రెండు గ్రామాలు  ఒక కథ! | funday laughing story | Sakshi
Sakshi News home page

రెండు గ్రామాలు  ఒక కథ!

Published Sun, Nov 4 2018 12:52 AM | Last Updated on Tue, Nov 6 2018 12:36 PM

funday laughing story - Sakshi

వరల్డ్‌ మీడియా మొత్తం ఆ రెండు గ్రామాల నడిబొడ్డున తిష్టవేసింది. ఎటు చూసినా టీవీకెమెరాలు, గన్‌మైక్‌లే. ఎందుకిలా?మామూలుగానైతే దీపావళి పండుగకు ముందు మూడు రోజులు, వెనక మూడు రోజులు...‘ఢాం...డూమ్‌’ అనే శబ్దాలు వినిపిస్తుంటాయి.శాంతిపురం, కాంతిపురం అనే ఈ  రెండు గ్రామాల్లో మాత్రం పెద్ద పెద్ద టపాసులు కాదు కదా...చిన్న కాకరపుల్ల కూడా కాల్చరు.‘ఎందుకిలా?’ అనే ప్రశ్నకు మీ దగ్గర ఉన్న సమాధానం...‘పర్యావరణ స్పృహ’‘వాయు, శబ్దకాలుష్యాలను నివారించడం’దీపావళి పండుగరోజు ఆ ఊళ్లల్లో సింగిల్‌ బాంబు కూడా కాల్చకపోవడానికి కారణం పై రెండు సమాధానాలు పొరపాటున కూడా కావు.మరి ఎందుకలా?ఇది తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి. ముప్ఫై సంవత్సరాల వెనక్కి వెళ్లాలి....శాంతిపురం గ్రామానికి పెద్ద మసిరెడ్డి.కాంతిపురం గ్రామానికి పెద్ద కసిరెడ్డి.ఆరోజు దీపావళి...ఆరుబయట కూర్చొని తన అనుచరులతో ముచ్చటిస్తున్నాడు మసిరెడ్డి. సడన్‌గా కాంతిపురం గ్రామం నుంచి ఒక రాకెట్‌ దూసుకువచ్చి మసిరెడ్డి పంచెలో దూరింది. అతడి పంచె కాలిపోయింది.‘‘కాలింది నీ పంచె కాదన్నా...మన పరువు’’  పళ్లెంలో ఉన్న దోశ తింటూ ఎగదోశాడు ఒక అనుచరుడు.దీంతో మసిరెడ్డి కోపం ఆకాశాన్ని అంటింది.‘‘తీయండ్రా బండ్లు’’ అని అరిచాడు.‘‘బండ్లు తీయడం ఎందుకన్నా...పెట్రోల్‌ వేస్ట్‌. ముల్లును ముల్లుతోనే తీయాలా, రాకెట్‌ను రాకెట్‌తోనే కొట్టాలా’’ అని సలహా ఇచ్చాడు ముఖ్య అనుచరుడు.‘‘అలాగే చేయండి...అర్జంటుగా చేయండి....ఇప్పుడే చేయండి’’ అని ఊరంతా వినబడేలా తొడ కొట్టాడు మసిరెడ్డి.

అలనాడు ఇరాక్‌ మీద అమెరికా క్షిపణి దాడి చేసినట్లు....శాంతిపురం గ్రామం కాంతిపురం గ్రామంపై రాకెట్ల దాడి మొదలు పెట్టింది. ఇక ఆరోజు కాంతిపురంలో ఎటు చూసినా రాకెట్లే!ఒకాయన ఇంకోఆయనకు...‘హ్యాపీ దివాలీ’ అని చెప్పాడు. సరిగ్గా  ఆ సమయంలోనే శాంతిపురం నుంచి దూసుకువచ్చిన రాకెట్‌ అతడి చెవిలోకి దూరింది. ‘ఓరి నాయనో’ అని అరిచి పరుగు అందుకున్నాడు ఆ వ్యక్తి. ఇలాంటి అరుపులు, పరుగులు  ఆ పండుగ రోజంతా వినిపిస్తూనే ఉన్నాయి. కనిపిస్తూనే ఉన్నాయి.ఇదంతా ఒక ఎత్తు. కాంతిపురం పెద్ద కసిరెడ్డిపై జరిగిన రాకెట్‌ దాడి ఒక ఎత్తు.కసిరెడ్డికి పప్పు అంటే మహా ఇష్టం. పండుగ పూట ‘ఆహా’ ‘ఓహో’ అని లొట్టలు వేస్తూ ఆవురావురుమని తింటున్నాడు. ఈలోపే శాంతిపురం నుంచి దూసుకువచ్చిన రాకెట్‌ కసిరెడ్డి ముందు ఉన్నపప్పుగిన్నెలోకి దూరి పప్పును నేలపాలు చేసింది.‘‘నా పప్పు జోలికి వచ్చి పెద్ద తప్పు చేశార్రా’’ అని నలుదిక్కులు వణికేలా అరిచాడు కసిరెడ్డి. ఆ తరువాత ఇలా కన్నీళ్లు పెట్టుకున్నాడు...‘‘పగ ఉంటే నా మీద చూసుకోవాలి. నా పప్పేం చేసింది?’’‘‘నేలపాలైంది పప్పు కాదన్నా...మన పౌరుషం’’ అగ్గి రాజేశాడు అనుచరుడు.ఇక ఆరోజు నుండి రెండు గ్రామాల మధ్య  ఫ్యాక్షన్‌ మొదలైంది. ఆ ఊరి మీద వాలిన కాకి ఈ ఊరు మీద వాలొద్దని కాకులను అదేపనిగా తరమడం ప్రారంభించారు. ఆ ఊరు మీద పడిన వాన ఈ ఊర్లో పడొద్దు అంటూ ఎటు చూసినా టెంట్లు వేశారు!ఆ రెండు గ్రామాల ప్రజలు తమ ప్రగతి మరిచారు. తమ పిల్లలు చదువు మరిచారు. వాళ్ల భవిష్యత్తు మరిచారు.దేశంలో ఎక్కడైనా ఒక్కరోజే దీపావళి జరుగుతుంది. దీపావళి రోజు జరిగిన గొడవ పుణ్యమా అని ఆ ఊళ్లలో  రోజూ బాంబులమోతే! పెద్ద రాకెట్‌కు లక్ష్మీబాంబులు, ఉల్లిగడ్డబాంబులు కట్టి ప్రత్యర్థిగ్రామంపైకి పంపించేవారు.శబ్దకాలుష్యం  పుణ్యమా అని ఊళ్లో 97 శాతం మందికి చెవికి సంబంధించిన సమస్యలు, శ్వాసకోశ సంబంధ  సమస్యలు తలెత్తాయి.

దీపావళి సెలవులకని పట్నం నుంచి దిగాడు మసిరెడ్డి కొడుకు బాంబేష్‌. అతడిని బస్‌స్టాప్‌ నుంచి ఇంటికి  ఘనంగా తీసుకెళ్లడానికి పదులసంఖ్యలో టాటాసుమోలు బారులు తీరాయి. టాటా సుమోలకుముందు వెళుతున్న  మసిరెడ్డి కారు టైర్లను  రెండు దీపావళి రాకెట్లు ఢీకొట్టడంతో కారు అదుపు తప్పి బోల్తాపడి మసిరెడ్డి మసిబొగ్గులా అయిపోయాడు. హెడ్‌లో ఉన్న ఫైల్స్‌ అన్ని డిలీటైపోయి ఎవరిని గుర్తుపట్టడం లేదు. ‘దూకుడు’లో ప్రకాశ్‌రాజ్‌లాగా!ఇక ఆరోజు నుంచి బాంబేష్‌ నుంచి పెద్ద పెద్ద డైలాగులు వినిపించేవి. మచ్చుకు...‘ఒరే నాయాలా...దీపావళి బాంబుల పొగ ముక్కులో దూరితే ఎట్టుంటుందో తెలుసా? హుసేన్‌సాగర్‌ వాటర్‌ను క్వార్టర్‌ బాటిల్‌లో కలిపి తాగిస్తే  ఎలా ఉంటుందో తెలుసా?’‘కంటపడ్డావా కాకరపుల్లతో కంట్లో పొడుస్తా....వెంటబడ్డావా ఉల్లిగడ్డ బాంబుతో   ఊడ్చేస్తా’‘‘ఈ ఊళ్లో ఒక్కొక్కడు ఒక్కో సైనికుడై కాంతిపురం వాళ్ల మీద విరుచుకుపడాలి. ఊళ్లో శ్మశానం ఉంటుంది. కాని శ్మశానంలోనే ఊరు ఉండాలి’’ అని పిలుపునిచ్చాడు.ఇంటింటికీ వెళ్లి చెప్పడం మొదలుపెట్టాడు.కానీ ఏంలాభం?ఒక్కరికి వినపడి చావడం లేదు.పదిసార్లు చెప్పినా ఒక్క పదం వినబడడం లేదు.బాంబేష్‌ మనసులో మార్పు మొదలైంది.‘‘ఏం సాధించాం?’’ అని అద్దం ముందు నిల్చొని  గట్టిగా అరిచాడు.‘‘చెవుడు’’ అని అద్దంలోని ప్రతిబింబం సమాధానం చెప్పింది.‘‘వాడిదైన రోజు చిచ్చుబుడ్డి కూడా లక్ష్మీబాంబై పేలుతుంది. అసలు చిచ్చుబుడ్డిని బాంబు కాకుండా ఆపుతాడు చూడు...వాడే గొప్పోడు!’’ అని గట్టిగా డైలాగ్‌ చెప్పి ఫ్యాక్షన్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు బాంబేష్‌.ఇక ఆరోజు నుంచి...మామూలు రోజుల్లోనే కాదు....దీపావళి రోజు కూడా ఆ గ్రామాల ప్రజలు బాణసంచ కాల్చడం లేదు.
– యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement