ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యి ఆమె తలపై ఉంచాడు ఆ వచ్చినతను. తలపై ఉంచాడే కానీ, చేతిని ఆమె తలకు తాకనివ్వలేదు.
‘‘ఉంది’’ అన్నాడు ఆ వచ్చినతను!ఉలిక్కిపడి, భర్త చేతిని గట్టిగా పట్టుకుంది కోవెల. దేవ్ కళ్లల్లో ఎలాంటి ఎక్స్‌ప్రెషనూ లేదు. ఆ వచ్చినతను ‘ఉంది’ అన్నప్పుడు దేవ్ ఎలా ఉన్నాడో, భార్య ఉలిక్కిపడినప్పుడూ అలాగే ఉన్నాడు. అభావంగా!డూప్లెక్స్ అది. ఇంట్లోనే మెట్లుంటాయి. కొనేముందే వద్దంది కోవెల. ఇంట్లో మెట్లుండడం ఆమెకు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు టీవీలో ఏ సినిమాలోనో చూసింది, సరిగ్గా వాళ్లిప్పుడున్న ఇల్లు లాంటి ఇంట్లోనే రాత్రిళ్లు ఒక దెయ్యం మెల్లగా మెట్లు దిగుతూ ఉండడం. దెయ్యం బయటి నుంచి వస్తుందనుకుంటే తలుపులు వేసుకుని పడుకోవచ్చు. ఇంట్లోనే దెయ్యం ఉంటే తలుపులు తెరుచుకుని బయటికి పారిపోయే టైమ్ అయినా ఉంటుందా? అందుకే వద్దంది. అప్పుడు దేవ్ నవ్వాడు. ఇప్పుడూ నవ్వేవాడే కానీ, భార్య భయపడుతోంది. అందుకే నవ్వలేదు. ఇంకొకందుకు కూడా దేవ్ నవ్వలేదు. ఆ వచ్చినతన్ని తక్కువ చేసినట్లవుతుందని. అందుకే అభావంగా ఉండిపోయాడు. లేని ఫీలింగ్‌ని తెచ్చిపెట్టుకోవడం సులభమే. ఫీలింగ్‌ని దాచి పెట్టుకోవడం కష్టం. అయితే ఆ కష్టాన్ని కూడా బయటికి తెలియనివ్వడం లేదు దేవ్. ‘‘ఉంది’’ అన్నాడు ఆ వచ్చినతను మళ్లీ ఒకసారి. ‘‘ఉంది’’ అని ఆ ఇంట్లోకి వచ్చీరాగానే అనలేదు అతను. మొదట వాస్తు చూశాడు. ఉండడానికి వీల్లేదన్నాడు.గడపలన్నీ తాకి చూశాడు. ఉండడానికి వీల్లేదన్నాడు. గదులన్నీ తిరిగి చూశాడు. ఉండడానికి వీల్లేదన్నాడు. మూలల్ని కొలిచి చూశాడు. ఉండడానికి వీల్లేదన్నాడు. దూలాల్ని తట్టి చూశాడు. ఉండడానికి వీల్లేదన్నాడు. కోవెల ఊపిరి పీల్చుకుంది. ఇక లేనట్లే అనుకుంది. పూజలూ అవీ చేయిస్తే అరాకొరా ‘గాలి’ ఏమైనా ఉంటే అదీ పోతుంది అనుకుంది.
‘‘కొన్నిళ్లను చూడగానే బయటి నుంచే తెలిసిపోతుంది, ఏమీ లేవని. కానీ మీ తృప్తి కోసం ఇంట్లోకి వచ్చి చూశాను. ఏమీ లేవు, హాయిగా ఉండండి’’ అన్నాడతను. కోవెల అతడి కాళ్లకు దండం పెట్టింది. ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యి ఆమె తలపై ఉంచాడు ఆ వచ్చినతను. తలపై ఉంచాడే కానీ, చేతిని ఆమె తలకు తాకనివ్వలేదు. దేవ్ కూడా అతడికి దండం పెట్టాడు.. కోవెల కోసం. దండం పెడుతుండగా దేవ్‌కి సందేహం వచ్చింది. దెయ్యాలను పోగొట్టేవాళ్లు కూడా గుళ్లో పూజారుల్లా మనుషులను ఆశీర్వదిస్తారా అని. హాల్లోంచి ముగ్గురూ బయటికి వచ్చారు. ఆ వచ్చినతను మళ్లొకసారి వెనక్కి తిరిగి చూశాడు.. ఇంట్లోకి. ఆ వెంటనే కోవెల వైపు, దేవ్ వైపు చూశాడు. ఎందుకో అతడి ముఖం అప్రసన్నంగా మారిపోయింది!‘‘ఉంది’’ అన్నాడు! అతడలా అన్నప్పుడే.. కోవెల ఉలిక్కిపడి, దేవ్ చేతిని గట్టిగా పట్టుకుంది. దేవ్ ఆలోచిస్తున్నాడు. ‘ఉండడానికి వీల్లేదు’ అన్న మనిషి.. ‘ఉంది’ అని అకస్మాత్తుగా అన్నాడంటే.. అతడికేదో కనిపించి ఉండాలి. కనీసం అనిపించి ఉండాలి. అంటే.. కోవెలకు అనిపించిన విధంగానే అతడికీ అనిపించిందా?! ‘‘ఉంది. ఇక్కడే ఉంది’’ అన్నాడు అతను.‘‘లేదన్నారూ..’’ అంది కోవెల. ఆ అమ్మాయి గొంతు ఆర్చుకుపోతోంది. కొత్త జంట. జీవితాన్నింకా మొదలుపెట్టనే లేదు. ‘‘నేను కాకుండా ముగ్గురు కనిపిస్తున్నారు నాకిక్కడ’’ అన్నాడతను!కళ్లు తిరిగిపడిపోయింది కోవెల.
‘‘మీతో విడివిడిగా మాట్లాడాలి’’ అన్నాడతను.దేవ్, కోవెల ఒకర్నొకరు చూసుకున్నారు. ‘‘మేము ఇద్దరం కాదు. ఒక్కరిమే. కలిపే మాట్లాడండి’’ అన్నాడు దేవ్. దేవ్‌ని అతడు తీక్షణంగా చూశాడు. ‘‘మీరిద్దరూ కలిపి ఒక్కరే. కానీ మీ ఇద్దరినీ వేరు చేయడానికి వచ్చిన వారొకరున్నారు మీ లోపల’’ అన్నాడతను. కోవెల అదిరిపడింది. దేవ్ మళ్లీ అభావంగా ఉండిపోయాడు. ఇలాంటివాటిపై దేవ్‌కి నమ్మకం లేదు. కోవెల కోసం అతణ్ణి పిలుచుకొచ్చాడంతే. దేవ్‌ని ఇంకా అలాగే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు అతను. రెండోసారి కళ్లు తిరిగి పడిపోడానికి సిద్ధంగా ఉంది కోవెల. ఆ అమ్మాయి ఇప్పుడు దెయ్యానికి భయపడడం లేదు. దేవ్‌ని, తనని విడదీయడానికే ఆ దెయ్యం వచ్చిందనే మాటకు భయపడుతోంది. దేవ్‌కి దగ్గరగా జరిగి కూర్చుంది. వాళ్ల ఎదురుగా అతను కూర్చొని ఉన్నాడు. ‘‘అలా అంటుకుని కూర్చోకమ్మా’’.. కోవెలతో సౌమ్యంగా చెప్పాడతను. ఆ సౌమ్యతను అతడు దేవ్ దగ్గర ప్రదర్శించడం లేదు. ఆ సంగతిని దేవ్ గ్రహించాడు. ‘‘ఇప్పుడే కాదు, జీవితంలో ఎప్పుడూ.. మూడో వ్యక్తి ఉన్నప్పుడు నీ భర్తను అంటుకుని కూర్చోకు తల్లీ’’ అన్నాడు. కోవెల తలూపింది. భర్తకు దూరంగా జరిగి కూర్చుంది. ఆ వచ్చినతను కాసేపు కళ్లు మూసుకున్నాడు. తర్వాత కళ్లు తెరిచాడు. దేవ్, కోవెల ముఖాలు చూసుకున్నారు. అతడు మళ్లీ కళ్లు మూసుకుని, కాసేపటి తర్వాత కళ్లు తెరిచాడు. ‘‘పట్టేశాను!’’ అన్నాడు. కోవెల ఉలిక్కిపడింది. దేÐŒ లో ఎప్పట్లాగే ఏ భావమూ లేదు. ‘‘మీ ఇద్దరూ ఒకటే అంటున్నారు కాబట్టి, మీలో ఉన్న మూడో మనిషి మీ ఇద్దరిలో ఎవరిలో ఉన్నారో చెప్పడం భావ్యం కాదు. అయితే ఒకటి మాత్రం చెప్తాను. మీ ఇద్దరిలో ఒకరు.. ఒకరు కాదు. ఇద్దరు’’ అనేసి పైకి లేచాడు. కోవెల, దేవ్ కూడా పైకి లేచారు.భయంతో కళ్లు తేలేసింది కోవెల. ఇంటి బయటికి.. గేటు దగ్గరికి వచ్చాక కోవెలను మాత్రమే దగ్గరకు రమ్మన్నట్లు చూశాడు అతను. కోవెల వెళ్లింది. ఆశీర్వదిస్తున్నట్లుగా ఆమె తలపై చెయ్యి ఉంచాడు అతను.‘‘కోవెలలో దైవం కానిదేదీ ఎక్కువ కాలం ఉండలేదు. ధైర్యంగా ఉండు’’ అన్నాడు. ఆమె తలను తాకుతూ ఆ మాట చెప్పాడతను.
మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment