డప్పులగూడెం నుంచి ప్రత్యక్ష ప్రసారం! | funday Laughing fun | Sakshi
Sakshi News home page

డప్పులగూడెం నుంచి ప్రత్యక్ష ప్రసారం!

Published Sun, Jun 10 2018 1:15 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

funday Laughing fun - Sakshi

ప్రపంచ దృష్టంతా జూన్‌ 12 మీదే ఉంది. ఎందుకంటే నిప్పు–ఉప్పులాంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ తొలిసారిగా సింగపూర్‌లో భేటీ అవుతున్నారు. ఈ భేటీ కోసం, ఇచ్చిన మాట ప్రకారం అంతర్జాతీయ జర్నలిస్ట్‌ల సమక్షంలో తమ దేశంలోని అణుకేంద్రాన్ని ధ్వంసం చేశాడు కిమ్‌. ఆ తరువాత ట్రంప్‌ ప్లేటు, చిప్ప మరియు  గిన్నె ఫిరాయించి... ‘భేటీ లేదు గీటీ లేదు’ అని ప్రకటించాడు. ట్రంప్‌ ప్రకటన సంచలనం సృష్టించింది. కిమ్‌తో భేటీని ట్రంప్‌ అర్ధంతరంగా ఎందుకు రద్దు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాలేదు. ఈలోపే ట్రంప్‌ మరో ప్రకటన జారీ చేశాడు.‘మేము సింగపూర్‌లో భేటీ కావాలనుకున్న విషయం ప్రపంచానికి తెలిసిందే. నాలుగు గోడల మధ్య, ఏ.సీ రూముల్లో  కూర్చోవడం అనేది పరమ రోటిన్‌ వ్యవహారం. అందుకే నేను సింగపూర్‌ భేటీని రద్దు చేశాను. ఏసీ రూముల్లో కాకుండా పచ్చటి ప్రకృతి మధ్య అక్కడి ప్రజలతో మమేకం అవుతూ  చర్చలు జరపడం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీనికి కిమ్‌ ఓకే అంటే... ఎప్పుడైనా నేను భేటీకి రెడీ’‘ట్రంప్‌కు మంచి టేస్ట్‌ ఉంది. ఆయన ప్రతిపాదనకు నేను ఓకే చెబుతున్నాను’ అని ప్రకటించాడు కిమ్‌.తమ భేటీకి ‘డప్పులగూడెం’ను ఎంచుకున్నారు ట్రంప్‌–కిమ్‌.మన నల్లమల అడవిని ఆనుకొని చాలా అందంగా ఉండేడప్పులగూడెం పేరు ఆ జిల్లా వాసులకు కూడా తెలియదు. అలాంటి మారుమూల గూడెం పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.

ఆరోజు డప్పులగూడేనికి మొదట ట్రంప్‌ వచ్చాడు. ఆ తరువాత కిమ్‌ వచ్చాడు.డప్పులు కొడుతూ ఇద్దరు ప్రముఖులకు స్వాగతం పలికారు గూడెంవాసులు.‘జుంబారే యే జుంబరే’ అని పాట కూడా పాడారు. ఆ తరువాత...‘‘కిమ్‌... ఈ మామిడిచెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందాం సరేనా!’’ అన్నాడు ట్రంప్‌.‘‘ఓకే అంకల్‌...’’ అని తన సీట్లో కూర్చొని చుట్ట వెలిగించాడు కిమ్‌.‘‘ఒరే సచ్చినోడా... నీ చుట్ట కంపునంతా నేను పీల్చాలా? చుట్ట పక్కనెయ్యి’’  గద్దించాడు ట్రంప్‌.‘‘ఏమయ్యో... మాటలు మర్యాదగా రానివ్వు. నేనేమన్నా నీకు సర్వెంట్‌ను అనుకుంటున్నావా? నేను కూడా నీలాగే ప్రెసిడెంట్‌ని.  నేనసలే కరాటేలో బ్లాక్‌బెల్ట్‌... మూతి మీద ఒక్కట్టిస్తే... ముప్పై రెండు పళ్లు రాలిపోవాలి’’ అని పళ్లు పటపట కొరికాడు కిమ్‌.ఈలోపు ఐక్యరాజ్యసమితి వాళ్లు పరుగెత్తుకు వచ్చారు.‘ఏమండీ పెద్దమనుషులు... ఇలా చిన్న పిల్లల్లా  కీచులాడుకోవడానికేనా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చింది. ప్రపంచం ముందు మీ పరువుపోతుంది’’ అని చివాట్లు పెట్టారు.దీంతో ఇద్దరు సర్దుకున్నారు.‘ట్రంప్‌–కిమ్‌ భాయి భాయి’ అని పెద్దగా నినాదాలు కూడా  ఇచ్చుకున్నారు.టేబుల్‌ మీద ఉన్న చర్చల ఎజెండా కాపీని చేతుల్లోకి తీసుకున్నాడు ట్రంప్‌.ఈలోపు అక్కడికి గూడెం పెద్ద బండన్నదొర వచ్చాడు.‘‘ఇద్దరు సార్‌లకు నమస్తే అయ్యా... నన్ను బండన్నదొర అంటారు. మీరు మీ దేశాలకు ఎలా పెద్దో... నేను మా గూడానికి అలా పెద్ద. నాకు ముగ్గురు కొడుకులయ్యా... చిన్న కొడుకైతే మహా చిలిపి నా కొడుకు... ఎప్పుడూ ఏదో ఒక కొంటెపని చేస్తూనే ఉంటాడు... ఒకప్పుడు వాడి వయసులో నేను కూడా అంతే అనుకో’’ నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉన్నాడు బండన్నదొర.

‘‘మధ్యలా నీ లొల్లి ఏంద్వయ్య... అటు బో’’ కంఠం ఎర్ర చేశాడు కిమ్‌.‘‘అతిథ్యం ఇచ్చిన వాళ్లను అలా కసురుకోకూడదు నాన్నా... తప్పు కదా’’ హితవు పలికాడు  ట్రంప్‌.‘‘ఏది తప్పు... ఏది పప్పు అని డిసైడ్‌ చేయడానికి నువ్వెవడివయ్యా.... ఎండకు ఆరేసిన ప్యాంట్లు ఎత్తుకుపోయి అమ్ముకునే  ఫేసూ... నువ్వూనూ... బస్తీమే సవాల్‌.... ఇది అమెరికా కాదు... డప్పులగూడెం...ఇక్కడ నీ డామినేషన్‌ ఏంద్వయ్య’’ అని నాలిక మడతేశాడు కిమ్‌.మళ్లీ ఐక్యరాజ్య సమితి వాళ్లు పరుగెత్తుకు వచ్చారు.ఇద్దరికి సర్ది చెప్పడంతో సైలెంటైపోయారు.‘స్నేహాని కన్నా మిన్నా లోకాన లేదురా’ అని పాట అందుకున్నారు.‘‘ఈ పెద్దమనుషులిద్దరిని ఏకాంతంలో వదిలేద్దాం... ఇక్కడ ఒక్క పురుగు కూడా కనిపించడానికి వీలులేదు’’ అనడంతో ఎటు వాళ్లు అటు వెళ్లిపోయారు. ఇద్దరు మాత్రమే మిగిలిపోయారు.‘‘అంకల్‌... మీకెంత మంది పిల్లలు?’’ అడిగాడు కిమ్‌.‘‘నాకెంతమంది పిల్లలు, నీకెంతమంది భార్యలు అని తెలుసుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. ప్రపంచశాంతి గురించి  మాట్లాడుకోవడానికి  వచ్చాం. అవసరమైతే ఈ ప్రపంచం కోసం మన ప్రాణాలనుతృణప్రాయంగా అర్పిద్దాం. భయం అనేది మన డిక్షనరీలోనే  ఉండకూడదు’’  ఉపదేశించాడు ట్రంప్‌.‘‘భయం గురించి నువ్వు నాకు చెబుతున్నావా? నా పేరు వింటే చాలు భయానికి నాన్‌స్టాప్‌గా మోషన్స్‌ అవుతాయి.... నేను నీలా పిరికి గొడ్డును కాదు’’ అంటూ మూతి మీద చెయ్యి వేసి తిప్పబోయాడుకిమ్‌.‘‘లేని మీసాన్ని ఏం తిప్పుతావుగాని... నువ్వొక పిరికి సన్నాసివి, ఎలుక చప్పుడుకు కూడా భయపడతావు. నా ధైర్యం గురించి ఇక్కడ ఏ చెట్టును అడిగినా చెబుతుంది’’ అన్నాడు ట్రంప్‌.‘నువ్వు పిరికి వాడివి అంటే... కాదు నువ్వు పిరికి వాడివి’ అని ఒకరినొకరుతిట్టుకుంటున్న సమయంలో...‘గాండ్రు... గాండ్రు’ అని శబ్దం వినిపించింది.భయంతో ఇద్దరికీ  ఊపిరాడలేదు.‘గాండ్రు... గాండ్రు’ అనే శబ్దం మరింత పెద్దదైంది.అంతే!‘ఓరి నాయనో పులి’ అంటూ చెరో దిక్కు పారిపోయారు.‘ఎందుకైనా మంచిది’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా చెరో చెట్టు ఎక్కే ప్రయత్నం చేశారు. వారి బరువు ధాటికి ఆ చెట్లు వేళ్లతో సహా కుప్పకూలిపోయాయి.పాపం చెట్లు!‘పులిలా అరిస్తే... భయపడి పారిపోయారు’ అని కడుపు పట్టుకుని తెగ నవ్వుతున్నాడు బండన్నదొర చిన్నకొడుకు!!
 – యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement