ఆ వార్త విన్నప్పటి నుంచి ఉత్తర కొరియా పెసిడెంటు కిమ్ జోంగ్ మనసు మనసులో లేదు. దినపత్రికను నూటా రెండోసారి తిరిగేశాడు.... ఆ వార్తను మళ్లీ చదివాడు. అది ఇలా ఉంది: ‘అగ్రదేశాలు చైనా, అమెరికాలు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో ఒక బాంబును తయారుచేశాయి. ప్రపంచంలోనే నంబర్‌వన్ బాంబు ఇది. దీని ప్రత్యేకతలు ఏమిటంటే...’’\ అసహనంగా పేపర్ గిరాటు వేశాడు కిమ్. ‘‘అయ్యా!ఏమిటి డల్‌గా ఉన్నారు?’’ అని చుట్ట చేతికిస్తూ అడిగాడు కిమ్ పీయే కుమ్ డాంగ్. ‘‘నా పేరు చెప్పగానే హైట్రోజన్‌బాంబు, అణుబాంబు... ఎక్సెట్రా ఎక్సెట్రా బాంబులు గుర్తుకువచ్చేవి. దేశదేశాలు గజగజా వణికేవి. కానీ ఇప్పుడు చైనా, అమెరికాలు ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ తయారుచేశాయట. ఇక నాకెందుకు భయపడతారు. ఇలా చుట్టలు తాగుతూ ఒక మూలన కూర్చోవల్సిందే’’ గాద్గదిక స్వరంతో నిట్టూర్చాడు కిమ్. ‘‘మీరు అధైర్యపడవద్దు... ప్రపంచమంతా ఒక ఎత్తు మీరు ఒక ఎత్తు. ఎవరు మీకు సాటిలేరు...నీ దూకుడు సాటెవ్వడూ’’ అని పొగడ్తల మద్దెల మోగించాడు కుమ్ డాంగ్.
ఈ పొగడ్తలతో కాస్త పైకి లేచాడు కిమ్. దేశంలోని ముఖ్యమైన శాస్త్రవేత్తలందరికీ ఫోన్లు చేశాడు.
అందరూ భయంభయంగా కిమ్ ఇంటికి పరుగులు తీశారు. వారిని ఉద్దేశించి కిమ్ ఇలా ప్రసంగించాడు:‘‘గజగజా వణకాల్సింది మీరు కాదు.... ప్రపంచం. మీకు తెలుసు కదా...చైనా,అమెరికాలు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో సరికొత్త బాంబును తయారుచేసి ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి. నేను బతికున్నంత వరకు అది జరగని పని. డియర్ కామ్రేడ్స్.... మీకు ఒక నెల టైమ్ ఇస్తున్నాను. ఏంచేస్తారో ఏమిటో నాకు తెలియదు. ఆ బాంబును మించిన బాంబును తయారుచేయాలి. దాని పేరు కూడా ఇప్పుడే పెట్టేస్తున్నాను.... బాప్ ఆఫ్ ఆల్ బాంబ్స్! ఓకే...ఇక పనిలోకి దిగండి...’’నెల రోజుల పాటు శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేశారు.జుత్తు పీక్కున్నారు. పక్కోడి జుట్టు కూడా పీకారు.అసహనం, ఆగ్రహం, అసంతృప్తి తప్ప కొత్త బాంబేదీ రాలేదు.‘‘అయ్యా మమ్మల్ని క్షమించండి.నిద్రాహారాలు మాని ఎన్నో ప్రయోగాలు చేశాం. ఎంత చేసినా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ సమీపంలోకి కూడా వెళ్లలేకపోతున్నాం’’ అని పెద్ద పెట్టున ఏడ్చారు శాస్త్రవేత్తలు.‘‘మీరు ఏడ్వడానికి తప్ప ఎందుకు పనికిరారు. వెళ్లి చావండి’’ అని తిట్టి చుట్ట వెలిగించాడు కిమ్.ఈలోపు ‘బ్రేకింగ్ న్యూస్’ అంటూ టీవీలో హడావుడి మొదలైంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు...‘‘ప్రపంచ ప్రజలారా... మీకు కోడి పందేల గురించి తెలుసు... కానీ బాంబుల పందేలా గురించి తెలియదు. తొలిసారిగా ప్రపంచచరిత్రలో ఇండియాలోని సికింద్రాబాద్ జింఖాన గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిదేశం ఇక్కడ తమ బాంబులను ప్రదర్శించవచ్చు.... ఎవరి బాంబు స్ట్రాంగో వారికి అమెరికాను, చైనాను రెండు సంవత్సరాలు పాలించే బంపర్ ఆఫ్ ఇస్తున్నాం. ఎవరూ గెలవకపోతే...అందరూ కలిసి మెక్సికో–యూఎస్ గోడకట్టివ్వాలి’’ అన్నాడు. ‘‘మంచి చాన్సు. తాడో పేడో తేల్చుకుంటాను’’ మీసానికి బదులు తల దువ్వాడు కిమ్.
ఆరోజు జంటనగరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.ఎటు చూసినా జనాలే జనాలు! బాంబుల పోటీలో పాల్గొనడానికి దేశదేశాల వాళ్లు వచ్చారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాయంత్రం రిజల్ట్ వచ్చింది. ‘విజేత కిమ్..... జొంగ్!’ అని ప్రకటించారు.‘‘నార్త్ కొరియా పెసిడెంట్‌గారి బాప్ ఆఫ్ ఆల్‌బాంబ్స్‌కు మొదటి బహుమతి వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం’’ అని ఏడుస్తూ ప్రకటించాడు ట్రంప్.‘‘విక్రమార్కామదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌కు దీటుగా బాంబు తయారుచేయలేమని శాస్త్రవేత్తలు చేతులు కాళ్లెత్తేసిన తరువాత కూడా కిమ్ అంత పెద్ద బాంబును ఎలా తయారుచేయగలిగాడు?! నిజానికి కిమ్‌కు దీపావళి టపాసులు కూడా తయారుచేసే పరిజ్ఞానం లేదు. హౌ ఇట్ ఈజ్ పాజిబుల్!’’ అడిగాడు బేతాళుడు.‘‘కిమ్ తన నోరును నమ్ముకున్నాడు. అదే...బాప్ ఆఫ్ ఆల్‌బాంబ్స్’’ కూల్‌గా చెప్పాడు విక్రమార్కుడు.‘‘నువ్వు చెబుతున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు... నోరేమిటి? బాంబేమిటి!’’ ఆశ్చర్యంగా అరిచాడు భేతాళుడు.‘‘అయితే చెబుతా విను’’ అంటూ ఇలా చెప్పాడు విక్రమార్కుడు:‘‘సంగీతం అనేది మంచినోళ్లలో ఉంటే మహాశక్తి జనిస్తుంది. అరుదైన రోగాలు కూడా నయమవుతాయి. అదే చెడునోట్లో పడితే విధ్వంస శక్తి జనిస్తుంది. అరుదైన రోగాలు వస్తాయి...బాంబును బాంబుతో ఎదుర్కోవడం అనేది పాత మాట...బాంబును మ్యూజిక్‌తో ఎదుర్కోవడం నా బాట అంటూ.... ప్రపంచంలోని రకరకాల మ్యూజిక్‌ను నెలరోజుల్లో నేర్చుకునే ప్రయత్నం చేశాడు కిమ్. గాత్రసంగీతానికి ప్రాధాన్యత ఇచ్చాడు.
చివరికి ఒకరోజు ఆయనకు గొప్ప ఆలోచన వచ్చింది.సకల సంగీతాలను మిక్స్ చేసి తన గొంతుతో ఆలపిస్తే గొప్పశక్తి విడుదల అవుతుందని కల కన్నాడు. ఆ కల అక్షరాలా నిజమైంది. ఆరోజు జింఖాన గ్రౌండ్‌లో అన్ని దేశాల బాంబుల ప్రదర్శన జరిగిన తరువాత....‘‘మీ బాంబు ఎక్కడ?’’ అని అడిగారు నిర్వాహకులు.‘‘నా నోరే నా బాంబు అంటూ.... అటు ఆఫ్రికన్ ఫోక్ జిమ్–బో–ల నుంచి ఇటు హిందుస్థానీ, కర్నాటక సంగీతం వరకు అన్నీ కలగలిపి...గొంతు విప్పాడు ఇలా....‘సికుయో యెలిజివి లోబోమినోయన నోయన నితినిసారజవర గమన సారజవరగమన.... ఎన్నియెళ్లు ఎన్నియెళ్లో ఎన్నియేళ్లు...దొర ఏందిరో వాని జులుము ఎందిరో...’అంతే..... భారీ విస్ఫోటం. చెల్లాచెదురుగా ఎటు వాళ్లు అటు పరుగులు తీశారు.‘‘నేను...గొంతు విప్పి రెండు నిమిషాలు కూడా పాడకముందే ఇంత విధ్వంసం జరిగితే....పదినిమిషాలు ఏకధాటిగా పాడితే.... నా నోటి ముందు ఏ బాంబు సరిపోదు...’’ అన్నాడు కిమ్.‘‘నిజమే’’ అని ఏకగ్రీవంగా ఒప్పుకొని కిమ్‌ను విజేతగా ప్రకటించి ఆయన నోటికి ‘బాప్ ఆఫ్ ఆల్‌బాంబ్స్’ అనే నామకరణం చేశారు దేశాధీశులు.
– యాకుబ్ పాషా
బాప్ ఆఫ్ ఆల్ బాంబ్స్
Published Sun, Jan 27 2019 12:16 AM | Last Updated on Sun, Jan 27 2019 12:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment