మజిలీ | Funday news story of the week 24-03-2019 | Sakshi
Sakshi News home page

మజిలీ

Published Sun, Mar 24 2019 12:22 AM | Last Updated on Sun, Mar 24 2019 12:22 AM

Funday news story of the week 24-03-2019 - Sakshi

‘రమ్య’. పేరు ఎంత బాగుందో ఆమె కూడా అంతే అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే, ఓ దేవతలా అనిపిస్తుంది నాకు. ఆమె నవ్వుతుంటే, కొన్ని గంటల్లోనే కొన్ని కోట్లసార్లు చూసి ఉంటా. అంత అందంగా నవ్వుతుంది. నాకందుకే అనిపిస్తూ ఉంటుంది, ఆమె పుట్టగానే నవ్విందేమో అని! ఆమెను నేను మొదటిసారి వరంగల్‌ గౌతమి ఇంజనీరింగ్‌ కాలేజీలో చూడటం ఇప్పటికీ అలాగే గుర్తుంది. నా ఫ్రెండ్‌ వరుణ్‌ అదే కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. ఆ రోజు కాలేజీలో పార్టీ ఉంటే నన్ను కూడా బలవంతంగా తీసుకెళ్లాడు.పార్టీ కావడంతో కాలేజీలో చాలా హడావుడిగా ఉంది. నాలుగు స్తంభాలు ఉన్న దగ్గర నేను నిలబడి ఆలోచిస్తున్నా. ఉన్నట్లు ఉండి ఆకాశం చల్లగా మారింది. రాను రానూ వర్షపు జల్లు నవ్వుతూ పడింది. దూరం నుంచి తెల్లటి డ్రెస్‌లో ఆ వర్షపు జల్లులో అలా నడుచుకుంటూ ఒక అమ్మాయి వచ్చింది. ఆ వర్షపు జల్లు తనపై పడుతుంటే, నవ్వుతోంది. బహుశా ఆ వర్షపు జల్లు ఆమె కోసమే పడుతున్నట్లు ఆ నిమిషం నాకనిపించింది.ముఖంపైకి వచ్చి పడుతున్న కురులను తన చేతి వేళ్లతో అందంగా వెనక్కి నెట్టిపడేస్తూ చిన్ని చిన్ని అడుగులు వేస్తోంది. ఇంత అందమైన అమ్మాయిని చూడటానికే ఈ రోజు ఇక్కడికి వచ్చినట్లు నా మాటలు నా గుండెకి తాకాయి.

ఇది ఆమెపై కలిగిన ప్రేమో, లేక ఆకర్షణో తెలియదు. కానీ, ఆమెకోసం ఏదైనా చేయొచ్చని మనసుకు అనిపించింది. ఇలా అనిపించడం కూడా నాకే వింతగా ఉంది. నా ఫ్రెండ్‌ వరుణ్‌ను పిలిచి ఆ అమ్మాయి ఎవరని అడిగాను.పేరు రమ్య. ఫస్ట్‌ ఇయర్‌. వరుణ్‌ ఆ అమ్మాయి గురించి చెబుతుంటే, వెళ్లి పరిచయం చేసుకోవాలనిపించింది. కానీ, ఏమో అప్పుడు ఆ సాహసం చేయలేదు. ఆమెకూ నేను నచ్చాలి కదా. అయినా, నేను ఎవరని ఆమె నాతో మాట్లాడుతుంది! ఒక్కటా.. రెండా.. ఎన్నో ప్రశ్నలు. అన్నీ తన చుట్టే! తనని చూసిన తర్వాత ఆరు గంటలు జరిగిన పార్టీ, అర నిమిషంలో ముగిసినట్లు అనిపించింది. తననివదిలి ఇంటికి వెళ్లాలనిపించలేదు. ఇదే విషయాన్ని వరుణ్‌కి చెప్పాను.‘ప్రేమ ఏంట్రా చరణ్‌! అయినా ఒక్క రోజులో ప్రేమ పుడుతుందారా? ఇవన్నీ వద్దు. టైం వేస్ట్‌ చేసుకోకురా. ఇంకో రెండు సంవత్సరాలు అయితే నీ ఇంజనీరింగ్‌ అయిపోతుంది. మంచి జాబ్‌ వస్తుంది. అప్పటికి ఆ అమ్మాయి థర్డ్‌ ఇయర్‌లోనే ఉంటుంది. అప్పుడు తనకి నీ విషయం చెప్పు. ఏమంటుందో చూడు. తనకీ ఇలాంటి ఫీలింగే ఉంటే, నీ లైఫ్‌ బాగుంటుంది’ అన్నాడు.‘అంటే ఏంట్రా నువ్వనేది, ప్రేమించిన ప్రతి వాడు చదువుని పక్కనపెట్టి అమ్మాయిల కోసమే తిరుగుతాడా?’‘తిరుగుతాడో లేదో నాకు తెలియదు చరణ్‌! కానీ నువ్వు ఆ అమ్మాయి కోసం ఇంత రిస్క్‌ చేయొద్దు. ఎందుకంటే, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి.’‘అయితే రేపు కాలేజ్‌కి వచ్చి నా ప్రేమ విషయం చెప్తా’‘హా. వెళ్లి చెప్పు. చెప్పు ఎలా ఉందో చూశావా అని సినిమా స్టైల్లో రిప్లయ్‌ ఇస్తుంది’‘ఎందుకు రా వరుణ్, నెగటివ్‌గా ఆలోచిస్తున్నావ్‌?’‘సారీ రా. కానీ ఆమె నాకు ఇవన్నీ నచ్చవంటే నువ్వు బాధపడతావ్‌. అది నేను చూడలేను. నా మాట విని నువ్వు ఒక టూ ఇయర్స్‌ వెయిట్‌ చెయ్యి’‘సరే రా వరుణ్, నాకు నా మీద కంటే నీ మీద  నమ్మకం ఎక్కువ. నువ్వు చెప్పినట్లే నా చదువయ్యాకే ఆమెని కలుస్తా‘ అని వాడికి మాటిచ్చా.’

వాడికి ఇచ్చిన మాట ప్రకారమే, ఆమె నుంచి దూరంగా వచ్చేశా. చాలాసార్లు వరుణ్‌కి చెప్పకుండా ఆమెని చూడాలనిపించేది. కానీ, ఆమెను చూశాక నేను ఇక హైదరాబాద్‌కి మళ్లీ వెళ్లనేమో అనిపించింది. అలా చేస్తే నా ఫ్రెండ్షిప్‌ పాడైపోతుంది. ఏదేమైనా ఆమె నాకోసమే పుట్టిందన్న ఆ చిన్న నమ్మకంతోనే సంవత్సరం గడిపేశా. తర్వాత వరుణ్‌కి సెలవులని తెలిసి కలవడం కోసం వరంగల్‌ వెళ్లా. ఆ టైంలో రమ్య గురించి వరుణ్‌ని చాలాసార్లే అడిగాను. వాడు సమాధానం చెప్పలేదు. ఇక నేను అడగదల్చుకోలేదు. నాలుగు రోజులు ఉండి, తిరిగి హైదరాబాద్‌ వెళ్లేందుకు బస్టాండ్‌కి వెళ్లా. రాత్రి సరిగ్గా పన్నెండవుతోంది. బస్‌ టిక్కెట్‌ తీసుకుని లోపలికి వెళ్లి కూర్చున్నా. బస్‌ మొత్తం ఫుల్‌ అయింది కానీ, నా పక్కనున్న సీట్‌ మాత్రం ఖాళీగానే ఉంది. అప్పుడే వచ్చింది ఓ అమ్మాయి. కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖం కనిపించకుండా స్కార్ఫ్‌ కట్టుకుంది. రాత్రి ఒంటిగంట అవుతోంది. ఆ అమ్మాయి హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటోంది. ముఖానికున్న స్కార్ఫ్‌ మాత్రం తీయలేదు. పాటలు వింటూనే నిద్రలోకి జారుకుంది. నేను విండోవైపు తిరిగి పడుకున్నా. ఫోన్‌ కింద పడిన శబ్దం వినిపించి లేచా. కానీ ఆమె నిద్రలోనుంచి ఇంకా బయటకు రాలేదు. ఫోన్‌ పైకి తీశా. ఆమె నిద్ర ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూస్తున్నా. సరిగ్గా సగం దూరం వచ్చాక లేచింది. ‘‘ఏంటి అలా చూస్తున్నావ్‌?’’ అని సీరియస్‌గా అడిగింది.

‘కాదండి. మీ ఫోన్‌ కింద పడిపోయింది. మీరు లేస్తే ఇద్దామని చూస్తున్నా’ అన్నాను.‘అయ్యో! క్షమించు. నిద్ర పట్టేసింది, చూసుకోలేదు. చాలా థ్యాంక్స్, ఫోన్‌ ఇచ్చినందుకు.’ అని తన స్కార్ఫ్‌ వెనక ఉన్నమాటలు కనిపించలేదు కానీ, వినిపించాయి.‘పర్లేదండీ! కానీ చాలాసేపే నిద్రపోయారు మీరు..’‘అదేంటో.. నాకు బస్‌ ఎక్కిన కొద్దిసేపటికే నిద్ర పట్టేస్తుంది. ఇక రాత్రి సమయాల్లో ప్రయాణం అంటే, ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. సరే, మీరు ఏం చేస్తుంటారు?’‘నేను ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ హైదరాబాద్‌లో. మరి మీరు?’‘నేను ఇంజనీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌. ఇక్కడే వరంగల్‌లో..’‘ఓకే. ఏ కాలేజో తెలుసుకోవచ్చా?’‘ఎందుకు?’‘కాదు. నేనొక అమ్మాయిని ఇష్టపడ్డా. ప్రేమించా. ఆ అమ్మాయి మీ కాలేజేమోనని?’‘ఓ సూపర్‌. ఏ కాలేజ్‌ మరి ఆ అమ్మాయి?’‘వరంగల్‌ గౌతమి ఇంజనీరింగ్‌ కాలేజ్‌!’‘అవునా, నేను అరోరా కాలేజ్‌. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి?’‘ఆమె పేరు రమ్య. చాలా అందంగా ఉంటుంది. చూడగానే చాలా ఇష్టపడిపోయా. కానీ, నా ఫ్రెండే.. అప్పుడే ఎందుకు లవ్‌ అని చదువు అయిపోయాక ఆఅమ్మాయిని కలవమని అన్నాడు. కానీ, ఈలోపు ఆ అమ్మాయిని నేను మర్చిపోతానని వాడి నమ్మకం. కానీ, అంత ఈజీగా మర్చిపోలేను. ఇంతకీ మీ పేరు?’‘నా పేరు శ్రీవాణి. ఆ అమ్మాయినిమర్చిపోతావేమో అని నాకు కూడా అనిపిస్తోంది’‘లేదండీ. బీటెక్‌ అయిపోయిన తర్వాత ఆమెకి నా విషయం చెప్తా’‘అచ్చా! చెప్పగానే ఆ అమ్మాయి ఒప్పుకోదు కదా మిస్టర్‌’‘అది నిజమే. బట్‌ వెయిట్‌ చేస్తా. ఒప్పిస్తా. నన్ను ఒప్పుకుంటుందన్న నమ్మకం ఉంది శ్రీవాణి గారు’‘అది ఓకే. కానీ ఈలోపు ఆ అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమిస్తే?’‘మీరు లేనిపోని భయాలు పెట్టకండి ప్లీజ్‌’    ‘జస్ట్‌అడుగుతున్నా. అప్పుడేం చేస్తావ్‌?’‘అలానే జరిగితే, తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటా. కానీ, నాకు నమ్మకం ఉంది. రమ్య నా సొంతం అని’‘సరే, గట్టిగా కోరుకుంటే జరుగుతుంది. నీకు మంచి జరగాలని నేను కూడా కోరుకుంటా’‘చాలా థ్యాంక్స్‌ అండీ. ఆ అమ్మాయి నా సొంతం’ అని మళ్లీ అనేసి నిద్రలోకి జారుకున్నా.

హైదరాబాద్‌ వచ్చింది. పక్కన మాత్రం శ్రీవాణి లేదు. ఆమె ప్లేస్‌లో ఓ లెటర్‌ ఉంది. అది చూశాక నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమయింది.‘హాయ్‌! నిజం చెప్పాలంటే నీ పేరు కూడా నాకు తెలియదు. ఒక అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయిని ఇంతగా ఇష్టపడటం నిజంగా గ్రేట్‌ అనిపిస్తోంది నాకు. ఎందుకు ఇంత సంతోషమంటే, ఆ అమ్మాయిని నేనే కాబట్టి. నువ్వు చదువుతుంది నిజమే. నేనే రమ్యని. నేనేశ్రీవాణీని. నా పూర్తి పేరు రమ్య శ్రీవాణి. నువ్వు నా గురించి చెబుతున్న విషయాలకు నేను చాలా సంతోషపడ్డా. నువ్వు మంచివాడివో కాదో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒకే ఒక్కటి, నువ్వునాకోసం ఎదురుచూస్తున్నావు. నిజం చెప్పాలంటే, బస్సులో నీ మాటలు నా హదయాన్ని కదిలించాయి. ఒక అమ్మాయి కోసం ఆమెకి తెలియకుండా, ఓ అబ్బాయి ఏడాది నుంచి ఇంతలా ఎదురుచూడటం నాకు కొత్తగా అనిపించింది. ఇది నా గురించే కావడం నేను ఇంకా నమ్మలేకపోతున్నా. నా గురించి నువ్వు చెబుతుంటే, నా అనందాన్ని నా స్కార్ఫ్‌ వెనుక దాచేశాను. ఏ అమ్మాయికైనాకావాల్సింది నిజమైన ప్రేమే. నా గురించి అప్పుడే చెబితే నీ చదువుకు అడ్డం అవుతాననే భయంతోనే నేను అరోరా కాలేజ్, నా పేరు శ్రీవాణీ అని చెప్పాను. నువ్వు నాకోసం అప్పుడే ఒక సంవత్సరం ఎదురుచూశావు. ఇంకా ఒక సంవత్సరం నేను నీకోసం ఎదురుచూస్తాను. నువ్వు నాకు ఎప్పుడు ప్రపోజ్‌ చేస్తావో అని’.ఆమె పేపర్‌ మీద రాసిన మాటలు చూసి బస్సులోనే ఎగిరి గంతేశా. ఎప్పుడు రాసిందో, ఎలా రాసిందో అర్థం కాలేదు. కాసేపు గాల్లో తేలాను. ఆ సంవత్సరమంతా ఆ లెటర్‌లోని మాటలనే తన మనసుగా చూసుకుంటూ గడిపేశా. మధ్యలో ఓ పదిసార్లు వరంగల్‌ వెళ్లినా తనని చూడలేదు. ఎందుకంటే, తను నాది కాబట్టి. నా ప్రెండ్షిప్, నా ప్రేమ కోసం సర్దిచెప్పుకున్నా.రెండేళ్ల తర్వాత చదువు పూర్తి చేసి విప్రోలో జాబ్‌ కొట్టి గౌతమి కాలేజ్‌ ముందు నిలబడ్డా. చాలామంది కాలేజీ నుంచి వస్తున్నారు. రమ్య మాత్రం కనిపించలేదు. ఆ బాధతోనే వరుణ్‌ దగ్గరకు వెళ్లాను. ‘రారా చరణ్, ఎలా ఉన్నావ్‌?’ నన్ను చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు వరుణ్‌. ‘వరుణ్, ఈ రోజు మీ కాలేజ్‌కి వెళ్లాను. రమ్య కనిపించలేదు’‘అదేంట్రా కనిపించకపోవడం. సరే, ఈ రోజు రాలేదేమో కాలేజీకి. రేపు వెళ్లి ట్రై చెయ్యి’ఆ మరుసటి రోజు నుంచి దాదాపు నెల రోజులు ఆమె కోసం ఎదురుచూశా. ఏ రోజూ ఆమె కనిపించలేదు. నా మనసుకు గాయం అయినంత పనయింది. ఇదే విషయం వరుణ్‌కి చెప్పాను.అరే చరణ్‌. నాకు కాలేజ్‌ అయిపోయి రెండు నెలలవుతోంది. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. అయినా ఆ అమ్మాయిని నేను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. సరే, నా జూనియర్స్‌కొందరివి నెంబర్స్‌ ఉన్నాయి. వాళ్లను అడిగి తెలుసుకుంటా’ అని దాదాపు ఓ ముప్ఫై మందికి కాల్‌ చేశాడు వరుణ్‌. అందరూ ఎక్కడికి వెళ్లిందోచెప్పలేదనే చెప్పారు. ఓ ఆరు నెలలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతిసారీ వరుణ్‌ నాకు ధైర్యం చెబుతూనే ఉన్నాడు. కానీ గుండెల్లో నిండివున్న తనని అంత ఈజీగా మర్చిపోలేను కదా.

ఓ ఎనిమిది నెలల తర్వాత.. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ కనిపించింది. ‘దూరం’ అనే కథ అది. పూర్తిగా చదివాను. నా గురించే రాసినట్లు ఉంది. ఈ కథ రాసిందెవరో అని చూశా. తనే. రమ్య. ఫోటో చుశాక నాపై వర్షపుజల్లు సంతోషంతో పడినట్లు అయింది. ఎన్ని నెలలైంది అయింది తనని చూసి. ఉండబట్టలేక, ఆ పోస్ట్‌ కిందే ‘కథ చాలా బాగుంది’ అని కామెంట్‌ పెట్టా. తను నాకు రిప్లయ్‌ ఇచ్చింది. నంబర్‌ చెప్పింది.ఫోన్‌ చేశా.‘హాయ్‌ రమ్య. ఆ రోజు నువ్వు నా పక్కనే ఉన్నా గుర్తించలేకపోయా. నా మదిలో రమ్య ఉంది. అందుకే నేను నీ కళ్లలోకి చూడలేకపోయాను. కానీ, ఆ రమ్యే నా పక్కన ఉందని తెలుసుకోలేకపోయా’నిజం చెప్పాలంటే, నువ్వు మంచివాడివి. ఇంత మంచితనం నేను ఎవరి దగ్గరా చూడలేదు చరణ్‌’‘నీ గురించి మీ కాలేజీ ముందు ఎన్నో రోజులు చూశా. చాలా బాధపడ్డా’‘నువ్వు అక్కడికి వెళ్తావని నాకు తెలుసు. కానీ, నీ ప్రేమ కోసం నువ్వు ఎంత ఎదురుచూస్తున్నావో, నీకోసం నేను కూడా అంతే ఎదురుచూస్తున్నా’‘నా ప్రేమ ఫలించింది రమ్యా! నేను ఎదురు చూసినందుకు నువ్వు నా సొంతం అయ్యావ్‌’‘అది నేను ఒప్పుకుంటా చరణ్‌. ఇంట్లో పెళ్లి చేస్తాం అన్నారు. అందుకే అక్కడ నుంచి ఢిల్లీ వచ్చేశా. అక్క దగ్గర ఉన్నాను. నెల క్రితమే బావకి జాబ్‌ హైదరాబాద్‌ షిఫ్ట్‌ కావడంతో అక్కడికి వెళ్లిపోయారు.ప్రస్తుతం రూంలో ఒక్కదాన్నే ఉంటున్నాను. కానీ నిన్ను ఎలా కలవాలో.. నీతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ బాధే ఈ ‘దూరం’ కథ. ఈ కథ నీవరకు వస్తుందని.. నువ్వు కచ్చితంగా చదువుతావని అనిపించింది. నా ఆశే నిజమైంది’‘నాకోసం నువ్వు ఎంతో గొప్ప పనిచేశావ్‌ రమ్యా! నిజంగా ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవాలి నేను’ ‘కచ్చితంగా నాకూ అదే కావాలి. నిన్ను మిస్‌ చేసుకోలేను. నువ్వు నాకోసం ఢిల్లీ వచ్చెయ్‌’ ‘వస్తా. కచ్చితంగా’నెలరోజులు టైం లేకుండా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. తన దగ్గరే ఉండేందుకు ఢిల్లీలో కొత్త జాబ్‌ చూసుకున్నా. ఇది నా జీవితంలో ఎంతో గొప్ప విషయం. నాకు అమ్మ, నాన్న అన్నీ ఇప్పుడు రమ్యనే కాబోతోంది. నాకంటూ ఎవరూ లేరు ఈ జీవితంలో. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంటే, వరుణ్‌ తల్లిదండ్రులే చదివించారు నన్ను.  ఈ ఆనందం ఎన్ని కోట్లు పెడితే వస్తుంది! భగవంతుడు నా మీద దయ చూపాడు. రైల్వే స్టేషన్‌లో దిగా. బ్యాగ్‌ ఓ చేత్తో పట్టుకుని నడుస్తున్నా. రమ్య కాల్‌ చేసింది. 

‘హలో’ అనేలోపు నలుగురు దొంగలు, వెనకాల నుంచి వచ్చి బ్యాగ్‌ లాక్కెళ్లారు. అరసెకను నాకేం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ల వెనుకే పరిగెత్తాను. మధ్యలో ఓ బండరాయి కాలికి తగిలి ఫోన్‌ మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. తర్వాత అది కనిపించలేదు. వాళ్లు నాకు ముప్పై అడుగుల దూరంలోనే ఉన్నారు. వాళ్ల వెనుకే పరిగెత్తాను. పరిగెడుతూ పరిగెడుతూ పక్కనుంచి వస్తున్న బస్సుని చూసుకోకుండా రోడ్డు దాటబోయాను. గట్టిగా బస్సు హారన్‌ శబ్దం. బ్రేక్‌ పడ్డ చప్పుడు. ’ఎయ్‌’ అని ఎవరో బలంగా లాగిన విషయమూ. అన్నీ సెకండ్లలో వినిపించి, కనిపించాయి. నా చేతిని అందుకున్న మనిషిని చూశా. ఆమె నోటి నుంచి ఏవో మాటలు అలా వస్తూనే ఉన్నాయి. అవేమీ వినిపించడం లేదు. ఆమెను అలా చూస్తూ ఉండిపోయా. రమ్య. ఆమె నా రమ్య.  
రమేశ్‌ రాపోలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement