జూనియర్ ఆర్టిస్ట్ సునందను ఎవరో కత్తితో పొడిచి చంపేశారని పోలీస్ స్టేషన్‌కి సమాచారం వచ్చింది. ఇన్స్‌పెక్టర్ వేణుగోపాల్‌కి ఫోన్ చేసి ఎస్సై అన్వర్ ఈ సంఘటన గురించి చెప్పాడు. అతను ఇంకా రెడీకాలేదు. ‘వేళాపాళా లేని దరిద్రగొట్టు ఉద్యోగం’ అని గొణుక్కుంటూనే స్టేషన్‌కి వెళ్లాడు.‘ఎక్కడ మర్డర్ జరిగిన స్పాట్?’’ స్టేషన్‌లోకి ఎంటరవుతూనే ఎస్సైని ప్రశ్నించాడు ఇన్స్‌పెక్టర్‌వేణుగోపాల్.‘‘ఎల్లారెడ్డిగూడా సార్’’‘‘సరే.. పద..!’’ అని పోలీసు వ్యాన్‌లో కొందరు పోలీస్ కానిస్టేబుల్స్‌ని తీసుకుని బయల్దేరాడు. సునంద ఉంటున్నది ఒక రేకుల ఇల్లు. రెండువందల గజాల స్థలంలో చుట్టూ కాంపౌండ్ వాల్ మధ్య రెండుగదుల ఇల్లు. ఇంటి ముందు పూల మొక్కలతో నీట్‌గా ఉంది. బెడ్‌రూమ్‌లో సునంద రక్తపు మడుగులో పడి ఉంది. పల్చటి నీలం రంగు నైటీ వేసుకుని ఉంది. ఆమెకు సుమారు నలభై ఏళ్లుండొచ్చు.బెడ్ మీద శవం పడి ఉంది. ఒక స్టూలు మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది సునంద కూతురు అనుపమ.‘‘వెపన్ దొరుకుతుందేమో వెతకండి..’’ అని ఎస్సైతో చెప్పాడు ఇన్స్‌పెక్టర్ వేణుగోపాల్.‘‘ఎస్సార్..’’ అని హెడ్‌తో కలసి ఇల్లు, బయట పూలమొక్కల మధ్య, పెరట్లోను వెతకసాగాడు ఎస్సై అన్వర్.‘‘చెప్పమ్మా! మీ అమ్మను ఎవరు హత్య చేసి ఉంటారు?’’ అనుపమను ప్రశ్నించాడు ఇన్స్‌పెక్టర్.‘‘ఏమో సార్! తెలియడం లేదు..’’ అని చున్నీతో కన్నీళ్లు తుడుచుకుంది.‘‘మీ అమ్మ చనిపోవడం ఎప్పుడు గమనించావు?’’‘‘నేను పక్క రూమ్‌లో పడుకుంటాను సార్! అమ్మ లేటుగా వస్తుంటుంది. షూటింగ్‌లో ఆలస్యమవుతూ ఉంటుంది. గేటు మామూలుగా తెరుచుకునేట్టు గొళ్లెం పెట్టి, ఇంటికి తాళం వేసి వెనుక పెరట్లో నుంచి లోపలకు వెళ్లి పడుకుంటాను. అమ్మ దగ్గర డూప్లికేట్ ‘కీ’ ఉంటుంది. ఎప్పుడో వచ్చిపడుకుంటుంది. నైట్ షూటింగులప్పుడు అలాగే జరుగుతుంది. నిన్న రాత్రి కూడా నేను లాక్ చేసి పెరట్లో నుంచి ఇంట్లోకి వచ్చి పడుకున్నాను. రోజూ నేనే ముందు లేస్తాను. ఇల్లు ఊడ్చి టీ పెట్టిన తర్వాత అమ్మను నిద్ర లేపుతాను. అలాగే ఈరోజూ లేచాను. అయితే, ఇంటి తలుపుకి లోపల బోల్టు పెట్టి లేదు. అమ్మ లాక్ తీసి, లోపలకు వచ్చి బోల్టు పెట్టడం మర్చిపోయిందేమో అనుకున్నాను. టీ పెట్టి అమ్మ రూమ్‌లోకి వెళ్లి చూసే సరికి చనిపోయి ఉంది. నెత్తుటితో నైటీ తడిసిపోయి ఉంది సార్!..’’ అని ఏడవసాగింది అనుపమ.
ఎస్సై వచ్చి ‘‘సార్! ఎక్కడా వెపన్ కనిపించలేదు.’’ అన్నాడు నెమ్మదిగా.‘‘అమ్మాయ్! మీ నాన్న ఎక్కడ?’’ అడిగాడు ఇన్స్‌పెక్టర్.‘‘సార్! లేడు. నా చిన్నప్పుడే అమ్మా నాన్నా విడిపోయారు. ఇంట్లో అమ్మా నేనూ మాత్రమే ఉంటాం’’‘‘నువ్వు చదువుకుంటున్నావా?’’‘‘ఇంటర్ పాసయ్యాను సార్!’’‘‘తర్వాత కాలేజీలో చేరలేదా?’’‘‘మా అమ్మకు ఇష్టం లేదు నేను కాలేజీలో చేరడం. నన్ను సినిమాల్లో చేర్చాలని ట్రై చేస్తోంది. ఉద్యోగం చేస్తే ఏం సంపాదిస్తావు? సినిమా హీరోయిన్ అయితే కోట్లు సంపాదిస్తావు అంటుంది కాని నాకుచదువుకోవాలని ఉంది..’’అనుపమ మాటల్లో ఏదో క్లూ దొరుకుతున్నట్లుగా అనిపించసాగింది ఇన్స్‌పెక్టర్‌కి.‘‘చెప్పు! మీ అమ్మకు విరోధులు ఎవరైనా ఉన్నారా?’’‘‘నాకు తెలిసి ఎవరూ లేరు సార్! అమ్మ అందరితోనూ మంచిగా ఉంటుంది.’’‘‘మీ అమ్మ ఎవరికైనా డబ్బు ఎగ్గొట్టడం, అన్యాయం చెయ్యడంలాంటివి చేసి ఉండాలి. ఎవరైనా ఊరికే మర్డర్ చెయ్యరు కదా..?’’ ఇన్స్‌పెక్టర్ మాటలకు రెస్పాన్స్ ఇవ్వలేదు అనుపమ. మౌనంగా ఉండిపోయింది. అప్పుడప్పుడు చున్నీతో కన్నీళ్లు తుడుచుకుంటోంది.ఇంతలో ఫింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్, ఫొటోగ్రాఫర్ వచ్చారు. వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. పోలీసు కుక్కని తీసుకొచ్చాడు ట్రైనర్. బెడ్ దగ్గర వాసన చూసి బయటకు పరుగెత్తింది. శ్రీనగర్ కాలనీరోడ్డు మీద నుంచి స్టేట్ హోమ్ దగ్గరకు వెళ్లి ఆగిపోయింది. హంతకుడు హత్యచేసి నడుచుకుంటూ స్టేట్ హోమ్ వరకు వెళ్లాడు. అక్కడి నుంచి ఎటు వెళ్లాడో జాడ కనిపెట్టలేకపోయింది కుక్క. అంటేఅక్కడి నుంచి ఏదో ఒక వెహికల్‌లో వెళ్లిపోయాడు హంతకుడు అని డిసైడ్ అయ్యాడు ఇన్స్‌పెక్టర్.‘‘ఈ ఇల్లు మీ సొంతమేనా?’’ అనుపమని అడిగాడు ఇన్స్‌పెక్టర్.‘కాదు సార్! సోమరాజుది..’’‘సోమరాజు ఎవరు?’’మాటల్లోనే అక్కడకు వచ్చాడు సోమరాజు.‘‘సార్! నేనే సోమరాజు.. జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌ని. ఈ ఇల్లు నాదే. సునంద అద్దెకు ఉంటోంది’’ అన్నాడు.ఇన్స్‌పెక్టర్ అతన్ని ఎగాదిగాచూశాడు. ‘‘చెప్పండి సోమరాజూ! సునందను ఎవరు మర్డర్ చేసి ఉంటారు..?’’ అడిగాడు ఇన్స్‌పెక్టర్.‘‘సునంద మంచిది సార్! ఎవరితోనూ తగాదాలు పడే మనిషి కాదు. ఎందుకు మర్డర్ చేశారో అర్థకావడం లేదు..’’ విచారంగా చెప్పాడు.‘‘మర్డర్ చేసిన వాడు దొంగ మాత్రం కాదు. ఎందుకంటే ఆమె వంటి మీద బంగారం అలాగే ఉంది. బీరువా తెరిచినట్లు లేదు. కేవలం ఏదో కసితోనే మర్డర్ చేశాడు.’’అన్నాడు ఇన్స్‌పెక్టర్.శవ పంచనామా చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఇంక్వెస్ట్ రిపోర్ట్ కోసం పంపించారు పోలీసులు.
ఎల్లారెడ్డిగూడలో సునంద ఇంటి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేసి వచ్చారు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ అన్సారీ, జనార్దన్‌లు.‘‘సార్! సునందకు, సోమరాజుకు ఇల్లీగల్ కనెక్షన్ ఉందని చెప్తున్నారు. ఆ స్థలం సోమరాజు కబ్జా చేసి ఆక్రమించుకున్నాడు. వాడి కన్ను అనుపమ మీద ఉంది. అనుపమకు బాగా చదువుకోవాలని ఉంది. బాగా చదివి డాక్టర్ అవుతానని చుట్టుపక్కల పిల్లలతో అంటుండేదట. అనుపమనుహీరోయిన్ చెయ్యాలని తల్లి సునంద, సోమరాజు ఆమె మీద ఒత్తిడి తెస్తున్నారట.’’‘‘ఆ సంగతి అనుపమే చెప్పింది. చదివి ఏం సంపాదిస్తావు? హీరోయిన్ అయితే కోట్లు సంపాదిస్తావు అని సునంద కూతురితో అంటుండేదట. అయితే అనుపమకు అదంతా ఇష్టంలేదు. అదే ఇప్పుడు ప్రాబ్లెమ్.’’‘‘సునంద ప్రాబ్లమ్ అదే సార్! అరకొర సంపాదనతో కూతుర్ని చదివిస్తోంది. మెడికల్ కాలేజీలో చదివించాలంటే అది ఆమె వల్ల కాదు. అనుపమ మెరిట్ స్టూడెంట్. ఎంసెట్‌లో ర్యాంకు తెచ్చుకుంటే వస్తుందని, కోచింగ్‌కు వెళతానని పట్టుబట్టింది. సునంద ఒప్పకోలేదు. కూతుర్ని కొడుతుందని, ఆమె ఏడుపులు బయటకు వినిపిస్తుంటాయని చెప్పారు.’’ జనార్దన్ చెప్పాడు.ఇన్స్‌పెక్టర్ తల ఊపాడు.‘‘జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ దగ్గర ఇంకొక సంగతి కూడా చెప్పారు.’’ అన్నాడు అన్సారీ.‘‘ఏంటది?’’‘‘టిప్పుఖాన్ అని ఒక గూండా ఉన్నాడట. వాడు సినిమాలకు ఫైనాన్స్ కూడా చేస్తాడట. వాడు తల్చుకుంటే అమ్మాయిలకు సినిమా చాన్సులు ఇప్పిస్తాడట. అయితే, వాడితో అమ్మాయిలు గడపాలట. అదంతా ఇక్కడ కాదు. టూరిజం అని సింగపూర్‌కో, బ్యాంకాక్‌కో తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తాడట. సోమరాజు టిప్పుఖాన్ గుడ్‌లుక్స్‌లో ఉన్నాడట. అనుపమ ఫొటోలు టిప్పుఖాన్‌కి చూపించి, హెల్ప్‌చెయ్యమని సునందని తీసుకెళ్లి అడిగించాడట. యూరప్ ట్రిప్ వెళ్తున్నాను.
అనుపమని పంపించమన్నాడట. టాప్ హీరో పక్కన హీరోయిన్ చాన్స్ ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడట టిప్పుఖాన్. అనుపమఒప్పుకోవడం లేదట. సోమరాజు కూడా ఇంటికెళ్లి అనుపమను కొడుతున్నాడని చెప్తున్నారు.’’ చెప్పాడు అన్సారీ.ఇన్స్‌పెక్టర్ ఆలోచనలో పడిపోయాడు.‘‘చదువుకుని జాబ్ సంపాదించుకుని గౌరవంగా బతకాలని అనుపమ ఆశపడుతోంది. తల్లే అడ్డుపడుతోంది. ఘర్షణ తల్లీకూతుళ్లదే..’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్.‘అనుపమే తల్లిని చంపి ఉంటుందేమో సార్!’’ అన్సారీ సందేహం వెలిబుచ్చాడు.‘అనుపమకు అంత సాహసం ఉండదు. అనుపమ మేలు కోరే వారెవరో సునందను హత్య చేసి ఉంటారు.’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్ వేణుగోపాల్.‘సార్! శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడా చౌరస్తాలో కరెంట్ పోల్ మీదఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీ తెచ్చాను’’ అన్నాడు ఎస్సై అన్వర్ వచ్చీరాగానే.పెన్‌డ్రైవ్ కంప్యూటర్‌కి అటాచ్ చేసి సీసీ కెమెరా రికార్డు చేసిన ఫుటేజీ చూస్తున్నారు. రాత్రి పదిగంటలకు అనుపమ, ఒక సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతోంది. అనుపమ ఏడుస్తుంటే అతను ఓదారుస్తున్నాడు. అతనికి దాదాపు యాభయ్యేళ్లు ఉన్నట్టుగా ఉంది. మనిషి లావుగా ఎత్తుగా ఉన్నాడు.‘‘హంతకుడు దొరికాడు పదండి.’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్ సీట్లోంచి లేస్తూ..పోలీసు వ్యాను సరాసరి ఆ బ్యాంకు ముందు ఆగింది. సెక్యూరిటీ గార్డు తుపాకీ పట్టుకుని అటెన్షన్‌లో నిలబడ్డాడు పోలీసులను చూసి.‘‘దామోదర్!నిన్ను అరెస్టు చేస్తున్నాం.’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్ వేణుగోపాల్.‘‘అరెస్టు చేస్తున్నారా? ఎందుకు?’’ అన్నాడు వెలవెలబోతున్న ముఖంతో.‘‘ఎందుకా? సునందను చంపినందుకు.’’‘నేనా..?’’‘‘ఆ.. నువ్వే.. పద..’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్.బ్యాంకు మేనేజర్‌కి విషయం చెప్పి డ్యూటీ నుంచి తప్పించి, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు దామోదర్‌ని. అతను సునంద భర్త.విడాకులిచ్చాడు.అనుపమ అతని కూతురే. పెద్దగా శ్రమ లేకుండా సునందను హత్య చేసిన విషయం ఒప్పుకున్నాడు.‘‘నిజం సార్! సునందను నేనే హత్య చేశాను. అది నీచురాలు. సినిమాల్లో వేషాల కోసం నన్ను కాదని వెళ్లిపోయింది. దాని తిరుగుళ్లు భరించలేక విడాకులిచ్చాను. అది నా కూతుర్ని కూడా పాడు చేయాలని చూస్తోంది. అనుపమ అదంతా చెప్పుకుని ఏడుస్తోంది. ఆ రోజు అనుపమ తలుపు తీసింది. గదిలో నిద్రపోతున్న సునందను నేనే చంపాను. నా కూతురు జీవితం కాపాడుకోవడానికి హత్య చేశాను’’ చెప్పాడు దామోదర్.
- వాణిశ్రీ
స్టార్ట్‌డస్ట్
Published Sun, Feb 10 2019 1:21 AM | Last Updated on Sun, Feb 10 2019 1:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment