
సార్ పోస్ట్. పడకదిగి వెళ్లి పోస్ట్ తీసుకున్నా. ఎవరు రాశారు అని చూస్తే, టుడియర్ పోయెట్. ఫ్రమ్ సంద్రఏం రాసుంటుంది. అని తెరచి చూస్తే, మై డియర్ పోయెట్! కవిత్వం అంటే పారిపోయే నీవు ఎంత బాగా రాస్తున్నావ్. ఎప్పుడూ అకడమిక్ పుస్తకాలు దాటి చూడని నీవు, ఈమధ్య లేఖలో రాసే ప్రతి వాక్యంలో వచనమే రాస్తున్నావ్. క్రితంసారి నువ్ రాసిన లేఖ ముగింపుని ఎన్నిసార్లు చదువుకున్నానో. బాగా నచ్చిందోయ్. నిజంగా! ఒక్కమాట చెప్పనా, నాకన్నా బాగా రాస్తున్నావ్. ప్రౌడ్ ఆఫ్ యు స్టుపిడ్. నా రీసెర్చ్ మొత్తానికి అయిపోయింది. అది అయిపోగానే నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఒకటే ఆత్రం. ఈ ఐదేండ్ల ఎడబాటును చెరిపేస్తూ నీ దరికి వస్తున్న.బోలెడంత ప్రేమతో సంద్ర అచంచలమైన ప్రేమను లేఖల్లో వ్యక్తపరచే తను, ఐదేండ్ల తరువాత కళ్లముందుకు వస్తున్నట్టు రాసింది. ఎప్పుడు వస్తుంది? మళ్ళీ చదివా. తారీఖు చూస్తే రేపే వస్తున్నట్టుంది.
తన జ్ఞాపకాల్లో కాలం గడిచిపోయింది. గడచిన కాలమంతా ఒకవైపు. ఆమెతో కలసి నడచిన కాలం ఒకవైపు. స్వేచ్ఛగా ఉండటం అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే తనని చూపిస్తే సరిపోతుందేమో. తన స్వేచ్ఛను ప్రకటించి పోయిన తను, ఎప్పటిలాగే ఉత్తరమై పలకరించింది. ఈసారి ఎడబాటును ఓపమని గాక ఎడబాటును చెరిపెయ్య వస్తున్నట్టు.ఇప్పుడంటే ఇట్లా రాస్తున్నాను గానీ తన పరిచయం లేకముందు ఎంత ముభావంగా ఉండేవాడ్నో తలచుకుంటే నవ్వొస్తుంది. ఎంత అందమైనవి తన తలపులు. కేవలం అందమైనవేనా? అద్భుతమైనవి. ఎట్లా వచ్చింది తను జీవితంలోకి. గుడ్లగూబ కళ్ళది. ఇంతింత కళ్లేసుకొని. ఏంటి ఈ పిల్ల ఇట్లా కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతుంది అనుకునేవాణ్ణి. ఓ రోజు యూనివర్సిటీలో నడుస్తూ ఉంటే వెనకనుండి నెత్తిపై మొట్టి, వెనక్కి తిరగగానే కౌగిలించుకుంది. ‘ఏంట్రా ఈ మధ్య కనపడట్లేదు’ అని అత్యంత సహజంగా అడిగింది. ఏంటి ఈ పిల్ల పరిచయమై నాలుగు రోజులన్నా కాలేదు.. ఏదో ఏండ్ల నుండి సావాసం ఉన్నట్లు మాట్లాడుతుంది. నడిరోడ్డుపై కావలించుకుంటుంది. ఈలోకంతో పట్టింపులేనట్లు.
ఏదో ఓ సందర్భంలో కలవడం, మాట్లాడటం దినచర్యలాగానే అయిపోయింది. ఓ రోజు తన స్నేహితురాలి ఇంటికి పోవాలి రా అని పిలిచింది. వెళ్లి వాళ్ళింట్లో కూర్చోని మాట్లాడుతుంటే ఓ ముసలమ్మ వచ్చి మా ఇద్దరిని పరీక్షగా చూసి ఎదురుగా కూర్చుంది. ‘ఓయ్ అమ్మాయ్, ఎప్పుడు చూసినా మగరాయుడిలా ఆ ప్యాంటు, షర్టు వేసుకుని రాకపోతే ఎంచక్కా లంగా, ఓణిలో రావచ్చు కదా!’‘రాకూడదని ఏమి లేదు బామ్మా! లంగా ఓణిలో బండిపై ఆటోకాలు, ఇటోకాలు వేసుకొని కూర్చోవడం కాదు అనే వేసుకోట్లేదు. ఈ ప్యాంటు, షర్టు కన్నా కూడా చిన్న చిన్న నిక్కర్లు బాగా సౌకర్యంగా ఉంటాయి. వచ్చేసారి అవి వేసుకొని వస్తాలే’ఈ పిల్ల అన్న మాటలకు ముసలామే ఊకుంటదేమో అనుకున్నా. అంతలోనే అడిగింది – ‘అవును అమ్మాయ్ ఇంతకీ మీరేంటి?’‘మీరేంటి అంటే ఈ దేశంలో, మీదే కులమనేగా? అదేనా బామ్మ నువ్వు అడుగుతోంది?’‘– అవుననుకో’‘నాకు ఒక కులమంటూ లేదు. అయ్యదో కులం. అమ్మదో కులం. ఇక మతమంటావా! నాన్న కొద్దిగా భక్తుడు. అమ్మకు ఏ నమ్మకాలూ లేవు.’‘అంటే దేవుడ్ని కూడా నమ్మదా ఏంటి?’‘ఉంటే కదా బామ్మ నమ్మడానికి.’ ‘ఏందో అమ్మా! బొత్తిగా ఈ కాలం పిల్లలకు భయము, భక్తి లేకుండా పోతోంది.’ అంటూ వెళ్ళిపోయింది.
ఉదయాన్నే లేవగానే తన నుండి ఫోన్. అర్జంట్‌గా హాస్టల్‌కి రమ్మని. వెళ్లి వేచి చూస్తుంటే మెల్లిగా వచ్చింది. మోకాళ్ళపైకి షార్ట్, క్రాప్డ్ టాప్‌తో. జనాల కళ్ళన్నీ తన కాళ్ళ మీదే. వచ్చి బ్యాగులోంచి ఓ పుస్తకం తీసి, పెన్ను ఉందా అని అడిగి ఏదో రాసిచ్చింది. రూముకెళ్లేదాకా పుస్తకం చూడొద్దని బాసతీసుకుని మరీ. రూముకెళ్లి ప్రాజెక్ట్ వర్క్ రాస్తుండగా ఫోన్ చేసింది. ‘రేయ్ ఇంతకీ చదివావా.. లేదా..’ అని. అప్పటికి గానీ గుర్తుకురాలేదు. తను పుస్తకంలో రాసిన సంగతి. ‘లేదు. ప్రాజెక్ట్ వర్క్ రాస్తున్నా. చదువుతా’ అన్నా. ‘నువ్వు, నీ ప్రాజెక్టు వర్కులు.. ఇవేగాక జీవితంలో చెయ్యాల్సినవి చాలా ఉన్నాయిరా బాబు. ముందు అది చదివి కాల్ చెయ్’అప్పుడు తెరిచా పుస్తకాన్ని, తనేం రాసిందో చదవడానికి. ‘మై డియరెస్ట్.నా ఇష్టాన్ని వ్యక్తపరిచేందుకు, నా భావాల్ని చెప్పేందుకు సరిపోయే నా ప్రియకవి పాబ్లో కవితని పంపుతున్నా. కవితలో ప్రతి పదం, ప్రతీ పాదం నీపై నా అనుభూతే. నీది సహానుభూతి కావాలని ఆశిస్తూ. నీ సమాధానంకై వేచి చూస్తూ.’ అంటూ ఓ కవిత పంపింది. తను రాసింది చదవగానే కాల్ చేశా. ‘ఏంట్రా చదివావా?’‘– చదివాను. నువ్ ఏదో ఇష్టాన్ని చెప్పాలని రాశావ్. ఆ కవిత సరిగా అర్థం కాలేదు. నువ్వంటే నాకు ఇష్టమే కానీ, ఇంతకీ అనుభూతి, సహానుభూతి కావడం అంటే ఏంటి?’‘ఒసెయ్, పిచ్చిమొద్దు. అంతలా నీకోసం రాస్తే అర్థం కాలేదు అంటావేంట్రా!’‘– నిజంగా అర్థం కాలేదు.’‘అది ప్రేమలేఖరా బాబు.. నిన్ను ప్రేమిస్తున్నానని లేఖ రాశా.’ ఊహించని పరిణామానికి నా వైపు నుండి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ, ‘రేయ్ నాకు అనిపించింది చెప్పిన, నీకు ఏమనిపిస్తే అది చెప్పు.’ అని ఫోన్ పెట్టేసింది.
మర్నాడు యూనివర్సిటీలో కలిసింది. ఏమీ జరగనట్టే, ఏమీ ఎరగనట్టే అత్యంత సహజంగా, ఎప్పటిలాగే పలకరించింది. కాసేపు అలా దిక్కులు చూస్తూ, మధ్య మధ్యలో పుస్తకాన్ని తిరగేస్తూ మాట్లాడుకున్నాం. మాటల్లో మాటగా, ‘అవును. నిన్న లేఖ ఎందుకు రాశావ్?’ అని ఆడిగేశా.‘ఎందుకు రాశానో నిన్ననే చెప్పాను కదా’ ఒక్కటే సమాధానం. ‘అసలు ఎందుకు రాశావ్?’ మరో ప్రశ్న.‘అదికూడా నిన్ననే చెప్పినా కదా?’ మళ్ళీ అదే సమాధానం.‘అదే ఎందుకు?’ ‘పైకి ఇలా ముద్దపప్పులా కనిపిస్తావ్ గానీ, నీకు సమాజం పట్ల మంచి కన్సర్న్ ఉంది.’ ‘అయితే ప్రేమిస్తారా?’‘నాపట్ల కూడా అంతే కన్సర్న్ ఉంది. అందుకు ప్రేమించా.’‘నీకెలా తెలుసు?’‘వేసుకున్న బట్ట కాస్త పక్కకి తొలగితేనే, చూపులు తిప్పుకోని జనాలున్న చోట, నువ్వెప్పుడూ ఏ అమ్మాయినీ అట్లా చూడలేదు. అంతెందుకు ఇంత పొట్టి పొట్టి బట్టలు వేసుకు తిరిగే నన్ను, నాలాగే చూశావ్. నీ దోస్తులంతా, నా బట్టల్ని కామెంట్ చేస్తుంటే నువ్వు వాళ్లను మందలించావు. నచ్చేశావ్. పైకి కనిపించే ముద్దపప్పువేం కాదు అనిపించింది అప్పుడు.’‘సంద్ర ఒక మాట చెప్పనా? నీలాంటి ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయితో కలిసి బతకాలంటే నేనూ నీలాగే ఉండాలి. నేను కాస్త రిజర్వ్‌డ్. నువ్వేమో అలా కాదు. కలిసిన వెంటనే కలిసిపోతావ్. నాలుగు రోజుల్లోనే ఆ మనిషిపై ఒక అంచనాకి వస్తావ్. ఇదిగో ఇలా కలిసి నెల రోజులన్నా కాలేదు ప్రపోజ్ చేశావ్. నేను ఇలాగే ఉంటాను. నీలాగ ఉండలేను.’ ఓరే ముద్దపప్పు, నువ్వు నీలాగ ఉన్నావు కాబట్టే నచ్చావ్. నాలాగా ఉండాలనే, మారాలనే స్వార్ధమేమీ లేదు నాకు. అయినా నువ్వు నీలాగే, నేను నాలాగే ఉంటూ, ఇద్దరం ఒక్కటిగా ఉండటం ఎంత బావుంటుంది? నువ్వు నన్ను నీలా మారమని కాకుండా, నాలా ఉండలేనని అంటున్నావ్ చూడు అందుకు ఇంకా నచ్చావ్. నువ్వు నీలాగే ఉండు. నన్ను నాలాగే ఉండనివ్వు. నీకు ఇష్టముంటే, నేను ఇంకొకడిని చూసుకోక ముందే చెప్పు.’‘అంటే నాకోసం, నా జవాబు కోసం ఎదురుచూడవా?’‘ఈ ఎదురుచూపులు, నువ్వు కాదన్నావని కన్నీరు మున్నీరై విలపించడాలు సినిమాల్లో బాగుంటాయి. నా వంటి వాడికి పడవు. నువ్వు నచ్చావని నేను స్వేచ్ఛగా చెప్పినపుడు. నీకు నచ్చలేదనో, ఇంకేదో చెప్పే స్వేచ్ఛ నీకుంది. సరే నేను మీటింగ్‌కు పోవాలి. కలుస్తా.’
కాలం ఎవరి కోసం ఆగదు కదా. కాలం ఒక జీవనది. అది ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పటిలాగే రూంకి వచ్చిన సంద్ర, ‘రేయ్ నాకు సముద్రం చూడాలని ఉంది!’ అంది. ‘సరే, ప్లాన్ చేద్దాంలే!’ అని నేనంటే వినిపించుకోలేదు. అప్పటికప్పుడు గోవాకు రెండు టికెట్లు బుక్ చేసింది.æబీచ్‌కి వెళ్ళగానే తీరంలో కూర్చొని తదేకంగా సముద్రం వంక చూస్తోంది. ‘అంతలా ఏం చూస్తున్నావ్ సంద్ర?’ అనడిగా. ‘ఎగిసిపడే అలల్ని. తీరం తాకి, వెనక్కి మళ్లే అలల్ని. అలలు సముద్రంలోకి పోతున్నప్పుడు జాలువారే ఇసుకని. అదుగో దూరంగా నేల, ఆకాశాన్ని కలుపుతున్నట్టు ఉన్న దృశ్యాన్ని. ప్రశాంతంగా అలలు చేసే శబ్దాన్ని విను. ఏ సంగీతకారుడు పలికించగలడు దీన్ని?’‘సముద్రం అంటే అబ్సెషన్ ఎందుకు సంద్ర?’ ‘నేనే సముద్రం కాబట్టి,’ నవ్వింది.‘అవునూ ఇంతకీ సంద్ర అంటే అర్థం ఏమిటి?’ ‘సంద్ర అనే పేరు ఉందో, లేదో తెలియదు. అమ్మకి సముద్రం అంటే ఇష్టం. అందుకే సముద్రాన్ని షార్ట్‌గా చేసి, సంద్ర అని పెట్టుకుంది. నాకు సముద్రాన్ని చూడటం అమ్మతోనే అలవాటయింది. నాన్న దూరమయ్యాక ఇద్దరం ఇలా సముద్రతీరంలో గంటలు, గంటలు, రోజులు, రోజులు గడిపేవాళ్ళం. అమ్మ లేకుండా సముద్రాన్ని చూడటం ఇదే మొదటిసారి.’ అంటూ భుజంపై తలవాల్చింది.
ఎప్పుడూ పైకి ప్రశాంతంగా కనిపించే సంద్రలో ఇంత విషాదమూ ఉందా. అయినా బయట పడదేంటి. ఏమో ఈ పిల్ల అర్థం కాదు. అర్థమయినట్టే అనిపించే అర్థంకాని పిల్ల. సూర్యుడు సముద్రంలోకి మాయమయ్యే దృశ్యాన్ని చూపిస్తూ, మెడపై చేతులు వేసి కావలించుకుంది. పొద్దటినుండి అలసిపోయి బెడ్‌పై పడుకోగానే, వచ్చి పక్కన పడుకుంది. మాటల్లో కాసింత కాలం గడిచిపోయింది. కాసేపు మాటల్లేని యుద్ధం. తొలికలయికలో కార్చిన కన్నీళ్లను తను దాచాలనుకున్నా, చెదిరిన కాటుక తన కన్నీళ్లకు సాక్షం చెప్పింది. కాసేపు కిటికీలోంచి బయటకు చూసి, ఏదో రాసుకుంది. పొద్దున లేచేవరకు చుట్టూ చేతులు వేసి అల్లుకొని పడుకుంది. మెల్లిగా పక్కకు జరిపి పడకదిగి టేబుల్ ముందు కుర్చీలో కూర్చొని చూస్తుంటే, దూరంగా సూర్యోదయం. పక్కనే రాత్రి తను రాసిన పుస్తకం. తెరచి చూశా. ‘కిటికీలోంచి బయటకి చూస్తే, చూపుకు దగ్గరగా, అయినా అందుకోలేనంత దూరంగా సముద్రం. తీరాన్ని తాకుతూ అలలు. అనిర్వచనీయ ప్రేమను వ్యక్తికరించిన క్షణాలు. గుర్తుకురాగానే ఎరుపెక్కిన బుగ్గలు. వాన్నలా చూస్తుంటే మళ్ళీ ఓసారి ఊపిరి ఆపేసినంత పనిచేసి ఊపిరి పోయాలనిపిస్తుంది.’ చదివాక ఏదో చెప్పలేని అనుభూతి. మళ్ళీ పడుకున్నా.
ఓరోజు హడావుడిగా రూంకి వచ్చి, ‘రేయ్ నాకు ఆక్స్‌ఫర్డ్‌లో సీటు వచ్చింది. ఇంకో పది రోజుల్లో ప్రయాణం..’ అంది. ‘వాట్? అంటే ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తావా?’ ‘నీకు తెలుసుకదా నాకు అక్కడ చదవడం కల అని. అయినా నేనేం నిన్ను వదిలేసి పోవట్లేదు. రీసెర్చ్ కోసం పోతున్నా. మళ్ళీ వస్తా కదా.’ ‘ఊహు, వెళ్లడం మానెయ్. ఇక్కడే రీసెర్చ్ చేద్దాం.’ ‘సారీ డార్లింగ్, నో కాంప్రమైజ్ ఆన్ మై డ్రీమ్. అయినా నీకు ముందే చెప్పా కదా. కొత్తగా ఇదేంటి. డోంట్ బి పోసేసివ్.’ ‘అదంతా నాకు తెలియదు. కాంట్ లివ్ వితౌట్ యు.’ ‘డోంట్ బి స్టుపిడ్. ఒక్క ఫైవ్ ఇయర్సే కదా.’అంతే. సంద్ర ఫిక్స్ అయితే ఎవ్వరి మాటా వినదు. ‘నీ ఇష్టమైనప్పుడు రా. అంతవరకు, అంతే ప్రేమతో ఎదురుచూస్తుంటా’ అన్నా. మాట్లాడటం అయిపోగానే గట్టిగా హత్తుకుంది. అప్పుడు కలిసిన తను. ఆ తర్వాత నుండి మెయిల్ కాలంలో కూడా ఉత్తరమై పలకరిస్తూనే ఉంది. ఎప్పుడు రాసినా ఏదో కొత్త విషయం. ఏదో తెలియని ఉత్సుకత ఉంటుంది తన ఉత్తరాలలో. మళ్ళీ మళ్ళీ చదివించేలా రాస్తుంది. ఎప్పుడు చదివినా అదే కొత్తదనం. ఎట్లా అబ్బింది తనకు ఇట్లా రాయడం. బహుశా బాగా చదవడం వల్లేమో. తను వస్తుందనే విషయం ఒక్కచోట కాలు నిలవనివ్వడం లేదు. సంద్ర. తిరిగొస్తోంది. నాకోసం వస్తోంది.డోర్ బెల్ మోగిన మోత. ఇప్పుడెవరో అనుకుని ఒక నడక, చేతిలోని ఉత్తరం బల్లపై పెట్టి, తలపులనుండి బయటపడి తలుపు వైపు.
Comments
Please login to add a commentAdd a comment