నా చావు నే చస్తా | funday horror story | Sakshi
Sakshi News home page

నా చావు నే చస్తా

Published Sun, Mar 11 2018 6:39 AM | Last Updated on Tue, Mar 13 2018 1:46 PM

funday horror story - Sakshi

తాతామనవళ్లిద్దరూ ఒక నిద్ర తీశాక.. మధ్యరాత్రిలో ఏదో చప్పుడైంది. మనవడు మేల్కొన్నాడు. ‘‘భయమేస్తోంది తాతా’’ అన్నాడు.. ముఖాన్ని తాత డొక్కలోకి దూర్చేస్తూ. 

శుభం! సినిమా ముగిసింది. ‘నా సావు నే సస్తా. నీకెందుకు?’.. సినిమాలోని డైలాగ్‌. ఎవరో పకపకమంటున్నారు. డిమ్‌ లైట్‌లలో కొద్దికొద్దిగా కదులుతూ ‘ఎగ్జిట్‌’ వైపుకు మెట్లు దిగుతున్నారు తాత, మనవడు. పదేళ్లుంటాయి మనవడికి. తాత చెయ్యి పట్టుకుని ఒక్కో అడుగూ వేస్తున్నాడు. చూసిన సినిమాపై లేదు వాడి ధ్యాస. చూడబోయే ‘స్కేరీ హౌస్‌’ మీద ఉంది. మల్టీప్లెక్స్‌ అది. నాలుగైదు స్క్రీన్‌లు, చిన్న షాపింగ్‌ మాల్, కిడ్స్‌ ప్లే జోన్, స్కేరీ హౌస్‌.. ఇలాంటివన్నీ ఉన్నాయి. థియేటర్‌ లోపలికి వెళ్లే ముందే మాట తీసుకున్నాడు మనవడు. ‘‘తాతా.. సినిమా అయిపోయాక స్కేరీ హౌస్‌కి వెళ్లాలి’’ అని. తాతగారు నవ్వారు. ‘‘సరే’’ అన్నారు.మొదట పిల్లల సినిమాలు ఏవైనా ఉంటాయేమోనని ఆయన చూశారు. ఉన్నాయి కానీ, ఆ టైమ్‌లో షోలు లేవు. ‘‘ఈ సినిమాకు టిక్కెట్లు ఉన్నాయట. వెళ్దామా?’’ అన్నాడు. ‘‘వద్దు తాతా. స్కేరీ హౌస్‌కు వెళ్దాం’’ అన్నాడు మనవడు. స్కేరీ హౌస్‌లో ఏముంటుందో తాతగారికి కొద్దిగా తెలుసు. ఏవో దెయ్యాల కొంపలోని సెట్టింగులు, అరుపులు ఉంటాయని విన్నాడు. ‘‘వద్దురా బుజ్జులూ.. భయపడతావు’’ అన్నారు వాడి తలను నిమురుతూ.  బుజ్జులు నవ్వాడు. ‘‘నాకు భయమా తాతా! కేపీసాయి కన్నా నాకే ధైర్యం ఎక్కువ’’ అన్నాడు. ‘‘కేపీసాయి ఎవర్రా?’’ అన్నారు తాతగారు. ‘‘మా క్లాస్‌మేట్‌ తాతా. స్ట్రాంగ్‌గా ఉంటాడు. కానీ భయం. బాత్రూమ్‌ వస్తే చీకట్లో ఒక్కడే వెళ్లలేడు తెలుసా?’’ అన్నాడు చిటికిన వేలు చూపిస్తూ.
తాతగారు నవ్వారు. 

థియేటర్‌ ‘ఎగ్జిట్‌’ డోర్‌ నుంచి బయటికి రాగానే ఎస్కలేటర్‌లో పై ఫ్లోర్‌కు వెళ్లారు తాతా మనవడు. ఆ ఫ్లోర్‌లోనే ఉంది స్కేరీ హౌస్‌.‘‘రెండు టిక్కెట్లు ఇవ్వు బాబూ’’ అడిగారు తాతగారు. కౌంటర్‌లో ఉన్న కుర్రాడు టిక్కెట్లు ఇవ్వబోతూ, తాతగారి పక్కన మనవణ్ని చూసి ఆగిపోయాడు. ‘‘పిల్లలకు నో ఎంట్రీ అండీ’’ అన్నాడు. మనవడు భయంగా చూశాడు. ‘లోపలికి పోనివ్వనంటాడా ఏంటీ!’ అన్న భయం అది. ‘‘పర్లేదు ఇవ్వు బాబూ.. నేనున్నాగా’’ అన్నారు తాతగారు. ‘‘లేదండీ.. పిల్లలు భయపడితే మాకు మాటొస్తుంది’’ అన్నాడు కౌంటర్‌లోని కుర్రాడు. ‘‘పదరా బుజ్జులూ.. పిల్లల్ని పోనివ్వరట’’ అన్నారు తాతగారు మనవడి చెయ్యి పట్టుకుని. మనవడు ఆ కౌంటర్‌లోని కుర్రాడి వైపు కోపంగా చూశాడు.‘‘నా చావు నే చస్తా. నీకెందుకు’’ అన్నాడు!ఆ మాటకు తాతగారు, కౌంటర్‌లోని అబ్బాయి  .. ఇద్దరూ ఒకేసారి పెద్దగా నవ్వారు.స్కేరీ హౌస్‌లోకి వెళుతుండగా తాతగారు అడిగారు.. ‘‘ఆ డైలాగ్‌ నీక్కూడా నచ్చిందా?’’ అని. ఏ డైలాగ్‌ తాతా అన్నట్టు చూశాడు మనవడు. తాతగారు చెప్పారు. ‘‘ఓ.. అదా తాతా..! ఆ డైలాగ్‌ నాకు సినిమా చూడకముందే తెలుసు’’ అన్నాడు మనవడు. ‘‘ఎలా?’’ అన్నారు తాతగారు ఆశ్చర్యాన్ని నటిస్తూ. ‘‘ఎప్పుడూ.. డాడీ, మమ్మీ అంటుంటారు తాతా..’’అన్నాడు. తాతగారు నవ్వుకున్నారు.

పాడుపడినట్లున్న ఆ చీకటి గుయ్యారంలో తాతామనవడు మెల్లగా తడుముకుంటూ నడుస్తున్నారు. తాతగారు ఊహించిన దానికంటే భయంకరంగా ఉంది స్కేరీ çహౌస్‌! అడుగుకో దెయ్యం వచ్చి మీద పడబోతోంది. అలా పడబోతున్నప్పుడల్లా లోపల ఉన్నవాళ్లంతా భయంతో పెద్దగా అరుస్తున్నారు. ఓ చోట కాళ్ల కింద నుంచి దెయ్యం ఒకటి తాతామనవళ్ల మీదకి రాబోయింది. తాతగారు అదిరిపడ్డారు. కానీ మనవడు నవ్వాడు! ఇంకోచోట అస్థిపంజరం కిందికి జారి, వీళ్ల తల మీద ఊగింది. అప్పుడు కూడా మనవడు నవ్వాడు. మరో మూల.. కొరివి దెయ్యం గుర్రున చూసింది. మళ్లీ మనవడి నవ్వు! దెయ్యాలు, భూతాలు రకరకాలుగా భయపెడుతుంటే మనవడు రకరకాలుగా నవ్వుతున్నాడు. నవ్వుతూనే వాడు బయటికి వచ్చేశాడు. వెనకే తాతగారు. తాతగారి వెనకే బతుకు జీవుడా అనుకుంటూ మిగతావాళ్లు. ‘‘భయం వెయ్యలేదురా.. బుజ్జులూ నీకు?’’ అన్నాడు తాతగారు అదురుతున్న గుండెలతో. ‘‘లేదు తాతా.. మస్తు మజా వచ్చింది’’ అన్నాడు వాడు. 

ఆ రాత్రి కూడా మనవడు తాతగారి దగ్గరే పడుకున్నాడు. కూతురి దగ్గరికి హైదరాబాద్‌ వచ్చి రెండు రోజులు అయింది ఆయన. అల్లుడిని చూసి కూడా రెండు రోజులు అవుతోంది!  తను ఊర్నుంచి వచ్చిన రోజు మాత్రం.. ‘‘బాగున్నారా మావయ్యా’’ అని అతడు అడిగినట్లు గుర్తు. ‘‘బాగున్నాను బాబూ’’ అనే లోపే అతడు బండి స్టార్ట్‌ చేసుకుని వెళ్లిపోయాడు. అది కూడా గుర్తు. తాతామనవళ్లిద్దరూ ఒక నిద్ర తీశాక.. మధ్యరాత్రిలో ఏదో చప్పుడైంది. మనవడు మేల్కొన్నాడు. ‘‘భయమేస్తోంది తాతా’’ అన్నాడు.. ముఖాన్ని తాత డొక్కలోకి దూర్చేస్తూ.అందుకేరా ఆ దెయ్యాలకొంపకు వద్దంది.. అనబోయి, ఇప్పుడు దాన్ని గుర్తు చేయడం ఎందు కని, మనవడి మీద చెయ్యి వేశారు తాతగారు. ‘‘తాతా.. రేపే కదా నువ్వు ఊరికి వెళ్లిపోయేది’’ అన్నాడు మనవడు బెంగగా.‘‘మళ్లీ వస్తాను కదరా బుజ్జులూ..’’ అన్నారు తాతగారు మురిపెంగా. ‘‘పోవద్దు తాతా. నువ్వు ఇక్కడే ఉండిపో తాతా. నువ్వుంటే నాకు భయం వెయ్యదు తాతా’’ అంటున్నాడు వాడు. అలా అంటూనే నిద్రలోకి జారుకున్నాడు. స్కేరీ హౌస్‌లో దెయ్యాల్ని చూసి పడీపడీ నవ్విన వాడికి భయమేంటి?!  మనవడి కాలు, చెయ్యి ఆయన మీద ఉన్నాయి. వాడి నిద్ర పాడవకూడదని ఎటూ కదలకుండా అలాగే ఉండిపోయారు ఆయన.ఊరు వెళ్లిన తర్వాత కూతురుకి ఫోన్‌ చేశారు తాతగారు.‘‘మీ ఇంట్లో రెండు దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలు పోట్లాడుకుంటూ.. గిన్నెలు, కంచాలు ఎత్తేస్తుంటే నా మనవడు భయంతో వణికిపోతున్నాడు. ఎలాగైనా మీ భార్యాభర్తలే ఆ దెయ్యాలకు సర్దిచెప్పి, ఇంట్లోంచి తరిమేయాలి’’ అని చెప్పారు. 
- మాధవ్‌ శింగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement