అబ్బబ్బో మా డబ్బా టాకీసు! | funday Laughing fun | Sakshi
Sakshi News home page

అబ్బబ్బో మా డబ్బా టాకీసు!

Published Sun, Apr 15 2018 12:05 AM | Last Updated on Sun, Apr 15 2018 12:05 AM

funday Laughing fun - Sakshi

ఎర్రటి ఎండాకాలంలో తప్పక గుర్తుకు వస్తుంది.... విశ్వరూపం. ‘విశ్వరూపం’ అనేది కమలాసన్‌ సినిమా పేరు కాదు... ఒకప్పటి మా ఊరి డబ్బా టాకీస్‌ పేరు. ఓనరు ఏ కాన్సెప్ట్‌తో ‘విశ్వరూపం’ అని తన టాకీస్‌కు పేరు పెట్టుకున్నాడోగానీ... ఆ టాకీస్‌ ప్రేక్షకులకు అక్షరాల విశ్వరూపం చూపించేది.మండే ఎండాకాలంలో మ్యాట్నీ షో.పైన రేకుల వేడి. కింద ఇసుక వేడి. మధ్యలో ‘గిర్ర్‌ర్ర్‌ర్‌ర్‌’ అని తిరిగే పాత సీలింగ్‌ ఫ్యాన్‌లు.‘ఫ్యాన్‌’ అనగా ‘గాలి వీచు సాధనం’. కానీ పైన తిరిగే పాతఫ్యాను రెక్కల నుంచి వేడి వేడి మంటలు వీచేవి. రేకుల వేడి + ఇసుక వేడి+  ఫ్యాన్‌ వేడి = ఇత్తడి.అయినా సరే, ప్రేక్షక మహాశయులకు ఇదేమీ పెద్ద ఇబ్బంది కాదు. అసలు సిసలు ఇబ్బంది.... ఈ ‘కరెంటు’ అనేది ఉంది చూశారు... దాని గురించే.ఆరోజు సినిమా మాంచి రంజులో ఉంది. క్లైమాక్స్‌కు కాస్త ముందు సీన్‌లో ముసలి తండ్రి కొడుకు కళ్లలోకి చూస్తూ ఇలా డైలాగ్‌ కొట్టాడు...‘చూడు రాజా!  ఇన్నాళ్లూ ఒక రహస్యాన్ని నా గుండె గుహలో దాచాను’‘రహస్యమా? ఏమిటది?’ అని మూడు అడుగులు ముందుకు గెంతి... తండ్రిని సూటిగా అడిగాడు కొడుకు.‘నువ్వు నా కొడుకువి కాదు’ అన్నాడు ఆ తండ్రి చుట్ట వెలిగిస్తూ కూల్‌గా.‘నాన్న.... గారూ’ అంటూ చెవులకు చేతులు అడ్డం పెట్టుకొని అరిచాడు రాజా.‘చెవులకు చేతులు అడ్డం పెట్టుకున్నంత మాత్రాన... నిజం అబద్ధమైపోదు మై డియర్‌ రాజా’ చుట్ట పొగను రింగులు రింగులుగా గాల్లోకి వదులుతూ అన్నాడు తండ్రి.‘ఇంతకీ నేను ఎవరి కొడుకును?’ దీనంగా అడుగుతాడు రాజా.‘నువ్వు కలలో కూడా ఊహించని ఆ వ్యక్తి ఎవరంటే...’ అని ఆ తండ్రి చెప్పబోయాడో లేదో..కరెంట్‌ పోయింది!ఎండాకాలంలో వేడి వేడి వర్షం... అది ప్రేక్షక మహాశయుల తిట్ల వర్షం!‘ఒరే నా కొడక ఎయ్యరా సిన్మా’‘ఒరేయ్‌ గాడిద మనవడా... ఎయ్యరా బొమ్మ’ నాన్‌స్టాప్‌గా తిట్లే తిట్లు!

ఈలోపు గేటు పరదా తీసి...‘కరెంటు గంట వరకు రాదు. బయటకొచ్చేయండి’ అని గట్టిగా అరిచాడు గేట్‌కీపర్‌.నానా బూతులు తిట్టుకుంటూ ప్రేక్షక మహాశయులందరూ బయటకు వచ్చారు.గంట గడుస్తుంది.రెండు గంటలు గడుస్తాయి.... అలా గంటలు గడుస్తూనే ఉంటాయి. ఆ టైమ్‌లో డబ్బా టాకీస్‌ స్పోక్స్‌పర్సన్‌ రంగంలోకి దిగి ‘మ్యాట్నీ షో క్యాన్సిల్‌. పాసులు ఇస్తున్నాం. అందరూ రాత్రి ఫస్ట్‌ షోకు రండీ’ అంటూపాసులు పంచుకుంటూ పోయాడు. ఇప్పుడు ఫస్ట్‌ షో సంగతి.ఇంటర్వెల్‌కు ముందు ఒక సీన్‌లో హీరో హీరోయిన్‌ కళ్లలోకి చూస్తూ...‘ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నావు. నీ పేరు కందిపప్పా? అయ్యుండదులే... మరి నీ పేరు ఏమిటి?’ అని అడిగాడో లేదో... ‘చచ్చాన్రో’ అని పెద్దగా సౌండ్‌ వినిపించింది.‘హీరోయిన్‌ పేరు చచ్చాన్రో. చాలా కొత్తగా ఉంది’ అని ఒక ప్రేక్షకుడు తన పక్కన కూర్చున్న ఫ్రెండ్‌ ప్రేక్షకుడితో అన్నాడో లేదో...‘హీరోయిన్‌ పేరా పాడా! ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు’ అన్నాడు ఫ్రెండ్‌ ప్రేక్షకుడు.‘వామ్మో! వాయ్యో! చచ్చాన్రో’ అనే అరుపులు వినిపిస్తున్నాయి.ఇంతకీ ఏం జరిగిందంటే...పైన తిరుగుతున్న శాతవాహనుల కాలం నాటి  పాత సీలింగ్‌ ఫ్యాన్‌ ఒకటి విరిగి ఒక ప్రేక్షక మహాశయుడి నెత్తి మీద పడి తల పగిలింది. దీంతో పెద్ద లొల్లి. బాధితుడికుటుంబసభ్యులతోపాటు చుట్టాలుపక్కాలు, కులసంఘం వాళ్లు రంగంలోకి దిగి టాకీస్‌ ముందు ఆందోళన చేయడం మొదలు పెట్టారు.ఈ దెబ్బకు ఫస్ట్‌ షో కూడా క్యాన్సిల్‌!

శాంతిభద్రతల దృష్ట్యా సినిమా హాలు రెండు రోజులు మూతపడింది. మూడో రోజు...‘ఈ రోజు అయినా హీరోగాడు  ఎవరి కొడుకో తెలుసుకోవాలి’ అనుకున్నారు ప్రేక్షక మహాశయులు. ఆరోజు మ్యాట్నీ షో మొదలైంది... అర్ధగంట గడిచిన తరువాత ఒక కన్నీటిభరిత సీన్‌...‘నాన్నా! నా పెళ్లి చేయడం కోసం కిడ్నీ అమ్ముకున్నావా? త్యాగం చేయడం నీకే కాదు... నీ రక్తం పంచుకొని పుట్టిన నాకూ చేతనవుతుంది... అన్నయ్య కాలేజీ ఫీజు కోసం నేను నా కిడ్నీ అమ్మేసుకున్నాను నాన్నా!’ అని లీటర్‌  కన్నీళ్లతో నాన్న కాళ్ల మీద పడింది కూతురు. ఈలోపు ఆ ఇంటి ఇల్లాలు పరుగెత్తుకొచ్చి...‘‘ఏమండీ ఆ అప్పులవాడు మిమ్మల్ని నానామాటలు అంటుంటే... తట్టుకోలేకపోయాను. అప్పు తీర్చడానికి, మన  ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నా కిడ్నీని అమ్ముకున్నాను’’ అని గొల్లుమంటుంది.ఫ్యామిలికీ ఫ్యామిలీ కిడ్నీలు అమ్ముకున్న ఈ ట్రాజెడీ సీన్‌కు ప్రేక్షకులు భోర్‌మని ఏడ్వక పోగా, భళ్లుమని నవ్వుతున్నారు. డొక్కుటాకీస్‌లో ప్రేక్షకులు మాత్రమే ఉండరు. శ్రీ నల్లులు,  పిల్లులు, కుక్కలు కూడా ఉంటాయి. సినిమా చూస్తున్న మత్తులో ప్రేక్షకులు వీటి ఉనికిని పట్టించుకోరు.ఏడ్చే సీన్‌లో ప్రేక్షకులు పగలబడి ఎందుకు నవ్వారంటే...‘కిడ్నీల సీన్‌’ చూస్తూ కన్నీళ్లు కారుస్తున్న ఒక ప్రేక్షక మహాశయుడి లుంగీని, సీటు కింద ఉన్న కుక్కలాగి బెంచి క్లాసులోకి పరుగులు తీసింది... అక్కడి నుంచి నేల క్లాసుకు పరుగులు తీసి తెర ముందు అటూ ఇటూ పరుగులు తీస్తుంది. మరోవైపు ‘నా లుంగో... లుంగో’ అంటూ అండర్‌వేర్‌ మీద పరుగులు తీస్తున్నాడు బాధితుడు. ఇది చూసి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ఈ ఎపిసోడ్‌ తరువాత కరెంట్‌ పోయింది.ఆరోజంతా రాలేదు! మరుసటి రోజు సినిమా ప్రొజెక్టర్‌ కాలిపోయింది... అది రిపేర్‌ కోసం పట్నానికి వెళ్లింది. రెండు నెలల విరామం. ఆ తరువాత ఏమైందోగానీ.... ఆ డబ్బాటాకీస్‌ మూతపడింది. ఇప్పుడు అక్కడ టాకీస్‌ లేదు. కళ్యాణమండపం ఉంది. దీన్ని చూస్తే డొక్కు టాకీస్‌ గుర్తుకు వస్తుంది. దీంతో పాటు ‘ఇంతకీ ఆ హీరో ఎవరి కొడుకు?’ అనే ప్రశ్న కూడా గుర్తుకు వస్తుంది. మీకేమైనా తెలుసా!!
– యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement