రాత్రికి భారీ వర్షం పడే సూచనలున్నాయని వార్తల్లో చెబుతున్నారు. రాయల్‌ అపార్ట్‌మెంట్‌ నిశ్శబ్దంగా ఉంది. పెంట్‌హౌస్‌ నుంచి కేకలు వినబడుతున్నాయి. అది మూడంతస్తుల అపార్ట్‌మెంట్‌. ఒక్కో అంతస్తులో నాలుగు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మూడు ఫ్లాట్స్‌ ఉన్నాయి. పైన పెంట్‌హౌస్‌ ఉంది. బిల్డర్‌ జగ్గారావు ఫ్యామిలీతో పెంట్‌హౌస్‌లో ఉంటున్నాడు. పెంట్‌హౌస్‌పై నుంచి కేకలు వినబడుతూ ఉండటంతో మెయిన్‌ గేటు పక్కన ఉన్న ఔట్‌హౌస్‌లో జోగుతున్న వాచ్‌మేన్‌ అప్పారావు ఉలిక్కిపడ్డాడు. ఏదో జరిగిందని అర్థమై మెట్లెక్కి పైకి పరిగెత్తాడు. ఆ అపార్ట్‌మెంట్‌కి లిఫ్ట్‌ లేదు. కార్‌ పార్కింగ్‌ కూడా జగ్గారావు ఒక్కడికే ఉంది. మిగిలిన వారికి స్కూటర్‌ పార్కింగ్‌లే. అప్పారావు వెళ్లేసరికి సింధూరాణి ఆయాసపడిపోతూ ఉంది.‘‘ఏమైందమ్మా?’’ అని అడిగాడు అప్పారావు.‘‘సార్‌ పంపారని ఎవరో వచ్చారు. నిన్న ఇంట్లో పెట్టిన బ్రీఫ్‌కేస్‌ తెమ్మన్నారంటే నిజమే అనుకున్నాను. ఆయన నిన్న రాత్రి ఒక బ్రీఫ్‌కేస్‌ తెచ్చి బీరువాలో పెట్టమన్నారు. రేపు ఆఫీసుకి వెళ్లేటప్పుడు ఇవ్వమన్నారు. వెళ్లేటప్పుడు ఆయన అడగలేదు. నేను గుర్తు చెయ్యలేదు.’’ సింధూరాణి ఆయాసం పెరిగిపోయి మాట్లాడలేక ఆగింది. ఆమె అవస్థ గమనించి,  ‘‘కూర్చోండమ్మా!’’ అన్నాడు అప్పారావు. ఆమె కూర్చుని చెప్పడం మొదలుపెట్టింది.

‘‘వచ్చిన ఇద్దరిలో ఎవరూ నాకు తెలిసిన వాళ్లు కాదు. బీరువాలోంచి బ్రీఫ్‌కేస్‌ తీశాను. ఇవ్వబోయే సమయానికి అనుమానం వచ్చింది.  సరే, నేనే కాల్‌ చేసి అడుగుదామనుకున్నాను. టీపాయ్‌ మీదున్న ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ డయల్‌ చేస్తున్నాను. సార్‌ నెంబర్‌ ఎంగేజ్‌ వస్తోంది. ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు. ఇంతలో వాళ్లలో ఒకడు టీపాయ్‌ మీద ఉంచిన బ్రీఫ్‌కేస్‌ తీసుకుని పరిగెత్తాడు. రెండోవాడూ వాడితోపాటు పోయాడు’’ చెప్పింది సింధూరాణి. ‘‘పోలీసులకు ఫోన్‌ చేశారా?’’ ఎవరో అడిగారు. ‘‘అమ్మా! ముందు సార్‌కి ఫోన్‌ చేయండి!’’ అన్నాడు అప్పారావు. సింధూరాణి తేరుకుని భర్తకి కాల్‌ చేసింది. అతను లైన్‌లోకి వచ్చాడు. ‘‘హలో!’’ అన్నాడు.‘‘ఏమండీ! చాలాసేపట్నుంచి మీకు ఫోన్‌ చేస్తున్నా. లైన్‌ కలవడం లేదు. దొంగతనం జరిగిందండీ..’’ అంటూ సింధూరాణి చెప్పడం మొదలుపెట్టింది. అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. వర్షం పెద్దదైనట్టు ఉంది. అందరూ రెయిన్‌కోట్లు వేసుకున్నారు. అవి కొంతమేర తడిసివున్నాయి. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌ వస్తూనే సోఫాలో కూలబడ్డాడు. అతనుబాగా లావుగా బాన పొట్టతో ఉన్నాడు. అన్ని మెట్లు ఎక్కి వచ్చేటప్పటికి ఆయాసం వచ్చేసింది. ఎస్సై జోసఫ్, నలుగురు కానిస్టేబుల్స్‌ నిలబడి అందరివంకా చూస్తున్నారు.‘‘ఎవరయ్యా వాచ్‌మేన్‌?’’ అన్నాడు సీఐ. ‘‘సార్‌! నేనే..’’ అంటూ ముందుకు వచ్చాడు అప్పారావు.‘‘అందర్నీ పంపెయ్‌!’’ అన్నాడు.అప్పారావు అక్కడున్నవాళ్లని దూరంగా వెళ్లమని చెప్పి వచ్చాడు. ‘‘మీరేనా ఇందులో ఉండేది?’’ అన్నాడు సీఐ సింధూరాణితో. ‘‘ఔనండీ!’’‘‘మీ పేరు?’’‘‘సింధూరాణి’’‘‘మీవారు ఎవరు? ఏం చేస్తుంటారు?’’‘‘జగ్గారావండీ. ఆయన రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తారు.’’‘‘అలాగా? ఏం జరిగింది?’’సింధూరాణి జరిగింది చెప్పింది.‘‘బ్రీఫ్‌కేస్‌లో ఏమున్నదమ్మా?’’‘‘తెలీదండీ! రాత్రి తెచ్చి బీరువాలో పెట్టమన్నారు. పొద్దున ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు ఇవ్వమన్నారు. ఆయన వెళ్లేటప్పుడు అడగలేదు. పాపిష్టిదాన్ని నేనూ గుర్తు చేసుకుని ఇవ్వలేదు. ఇచ్చివుంటే ఇదంతా జరిగేది కాదు.’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. 

సీఐ కళ్లు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి కళ్లు తెరిచాడు. ‘‘మీ వారేరీ?’’ అడిగాడు సింధూరాణిని.‘‘జరిగిందంతా చెప్పానండీ! వస్తుంటారు.’’ అంది. ‘‘జోసెఫ్‌ ఆయన నెంబర్‌ తీసుకుని కాల్‌ చెయ్యి. అర్జెంటుగా రమ్మను.’’ అన్నాడు ఎస్సైతో. ‘‘ఎస్‌ సార్‌!’’ అని సింధూరాణిని అడిగి జగ్గారావు సెల్‌ నెంబర్‌ తీసుకున్నాడు. కాల్‌ చేస్తుంటే రింగవుతోంది కానీ లిఫ్ట్‌ చేయడం లేదు. ‘‘సార్‌! ఆయన లిఫ్ట్‌ చేయడం లేదు.’’ చెప్పాడు జోసెఫ్‌.‘‘జర్నీలో ఉన్నాడేమో? ఓకే!’’ అన్నాడు సీఐ.‘‘వాచ్‌మేన్‌! ఇద్దరు మనుషులు మెయిన్‌గేట్‌ దాటి రావడం నువ్వు చూశావా?’’ ప్రశ్నించాడు సీఐ. ‘‘లేదండీ. నేనప్పుడు నా రూమ్‌లో ఉన్నాను.’’‘‘నువ్విక్కడ వాచ్‌మేన్‌వి. గేట్లో నుంచి వచ్చే పోయే వాళ్లని చూస్తుండొద్దా? ఏం చేస్తున్నావు? తాగి తొంగున్నావా?’’ గర్జించాడు సీఐ. అప్పారావు బెదిరిపోయాడు. ‘‘చూస్తూనే ఉంటానండీ. ఎవరోకళ్లు ఏదోక పని చెప్తుంటారండి. చెయ్యకపోతే కోపం. ఒక్కడ్నేనండి. ఎన్నని చెయ్యను!’’ నెమ్మదిగా చెప్పాడు అప్పారావు. ‘‘అట్లాంటప్పుడు ఆ పని చెప్పినవాళ్లని గేటు దగ్గర ఉండమని చెప్పాలి. ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ఎట్లా?’’అప్పారావు మౌనంగా ఉండిపోయాడు. ‘‘అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు పెట్టించారా?’’అప్పారావు తల అడ్డంగా ఊపాడు. ‘‘సీసీ కెమెరాలు లేవు.

లిఫ్ట్‌ లేదు. ఏం అపార్ట్‌మెంటమ్మా? ఏదైనా జరిగినప్పుడు మా చావుకొస్తుంది.’’ అసహనంతో అన్నాడు సీఐ. సీఐ మాటమాటకీ వాచ్‌ చూసుకుంటున్నాడు. ‘‘ఏవండీ! మీ ఆయన ఇంకా రాలేదు. ఎప్పుడొస్తారు?’’ సింధూరాణితో అన్నాడు.‘‘నేనూ ట్రై చేస్తున్నానండీ. ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యడం లేదు.’’ అంది ఆమె. ‘‘అయితే పోయిన బ్రీఫ్‌కేస్‌లో ఏముందో మీకు తెలియదన్నమాట?’’సింధూరాణి తల అడ్డంగా ఊపింది తెలియదన్నట్టుగా. అంతలో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ మోగింది. సింధూరాణి లిఫ్ట్‌ చేసి, ‘‘హలో!’’ అంది. అవతల చెప్పింది విని ఆమె ముఖం వివర్ణమయింది.‘‘ఎక్కడా?’’ అంది ఆందోళనపడుతూ. సింధూరాణి ఫోన్‌ పెట్టేసింది. అరవడం మొదలుపెట్టింది. ‘‘ఏమైందండీ!’’ అని అడిగాడు సీఐ.‘‘ఆయనకి గుండెపోటు వచ్చిందంటండీ! హాస్పిటల్‌లో చేర్పించారట. ఆఫీస్‌ వాళ్లు చెప్పారు.’’ ఏడుస్తూనే చెప్పింది సింధూరాణి. సీఐ మల్లికార్జున్‌ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘బ్రీఫ్‌కేస్‌ పోయిందని తెలియగానే గుండెపోటు వచ్చిందంటే, దాంట్లో డబ్బు ఉండుంటుంది..!’’ అన్నాడు ఎస్సై వైపు చూస్తూ. ‘‘ఎస్‌ సార్‌!’’ అన్నాడు జోసెఫ్‌. ‘‘జోసెఫ్‌! వర్షం బాగా కురుస్తోంది. పాపం మేడమ్‌ ఎట్లా వెళ్తారు? ఆమెను హాస్పిటల్లో డ్రాప్‌ చెయ్‌. ఆయనకి ఎట్లా ఉందో డాక్టర్స్‌ని ఎంక్వయిరీ చేసి, నాకు కాల్‌ చెయ్‌! నేనిక్కడే ఉంటాను.’’ అన్నాడు సీఐ. ‘‘ఎస్‌ సార్‌!’’ అన్నాడు జోసెఫ్‌. ‘‘అమ్మా! మీరు మా వాళ్లతో వెళ్లండి. హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. వర్రీ పడకండి. కష్టార్జితం ఎక్కడికీ పోదు. తప్పక దొరుకుతుంది.’’ ధైర్యం చెప్పాడు మల్లికార్జున్‌. ఎస్సైతో పాటు సింధూరాణి బయలుదేరింది. జగ్గారావు కోలుకున్నాడనీ, ఐసీయూ నుంచి రూమ్‌లోకి షిఫ్ట్‌ చేశారని సమాచారం వచ్చింది. సీఐ మల్లికార్జున్‌ తన స్టాఫ్‌తో హాస్పిటల్‌కి వెళ్లాడు. రూమ్‌లో అతని భార్య సింధూరాణి లేదు. వేరే ఇంకొక ఆమె ఉంది. ఎర్రగా పొడుగ్గా ఉంది. ఆమె పక్కన టీనేజ్‌ కుర్రాడు, పదేళ్ల పాప ఉన్నారు. 

‘‘హలో సార్‌!’’ అని పలకరించాడు సీఐ. ‘‘నమస్తే!’’ అని లేవబోయాడు జగ్గారావు. ‘‘మీరు లేవొద్దు. ప్లీజ్‌!’’ అని ఆమె వైపు చూసి, ‘‘మీరు?’’ అన్నాడు ప్రశ్నార్థకంగా. ‘‘నా వైఫ్‌ రాజేశ్వరి. వీళ్లు నా పిల్లలు’’ చెప్పాడు జగ్గారావు. మల్లికార్జున్‌ షాక్‌ తిన్నట్టయ్యాడు. ఈవిడ వైఫ్‌ అయితే, మరి సింధూరాణి? గురుడికి ఇద్దరు భార్యలా? అనుకున్నాడు. ‘‘ఓకే! చెప్పండి జగ్గారావుగారూ. బ్రీఫ్‌కేస్‌లో ఏముంది?’’ ప్రశ్నించాడు సీఐ. ‘‘యాభై లక్షలు క్యాష్‌ సార్‌!’’ విచారంగా అన్నాడు.‘‘మై గాడ్‌! ఫిఫ్టీ ల్యాక్స్‌? అంత డబ్బు ఇంటికి తీసుకెళ్లినట్టు మీ స్టాఫ్‌లో ఎవరికైనా తెలుసా?’’‘‘మా అకౌంటెంట్‌కి తెలుసు.’’ ‘‘ఓకే.. అమ్మా! మీరు కొంచెం బయటకు వెళ్తారా?’’ రాజేశ్వరి వైపు చూసి అన్నాడు సీఐ మల్లికార్జున్‌. రాజేశ్వరి పిల్లల్ని తీసుకుని గది బయటికి వెళ్లిపోయింది. ‘‘ఏమండీ! మీకు ఇద్దరు భార్యలా?’’‘‘ఔనండీ! సింధూరాణికి పిల్లలు లేరు. తర్వాత రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాను.’’ చెప్పాడు జగ్గారావు. యాభై లక్షల క్యాష్‌ పోవడంతో అప్‌సెట్‌ అయ్యాడు జగ్గారావు. ఒక స్థలం కొనుగోలు చేయడానికి అంత క్యాష్‌ సమకూర్చుకునేసరికి చాలా కష్టమైంది. ఫ్రెండ్స్, తోటి బిల్డర్స్‌ దగ్గర సేకరించుకోవాల్సి వచ్చింది. స్థలం యజమాని క్యాష్‌ ఇవ్వమని ఒత్తిడి చేయడంతో అంత క్యాష్‌ తెచ్చి పెద్ద భార్య సింధూరాణి ఇంట్లో ఉంచాడు. ఉదయం వెంట తెచ్చుకోవాల్సింది కానీ ఈ రోజుకి అవసరం లేదని ఊరుకున్నాడు. అందుకే ఇలా జరిగింది. ‘‘మీ బ్రీఫ్‌కేస్‌ ఏ రంగులో ఉంది?’’‘‘సిమెంట్‌ కలర్‌ సార్‌!’’ అన్నాడు జగ్గారావు. జగ్గారావు ఆఫీసుకెళ్లి అకౌంటెంట్‌ని విచారించాడు సీఐ. అతను రామశర్మ. రిటైరైపోయిన వృద్ధుడు. అతను తనకు ఏం తెలియదని నొచ్చుకున్నాడు అనుమానించినందుకు. రామశర్మ అనుమానించదగ్గ మనిషి కాదని మల్లికార్జున్‌కి అర్థమైంది. 

‘‘సార్‌! సింధూరాణి భర్త మీద చాలా కోపంగా ఉంది. తరచుగా ఘర్షణ పడుతుంటుందని వాచ్‌మేన్‌ అప్పారావు చెప్పాడు. అపార్ట్‌మెంట్‌లో ఆడవాళ్లు కొన్ని సంగతులు చెప్పారు. జగ్గారావు పెద్ద భార్య దగ్గరికి వారానికి ఒకసారి కూడా రాడట. ఎక్కువగా రెండో భార్య, పిల్లలతోనే గడుపుతాడట. గచ్చిబౌళిలోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో రెండో భార్యకు విల్లా కొని ఇచ్చాడట. అప్పట్నుంచి సింధూరాణి భర్త మీద మండి పడుతున్నదట.’’ చెప్పాడు ఎస్సై. సీఐకి కేసులో క్లూ దొరుకుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇంతలో హెడ్‌ కానిస్టేబుల్‌ వాచ్‌మేన్‌ అప్పారావుని పట్టుకొచ్చాడు. స్టేషన్‌లోకి గడగడలాడుతూ వచ్చాడు అప్పారావు. వచ్చీ రావడంతోనే కాళ్ల మీద పడిపోయాడు. ‘‘సార్‌! నాకేం తెలీదు.’’ అన్నాడు ఏడుస్తూ. ‘‘నీకు తెలీదుగాని ఒక సంగతి చెప్పు! ఆ రోజు పొద్దున జగ్గారావు కారులో వెళ్లిపోయాడు. సాయంకాలం మూడున్నర, నాలుగు గంటలకు దొంగతనం జరిగింది. ఈ లోపల పెంట్‌హౌస్‌కి ఎవరు వచ్చారు?’’ ప్రశ్నించాడు. అప్పారావు అతని పేరు చెప్పాడు. ఆ ఇల్లు కూడా తనకి తెలుసు అన్నాడు. వాచ్‌మేన్‌ని వెంటపెట్టుకుని సీఐ స్టాఫ్‌తో పోలీస్‌ వ్యాన్‌లో బయలుదేరాడు.పోలీసులు తన ఇంటికి రావడంతో బెదిరిపోయాడు భిక్షపతి. ఇల్లంతా గాలిస్తే దొరికింది బ్రీఫ్‌కేస్‌. అది బరువుగానే ఉంది. తను ఓపెన్‌ చేయలేదన్నాడు. పోలీస్‌ స్టేషన్‌లో తలవంచుకుని నిలబడి ఉంది సింధూరాణి. ‘‘చెప్పవమ్మా! బ్రీఫ్‌కేస్‌ మీ నాన్నకు ఇచ్చి పంపి, దొంగలు ఎత్తుకెళ్లారని ఎందుకు నాటకం ఆడావు?’’ గద్దించాడు సీఐ. ‘‘మా ఆయన నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడండీ. చిన్న పెళ్లానికి కోటి రూపాయలు పెట్టి విల్లా కొనిచ్చాడు. నేను అదే అడిగితే నువ్వుండే పెంట్‌హౌస్‌ నీకే రాసిస్తాను అన్నాడు. అదీ చెయ్యడం లేదు. నాకీ పెంట్‌ హౌస్‌ వద్దు. ఇది అనాథరైజ్డ్‌. దీనికి విలువలేదు. పది లక్షలకు కూడా ఎవరూ కొనరు. నాకూ విల్లా కొనివ్వు అని అడిగాను. పిల్లా జెల్లా లేరు నీకెందుకే విల్లా అని తిట్టాడండీ. ఏం చేయమంటారు? అందుకే బ్రీఫ్‌ కేస్‌ దొంగలెత్తుకెళ్లారని నాటకం ఆడాను. నాకు తెలుసు, అందులో యాభై లక్షలున్నాయని.’’ తప్పు ఒప్పుకుంటూ చెప్పింది సింధూరాణి.                
వాణిశ్రీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement