నూరు, నూట పాతికేళ్ల పాటు మనుషులు బతికుండటం అనేది పెద్ద ఆసక్తికరమైన సంగతేం కాదు. ఆ నూరూ, నూటపాతికేళ్ల వాళ్లు చనిపోయినప్పుడే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. ఇన్నేళ్లు బతికారా అని! అదీ పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. ఊరికే ఆశ్చర్యం.
ఆ బంగళా వయసు నూటా ముప్పై ఏళ్లకు పైగానే. అన్నేళ్లపాటు ఒక మనిషి బతికి ఉన్నారంటే ఆ మనిషిని చూడాలని వెళ్లేవారు ఎవరైనా ఉంటే ఉంటారేమో కానీ.. ఒక బంగళా అన్నేళ్ల నుంచీ ఉందంటే ఆ బంగళా లోపలికి వెళ్లి, లోపలంతా ఒకసారి చుట్టి రావాలని అనిపించకుండా మాత్రం ఎవరికీ ఉండదు. మానవ జీవనంలో లేని ఆసక్తి మానవ నిర్మాణంపై ఉండడం సహజమే. అది ప్రభుత్వ బంగళా. బ్రిటిష్ ప్రభుత్వం కట్టించిన ఆ బంగళాను, మన ప్రభుత్వం వాడుతోంది. అది కూడా ప్రభుత్వ కార్యాలయంగా వాడడం లేదు. బదలీ అయి వచ్చే కలెక్టర్‌ల నివాసగృహంగా వాడుతోంది. ప్రజలు ఎవరైనా బంగళాను బయటి నుంచి చూసి వెళ్లిపోవడమే కానీ, లోపలికి వెళ్లి కలియదిరగడానికి లేదు. అలాంటి బంగళా ఇప్పుడు అకస్మాత్తుగా స్థానికుల్లో, చుట్టపక్కలవాళ్లలో ఆసక్తి రేకెత్తించింది! అందుకు ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి.. ఓ ఎంగ్ అండ్ డైనమిక్ మహిళా కలెక్టర్ ఆ బంగళాలోకి దిగడం. ఇంకొకటి.. ఆ బంగళాలో దెయ్యం తిరుగుతోందని ఆ కలెక్టరమ్మతో.. ఆ బంగళాలో పనిచేసేవారెవరో అనడం!
బంగళాలో దెయ్యం ఉందని పనివాళ్లలో ఒకరు మొదట అన్నప్పుడు.. ఆ కలెక్టరమ్మ పెద్దగా నవ్వారు. ‘‘నీకెలా తెలుసు జంగయ్యా.. బంగళాలో దెయ్యం ఉందనీ!’’.. నవ్వును ఆపుకుంటూ అడిగారు కలెక్టరమ్మ. బంగళాలో దెయ్యం ఉందని చెప్పిన మనిషే జంగయ్య. ‘‘ఉందమ్మా.. పైన రూమ్‌లో ఉంది. నా భార్య కూడా చూసింది. నా భార్య రూమ్ సాఫ్ చేస్తుంటే వచ్చి దాని మెడ పట్టుకుంది’’ అన్నాడు జంగయ్య. కలెక్టరమ్మ ఈసారి నవ్వలేదు. నవ్వీ నవ్వనట్లు ఊరుకున్నారు. ‘‘సర్లే.. జాగ్రత్తగా ఉందాం’’ అని మాత్రం అన్నారు.‘‘దెయ్యాల దగ్గర జాగ్రత్త ఏంటమ్మా.. దెయ్యాలు దెయ్యాలే. మనుషులం మనుషులమే’’ అన్నాడు జంగయ్య.
ప్రెస్ మీట్‌లో అంతా కలెక్టరమ్మ చుట్టూ చేరారు. అది కలెక్టరమ్మ ఏర్పాటు చేసిన మీట్ కాదు. ప్రెస్ మీట్ కోసం కలెక్టరమ్మను ఒప్పించిన మీట్. కొత్త కలెక్టర్.. జిల్లాలో ప్రభుత్వ పథకాలను ఎలా అమలు చేయబోతున్నారో.. ప్రజలకు ఎలా చేరువ అవబోతున్నారో చెప్పే ‘గెట్ టుగెదర్’ లాంటి మీట్. మీడియా ప్రతినిధులు కలెక్టరమ్మను ప్రశ్నలు అడుగుతున్నారు. మీడియా కెమెరాలు కలెక్టరమ్మ నవ్వును, కలెక్టరమ్మ చీరకట్టును, కలెక్టరమ్మ కంఠం కింది అందమైన ఉడెన్ జ్యుయలరీని, ఆ ఉడెన్ జ్యుయలరీకి ఉన్న ఉడెన్ లాకెట్‌నీ, ఆహ్లాదకరమైన ఆమె హావభావాల్ని షూట్ చేస్తున్నాయి. మీడియా ప్రశ్నలకు కలెక్టరమ్మ సమాధానాలన్నీ అయ్యాక.. టీ–బిస్కెట్ సెషన్‌లో.. ‘‘ఏలా ఉంది మేడమ్.. ఈ బంగళా! మీకు కంఫర్ట్‌గా ఉందా?’’ అని ఓ ప్రతినిధి అడిగారు. వెంటనే జంగయ్య గుర్తుకొచ్చాడు కలెక్టరమ్మకు. ‘‘నా కంఫర్ట్ కోసం ప్రభుత్వం నన్నిక్కడ ఉంచలేదు. ప్రజల కంఫర్ట్ చూడ్డానికి ఉంచింది’’ అని నవ్వారు కలెక్టరమ్మ. ‘‘అది నిజమే. కానీ మీరు కంఫర్ట్‌గా ఉంటేనే కదా.. ప్రజలు కంఫర్ట్‌గా ఉండేది’’ అని ఇంకో ప్రతినిధి అన్నారు. ‘‘ప్రజా ప్రతినిధులు తమ కంఫర్ట్ చూసుకోకుండా ప్రజల కోసం పని చేస్తున్నప్పుడు.. ప్రజాసేవకులమైన మేమూ అలాగే ప్రజల కోసం పని చేయాలి కదా.. కంఫర్ట్ చేసుకోకుండా’’.. నవ్వుతూ చెప్పారు కలెక్టరమ్మ. ‘‘అంటే.. మీరిప్పుడు కంఫర్ట్‌గా లేరనేనా.. ఈ బంగళాలో’’.. మరో ప్రతినిధి. కలెక్టరమ్మ ఆశ్చర్యపోయారు.‘‘నేను అలా అనడం లేదు. ప్రజల్ని కంఫర్ట్‌గా ఉంచడమే మా డ్యూటీ అంటున్నాను’’ అన్నారు. ‘‘ప్రజల్ని కాసేపు పక్కన పెడదాం మేడమ్. స్ట్రయిట్‌గా చెప్పండి. ఈ బంగళాలో మీరు ధైర్యంగా ఉండగలుగుతున్నారా?’’ ఇంకో ప్రశ్న. కలెక్టరమ్మ నవ్వారు. ‘‘నేననుకోవడం ఏంటంటే.. మీరే స్ట్రయిట్‌గా నన్ను అడగదలచిన ప్రశ్నను అడగలేకపోతున్నారు. అసలు ధైర్యం అనే మాట ఎందుకొచ్చింది?’’ అన్నారు. ‘‘బంగళాలో దెయ్యం తిరుగుతోందని..’’ అన్నారా ప్రతినిధి!ఆ మాటకు పెద్దగా నవ్వారు కలెక్టరమ్మ. ఆమెకు మళ్లీ జంగయ్య గుర్తుకొచ్చాడు. ‘‘అవును. ఉందని అంటున్నారు’’ అన్నారు నవ్వుతూ.అక్కడితో మీట్ ముగిసింది.
ఇలా మీట్ ముగియగానే అలా టీవీ చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ మొదలైంది.‘కలెక్టర్ బంగళాలో దెయ్యం’‘దెయ్యానికి భయపడుతున్న యువ కలెక్టర్’‘ఉంటారా? ఖాళీ చేస్తారా?’‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా?’బ్రేకింగ్‌లతో పాటే.. ‘దెయ్యాలున్నాయా? లేవా?’ అనే డిబేట్. డిబేట్‌లో ఘన విజ్ఞాన వేదిక (ఘ.వి.వే) చాలెంజ్. ‘‘కలెక్టర్ అయ్యుండీ.. ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచి పోషిస్తారా! అంత చదువు చదివి ఏం లాభం? అంత ఉద్యోగం చేస్తూ ఏం ప్రయోజనం? కలెక్టర్ గారి బంగళాలో దెయ్యం ఉందని నిరూపిస్తే.. ఇరవై ఐదు లక్షల రూపాయలిస్తాం. ఒక్కరాత్రి బంగళాలో ఉండేందుకు అనుమతి ఇవ్వండి చాలు. దెయ్యాలు లేవని మేము రుజువు చేస్తాం..’’ డిబేట్‌లో ఆవేశంగా చెప్పుకుపోతున్నారు ఘ.వి.వే. అధ్యక్షుడు. టీవీ చూస్తున్న కలెక్టరమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బంగళాలో దెయ్యం ఉందని, ఆ దెయ్యానికి తను భయపడుతున్నానని తనెప్పుడు చెప్పిందో ఆమెకు అర్థం కాలేదు. ‘దెయ్యం ఉందట కదా’ అని వాళ్లు అంటే, ‘ఉందని అంటున్నారు’ అనే కదా తను వాళ్లతో అన్నది! అది కూడా నవ్వుతూ అన్న మాటే.లైఫ్‌లో మొదటిసారి దెయ్యం అంటే భయమేసింది కలెక్టరమ్మకు. బంగళాలో ఉందని జంగయ్య చెప్పిన దెయ్యానికి కాదు ఆమె భయపడింది. తన మాటల్ని వక్రీకరించిన దెయ్యానికి! ఘ.వి.వే. అధ్యక్షుడి మాటలు కూడా కలెక్టరమ్మకు ఆశ్చర్యంగా అనిపించాయి. లేవని నిరూపిస్తారట!! దెయ్యాలు ఉన్నాయని నమ్మని వారు.. పనిగట్టుకుని వచ్చి దెయ్యాలు లేవని నిరూపించవలసిన అవసరమేంటి?నవ్వుకున్నారావిడ.
- మాధవ్ శింగరాజు
కలెక్టర్ బంగళా
Published Sun, Sep 2 2018 12:46 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment