నొప్పులు ఎందుకు వస్తాయి? | funday health counciling | Sakshi
Sakshi News home page

నొప్పులు ఎందుకు వస్తాయి?

Published Sun, Dec 10 2017 12:48 AM | Last Updated on Sun, Dec 10 2017 12:48 AM

funday health counciling - Sakshi

మా బంధువుల అమ్మాయికి ఎనిమిదో నెలలోనే నొప్పులు రావడంతో హడావిడిగా హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం. అయితే అవి ప్రసవనొప్పులు కాదని చెప్పారు. ‘బ్రాక్స్‌టన్‌ హిక్స్‌ కాంట్రాక్షన్స్‌’ వల్ల ఇలాంటి నొప్పులు వస్తాయని వైద్యులు చెప్పారు. అసలు ఇలాంటి నొప్పులు ఎందుకు వస్తాయి? ఎంతసేపటికి ఇవి తగ్గిపోతాయి. అలాగే ఈ నొప్పులు ఏ నెల నుంచి ప్రారంభమవుతాయి. దయచేసి దీని గురించి తెలియజేయగలరు.
– పి.స్వాతి, హైదరాబాద్‌

గర్భిణీలలో గర్భాశయ కండరాలు 30 నుంచి 60 సెకన్ల పాటు కొద్దిగా గట్టిపడి, వదులు కావడం జరుగుతుంది. ఇవి సాధారణంగా ఎనిమిదవ నెల నుంచి మొదలవుతాయి. ఇవి అప్పుడప్పుడు వచ్చి, మళ్లీ వాటంతటవే తగ్గిపోతాయి. గర్భిణికి పొట్ట గట్టిపడి వదులైనట్లు ఉండడం, నడుము నొప్పిలాగా ఉండడం జరుగుతుంది. వీటినే బ్రాక్స్‌టన్‌ హిక్స్‌ కాంట్రాక్షన్స్‌ అంటారు. వీటినే ఫాల్స్‌ లేబర్‌ పెయిన్‌ అని కూడా అంటారు. ఇవి కాన్పు నొప్పులు కావు. ఇందులో నొప్పి తీవ్రత పెరగదు. గర్భాశయం తెరుచుకోదు. తల్లి కాన్పుకు çసంసిద్ధం అయ్యే ముందు, బిడ్డ ఎక్కువగా కదులుతున్నప్పుడు, తల్లి ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, ఎక్కువసేపు నిల్చునే ఉన్నా ఇవి ఎక్కువగా వస్తాయి. కొంతమందిలో రోజులో రెండు, మూడుసార్లు వచ్చి తగ్గిపోతాయి. అదే కాన్పు నొప్పులైతే పొట్ట మెల్లగా గట్టి పడుతూ, వదులవుతూ నొప్పి మెల్లగా పెరగటం, ఎక్కువసేపు పొట్ట గట్టిగా ఉండి వదులవడం, ఎక్కువసార్లు గట్టిపడుతూ నొప్పి తీవ్రత పెరగడం జరుగుతుంది. అలాగే నొప్పులతో పాటు గర్భాశయ ద్వారం మెత్తపడుతూ తెరుచుకోవడం మొదలవుతుంది.

ప్రెగ్నెంట్‌ మహిళలకు ఏ విషయం చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే వైద్యపరమైన నియమావళి ఏదైనా ఉందా? ఎవరిదైనా చావుకు సంబంధించిన న్యూస్‌ వారికి తెలియజేసినప్పుడు, సహజంగానే షాక్‌ అవుతారు. దీని ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఏమైనా ఉంటుందా?
– ఎన్‌.ఎల్, నరసాపురం

సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ ఒత్తిడికి లోనవకుండా ఉండి, మానసికంగా సంతోషంగా ఉన్నప్పుడు కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగని ఏ విషయం చెప్పాలి, ఏది చెప్పకూడదు అని వైద్యపరమైన నియమావళి ఏమీ లేదు. ఉన్నట్టుండి చెడు వార్త చెప్పడం వల్ల కలిగే షాక్‌వల్ల బిడ్డ మీద ప్రభావం ఎక్కువగా ఏమీ ఉండదు. కాకపోతే దీర్ఘకాలం ఆ తల్లి డిప్రెషన్‌లో ఉంటే కొన్నిసార్లు బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదల తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా చెడ్డ వార్త చెప్పేటప్పుడు తల్లిని ముందుగా సిద్ధం చేసి, మెల్లగా చెప్పడం మంచిది. తర్వాత కూడా ఆమె పక్కన ఒకరు ఉండి వారికి ధైర్యం చెప్పడం, ఆమె ధ్యాసను వేరే పని మీదకు మళ్లించడం మంచిది.

గర్భిణీ స్త్రీలు శాకాహార, మాంసాహారాల్లో దేనికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది?  గర్భిణీ స్త్రీలకు ‘డీహెచ్‌ఏ సప్లిమెంటేషన్‌’ ఇవ్వడం అంటే ఏమిటి? అవి దేనికి ఇస్తారు? ఇస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? దయచేసి నా ప్రశ్నలకు సమాధానమివ్వండి..!
– పి.ఎన్, ఖమ్మం

శాకాహారం కంటే మాంసాహారంలో ఎక్కువగా ఐరన్, క్యాల్షియం, ప్రొటీన్లు లభ్యమవుతాయి. గర్భిణీ స్త్రీలలో తల్లీబిడ్డలిద్దరి అవసరాలకు సరిపడా ఆహారంలో ఎక్కువగా ప్రొటీన్లు, ఐరన్, క్యాల్షియం ఉండటం అవసరం. ఇవన్నీ శాకాహారంలో కూడా దొరుకుతాయి. కాకపోతే గర్భిణీ స్త్రీకి ముందు నుంచే రక్తహీనత ఉండటం, బరువు తక్కువగా ఉండటం వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాటిని తొందరగా సరిదిద్దుకోవడానికి మాంసాహారం ఉపయోగపడుతుంది. మాంసాహారం తింటే ఐరన్‌ ఎక్కువగా తల్లి పేగుల నుంచి రక్తంలోకి చేరి హిమోగ్లోబిన్‌ శాతం తొందరగా పెరుగుతుంది. కాకపోతే మాంసాహారం తీసుకునేటప్పుడు రోజూ మరీ ఎక్కువగా తీసుకోకుండా, కొద్దిగా మసాలా, కారం కూడా తగ్గించి తీసుకోవాలి. అలాగే వాటిని  బాగా ఉడకబెట్టుకొని తీసుకోవడం కూడా చాలా మంచిది. శాకాహారంలో ఎక్కువగా ఆకుకూరలు, పప్పులు, పండ్లు, కూరగాయలు... అన్నింటిలోనూ ఐరన్, క్యాల్షియం, ప్రొటీన్లు దొరుకుతాయి. వీటిని రోజూ తీసుకోవచ్చు. డీహెచ్‌ఏ అనేది ఈౌఛిౌట్చజ్ఛ్ఠి్చ్ఛnౌజీఛి ్చఛిజీఛీ అనే ౖఝ్ఛజ్చ3 జ్చ్ట్టy్చఛిజీఛీట. ఇది బిడ్డ మెదడు, నాడీవ్యవస్థ, పళ్లు బలపడటానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా చేపలలో దొరుకుతుంది. లివర్, గుడ్డు పచ్చసొనలో కొంతవరకు దొరుకుతుంది. శాకాహారంలో ఇవి ఎక్కువగా దొరకవు. ఆహారంలో ఇవి తక్కువగా ఉన్నప్పుడు డీహెచ్‌ఏని ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవడాన్ని డీహెచ్‌ఏ సప్లిమెంటేషన్‌ అంటారు.
డా‘‘ వేనాటి శోభ
రెయిన్‌బో హాస్పిటల్స్‌
హైదర్‌నగర్‌ హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement