2023
అమెరికన్ స్పేస్–ట్రావెల్ కంపెనీ ‘స్పేస్–ఎక్స్’ తొలి ప్రైవేట్ ప్యాసింజర్‌ను చంద్రుడి పైకి పంపింది. ఆ ప్యాసింజర్ పేరు యుసకు మాయిజవా. జపాన్ బిలియనీర్. ఈ యుసకు భూమి మీద ల్యాండయ్యాడో లేదో కనిపించిన టీవీ స్టూడియోల్లోకి దూరి ‘ఆహా చంద్రమండలం’ ‘ఓహో చంద్రమండలం’ అంటూ స్పీచ్‌లు మొదలుపెట్టాడు. ఇల్లు దాటి ఎప్పుడూ పక్క ఊరికి పోనివారు కూడా యుసకు స్పీచ్‌లు విని తెగ ఇదై పోయారు. జీవితంలో ఒక్కసారైనా చంద్రుడి మీదికి వెళ్లి రావాలని కలలు కన్నారు. కానీ ఏం లాభం? యుసకులాంటి బిలియనీర్లకు తప్ప సామాన్యులకు ‘స్పేస్–ఎక్స్’ ధరలు అందుబాటులోకి లేవు.
2025
బిలియనీర్లు, మిలియనీర్లకే కాదు సామాన్యజనానికి కూడా ధరలు అందుబాటులోకి తెచ్చి చారిత్రక విప్లవానికి శ్రీకారం చుట్టింది స్పేస్–ఎక్స్.అదిగో ఆ ఊళ్లో ఏదో అలికిడి అవుతుంది. ఒక్కసారి లుక్కేద్దామా మరీ...‘‘ఏం ఎంకయ్య మామా, ఏటో పయనమైనట్లున్నావు’’‘‘నాకు ఒక్కగానొక్క కూతురు అనే విషయం నీకు తెలుసుకదరా అల్లుడు..’’‘‘ఎటు వెళుతున్నావో చెప్పరా మామా అంటే, నాకు ఒక్కగానొక్క కూతురు అంటావేమిటి నీ యెంకమ్మ. చెవుడుగానీ వచ్చిందా ఏమిటి?’’‘‘నీకు తొందరెక్కువ, ఆగెహే. నేను చెప్పేది ఓపిగ్గా విను. నా ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా చేశాను అనే విషయం నీకు తెలుసు కదా. నువ్వు అడిగినంత కట్నం ఇస్తాను కోరుకో అల్లుడు అని అల్లుడుగారికి బంపర్ ఆఫర్ ఇచ్చాను. ‘నీ కట్నం ఎవరికి కావాలి! నన్ను చంద్రుడి మీదికి పంపించు చాలు’ అని కోరాడు. రెండు సంవత్సరాల క్రితం కోటీశ్వరులకు తప్ప మనలాంటోళ్లకు చంద్రుడిపైకి వెళ్లే అవకాశం లేనేలేదు. అందుకే తరువాత చూద్దాంలే అల్లుడు అని వాయిదా వేశాను. ఇది దృష్టిలో పెట్టుకొని పోయిన ఏడాది సంక్రాంతికి ఆయన మా ఇంటికి రాలేదు, అమ్మాయిని కూడా పంపలేదు. ఎలారా దేవుడా అని తెగ బాధ పడుతుండగా స్పేస్–ఎక్స్ ధరలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చిన తీపి వార్త తెలిసింది. ఇప్పుడు ఒక్కసారేమిటి? సంవత్సరానికి ఆరుసార్లు అల్లుడిని చంద్రుడి పైకి పంపించగలను. రేపే మా అల్లుడి చంద్రమండల యాత్ర. అందుకే పట్నం వెళుతున్నాను’’(సరిగ్గా ఆరు నెలల మూడు రోజుల తరువాత...)
‘‘ఏం మామా, దిగులుగా కూర్చున్నవ్? మీ అల్లుడిని చంద్రుడి మీదికి పంపాలనేది నీ ఏకైక కోరిక. అది కూడా నెరవేరింది కదా. ఇంకా దిగులెందుకు?’’‘‘ఏం చంద్రయాత్రో ఏమో...మా అమ్మాయి కాపురం బుగై్గపోయింది’’‘‘ఏమైంది మావా?!’’‘‘మా అల్లుడు చంద్రుడిపైకి వెళ్లి ఆరునెలలు దాటింది. రెండు నెలలు తిరక్కుండానే రావాల్సిన వాడు ఆరునెలలైనా రాకపోయేసరికి ఆందోళన మొదలైంది...’’‘‘ఏదైనా ప్రమాదం జరిగిందా ఏమిటి?’’ ‘‘ప్రమాదమా పాడా! ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ చంద్రమండలం అధికారులతో మాట్లాడితే అల్లుడిని మాతో మాట్లాడించారు. కోషియా మూడుమాజియా అనే కొరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, చావైనా బతుకైనా ఆమెతోనే అన్నాడు అల్లుడు. మీ పెళ్లిని నేను ఆమోదిస్తున్నాను...ముందైతే భూమి మీదికి రావయ్యా మగడా అన్నాను. ‘నేనేమన్నా చెవిలో రాకెట్ పెట్టుకున్నాననుకుంటున్నావా! భూమి మీదికి రాగానే మా ఇద్దరినీ విడదీయాలనేదే కదా నీ రావుగోపాల్‌రావు ప్లాను. నేను రాను గాక రాను. కూలో నాలో చేసుకొని మేమిద్దరం ఇక్కడే బతుకుతాం’ అన్నాడు గట్టిగా.ఇక ఆరోజు నుంచి రాత్రి కాగానే మా అమ్మాయి ఇంటి నుంచి పరుగెత్తుకు రావడం, ఆకాశంలో చందమామను చూస్తూ...‘చందమామ రావేనా మొగుడిని తేవే’ అని శోకాలు తీస్తూ పాడటం.దాని పాటలు వినలేక ఛస్తున్నాననుకో!’’
మరో ఊళ్లో...
‘‘ఏంటయ్యా కోటేశ్వర్రావు అలా నెత్తి మీద వైట్‌క్లాత్ వేసుకొని ఏడుస్తున్నావు?’’‘‘చంద్రుడి మీద అడుగు మోపితే నీ ఆస్తులు రెట్టింపు అవుతాయని ఒక జ్యోతిష్యుడు చెబితే ఛలో చంద్రమండలం అంటూ పరుగులు తీశాను. అక్కడికి వెళ్లాక అర్థమైంది....’’‘‘ఏమైంది?’’‘‘నీకు మొదటి నుంచి చెప్పాలి. చంద్రమండలంలోని ముఖ్యమైన ప్రాంతాలను మన ఇండియన్ కంపెనీ ‘మస్కా’కు కాంట్రాక్ట్ ఇచ్చారట. ఈ ‘మస్కా’వాళ్లు అక్కడ తమ తడాఖా చూపిస్తున్నారు. బిగ్ ఫాల్కాన్ రాకెట్‌లో నుంచి చంద్రుడిపై అడుగుపెట్టగానే... ఆహా! ఎంత అందంగా ఉంది ఈ చంద్రలోకం అన్నాను అక్కడ కనిపించిన వాడితో. ఓకే సార్ అని ఒక చీటీ చేతిలో పెట్టాడు. అందులో 33 డాలర్లు అని ఉంది. మన ఇండియన్ కరెన్సీలో 2,490 రూపాయలన్నమాట. ఎందుకు ఇది? అని అడిగితే...హియరింగ్ ట్యాక్స్. ఈలోకంలో ఏది వృథాగా వినరు. ట్యాక్స్ ఉంటుంది... అని చెప్పాడు. ఆ తరువాత... చంద్రమండలంలో ఒక వీధిలో నడిచి నడిచి ఫుట్‌పాత్‌పై ఉన్న ఒక బెంచిపై కూలబడ్డాను. ఇంతలో నా దగ్గరకు ఒక ఆఫీసర్ వచ్చి రసీదు చేతిలో పెట్టాడు. 249 డాలర్లు అని ఉంది. అనగామన ఇండియన్ కరెన్సీలో 18,290 రూపాయలు. ‘ఎందుకు?’ అని గట్టిగా అరిచాను. ‘ఇక్కడ ఫ్రీగా కూర్చోవడం కుదరదు. బెంచి ట్యాక్స్ ఉంటుంది’ అన్నాడు. ఆ ట్యాక్స్ కూడా కట్టాను.
వెంటనే మరో చీటీ చేతిలో పెట్టాడు. ‘ఇది ఎందుకు?’ అని అడిగాను. ఇంతకు ముందు ‘ఎందుకు?’ అని గట్టిగా అరిచారు. ఇది ‘అరుపు ట్యాక్స్’ అన్నాడు. అదీ కట్టాను.‘‘ఛీ... పొరపాటున చంద్రలోకానికి వచ్చాను.భూమి మీద టోల్‌ట్యాక్స్‌లాంటి అయిదారు ట్యాక్స్‌లు కడితే సరిపోయేది. ఇక్కడేమిటి? ప్రతిదానికి తొక్కలో ట్యాక్సు’’ అన్నాను.మరో చీటీ చేతిలో పెట్టాడు.‘ఇది ఏమిటి?’ అన్నాను భయంగా.‘ఇన్సల్ట్ ట్యాక్స్.... పది లక్షల నలభైవేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు’ అన్నాడు గంభీరంగా.అదీ కట్టాను.చంద్రుడిపైకి అడుగు పెట్టి మళ్లీ తిరుగురాకెట్ ఎక్కేవరకు... కూర్చుంటే ట్యాక్స్, లేస్తే ట్యాక్స్, తుమ్మితే ట్యాక్సు, దగ్గితే ట్యాక్సు... మాట్లాడితే టాకింగ్ ట్యాక్స్, మాట్లాడకపోతే సైలెన్స్ ట్యాక్స్... ఇలా రకరకాల ట్యాక్స్‌లతో తడిసి మోపెడైంది. నా ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. అదీ సంగతి!’’
– యాకుబ్ పాషా
అందుబాటు ధరలో చందమామ!
Published Sun, Dec 2 2018 1:23 AM | Last Updated on Sun, Dec 2 2018 1:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment