తన ఎదురుగా కూర్చుని ఉన్న యువకుడి వంక విసుగ్గా చూశాడు మల్హోత్రా. ‘‘చెప్పండి. ఏం పని మీద వచ్చారు?’’ వాచీలో టైమ్ చూసుకుంటూ చెప్పాడు.‘‘మీరు ప్రాచీన కళాఖండాలు, కొత్త వస్తువుల్లో డీల్ చేస్తారని తెలిసి వచ్చాను. నా దగ్గర ఒక విచిత్రమైన వస్తువు ఉంది’’ గది చుట్టూ ఒకసారి పరికించి, చిన్నగా చెప్పాడు సఫారీ సూట్ యువకుడు.సఫారీ సూట్ యువకుడు మల్హోత్రా మాటలకు సంతృప్తి చెంది, లెదర్‌బ్యాగులోంచి ఒక పలచటి తెల్లటి వస్త్రాన్ని బయటకు తీశాడు. మల్హోత్రా దానివంక ఆశ్చర్యంగా చూశాడు.‘‘దీన్ని అదృశ్యకరణి అంటారు’’ అని ఆ యువకుడు జిప్‌బ్యాగులోంచి ఒక చిన్న సీసా తీసి, అందులోని ద్రవాన్ని కొంత ఆ వస్త్రానికి పూసి, తనపై ఆ గుడ్డను కప్పుకున్నాడు. మరుక్షణం మల్హోత్రా ముందు ఎవ్వరూ లేరు. మల్హోత్రా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. రెండు నిమిషాల తర్వాత మల్హోత్రా ముందు కుర్చీలోప్రత్యక్షమయ్యాడు ఆ యువకుడు.‘‘ఆశ్చర్యంగా ఉంది. ఈ మాయావస్త్రం నీకెక్కడిది?’’ అన్నాడు మల్హోత్రా.‘‘ఎక్స్‌పోర్ట్ బిజినెస్ మీద నేను తరచు హాంకాంగ్‌కు వెళుతుంటాను. అక్కడొక యూనివర్సిటీ ప్రొఫెసర్ తయారు చేశాడు దీన్ని. ఆయన కొడుకు నా కస్టమర్, మంచి మిత్రుడు. ప్రొఫెసర్ వద్ద కొన్నాను దీన్ని భారీ సొమ్ము చెల్లించి’’ అన్నాడు సూట్‌వాలా.మల్హోత్రాకు ఇంకా నమ్మకం కుదరకపోవడంతో మళ్లీ ఆ వస్త్రాన్ని తనపై కప్పుకొని అదృశ్యమయ్యాడా యువకుడు. క్షణం తర్వాత ఆ గది తలుపు దగ్గర ప్రత్యక్షమయ్యాడు.‘‘చెప్పు దీన్ని ఎంతకమ్ముతావు నాకు?’’ ఆశ్చర్యానందాలతో తలమునకలవుతూ అడిగాడు మల్హోత్రా.‘‘పది లక్షలు. అంతకంటే తక్కువకు అమ్మలేను’’ అన్నాడతను కరాఖండిగా.‘‘చాలా ఎక్కువ. రెండు లక్షలకు మించి ఇవ్వలేను’’ బింకంగా చెప్పాడు మల్హోత్రా.‘‘వద్దులెండి. ఇంకెవరైనా దీన్ని కొంటారేమో చూస్తాను’’ అంటూ లేచి నిలబడి డోర్‌వైపు కదిలాడా యువకుడు.‘‘వద్దు, వద్దు. నేనే కొంటాను దీన్ని. నీకు చెక్ ఇయ్యవచ్చా?’’ అన్నాడు మల్హోత్రా ఆత్రంగా.‘‘లేదు. క్యాష్ మాత్రమే తీసుకుంటా’’ అన్నాడతడు.‘‘సరే, నీ పేరు, వివరాలూ నాకనవసరం. ఇది నాకు అమ్మినట్లు నువ్వు ఎవరికీ చెప్పకూడదు’’ అన్నాడు మల్హోత్రా. అలాగేనన్నాడతను.మల్హోత్రా ఇంటి లోపలికి వెళ్లి ఐదు నిమిషాల్లో డబ్బు తీసుకొని వచ్చి ఆ యువకుడికిచ్చాడు.సఫారీ సూట్‌వాలా వస్త్రాన్ని, చిన్న సీసాలోని ద్రవాన్ని మల్హోత్రాకిచ్చి చెప్పాడు: ‘‘మీరు ఈ వస్త్రంపై ఈ సీసాలోని ద్రవం ఒక ఐదు చుక్కలు పూసి కప్పుకుంటే అదృశ్యమవుతారు. కానీ ఈ వస్త్రం ప్రభావం రెండు గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత మీరందరికీ మామూలుగా కనిపిస్తారు’’ అన్నాడు.
‘‘రెండు గంటలు కావస్తుండగా మళ్లీ ఈ వస్త్రంపై ద్రవం పూస్తే మళ్లీ మాయం కావచ్చా?’’ అడిగాడు మల్హోత్రా.‘‘లేదు. రెండు వాడకాల మధ్య కనీసం పన్నెండు గంటలు గ్యాప్ ఉండాలి. వస్త్రాన్ని చెక్ చేసుకోండి’’ అని తన బ్యాగ్ తీసుకుని గది బయటకు నడిచాడా యువకుడు.మల్హోత్రా మనసు ఆనందంతో ఉరకలేస్తోంది. వస్త్రంపై ద్రవాన్ని పూసి కప్పుకొని అద్దంలో చూసుకున్నాడు. అద్దంలో ఎవరూ లేరు. తన వంటిపై వస్త్రాన్ని తీసేయగానే మళ్లీ మల్హోత్రా ప్రతిరూపం అద్దంలో కనిపించింది. మల్హోత్రా పనివాడు మున్నాను కేకేసి, వాడు గదిలోకి వచ్చేలోగా మళ్లీ ఆ గుడ్డను కప్పుకొని అదృశ్యమయ్యాడు.మున్నా గదిలోకి వచ్చి, ‘‘సాబ్ మీరెక్కడ?’’ అని గదంతా కలియదిరగడం ముసిముసి నవ్వుతో గమనించాడు మల్హోత్రా. గది బయటకు నడిచి, ఆ గుడ్డను ఒంటిపై నుంచి తీసి జాగ్రత్తగా మడిచి, జేబులో పెట్టుకొని గదిలోపలికొస్తూ, ‘‘ఒరేదున్నపోతు వెధవా, టీ తీసుకొని రా’’ అన్నాడు. మున్నా ఆశ్చర్యంగా వెళ్లిపోయాడు.కొంతకాలంగా మల్హోత్రా చేసే బిజినెస్ నష్టాల్లో ఉంది. కొందరు చోరులు తస్కరించిన కళాఖండాలు కూడా కొంటూఉంటాడతను. అటువంటి దొంగసరుకులు బొంబాయిలోని ఒక కస్టమర్ కోసం తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకోవడంతో మల్హోత్రా చాలా ఖర్చుపెట్టి వాటిని విడిపించాల్సి వచ్చింది. ‘‘పది లక్షలు చిల్లపెంకుల్లా ధారబోసి ఈ వస్త్రాన్ని కొన్నాను. వెంటనే దీన్ని ఉపయోగించి, పెట్టుబడిని రాబట్టుకోవాలి’’ అనుకున్నాడు మల్హోత్రా.మల్హోత్రా భార్య రెండు రోజుల క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. వస్త్రాన్ని కొన్న సందర్భాన్ని షాంపేన్ తాగుతూ ఆ రాత్రి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడతను. అతని బట్టల బీరువాలో విదేశాల నుంచి ఒక మిత్రుడు తెచ్చిచ్చిన షాంపేన్ బాటిల్ ఉండనే ఉంది.కాసేపు ఆలోచించి, మల్హోత్రా ఆ వస్త్రాన్ని, ద్రవాన్ని ఒక జిప్ బ్యాగులో ఉంచుకుని తన కారులో బయల్దేరి కృపాల్‌బాగ్‌లోని జువెలరీ షాపులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. ఒక ప్రసిద్ధి పొందిన జువెలరీ షాపు సమీపంలో తన కారు పార్క్ చేసి, బ్యాగులోంచి వస్త్రాన్ని తీసి, దానిపై ఐదు చుక్కల ద్రవాన్ని పూసి తనపై కప్పుకొని డోర్ తీసి కారు దిగాడు. తన ఉనికిని చుట్టుపక్కల వాళ్లెవరూ గుర్తించకపోవడం చూసి నవ్వుకుంటూ జాగ్రత్తగా రోడ్డు దాటి ‘మయూర్ షా జువెలర్స్’ దుకాణంలోకి వెళ్లాడు.
ఒక కస్టమర్ గ్లాస్‌డోర్‌లోంచి లోనికి ప్రవేశిస్తుండగా, అతని వెనుకనే అదృశ్యరూపంలో ఉన్న మల్హోత్రా కూడా షాపులోనికి వెళ్లిపోయాడు. మల్హోత్రా షాపంతా కలియదిరుగుతూ షోకేసుల్లో పేర్చిన రకరకాల వజ్రాల హారాలు, బ్రేస్‌లెట్స్, నగల వంక ఆనందంగా చూశాడు. వాటి జోలికి వెళ్లడం ప్రమాదం. కళ్ల ముందే నగలు మాయమైతే ఏ సేల్స్‌మెన్ కూడా ఊరుకోడు కదా అనుకున్నాడు.కౌంటరు ముందున్న మయూర్ షా ముందున్న ట్రేలో రకరకాల నగలు ఉన్నాయి. ఇదివరకు అదే షాపులో నగలు కొన్న కస్టమర్స్, ఆ రసీదులు నగలు తీసుకొచ్చి ఎప్పుడైనా తిరిగి ఆ షాపులో ఇస్తే ఆ కస్టమర్స్ కొన్న ధరకు తిరిగి నగదు చెల్లించే సదుపాయం ఉందా దుకాణంలో. అలా పాత కస్టమర్స్ ఆ రోజు తిరిగి ఇచ్చిన నగలవి. షాపు మూసే సమయం కావడంతో మయూర్ షా ఆ నగలన్నిటినీ క్యాష్ టేబుల్ కింది ర్యాక్‌లో ఉంచి తాళం వేసి, తాళం చెవి సొరుగుపై ఉంచి షాపంతా కలియదిరుగుతూ సేల్స్‌మెన్‌కు షోకేసులు మూసి లాక్ చేయాలని పురమాయిస్తున్నాడు.ఇదే అదనుగా మల్హోత్రా షా టేబుల్ సొరుగుపై ఉన్న తాళంచెవి సహాయంతో ఆ ర్యాక్ తెరిచి, ఆ నగలన్నింటినీ తన జేబులో కూరుకున్నాడు. షా అటువైపు రావడం గమనించి, ర్యాక్ మూసి తాళం వేసి, కొందరు కస్టమర్స్ స్వింగ్ డోర్స్ తెరుచుకొని బయటకు వెళ్తూ ఉంటే వారి వెనుకనే ఆ షాపు నుంచి బయటకు నడిచాడు. తన ఉనికిని ఎవరూ గమనించకపోవడం అతణ్ణి ఆనంద పారవశ్యంలో ముంచింది. మల్హోత్రా కారు డోర్ తీసుకుని,
సీట్లో కూర్చోవడం ఆ రద్దీలో ఎవరూ గమనించలేదు. ఆనందంగా ఇల్లు చేరుకుని, పనివాడు మున్నాను ఇంటికి పంపించి, డోర్ లాక్ చేసుకుని బెడ్ రూమ్‌లోకి నడిచాడు. జేబులోంచి నగలు తీసి ఆనందంగా చూసుకుని వాటినీ, మాయవస్త్రం, ద్రవం ఉన్న జిప్‌బ్యాగ్‌ను ఒక అల్మరాలో ఉంచాడు. తనకు బాగా తెలిసిన నగల వర్తకుడు కరమ్‌చంద్‌కు ఫోన్‌చేసి తన వద్ద కొన్ని నగలు ఉన్నాయని, వాటిని కొనడానికి మర్నాటి పొద్దున ఎనిమిదింటికి సొమ్ము తీసుకురమ్మని పురమాయించాడు. తర్వాత బట్టల బీరువాలోంచి షాంపేన్ బాటిల్ బయటకు తీసి ఆనందంగా కాసేపు తాగి, మున్నా చేసి పెట్టి పోయిన పరోటాలు తిని ఉల్లాసంగా నిద్రకు ఉపక్రమించాడు.ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేచిన మల్హోత్రా గబగబా తయారయ్యే సరికి తొమ్మిదింపావు దాటింది. ఎందుకో కరంచంద్ ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే క్యాష్ రెడీ చేసుకోవడం ఆలస్యమైందని, దారిలో ఉన్నానని చెప్పాడు.
పది గంటలకు కాలింగ్ బెల్ మోగింది. కరంచంద్ వచ్చి ఉంటాడని తలుపు తీసిన మల్హోత్రా ఎదురుగా యూనిఫామ్‌లోని పోలీసులనూ, మయూర్ షానూ చూసి నిశ్చేష్టుడయ్యాడు.‘‘మీరు నిన్న రాత్రి వీరి దుకాణంలో చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ నగలు ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పండి.’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్. మల్హోత్రాకు మతిపోయినట్లైంది.‘‘నిన్న రాత్రి వీడు చోరీ చేస్తుంటే ఎవ్వరూ గమనించలేదు. సీసీ కెమెరా దృశ్యాల్లోనూ కనబడలేదు. ఏం మాయ చేశాడో ఏమో! మళ్లీ ఈ రోజు ఉదయం తొమ్మిదింటికి షాపు తెరిచి, నగలు మిస్సవడంతో రాత్రి తాలుకా సీసీ కెమెరా ఫుటేజీ చూసేసరికి వీడునగలు చోరీ చేస్తూ కనపడ్డాడు. దగ్గరలో పార్క్ అయిన కారు వివరాలు ట్రాఫిక్ పోలీసుల సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ద్వారా ఇతని ఆచూకీ కనుక్కున్నాం’’ అప్పుడే అక్కడకు చేరుకున్న డీఎస్పీకి వివరించాడు షా. పోలీసు దెబ్బల భయంతో మల్హోత్రా గాభరాగా గత రాత్రి తాను నగలు దాచిన అలమరా తెరిచాడు. అందులో నగలు కాని, మాయావస్త్రం ఉన్న జిప్‌బ్యాగు కాని కనపడలేదు. సఫారీసూట్ యువకుడి వద్ద అలాంటిదే మరో వస్త్రం ఉండి ఉండాలి. దాన్ని గమనించి బయటకు నడవగానే కప్పుకొని తన బెడ్‌రూములోనే దాగి ఉండి, తాను నిద్రపోయాక నగలు, జిప్‌బ్యాగు చోరీ చేసి వెళ్లిపోయి ఉండవచ్చు.మాయావస్త్రం ప్రభావం రెండుగంటల తర్వాత తగ్గడంతో సీసీ కెమెరాల్లో తాను ఉన్న దృశ్యం కనిపించి ఉండవచ్చు. మల్హోత్రా చెప్పేది ఎవ్వరూ వినిపించుకోలేదు. దిగులుగా పోలీసుల వెనుక నడిచాడు మల్హోత్రా.
- రాచపూటి రమేష్
అదృశ్యకరణి
Published Sun, Dec 2 2018 2:30 AM | Last Updated on Sun, Dec 2 2018 2:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment