కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు. బెంచీలలో మనుషులు కూర్చునే చోట నిండా మనుషులు ఉండడం కోర్టు హాలు నిశ్శబ్దంగా లేకపోవడానికి కారణం కాదు. అక్కడెవ్వరూ లేరు. జడ్జీకి, నిందితుడికి మధ్య వాదన లాంటిది జరుగుతోంది. అందుకే కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు. ముందే జడ్జి నుంచి అనుమతి తీసుకుని మాట్లాడుతున్నాడు బలిష్ట. ‘‘మీరు ప్రశ్నలు అడిగితే నేను సమాధానం ఇవ్వడంలో నాకు ఆసక్తి లేదు. మీరే ప్రశ్నలు వేసుకుని, మీరే సమాధానాలు చెప్పుకుని, మీరే నాకు శిక్ష వేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు. పోయే చోటకే పోతాను’’ అన్నాడు బలిష్ట. అతడు ఆ మాట అన్నప్పుడు జడ్జి వింతగా చూశాడు. ‘‘బాబూ, భారతీయ శిక్షాస్మృతి అని ఒకటి ఉంటుంది. అన్నీ ఆ స్మృతి ప్రకారమే ఇక్కడ జరుగుతాయి. నువ్వు శిక్షను అంగీకరించకుండా, నీ నేరం రుజువు కాకుండా నిన్ను చట్టం శిక్షించడానికి లేదు’’ అన్నాడు. ‘‘ఎలాంటి విచారణ లేకుండానే నేను నా నేరాన్ని అంగీకరించడానికి సిద్ధమై వచ్చాను జడ్జిగారూ. అయితే మీ కోర్టులు నిందితుడు నేరం చేశాడా లేదా అన్నంత వరకే చూసి, లంచ్‌కి వెళ్లిపోతాయి.లేదా, హాలిడేస్‌కి వెళ్లిపోతాయి. ఆ తర్వాత బలిష్ట అనేవాడు ఏమైపోయాడన్నది ఈ న్యాయస్థానానికి అవసరం లేని విషయం. నా అభ్యర్థన ఏంటంటే.. ఈ నేరాలన్నీ నువ్వే చేశావా అని కాకుండా, ఈ నేరాలన్నీ నువ్వెందుకు చేశావు? అని మీరు నన్ను అడగాలని నా ఆశ. అందుకు నేను సమాధానం చెప్పాలని నా ఆకాంక్ష. ఇవన్నీ కుదరవు అనుకుంటే.. శిక్ష విధించి జైలుకో, ఉరికంబానికో పంపించేయండి. నాకేం భయాలు, భీతులు, చింతనలు లేవు’’ అన్నాడు బలిష్ట చేతులు కట్టుకునే నిలబడి.
జడ్జి బలిష్ట వైపు పరిశీలనగా చూశాడు. పేరుకు తగ్గట్టు లేడు బలిష్ట. పీలగా ఉన్నాడు. పీలగా ఉన్నవాడొకడు ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేంత బలంగా ఉన్నాడంటే.. వ్యవస్థ ఎక్కడో బలహీనంగా ఉందని వాడు కనిపెట్టగలిగాడని! జడ్జి నవ్వాడు. కోర్టు హాల్లో గానీ, కోర్టు బయట గానీ జడ్జిలు నవ్వినట్లు న్యాయ చరిత్రలో ఎక్కడా లేదు. కానీ ఈ జడ్జి నవ్వాడు. ‘‘ఈ నేరాలన్నీ నువ్వెందుకు చేశావో తెలుసుకుని నీలో పరివర్తన తెచ్చేందుకు కోర్టుకు తగిన సమయం ఉండదు. తర్వాతి కేసు రెడీగా ఉంటుంది. ఒకవేళ సమాజంలో అందరూ ధర్మబద్ధంగా నడుస్తూ, ‘ఇవాళైనా ఒక కేసు వస్తే బాగుండు’ అని జడ్జీలు కేసుల కోసం ఎదురు చూసే ఒక కాలం ఓ వెయ్యేళ్ల తర్వాత వచ్చినా.. అప్పుడు కూడా దోషిని నిలబెట్టో, కూర్చోబెట్టో కౌన్సెలింగ్ ఇచ్చే బాధ్యత కోర్టులది కాదు. అందుకు వేరే విభాగాలు ఉంటాయి. సరే, నువ్వు కోరుకున్నట్లుగా ఇప్పుడు నేను నిన్నేం ప్రశ్నలు వేయలేను గానీ, నువ్వు నన్ను ఈ కోర్టు హాలులో ప్రశ్నించే అవకాశం ఇవ్వగలను. నిన్ను అడగందే సమాధానం తెలియనంత ప్రశ్నలు నిన్ను అడగడానికి నా దగ్గర ఏముంటాయి చెప్పు? అయితే నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మాత్రం ఇవాళ నేను కోర్టు సమయాన్ని వినియోగమో, దుర్వినియోగమో చేయదలచుకున్నాను’’ అన్నాడు నవ్వుతూ జడ్జి. బలిష్ట రెండు చేతులు ఎత్తి జడ్జికి నమస్కరించాడు. ‘‘మిమ్మల్ని ప్రశ్నించేంతటి వాడిని కాదు. నన్ను మాట్లాడ్డానికి అనుమతించినట్లే.. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి చాలు’’ అన్నాడు బలిష్ట. అలా.. వాళ్లిద్దరి మధ్యా మాటలు మొదలవడంతో కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు.
‘‘జడ్జిగారూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నానని నాపై అభియోగం. అంటే చట్టం చేయవలసిన పనిని నేను చేశానని. చట్ట ప్రకారం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమే. అయితే నేను చేసిన పనికి నన్ను ప్రేరేపించిన పని చట్టంలో నేరంగా పరిగణన పొందడం లేదు కనుక, నేను చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకున్నట్లు కాదు. చట్టమే నేరాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదని నేను అభిప్రాయపడ్డాను. అందుకే ఒక్కొక్కరి మోకాళ్లూ విరగ్గొడుతూ వచ్చాను.’’ అన్నాడు బలిష్ట. జడ్జి వింటున్నాడు. ‘‘జడ్జి గారూ.. మన సమాజంలో హత్య నేరం. ఆత్మహత్య నేరం. అత్యాచారం నేరం. దొంగతనం నేరం. అవినీతి నేరం. అక్రమం నేరం.దాడి జరపడం నేరం. నేను మోకాళ్లు విరగ్గొట్టిన ఆ ఆరుగురో, ఏడుగురో ఈ నేరాలేవీ చేయలేదు కనుక, ఇంకా చట్టం లిస్టులో ఉన్న నేరాలేవీ వాళ్లు చేయలేదు కనుక.. పోలీసులు గానీ, న్యాయస్థానం గానీ.. వాళ్లను నేరస్థులుగా కాకుండా, వాళ్ల మోకాళ్లను విరగ్గొట్టిన నన్ను నేరస్థుడిగా పరిగణించడం అంటే.. చట్టం నాకు ప్రసాదించిన ‘జీవించే హక్కు’ను నా పక్కన ఉన్నవాడు హరిస్తూ ఉన్నప్పుడు కూడా మౌనంగా భరిస్తూ ఉండమని చట్టం చెప్పినట్లే కదా. నా జీవించే హక్కును నేను కాపాడుకునే ప్రయత్నంలో.. నాలాగే ఇంకెందరికో చట్టం ఇచ్చిన జీవించే హక్కును కాపాడే ప్రయత్నంలో నాకు తెలియకుండానే, పట్టలేని కోపంలో.. మోకాళ్లు విరగ్గొట్టానని చట్టం అర్థం చేసుకోలేదా’’ అని అడిగాడు బలిష్ట.
కోర్టు హాల్లో బలిష్ట మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. అతడివైపే రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు జడ్జి. ‘‘కానీ అబ్బాయ్.. సినిమా థియేటర్‌లో నీ వరుసలో కూర్చొని ఉన్నవాడు కాళ్లూపుతూ కూర్చున్నాడని, ఏదో ఆఫీస్‌లో ఎవరో నీకు కాళ్లూపుతూ సమాధానం చెప్పాడని, హోటల్‌లో ఎవరో కాళ్లూపుకుంటూ తింటున్నాడని, అసలు నీకు సంబంధమే లేని వారెవరెవరో, ఎక్కడెక్కడో నీకు దగ్గరగానో, నీకు దూరంగానో కాళ్లూపుకుంటూ నీకు కనిపించారని కోపం తెచ్చుకుని వెళ్లి.. వాళ్ల కాళ్లు, మోకాళ్లు విరగ్గొట్టడం నేరమే కదా! జీవించే హక్కు నీకెలాగైతే ఉందో, వాళ్లకూ.. వాళ్లకు ఇష్టమైన విధంగా జీవించే హక్కు ఉండదని ఎలా అనగలం?’’ అన్నాడుజడ్జి. ‘‘కానీ జడ్జిగారూ.. ఒకరి జీవించే హక్కు.. ఇంకొకరి జీవించే హక్కుకు భంగం కలిగించకూడదు కదా! నా దృష్టిలో హంతకుడి కన్నా, అత్యాచారం చేసినవాడి కన్నా, దొంగ కన్నా, అవినీతి పరుడికన్నా.. నీచమైన వాడు, హీనమైనవాడు.. ఈ కాళ్లూపుతూ కూర్చునేవాడు! కాళ్లూపుతూ కూర్చున్నాడంటే వాడికి మంచీ మర్యాద లేదని. సంస్కారం లేదని. వాడికొక ధ్యేయం లేదని. ఒక లక్ష్యం లేదని. ఒక బాధ్యత లేదని. ముఖ్యంగా మనుషులంటే గౌరవం లేదని. వాడసలు సరిగా పెరగలేదని. అలాంటి వాడిని శిక్షించే సెక్షన్ మన చట్టంలో లేదని. పబ్లిక్‌లోనే కాదు, పెళ్లాం పిల్లల ముందు కూడా కాళ్లూపడం నేరమే అని ఒక చట్టం తెండి. ఈ కాళ్లూపే దరిద్రులంతా దారికొస్తారు’’ అన్నాడు బలిష్ట. ‘‘ద్రవ్యోల్బణం మన దరిద్రం కాదు జడ్జిగారూ. కాళ్లూపడం మన దరిద్రం’’ అని కూడా అన్నాడు. జడ్జి అతడి వైపు చూశాడు. అతడు జడ్జివైపు చూశాడు. ‘‘ఆగావేం చెప్పూ’’ అన్నట్లు చూశాడు జడ్జి. ‘‘చెప్పడానికేం లేదు’’ అన్నట్లు చూశాడు బలిష్ట. ‘‘అలా చూస్తున్నావేం’’ అని అడిగాడు జడ్జి.బలిష్ట మాట్లాడలేదు. కేసు తర్వాతి రోజుకు వాయిదా పడింది. బలిష్ట వెళ్లిపోయాడు.అయితే ఆ తర్వాతి రోజు జడ్జిగారు కోర్టుకు రాలేదు. ముందురోజు రాత్రి ఎ.. వ.. రో.. ఆయన కాళ్లు విరగ్గొట్టారు!ఆ తర్వాతెప్పుడూ బలిష్ట ఏ వాయిదాకూ రాలేదు. ఏమైపోయాడో ఎవరికీ తెలీదు! కోర్టు హాల్లో ఎవరైనా కాళ్లూపుతున్నప్పుడు మాత్రం.. జడ్జిగారు భయంతో ‘‘ఆర్డర్.. ఆర్డర్’’ అంటుండేవారు. ఆయన అలా ఎందుకు అంటుండేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు.
- మాధవ్ శింగరాజు
బలిష్ట
Published Sun, Sep 30 2018 1:14 AM | Last Updated on Sun, Sep 30 2018 1:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment