బడిబాట | Funday new story special | Sakshi
Sakshi News home page

బడిబాట

Published Sun, Jun 3 2018 12:21 AM | Last Updated on Sun, Jun 3 2018 12:21 AM

Funday new story special - Sakshi

నిశ్చేష్టున్నయ్యాను ఒక్కసారిగా.అటెండర్‌ రెట్టించాడు – ‘‘గా పిల్ల మందు తాగిందట సార్‌..’’‘‘ఏ పిల్ల..?’’‘‘అదేసార్‌.. గా రంగులోల్ల పిల్ల. అప్పుడప్పుడస్తది సూడుండ్రి..’’నాకెందుకో మనసులో అలజడి మొదలైంది. ‘‘ఏం జరిగింది?’’‘‘పురుగుల మందు తాగిందట. పాణం పోలేదనుకోండ్రీ...’’నా గుండె లయ తప్పింది. అటెండర్‌ చెబుతున్నది ఆ అమ్మాయి గురించేనా? రాజేశ్వరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా? ఎందుకు? ఇది నాకేమైనా చుట్టుకుంటుందా?అమ్మాయి పట్ల జాలికన్నా నా కెరీర్‌ పట్ల అప్రమత్తత ఎక్కువైంది నాకు. ఏమాటా అనకుండా స్కూల్లో పాఠాలు చెప్పడమంటే కుదిరేపనేనా?అయినా తను ఎప్పుడు సక్రమంగా బడికొచ్చిందని? పది రోజులకోసారి వస్తుంది. రెండు మూడు రోజులు క్లాసులో కనిపిస్తుంది. మళ్లీ వారం పదిరోజుల వరకు బడి ముఖం చూడదు. కాస్త గట్టిగా మందలిస్తేమొత్తానికే రాదు. లేదంటే ఇలాంటి అఘాయిత్యాలు. ఇట్లా రోజుల తరబడి రానివారి సంఖ్య దినదినం పెరిగిపోతోంది. పల్లెల్లో ఉద్యోగాలు వెలగబెట్టడం కత్తిమీద సాములా మారింది మరి!అందరికీ చదువు రావాలి! కానీ బడికి మాత్రం సక్రమంగా రారు. రానివాళ్లను బడికి రప్పించాలంటే తలప్రాణం తోకలోకొస్తుంది. ఇట్లాంటి సంఘటనలేమైనా జరిగినప్పుడు తిరిగి తిరిగి మన తలకే చుట్టుకుంటుంది.

అయినా తల్లిదండ్రుల మనస్తత్వాల్లోనూ మార్పు రావాలి. తోచినప్పుడు బడికి పంపిస్తారు. పెండ్లీలకు, పేరంటాలకు, సొంతపనులకు తిప్పుతారు. చదువు రాకుంటే చదువు రావడం లేదంటారు. మాటిమాటికీ బడి ఎగ్గొట్టే వాళ్లకు ఎప్పుడో ఓసారి మందలించినా.. కోపంతో ఓ దెబ్బవేసినా వెంటనే పేరెంట్స్‌ దిగిపోయి సదరు పంతుల్ని తూర్పారబడతారు. పత్రికలవాళ్లు ఫొటోలు తీసి ‘పిల్లల పట్ల ఉపాధ్యాయుడి వేధింపులు’, విద్యార్థిని చితకబాదిన బడిపంతులు’ వంటి శీర్షికలతో చిలువలుపలువలు చేస్తారు. మరి బడికి చుట్టపు చూపులా అప్పుడప్పుడూ వచ్చిపోయే విద్యార్థుల గురించి ఉపాధ్యాయుడేం చేసేది?‘‘ఎప్పుడోసారచ్చే పిల్ల, గాపిల్ల గురించి గంత ఆలోచించేదేముంటది సార్‌!’’ అన్నాడు అటెండర్‌.ఆలోచించాల్సిన విషయమే!రాజేశ్వరి మూడు రోజుల్నుంచి బడికి రావడంలేదు. ఈ మధ్య గత పదిరోజుల్నుండీ వరుసగా వస్తోంది. అంతకు ముందు రెండ్రోజులు బల్లో ఉంటే వారం రోజులు ఇంట్లో ఉండేది. ఎంత చెప్పినా వినేది కాదు. ఉలకదూ పలకదూ. తల్లిదండ్రుల్ని తీసుకురమ్మన్నా తీసుకురాదు. గట్టిగా చెబితేతెల్లవారి నుండి మళ్లీ కనిపించదు.మళ్లీ ఎప్పుడో చుక్కతెగి రాలిపడినట్లు ఊడిపడుతుంది. పదిరోజుల కింద వచ్చినప్పుడు మాత్రం గట్టిగా మందలించాను. ఆ రోజు క్లాస్‌రూంలో ఏం మాట్లాడానో నాకింకా గుర్తుంది.

‘‘ఇంతకాలం ఎక్కడికెళ్లావు తల్లీ?’’ నా అరుపులకు ఆమె నుంచి ఏ సమాధానం లేదు.‘‘మాట్లాడవేం.. ఎటెళ్లావు?’’. ఆమె ఎటెళ్లలేదన్నట్లు తల అడ్డంగా ఊపింది.‘‘మరి ఇంట్లో ఏం చేశావు?’’నిశ్శబ్దం.‘‘బీడీలు చేసింది సార్,’’ ఎవరో గొణిగారు పక్కనుండి. ‘‘అవునా..?’’ఆమె నుంచి ఏ సమాధానం లేదు. వాళ్ల సమస్యకన్నా ఒకరకంగా వాళ్ల మౌనమే చిర్రెత్తుకొచ్చేలా చేస్తుంది. నేను కఠినంగా అన్నాను – ‘‘వస్తే రెగ్యులర్‌గా బడికి రా, లేకుంటే బీడీలే చుట్టుకో! ఏ ఒకదానికో తగలడు తప్ప రెండు పడవల మీద కాలు పెడ్తానంటే కుదరదు’’.ఆమె పల్కలేదు.నాకు మరింత మండింది. ‘‘ఏం.. నోరు పడిపోయిందా? తగుదునమ్మా అని పదిహేను రోజులకోసారి రావడానికి ఇది అత్తగారిల్లా ఏం? తొమ్మిదో తరగతిలోనే బీడీలు చుట్టడంపై మోజుపడితే ఇంక పదేం చదువుతావు? ఇంటికెళ్లిపో..’’ అన్నాను కోపంగా. ఆమె నుంచి మారుత్తరువు లేదు. ఇంకా గట్టిగా అంటే ఏడ్చేలా ఉంది తప్ప సమాధానం చెప్పేలా లేదు.నాకు సహనం నశిస్తుంటే.. ‘‘చెప్పు.. ఇకనుండైనా రెగ్యులర్‌గా వచ్చేదుంటే క్లాస్‌లో కూర్చో, లేదంటే ఇప్పుడే వెళ్లిపో,’’ కఠినంగానే అయినా స్పష్టంగా చెప్పాను.ఆమె వస్తానన్నట్లు తల ఊపింది.

ఇట్లా చాలామంది చాలాసార్లు చెప్పారు కానీ ఆచరించేది తక్కువ. ‘‘రెండ్రోజులు వరుసగా బడి మానేసినా మళ్లీ క్లాసులోకి రానివ్వను.’’ అన్నాను హెచ్చరిస్తున్నట్లుగా. ఆమె అవును కాదన్నట్లు తల ఊపి కూర్చుండిపోయింది.అప్పట్నుంచి∙పదిరోజులపాటు వరుసగా హాజరైంది. ఏమైందో ఏమో మళ్లీ రెండ్రోజులు రాలేదు. మూడోరోజు ఇదిగో ఇట్లాంటి వార్త వినాల్సి వచ్చింది.‘‘ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంది?’’ ఉన్నట్లుండి ప్రశ్నించాను అటెండర్ని.‘‘తెల్వదు సార్‌! దవఖాన్లకు తీస్కపోయచ్చిండ్రట, గంతే తెల్సు..’’‘‘పద.. వెళ్దాం..’’ లేచాను.‘‘ఎక్కడికి? గా పిల్లింటికా? మంచిగుండదేమో సార్‌!’’ అన్నాడు నసుగుతూ.‘‘వెళ్లకుంటేనే మంచిగుండదు, పదా!’’ అంటూ ముందుకు నడిచా. హెడ్మాస్టర్‌కు చెప్పి బయలుదేరాను. అటెండర్‌ ముందు నడుస్తున్నాడు. ఊళ్లోని ఇండ్లు అతనికి బాగా పరిచయం. రాజేశ్వరిఇల్లు ఊరికి ఆ చివర్లో ఉంది. పది నిమిషాలు పట్టింది నడకకు. అటెండర్‌ ఇల్లు చూపించి పక్కనే చింతచెట్టు కింద కూర్చుండిపోయాడు. శిథిలావస్థలో ఒకే గదితో ఉన్న పాతకాలపు మట్టిల్లు అది. ఈ రోజుల్లో అట్లాంటి ఇండ్లలో ఉండటం సాధ్యం కానిది. ముందు ద్వారానికి సూటిగా ఇంటివెనక్కి ద్వారం ఉంది. వెనకవైపు పొలాలున్నాయి. ఊరు చివర్లో ఉండటం వల్ల పెద్దగా మనుషులు కనిపించడం లేదు.పక్కింటిపరంధాములు దూరం నుంచి మమ్మల్ని చూసి మావైపు రావడం కనిపించింది.ఇంట్లో  అలికిడి లేదు. అతనొచ్చేవరకు వాకిట్లో నిలుచున్నాను. పరంధాములు దగ్గరకు రాగానే విష్‌ చేశాడు. ‘‘పిల్లని సూద్దమని వచ్చిండ్రా సారూ!’’ అంటూ పక్కనే ఉన్న తన ఇంట్లో నుంచి రెండు చైర్లు తీసుకొచ్చాడు.

పెళ్లలుగా మట్టి రాలుతున్న ద్వారంలోంచి లోనికి అడుగుపెట్టాం. ఒకే ఒక్క కుక్కి మంచంపైన జీవచ్ఛవంలా పడి ఉంది రాజేశ్వరి. ఇంట్లో కూచోవడానికేమీ లేవు. పరంధాములు తన ఇంట్లో నుంచి తెచ్చిన కుర్చీలు వేసి కూచోమన్నాడు. పక్కన తను కూచున్నాడు. మమ్మల్ని చూసి భయపడుతున్నట్లుగా ఇంటివెనక ద్వారం పక్కనే నక్కింది రాజేశ్వరి చెల్లెలు మహేశ్వరి. తను ప్రైమరీలో ఐదో తరగతి చదువుతోంది. వెనకే మరోపాప కూడా ఉంది. తను కూడా చెల్లెలేమో! ఇంకెవరూ లేరు.అయితే గదిలో మూలకు కాళ్లమీద కూర్చొని ఉంది ఓ నడివయస్కురాలు. తల్లేమో. చిందరవందర జుట్టు, అక్కడక్కడా చిరుగులు పడిన చీర, జీవంలేని కళ్లతో కొంచెం వింతగా తోచింది. మమ్మల్ని చూసినా ఆమెలో కదలిక లేదు. ‘‘ఎట్లా ఉందమ్మా రాజేశ్వరికి?’’ ఆమెని ప్రశ్నించాను. ఉలుకూ–పలుకూ లేదు. అట్లాగేనిర్వికారంగా చూస్తోంది శూన్యంలోకి. కూతురు పరిస్థితికి ఇంకా షాక్‌నుంచి తేరుకోలేదేమో!రాజేశ్వరి నిద్రలోనే ఉన్నట్లుంది.మాటలు ఎట్లా కలపాలో, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ‘‘వీళ్లు మీకు బంధువులా’’ అన్నాను పక్కనున్న పరంధాములుతో. కాదన్నట్లు తల ఊపాడు.‘‘అసలేం జరిగింది.. మీకేమైనా తెల్సా?’’ అన్నాను కల్పించుకొని. అతను కొంచెంసేపు మౌనంగా ఉన్నాడు. ‘‘జరగడమంటే ఏం జరుగుతుంది సార్‌? ఆ బీడీల కార్ఖాన భీమడు దీనికి ‘ఆకు ఎయ్యనుపో..’ అన్నడట. రెండ్రోజులు కార్ఖానా చుట్టూ తిరిగితే ఆడు ఆకెయ్యలే, తంబాకు పొయ్యలే. గంతే! దానికి ఏమనిపించిందో ఏమో! గీపని జేసింది’’.నేను విస్తుబోయి నోరెళ్లబెట్టాను. మంచిదేగదా! ‘‘పోతేపోనీ.. వెధవ బీడీలు. చక్కగ బడికొచ్చి చదువుకోవచ్చు కదా!’’ అన్నాను.

సాలోచనగా చూశాడు పరంధాములు నా మొహంలోకి. ‘‘మరి కడుపుకు అన్నమెవలు బెట్టాలి సార్‌? ఆ చిన్న పిల్లల్ని ఎవలు సాకాలి సార్‌?’’ అన్నాడు.కమ్చీతో ఎవరో కొట్టినట్లనిపించింది మొహం మీద. ‘‘అంటే.. వీళ్ల నాన్న.. అమ్మా...?’’ నా మాటలు పూర్తిచేయలేదు. ‘‘నాయన చచ్చిపోయిండు’’.నేను అదిరిపడ్డాను.అతను చెప్పడం కొనసాగించాడు – ‘‘నాయన వీళ్ల బతుకుల్ని మారుద్దామని చెప్పి దూరదేశం బోయిండు. ఆడనే చనిపోయిండు. ఆడు చనిపోయిన్నుండి ఇది.. ఈ తల్లి.. ఇగో ఇట్లా మారిపోయింది. ఇప్పుటికి మూడేండ్లాయె! ఆడు సచ్చినప్పుడు నాలుగేండ్లు కూడా నిండని ఆ చిన్నపిల్లతో సహాఇద్దరు చెల్లెండ్లను తనే చూసుకుంటూ ఆ బీడీల మీద బతుకీడ్చుకత్తుంది ఈ పిల్లే! ఆళ్ల పరిస్థితి జూసే ఈ ఇల్లు కిరాయికిచ్చిన. ఇప్పటికి ఆర్నెల్లాయె, కిరాయిగూడా ఇయ్యలే!’’నాకు మాటలు పెగలడం లేదు. అలా చూస్తుండిపోయాను. వెనక.. తలుపు దగ్గర్నుండి ఇద్దరు పిల్లలు తొంగి చూస్తున్నారు మేం వెళ్లామో లేదోనని. పిలిచాన్నేను – ‘‘అన్నం తిన్నావా?’’అడ్డంగా తల ఊపింది మహేశ్వరి.‘‘ఏం.. ఎందుకని?’’‘‘వండలేదు. అక్క లేవలేదుకద సార్‌?’’‘‘అమ్మ వంట చేయలేదా?’’‘‘అమ్మ చేయదు. అక్కే చేస్తుంది. అసలు అమ్మ ఏం చేయదు..’’

నాకు నోట మాట రాలేదు. నా సంశయం అర్థం చేసుకున్నట్లు ‘‘అవును సార్, అగో సూడుండ్రి. భర్త పోయినంక పిచ్చిదై పోయిందంతే... అదే వాలకం. ఉలకది పలకది. అన్నం పెడితే తింటుంది. లేకుంటే అట్లనే ఉంటుంది. వంటచేసేది, చెల్లెల్లనీ, తల్లినీ చూసుకునేది రాజేశ్వరే! తను బీడీలు చేస్తేగాని పొట్ట గడవది..’’ అన్నాడు పరంధాములు.నాకు తల మొద్దుబారినట్లయింది. నాలో నేను అనుకొన్నట్లుగా ‘‘రాజేశ్వరి రోజుల తరబడి బడి మానేసేది..?’’ అన్నాను.‘‘బడికొస్తే వీళ్లనొవలు సూడాలి సార్‌? అసలు వాళ్ల పొట్టెట్టా గడవాలి? ఆ పిల్ల బీడీల గంప ముందెట్టుకుంటేనే నాలుగు పైసలు. అవుంటేనే ఆళ్లకు తిండి. అటువంటిది పదిరోజుల పాటు బీడీలు మానేసి బడికొచ్చినందుకు ఆ భీమడు ఆకెయ్యనన్నడు. దానికేం బుద్ధి పుట్టిందో..! ఆ పిచ్చితల్లికి, ఈ అమాయకపు చెల్లెండ్లకు తిండెలా పెట్టాలనుకుందో.. ఏదనుకుందో..? మా ఇంటెనుక పురుగుల మందు డబ్బలో నీళ్లు కలుపుకొని తాగింది. ఈ మధ్య దాని వాలకం పసిగడుతున్నోడ్ని గనుకే ఎంటనే దవఖానకు తీస్కెల్లినా. లేకుంటేనా..’’ ఆ చిన్నపిల్లల వైపు చూస్తూ.. పరంధాములు గొంతు తడబడింది.నిద్రలో ఉన్న రాజేశ్వరి తలపై చేయుంచి నిమురుతున్న నా మనసు విచలితం అవుతుంటే ఆ ఇద్దరు చిన్నారులను దగ్గరకు తీసుకున్నాను. ‘‘మీ అక్కయ్యకు ఏమీ కాదు. మేమంతా ఉన్నాం కదా! అయినా ఆకలేస్తలేదా మీకు?’’ మహేశ్వరి బిడియంగానే అంది – ‘‘అమ్మ కూడా తిన్లేదు సార్, చెల్లేమో ఆకలని ఏడుస్తోంది. అక్క లేస్తలేదాయె..’’ కాస్త ఆగి ‘‘బడికొస్తే పెడతారుగదా సార్‌! రేపొస్తాము’’.

కరుకు రంపంతో కఠిన హృదయాన్ని సైతం ఖండఖండాలుగా కోస్తున్నట్లు... నాలోని అవివేకతను.. అసమర్థతనూ నిలువెల్లా కాల్చి దహిస్తున్నట్లు.. నా అసహాయతకు నన్ను నేనే నిందించుకొంటూ, నాకు నేనే కుచించుకుపోతున్న భావన.ఎంత అవివేకం?తరగతి గదిలో రోజుల తరబడి బడికి హాజరుకాని పిల్లల నిశ్శబ్ద నిర్వేదం వెనుక రోదననీ, వేదననీ పసిగట్టలేని అసమర్థ నిర్వాకం ఎందరి చిన్నారుల హృదయాలను భగ్నం చేస్తోందో! ఈటెల మాటలు ఆ పసిడి మనసులను ఎంతగా పరితపింపజేస్తాయో!పిల్లల తెరవెనుక నేపథ్యాన్ని చదవకుండా ఎన్ని చదువులు చెప్పినా ఎంత వృత్తి నిబద్ధత ప్రదర్శించినా వృథాయేనన్న సత్యం నాకు బోధపడుతూంటే అంతే నిర్వేదంగా లేచాను. చదువు చెప్పడంతో పాటు సమాజంలో వాళ్లు బతుకీడుస్తున్న విధానాల్నీ చదవాలని, చదువుతో పాటు ప్రభుత్వపరంగా వాళ్లకు అందాల్సిన పథకాల గురించి చెప్పాలని నా మనసు ఉద్భోదించింది.విద్యావ్యవస్థ నిర్వహించాల్సిన బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయని.. అందులో భాగస్వామినైన తనకూ ఆ బాధ్యతలతో సంబంధం ఉందన్న సత్యం బోధపడుతూంటే.. ప్రస్తుతానికి ఆ ఇద్దరు చిన్నారులను వెంటబెట్టుకొని పాఠశాలవైపు అడుగులు వేశాను.
- కటుకోజ్వల మనోహరాచారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement