థామస్ చెరియన్, కృష్ణ భగవాన్ ఇద్దరే ఉన్నారు ఆ గదిలో. అది భగవాన్ ఇల్లు. ఇంట్లో భగవాన్ గది. గది మధ్యలో ఖరీదైన పెద్ద సోఫా ఉంటుంది. ఆ సోఫా ఎదురుగా అంతే ఖరీదైన నాలుౖVð దు కుషన్ ఛైర్లు ఉంటాయి. భగవాన్ కోసం వచ్చే ఖరీదైన మనుషుల కోసం ఏర్పాటు చేసినవి అవి.థామస్ చెరియన్ ఖరీదైన వాడేం కాదు. నికార్సైనవాడు. నికార్సైనవాడు కాబట్టే నేరుగా భగవాన్ గదిలోకి వచ్చి కూర్చున్నాడు. భగవాన్ కూర్చోమనలేదు. కానీ చెరియన్ కూర్చున్నాడు! చెరియన్ వచ్చేటప్పటికి భగవాన్ తెల్లటి పంచె, తెల్లటి లాల్చీలో సోఫాపైన వెల్లకిలా పడుకుని రిలాక్స్‌డ్‌గా సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. ‘‘భగవాన్.. నువ్వు తెలివైనవాడివి కావచ్చు. నీ తెలివితేటలు నీ భార్యాబిడ్డలకు ఉపయోగపడినంత వరకు ఎవరికేం అభ్యంతరం ఉండదు. అయితే నీకొక్కడికే భార్యాబిడ్డలు ఉంటారనుకుంటునట్లు న్నావ్’’ అన్నాడు చెరియన్. మెల్లిగా సోఫాలోంచి లేచి కూర్చుని, కాలు మీద కాలు వేసుకున్నాడు భగవాన్. సోఫాలో తల పక్కనే పెట్టుకుని ఉన్న గన్‌ని తీసి పంచె కొసతో మృదువుగా తుడిచాడు. తన చేతిలో గన్‌ని చూశాక, చెరియన్ ఇంకొక్క మాట కూడా మాట్లాడడనే అనుకున్నాడు భగవాన్. కానీ చెరియన్ మాట్లాడాడు!‘‘భగవాన్.. నేనేం అన్యాయంగా అడగడం లేదు. నాకు రావలసింది నాకు ఇచ్చెయ్. ‘ఇంకో డీల్ చెయ్యి, రెండూ కలిపి ఇస్తాం’ అంటున్నారు మీ వాళ్లు. రోజు కూలీ లాంటి వాణ్ణి నేను. ఎప్పటిదప్పుడే ఇవ్వకపోతే శాటిస్‌ఫై కాను’’ అన్నాడు చెరియన్.
‘‘కోటి రూపాయల సెటిల్‌మెంట్ హైదరాబాద్‌లో చిల్లర సంగతి చెరియన్. అందులో నీ లక్ష ఇంకా చిల్లర. చిల్లర విషయాలు డీల్ చెయ్యడానికి నా దగ్గర తెలివైనవాళ్లు లక్షల్లో ఉన్నారు. నువ్వు నా వరకు రావడమే వింతగా ఉంది’’ అన్నాడు భగవాన్.‘‘నీ దగ్గరి తెలివైనవాళ్లకు తెలివి ఎక్కువైంది భగవాన్. నెల రోజుల నుంచీ తిరుగుతున్నాను. ముందు ఇస్తామని ఒప్పుకుని, తర్వాత ‘నువ్వు చేసిందేమీ లేదు’ అంటున్నారు.’’
‘‘నాతోనూ అన్నారు.. ఈ సెటిల్‌మెంట్‌లో నువ్వు చేసిందేమీ లేదని. ఎవరిదో ఫోన్ నెంబరు ఇచ్చావట. అంతేగా! ‘దానికి లక్షేమిటి?’ అంటున్నారు’’ అన్నాడు భగవాన్. అతడి పంచె ఇప్పుడు గన్ ట్రిగ్గర్‌ని తుడుస్తోంది. ‘‘నేను ఎంత చేశాను అని కాదు భగవాన్. నా పేరు నీ దాకా వచ్చిందంటే నేను చెయ్యాల్సిందే చేశాననే కదా..’’ భగవాన్ విసుగ్గా చూశాడు. ‘‘వెళ్లు చెరియన్. నా చేతుల్తో ఇప్పుడు నీకు లక్ష ఇచ్చానంటే.. నా సిస్టమ్‌ని నేనే దెబ్బతీసినట్లు. నీకు న్యాయం జరిగినా, అన్యాయం జరిగినా.. జరగాల్సిందే జరుగుతుంది. వెళ్లు’’ అన్నాడు. ‘‘వెళ్లడానికి రాలేదు భగవాన్. తీసుకెళ్లడానికే వచ్చాను’’ అన్నాడు చెరియన్. భగవాన్‌కి తిక్కరేగింది. గన్‌ని పొజిషన్‌లోకి తీసుకున్నాడు. టప్.. టప్.. రెండు బులెట్‌లు దిగాయి.
అయితే దిగింది భగవాన్ గుండెల్లోకి. సోఫాలోనే అతడు ఒరిగిపోయాడు. అరుపులు బయటికి వినిపించే గది కాదు అది. పోలీసు కుక్కలు వాసనపట్టే గది కూడా కాదు. తుపాకీని జేబులో పెట్టుకుని పైకి లేచాడు చెరియన్. భగవాన్‌కి దగ్గరగా వెళ్లి చూశాడు. చచ్చిపోయాడు. భగవాన్ గన్ భగవాన్ చేతిలోనే ఉంది. ఎవర్నో కాల్చబోతే ఎవరో కాల్చేశారు అన్నంత వరకు మొదట అర్థమైపోతుంది పోలీసులకు. ఆ గదిలో డబ్బు కోసం వెదికే అవసరం లేకపోయింది చెరియన్‌కి. సోఫాల వెనుక వరుసగా బస్తాలు పేర్చి ఉన్నాయి. ఒక బస్తా ఓపన్ చేశాడు. రెండువేల నోట్ల కట్టలు. వాటిని వదిలేశాడు. ఇంకో బస్తా తెరిచాడు. ఐదొందల నోట్ల కట్టలు. వాటిల్లోంచి రెండు కట్టలు తీసుకుని నడుము దగ్గర ప్యాంటు లోపలకి దోపుకున్నాడు. ‘‘ఏంటలా ఉన్నారు?’’ ఇంట్లోకి రాగానే అడిగింది చెరియన్ భార్య.‘‘పని ఎక్కువగా ఉంది’’ అని తన గదిలోకి, అక్కడి నుంచి స్నానానికి వెళ్లిపోయాడు చెరియన్. పిల్లలిద్దరూ నిద్రపోయారు. రాత్రి పన్నెండు కావస్తోంది. ‘‘భోజనం వడ్డించాను. రండి’’ అంది భార్య. ‘‘ఊరెళ్లాలి అంటున్నావ్ కదా. రేపు వెళ్తారా నువ్వూ, పిల్లలు’’ అన్నాడు భోం చేస్తూ. ‘‘రేపా! ఒక్క రోజులో అన్నీ సర్దుకోలేనండీ ’’ అంది భార్య.‘‘సరే.. ’’ అన్నాడు. ‘‘నిద్రొస్తోంది. వెళ్లి పడుకుంటాను’’ అందామె.. భర్త భోజనం పూర్తయ్యాక. తర్వాత తనూ వెళ్లి పడుకున్నాడు. పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు. అతడి కళ్లల్లో భగవాన్ మెదులుతున్నాడు.
టక్.. టక్.. టక్.. ఎవరో తలుపు తడుతున్నారు. టైమ్ చూశాడు చెరియన్. ఒంటి గంట దాటుతోంది. టక్ టక్.. టక్ టక్.. టక్.. తలుపు చప్పుడు ఎక్కువైంది. కనీసం ఉదయం వరకైనా పోలీసులు తనకు టైమ్ ఇస్తారనుకున్నాడు!లేదా.. భగవాన్ మనుషులు అయి ఉంటారు.మెల్లిగా పైకి లేచి, రివాల్వర్ తీసుకున్నాడు. తలుపు దగ్గరకు వెళ్లి ఒక్క క్షణం ఆగి, తలుపు తెరిచాడు. ఒక్కసారిగా షాక్ తిన్నాడు.ఎదురుగా.. భ.. గ.. వా.. న్!!!‘‘ప్ఛ్.. తొందరపడ్డావు చెరియన్’’ అన్నాడు భగవాన్. ‘‘నేను తొందరపడ్డం కాదు భగవాన్. నువ్వే ఆలస్యం చేశావ్.. నా డబ్బు నాకు ఇవ్వకుండా..’’అన్నాడు ధైర్యం తెచ్చుకుని.ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడుతున్నట్లుగానే ఉంది వాళ్ల సంభాషణ.‘‘దేవుడితో పోరాడుతూ నీ దగ్గరికి వచ్చాను చెరియన్. ఇదిగో, నీ ఉంగరం. నన్ను షూట్ చేస్తున్నప్పుడు పడిపోయింది. ఉంగరం మీద జీసెస్ ఉన్నాడు కదా... పట్టుకోలేకపోయాను. పైన పేరు వేయించుకున్నావ్. ఈజీగా దొరికిపోయేవాడివి. అందుకే ఎవరికీ దొరక్కుండా తెచ్చేశాను’’ అన్నాడు భగవాన్. తన వేళ్ల వైపు చూసుకున్నాడు చెరియన్. నిజమే. ఉంగరం పడిపోయింది! ‘‘ఒకటి కనుక్కున్నాను చెరియన్’’ అన్నాడు భగవాన్.. ఉంగరం ఇచ్చేశాక కూడా అక్కడి నుంచి కదలకుండా! మానవజన్మపై ప్రీతి అతడిని వదులుతున్నట్లు లేదు. ‘‘మనం తొందరపడినా, ఆలస్యం చేసినా.. బతుకును మాత్రం కోల్పోకూడదు.. కనీసం భార్యాబిడ్డల కోసమైనా. ఆ విషయం నాకు చనిపోయాక తెలిసింది’’ అని గాలిలోకి లేచాడు భగవాన్. లోపలికొచ్చాడు చెరియన్. భార్యాబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అవతలి వైపు భార్యాబిడ్డలు గుర్తొచ్చారు అతడికి.
- మాధవ్ శింగరాజు
భార్యాబిడ్డలు
Published Sun, Jul 22 2018 12:36 AM | Last Updated on Sun, Jul 22 2018 12:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment