బిత్తి చిత్రాల మ‌యూరి | Funday story of the world | Sakshi
Sakshi News home page

బిత్తి చిత్రాల మ‌యూరి

Published Sun, Mar 24 2019 12:50 AM | Last Updated on Sun, Mar 24 2019 12:50 AM

Funday story of the world - Sakshi

ఫుల్‌పతియాకు దేవత పూనినట్లు ఉంది. వాళ్లమ్మకేమో భూమి అనేది లేదు. కాలువ సూపర్‌వైజర్‌ నీటితీరువా ట్యాక్సు పదిహేను రోజుల్లోపల కట్టమని ప్యూనుతో నోటీసు పంపాడు. అలా కట్టకపోతే ఆస్తిని, పశువులను జప్తు చేస్తామని నోటీసులో ఉంది.  ఫుల్‌పతియా ఉగ్రురాలైంది. ‘‘ఇన్స్‌పెక్టరూ అరెస్టు చెయ్యాలంటే నన్ను అరెస్టు చెయ్యండి.  ఈ వృద్ధాప్యంలో మా అమ్మ చేతికి సంకెళ్లు వేయడం మాత్రం నేనొప్పుకోను. నా బొందిలో ప్రాణముండగా నేనది జరగనివ్వను.’’ఈ విషయం తెలుసుకొని ఊళ్లోని వాళ్లందరూ పొలాల్లోంచి, తోటల్నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడ గుమిగూడారు. పద్దెనిమిది సంవత్సరాల ఫుల్‌పతియా అమ్మను వెనకేసుకుని ‘‘నా ప్రాణం పోనీ. నా శవం ఇక్కడి నుంచి వెళ్లినా, నేను మాత్రం ఇది జరగనివ్వను’’ అని బిగ్గరగా అరిచింది. మాటిమాటికీ ఉమ్మేస్తూ.. కారణం లేకుండా మాటిమాటికీ నవ్వే వాడు తోఫాలాల్‌ సాహు అందరికంటే ముందు పరుగెత్తుకుంటూ వచ్చి, ఇన్స్‌పెక్టరుకు సలామ్‌ చేసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎదురుగా నిలబడ్డాడు అదను దొరికితే మాట్లాడాలని. ఆ ఊరిలో ఎవరికి ఏ ఆపద సంభవించినా, ఏ దుర్ఘటన జరిగినా, తండ్రీ కొడుకుల మధ్య పోట్లాట జరిగినా, ఎవడైనా తన భార్యను కొట్టినా అందరికంటే ముందు తోఫాలాల్‌ ఆ స్థలానికి చేరుకుంటాడు. ఇతరులు కష్టాల్లో ఉండటం చూస్తే అతనికి మహానందం కలుగుతుంది. ఎక్కడైనా ఎవరికైనా మంచి జరిగితే ఆ చల్లని సమాచారం విని అతనెప్పుడూ అక్కడికి వెళ్లడు. ఇప్పుడేమో ఫుల్‌పతియా అమ్మ అరెస్టు మాట విని అందరి కంటే కూడా ఎక్కువ సంతోషం కలిగింది అతడికి. తన తమ్ముని కూతురి పెళ్లి సందర్భంలో ‘‘వదినా, నీవు వచ్చి పెళ్లిమండపం దగ్గర గోడలపై బొమ్మలు గీచిపెట్టు ఫుల్‌పతియా వాటికి రంగులు వేస్తుంది’’ అని ఫుల్‌పతియా అమ్మను బతిమాలాడాడు. కానీ ఆవిడ కాదంటే కాదు అంది.

నడుము నొప్పిగా ఉందని ఏదో సాకు చెప్పింది. అప్పుడు కూడా ఫుల్‌పతియా ఎగతాళి చేస్తూ ‘‘పోరాదే అమ్మా! తోఫా కాకా పట్నం నుంచి మంచి డాక్టరును పిలిచి వైద్యం చేయిస్తాడులే’’ అని అంది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు తోఫాలాల్‌కు ఫుల్‌పతియా అమ్మను, ఫుల్‌పతియాను ఎగతాళి చేస్తూ నవ్వే అవకాశం లభించింది. ‘‘ఫుల్‌పతియా ఎదిగినదానివి, పెళ్లికానిదానివి ఎందుకు పోతావే జైలుకు. ఇప్పుడు మీ అమ్మ పోతే పోనీలే. మీ అమ్మ జైలుకు పోతే జైల్లో సర్కారీ డాక్టరు ఉచితంగా వైద్యం కూడా చేస్తాడు.’’ అంటూ వెకిలిగా నవ్వుతూ అన్నాడతను.‘‘నువ్వు నోరు మూసుకుంటావా లేదా..’’ అని గద్దించి తోఫాలాల్‌ నోరు మూయించింది.ఇంతలోనే ఊరి సర్పంచ్‌ తాహా మియా కూడా వచ్చాడు. వస్తూనే గవర్నమెంట్‌ వాళ్ల మనిషి మాదిరి ‘‘నీకేమైనా పిచ్చి పట్టిందా? ఊరుకో’’ అని ఫుల్‌పతియాని గద్దించాడు.ఫుల్‌పతియా ఈ రోజు ఎవరి మాటా వినేట్లు లేదు. ఊరికి పెద్దగానీ, సర్పంచ్‌గానీ.. తాహా మియా మాటకు అడ్డొస్తూ.. ‘‘మాకు ఈ రోజు ఎవరడ్డు వచ్చినా వాళ్లను వదిలేది లేదు. సర్పంచ్‌ గానీ, గిర్పంచ్‌ గానీ’’ అంటూ బల్లగుద్దినట్టు ఫుల్‌పతియా అన్నది. ఇన్స్‌పెక్టర్‌ ఫుల్‌పతియా దగ్గరకొచ్చి నిలబడిచేతులెత్తి నమస్కారం చేస్తూ, ‘‘ఏమండీ, నేను ఇన్స్‌పెక్టర్‌ని కాదు. ఎవరినీ అరెస్టు చేయడానికి రాలేదు. నేను కుటీర శిల్ప విభాగం, పట్నా నుంచి వచ్చాను. నేను వచ్చిన పనేమిటంటే..’’ అన్నాడు.అతని మాటలు విని అక్కడ గుమిగూడిన వాళ్లంతా గొల్లుమన్నారు. ‘‘భలే! ఎవరూ ఏమీ తెలుసుకోకుండానే ఏమిటనీ ఇంత రాద్ధాంతం.’’

కానీ ఈ విషయం నవ్వులాటగా ఉండిపోలేదు. నెమ్మది నెమ్మదిగా ఊరంతా పాకింది. ‘‘ఏమి విడ్డూరం. ఇదెక్కడైనా విన్నారా? పట్నా నుంచి ఎవరో జెంటిల్మన్‌ ఆఫీసర్‌ వచ్చి ఫుల్‌పతియా రాసిన చిత్రాలను చూసి, వీటిని ప్రింటు చేసి అమెరికా, రష్యా పంపిస్తారట’’ ‘‘ఎవరిని పంపుతారట రష్యా, అమెరికాలకు.. ఫుల్‌పతియా అమ్మనా?’’‘‘డబుల్‌ ఇనామ్‌ ఇస్తానన్నారట. కానీ అతనేమో, చూడటానికి మన దేశపువాడిలాగే ఉన్నాడు.’’‘‘ఫుల్‌పతియా అప్పుడేమో గర్జించింది. ఇప్పుడు చూడుపో, పట్నం నుంచి వచ్చిన ఆ ఆఫీసర్‌కు రకరకా వంటకాలు తయారు చేస్తోంది.’’‘‘అతడు మన అన్నం తింటాడా? ఏ కులస్తుడో మరి?’’‘‘ఫుల్‌పతియా అమ్మ అదృష్టం లేచొచ్చిందనుకో’’‘‘అది కాదురా పాపం, ఆవిడ ఆస్తిపాస్తులను భర్తను పోగొట్టుకుని ఎన్ని కష్టాలు అనుభవిస్తోందో నీకేం తెలుసు? ఇంటి వాకిళ్లకు ‘శుభ్‌లాభ్‌’ పెండ్లీ పేరంటాలప్పుడు ఊళ్లో వాళ్ల ఇంటి గోడలకు పూలు, తీగలు, వాటి మధ్య దేవుళ్లు దేవతలను చిత్రిస్తోంది కదా! ఆ సుకృత ఫలమే ఇది. మనం అంటాం గానీ భగవంతుడు గుడ్డివాడేమీ కాదు..’’‘‘ఇంకేమీ ఫర్వాలేదు. ఫుల్‌పతియా పెళ్లి కూడా జరిగిపోతుంది. పెళ్లి ఖర్చులకు అమెరికా, రష్యాల నుంచి పైసలొచ్చేస్తాయి.’’గులాబీ రంగు దిండుపైన గంజాయి ఆకులను కత్తెరతో కత్తిరిస్తూ అనూప్‌లాల్‌– ‘‘ ఏమిటేమిటో వాగుతున్నారే. ముందు ఆ వచ్చిన మనిషి ఎవడు? అసలోడా, నకిలీవాడా.. అన్నీ ఆలోచించాలి కదా. మీకు గుర్తుంది కదా ఒకసారి నకిలీ లాటరీ కంపెనీ వాడు, నకిలీ ఏజెంటు వచ్చి లబ్‌బోలియా ఊరులోని మరచూ మహతోను మోసం చేసి యాభై రూపాయలు కాజేశాడు. అప్పుడు అన్ని ఊళ్లల్లో పుకార్లు పుట్టించారు కదా, మరచూ మహతో లాటరీలో లక్షాధికారి అయ్యాడని! యాభై రూపాయల స్టాంపు పేపరు కొని, దానిపైన అఫిడవిట్‌ రాయించాడు. అఫిడవిట్‌ చూపించి, బ్యాంకు నుంచి లక్ష రూపాయలు తీసుకో అన్నాడు. మరేమైందో మనందరికీ తెలిసిన విషయమే కదా. మరచూ మహతో ఆ దెబ్బకు పిచ్చోడైపోవాల్సింది. అదృష్టం బాగుండి పిచ్చివాడు కాలేదు.’’ అని అన్నాడు.

అందరూ నవ్వారు. రామ్‌ఫల్‌ మాటలు అల్లేదాంట్లో నేర్పరి. ‘‘మరచూకు లక్షరూపాయలు దొరకలేదు గాని  ఓటర్ల లిస్టులో అతని పేరు మహతో లక్షాధికారి అని నమోదైంది. అరే ఒకటే ఊరిలో ఇద్దరు మరుచూలు, ఇద్దరూ మహతోలే! ఓటర్ల పేర్లు నమోదు చేసుకునే ఆయన ఒకటే పేరుతో ఇద్దరు వ్యక్తులుంటే చాలా తంటా అవుతుంది అన్నాడు. అప్పుడు మరచూ మహతోను ఊళ్లో వాళ్లు ఎగతాళికి లక్షాధికారి అంటారని చౌకీదారు అన్నాడు. ఇంకేముంది నమోదు చేసే ఆయన ఆ విధంగా నమోదు చేసుకున్నాడు.’’నాగేశర్‌ దాస్‌ ఆ ఊళ్లో అబద్ధాలకోరని ప్రతీతి– కానీ అతను చెప్పేదంతా ఊళ్లో వాళ్లు శ్రద్ధగా వింటారు. ‘‘మరచూ మహతోకు తగిలిన లాటరీలో ఒక రహస్యముంది. అది మీలో ఎవరికన్నా తెలుసా?’’ అన్నాడు. ‘‘మరచూ దగ్గరకు వెళ్లి నీవు ఐదువేల రూపాయలు ఖర్చు చేశావంటే మంచి వయసులో ఉన్న వితంతువుతో నీ వివాహానికి ఏర్పాటు చేయిస్తానన్నాడు. మరచూ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నట్లు ఒక కాగితం మీద రాయించుకున్నాడు. పాపం మరచూకు లాటరీ తగల్లేదు. కానీ జోఖన్‌ అతని చేత రాయించుకున్న కాగితాన్ని ఆధారంగా పెట్టుకుని మరచూ మాట తప్పినందుకు అతని రెండు గేదెలను..’’‘‘ఏమయ్యో, ఈ మనిషి  తప్పకుండా సీఐడీ అయి ఉండొచ్చు. లేకపోతే పట్నాల్లో ఫొటోలు, చిత్రాలుకరువా, చిన్న చిన్న పాన్‌ దుకాణాల్లో కూడా ఒక దాని కంటే మించి ఒకటికి మించిన రంగు రంగుల దేవతల, దేవుడి బొమ్మలు గల కేలండర్లు వేలాడుతూ ఉంటాయి. అలాంటప్పుడు పట్నం నుంచి ఈపల్లెటూరికి వచ్చి, ఈ పల్లెటూర్లో గోడలపై రాసిన చిత్రాలపై మోజుపడటం నమ్మదగిన మాటేనా’’ అని ఒక మధ్య వయస్కుడన్నాడు.సాయంత్రం బండి ఎక్కిపోయే ముందు ‘‘వచ్చేవారం మీకు ఉత్తరం రాసి అన్ని విషయాలూ తెలియజేస్తా’’మని ఫుల్‌పతియా అమ్మతో చెప్పి పోయాడు ఆ జంటిల్మన్‌.‘‘బాబూ, అన్ని విషయాలూ చెప్పావు. గానీ నీ పేరు మాత్రం చెప్పలేదు’’ అంది ఫుల్‌పతియా అమ్మ.‘‘నా పేరు సనాతన్‌ ప్రసాద్‌’’ అన్నాడు నవ్వుతూ.‘‘తెలియక కోపంతో ఏమేమో అన్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకండి’’ అంది ఫుల్‌పతియా సిగ్గుతో తలవంచుకుని.‘‘ఉహూ.. మనసులో ఉంచుకుంటాను. నీవునాతో ఏమన్నావు..‘నన్ను అరెస్టు చేయండి’ అని అన్నావు!’’ సనాతన్‌ ఎగతాళిగా ఆమె వైపు చూస్తూ అన్నాడు.

ఫుల్‌పతియా ముఖం సిగ్గుతో ఎర్రబడింది.పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లిపోయింది. లక్ష్మి వచ్చిందంటే పైకప్పును కూడా చీల్చుకొని వస్తుంది అంటే ఇదేనేమో. పద్దెనిమిది పంతొమ్మిదేళ్ల కిందట ఫుల్‌పతియా నాన్న కోర్టు వ్యవహారాల్లో ఉన్న ఆస్తినంతా తగలేసి, తను తగలబడిపోయాడు. కోర్టుకేసులో ఓడిపోయాననే దుఃఖంతో విషం తాగి చనిపోయాడు. అప్పటి నుంచి ఊళ్లో వాళ్ల ఇళ్లల్లో దంచి, విసరి ఒడిలో ఉన్న ఒక్కగానొక్క సంతానాన్ని సాకింది. తన చేతిలో ఉన్న నైపుణ్యం వల్ల ఊళ్లో పేరు ప్రతిష్ఠలుండేవి. కానీ ఇప్పుడు కాగితాలపైన ప్రింటైన రంగురంగుల చిత్రాలు రావడంతో ఇప్పుడు పెళ్లి పేరంటాలకు గోడలపై ముగ్గులూ రకరకాల బొమ్మలూ అలంకరించడానికి ఆమెను ఎవరూ పిలవడం లేదు. నిన్న పోస్ట్‌మ్యాన్‌ వచ్చి ఆమెకు రెండొందల యాభై రూపాయలు మనియార్డరు వచ్చిందని డబ్బులిచ్చిపోతే అప్పుడనిపించింది ఊళ్లోవాళ్లందరికీ పాతకాలపు వస్తువులన్నీ బేకారు కాదని. ‘‘పాట్నా నుంచి వచ్చిన ఆ వ్యక్తి నకిలీ కాదని, అసలైన ఆఫీసరేనని ఊరిలోని అందరికీ తెలిసిపోయింది.వారం పది రోజుల తర్వాత సనాతన్‌ ప్రసాద్‌ మళ్లీ ఆ ఊరికొచ్చాడు. ‘‘ఫుల్‌పత్తి అమ్మ వెళ్లిపోయిందని– పాట్నాకు కాదు సరాసరి ఢిల్లీకి, సనాతన్‌ ప్రసాదే ఆమెను తీసుకెళ్లాడని, ఢిల్లీలో ఒక్కొక్క భిత్తి చిత్రానికి వెయ్యి రూపాయలు మజూరీ ఇస్తారట అని ఊళ్లో వాళ్లకితెలిసిపోయింది.’’‘‘మజూరీ కాదు, బక్షీస్‌ అను.’’‘‘ఫుల్‌పత్తీ! వెంటపోలేదా?’’‘‘పోలేదు. ఏదో ఊళ్లో టీచరుగా పనిచేసే ఆవిడ అత్త వచ్చిందట. ఇక్కడే పది పదిహేను రోజులుండి పోవడానికి సెలవు తీసుకొని వచ్చిందట.ఇక చూడండి. అందరూ వచ్చి చేరుతారు– మామాఅత్త, పెద్దమ్మ–పెదనాన్న, మేనత్త–మేనమామ.. వీళ్లే కాకుండా అమ్మవైపు వాళ్లు, నాన్నవైపు వాళ్లు బంధుత్వం కలుపుకుంటూ వస్తారు. ఇంతకు ముందెన్నడూ వీళ్లను పట్టించుకోని వారంతా వస్తారు.’’ చాలా రోజుల తర్వాత స్టేషన్‌ బజారులో ఉండే బదరీ భగత్‌ ఫుల్‌పత్తీ అమ్మ ఫొటో పడిన పేపర్‌ తీసుకొని వచ్చాడు. చాలా పెద్ద ఆఫీసరు చేత్తో ఫుల్‌పత్తి అమ్మ బహుమానం తీసుకుంటున్నఫొటోఅది.భగత్‌ ఉండేదేమో స్టేషన్‌ బజారులో. జాతికి కోమటాయన. బియ్యం, పప్పుల ధరలతో పాటు ప్రపంచంలో జరిగే సమాచారమంతా తెలుసుకొంటాడు. ఎప్పుడూ పేపరు చదువుతూనే ఉంటాడు. ‘‘ఏరోజు ఫుల్‌పత్తి అమ్మ తిరిగొస్తుందో ఆ రోజు మనమందరమూ స్టేషన్‌ వద్ద ఆమెకు బ్రహ్మాండంగా స్వాగతం పలకాల’’ని అందరికీ చెప్పాడు. వెదుర్లతో బోదతో స్వాగత తోరణాలు కట్టించి, వాటికి మట్టి మెత్తి ఆ మట్టి గోడలపైన ఫుల్‌పత్తితో బొమ్మలు గీయిద్దాం. ఓ ఫులోదీదీ నీకు సంక్రమించిన అమ్మ విద్యను జాగ్రత్తగా నేర్చుకున్నావంటే నీకు కూడా ఒక రోజు సర్కారోళ్లు బహుమానం ఇస్తారు. అప్పుడు మన ఊరు పేరు ప్రతిష్ఠలు ఆలిండియా ఏమిటి, ఇండియా బయటికి కూడా వ్యాపిస్తాయి. ఈ పేపరులో ఏమి రాశారో తెలుసా? శ్రీమతి ఫణియా ఉరఫ్‌ పన్నాదేవి తాను గీసే ప్రతి చిత్రంలో వచ్చీరాని భాషలో తన పేరుతో పాటు తన ఊరు జిల్లా పేరు కూడా తప్పకుండా రాసుకుంటుంది. మీరే చెప్పండి అలాంటప్పుడు మన ఊరి పేరు గణింపులోకి వస్తుంది కదా’‘‘అవును మరి.’’‘‘పన్నాదేవికి జై పన్నాదేవికి జై!’’ ఊరిలోని యువకులందరూ జయజయ ధ్వానాలు చేశారు. ఇప్పుడు ఫుల్‌పత్తి చెయ్యి బాగా తిరిగింది. అమ్మ విద్యను ఆకట్టుకుంది.

‘‘ఎందుకు రాదు. అమ్మ చేత నేర్చుకునేటప్పుడు ఫుల్‌పత్తి తక్కువ దెబ్బలు తిందా’’ అంది ఫుల్‌పత్తి అత్త. ఆమె తన ఊరు పోరియాలోని కన్యా పాఠశాలలో పంతులమ్మ. ఎప్పుడూ తాంబూలం నములుతూ ఉంటుంది. ఆవిడ బదరీ భగత్‌తో ‘‘మిగతా పనులన్నీ వాళ్ల అమ్మ ఉన్నప్పుడు ఫుల్‌పత్తినే చేసేది. నానిన బియ్యాన్ని బండపై చాలా మెత్తగా నూరటం, పిండిని పాలల్లో కలపటం, ఆ తర్వాత అడవి చెట్టు ‘మేధాకార్‌’ చిగుళ్లను దానిలో వేసి బాగా చిలకటం, బొమ్మలు గీసే పుల్లలకుగుడ్డపీలికలు చుట్టడం, రంగులు కలుపుకోవడం అలాంటి పనులన్నీ ఫుల్‌పత్తి చిన్నప్పటి నుంచే చేస్తూ ఉంది. ఎప్పుడైనా పిండి కొంచెం మందమైనా చిత్రాలు గీసే పుల్లలకు కట్టిన గుడ్డ పీలికలు వదులైనా, లేకరంగులు ఎక్కువ చిక్కగా తయారైనా లేక పల్చనయినా జుట్టు పట్టుకుని వీపుపైన బాదేది ఢమా ఢమా!’’‘‘మామీ, ఫుల్‌పత్తిని మీ ఇంట్లో ఉంచుకుని నాలుగు అక్షరాలు నేర్పిస్తే బాగుంటుంది కదా’’ అని బదరీ భగత్‌ అన్నాడు. ‘‘నిజమేనండీ భగత్‌గారు, ఫుల్‌పత్తిని లోయర్‌ వరకు చదివించి, రామాయణం చదవడంనేర్పించిన తర్వాత అప్పర్‌ ప్రైమరీ కూడా చదివించాలనుకున్నా. కాని వాళ్లమ్మొండి పట్టు పట్టింది. పిల్లను ఇంక చదివించకూడదని, అక్కకూ ఒకటే కూతురు కదా! మనమేం జేస్తాం.’’ ఆ అత్త అన్నది.‘‘ఇక నీవే ఏదో ఒక మంచి సంబంధం చూసి, ఫుల్‌పత్తికి పెండ్లి చేయించు. అంతో ఇంతో ఇవ్వాల్సి వచ్చినా ఫర్వాలేదులే’’ అన్నాడు భగత్‌.దరీ భగత్‌ ఇచ్చిన జర్దా నోట్లో వేసుకుంటూ, ‘‘బదరీ బాబు, మంచి సంబంధం దొరికేది ఉందే అదంతా భగవంతుని చేతిలో ఉంది. భగవంతుడి దయ ఉంటే ఏ పనైనా సులువుగా అయిపోతుంది’’ అని అంది.నాగేశర్‌ దాస్‌ మళ్లీ ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘జోఖన్‌ ఇక్కడ విచారించి ముందు వెనుకా చూసి ఒక సంబంధం చూశాడు.ఫుల్‌పత్తిఅమ్మ ఐదువేలు అడ్వాన్స్‌ ఇచ్చి ఉంటే పెళ్లికొడుకు దొరికుండేవాడు. కానీ ఫుల్‌పత్తి అత్తకు సంబంధం నచ్చలేదు.’’ఫుల్‌పత్తి అమ్మ తిరిగొచ్చింది.


తన వెంట తనకు లభించిన ఇనాము బాపతు సరుకు మూడు ఎడ్ల బండ్లలో వెంట తీసుకొచ్చింది. స్టేషన్‌ వద్ద జయజయ ధ్వానాలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. నిజంగానే ముచ్చటైన స్వాగత తోరణాలు కట్టారు. స్టేషన్‌ వద్ద ఫుల్‌పత్తి నైపుణ్యం– ఎనిమిదణాల నుంచి పన్నెండణాల వరకు పెరిగింది. సనాతన్‌ ప్రసాద్‌ కూడా వెంట వచ్చాడు. బండి దిగుతూనే అతని దృష్టి అందరికంటే ముందు స్వాగత తోరణాలపై ఉన్న చిత్రాలు, వాటి కళా నైపుణ్యంపైన పడింది. వాటి ఫ్రేము తయారు చేయడం, కలశ నిర్మాణం, పువ్వుల తీగల అల్లికలతో కూడిన చిత్రాలు చాలాసేపటి వరకు అతను వాటినే చూస్తుండిపోయాడు. ఇంటికెళ్లిన తర్వాత ఫుల్‌పత్తిని అడిగాడు. ‘‘ఎర్రరంగు చేపలు ఏ నదిలో దొరుకుతాయి. అక్కడ కలశానికి నాలుగువైపులా నువ్వు గీసిన చేపల ఎర్రరంగును చూసి నా మనసులో ఓ ప్రశ్న రేకెత్తింది’’ అన్నాడు.‘‘ఎక్కడేమిటి? మా ఊరిలోని చంద్రభాగా నదిలో జ్యేష్ఠ ఆషాడ మాసాల్లో కురిసే వర్షాల తర్వాత వెళ్లి చూడండి. మీకే తెలుస్తుంది. ఈ చేపల కారణంగానే నది కూడా అప్పుడప్పుడు ఎర్రగామారిపోతుంది. ఈ నదులు మీ పాట్నా వైపు ప్రవహించవా?’’‘‘అటువైపు చంద్రభాగా, కోసి నది గాని, వాటి ఏ ఉపనదిగాని ప్రవహించదు’’ఫుల్‌పత్తి మామ నరోత్తమ్‌ బాబుకు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోనివ్వకుండా ‘‘ఢిల్లీ విశేషాలేమిటి?’’ అని అందరూ చుట్టుముట్టారు.‘‘ఇప్పుడే వచ్చారుగా! మమ్మల్ని ఇంటివిషయాలుకూడామాట్లాడుకోనివ్వండి’’ అని ఫుల్‌పత్తి అత్త వాళ్లతో అంది.ఫుల్‌పత్తి అత్త తన భర్తను లోపలికి తీసుకెళ్లి ఏకాంతంగా అడిగింది. ‘‘ఈ సనాతన్‌ ప్రసాద్‌ ఏమంటున్నాడో నీకు తెలుసా?’’‘‘తెలుసు. అతను అంటున్నది నిజమే! ఇక్కడ ఏముందని? నాలుగు గుడిసెలు, తాతల నాటి కాలంలోని ఒక పాత మిద్దె ఉంది అంతే కదా. మీ అక్క ఈ కొంపలోనే పడి ఉంటే ఏం లాభం? భగవంతుడే దయతలచి ఆమె అదృష్టాన్ని మార్చాలన్నప్పుడు మీ అక్క పట్నంలో పోయి ఉండవచ్చు కదా. ఐదు నుంచి తొమ్మిది వందల వరకు నెలసరి జీతం, లోహిదానగరంలో ఉండటానికి మంచి ఇల్లు, సనాతన్‌ ఆవిడ మంచికే చెప్పాడని ఫుల్‌పత్తి మామ జవాబిచ్చాడు.

‘‘సనాతన్‌ మన బంధువా ఏమన్నానా?’’‘‘బంధువులు ఎవరికి సహాయం చేస్తున్నారు ఈ కాలంలో. మనిషి ఎవరూ? అతని హోదా ఏమిటి? ఇది తెలుసుకుంటే చాలు. మన బం«ధువే అవ్వాల్సిన అవసరం లేదు. సనాతన్‌ గొప్పింటి బిడ్డ. తండ్రి గొప్ప ఆస్తిపాస్తులు సంపాదించి చనిపోయాడు. తండ్రి కట్టించిన పెద్ద ఇల్లుంది. కారుంది. ఏడాదిలో పది పన్నెండువేల చిత్రాలు కొని అమ్ముతుంటాడు. పాట్నాలో పెద్ద పెద్ద చదువుకున్నవాళ్లతోను, క్లబ్బులవాళ్లతోను మంచి పరిచయాలు ఉన్నాయి. పాట్నా కళా అకాడమీ సెక్రటరీగా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి మరి?’’‘‘అక్క దీనికేమంటుంది? అక్కకిది సమ్మతమేనా?’’‘‘సమ్మతం దేనికుండదు? సమ్మతం లేకపోయినా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేయడం మన పని’’ఫుల్‌పత్తి అమ్మ గోవు. గంగిగోవుతో సమానం. ఆవిడ మనసులో ఎలాంటి మోసం, కపటం లేదు. ఆవిడ వాళ్లు చెప్పిన మాటలన్నీ విని అర్థం చేసుకుని రాజీ అయింది. ఈ పిల్ల ఫుల్‌పత్తి ఏమంటుందో?ఫుల్‌పత్తి బొత్తిగా ఒప్పుకోవడం లేదు. ఈ సంబంధం గురించి ఆలోచిస్తున్నారని ఎప్పుడైతే ఫుల్‌పత్తికి తెలిసిందో అప్పటి నుంచి తిండితిప్పలు మానేసి ఇంట్లోనే పడి ఉంది. అమ్మ నచ్చజెప్పాలని ఎంతో ప్రయత్నించి అలసిపోయింది. మామ కూడా ప్రయత్నించి లాభం లేదనుకున్నాడు. నేను నచ్చచెప్పి ప్రయత్నిస్తానంటూ మామి ఫుల్‌పత్తివద్దకు వెళ్లింది.‘‘అమ్మాయీ, ఫుల్‌పత్తి!’’‘‘అత్త ఇక నువ్వొచ్చావా నన్ను ఏడిపించడానికి? ఢిల్లీ పాట్నా పోవాలని నీ మనసు ఉబలాటపడుతోందా? మా తాత తండ్రులు ఉన్న చోటును వదిలి నేనెక్కడికీ పోను. మీరుమొండి పట్టు పట్టారంటే నా శవమే ఈ ఇంటి నుంచి బయటకు పోతుంది’’ అని ఏడవసాగింది.‘చిన్నప్పటి నుంచి ఇంతే ఈ పిల్ల మొండిఘటం..’’సనాతన్‌ ఆలోచిస్తూ కూర్చున్నాడు. గత రెండు రాత్రుళ్లుగా అతనికి నిద్రలేదు. కళ్లు మూస్తూనే అతనికి తన లోపల ఎవరో కూర్చుని ఉన్నట్లు, తనను గుడ్లురిమి చూస్తూ ‘‘నీవు చేసేదేమిటి? బలత్కారమా?కన్నెను అపవిత్రం చేస్తావా? నీ కామోద్రేకం తీర్చుకోవడానికా ఈ కళా వ్యాపారం? హ, హ, హ.. బిగ్‌ స్కేల్‌ ఫేక్‌ ఆర్ట్‌ ఇండస్ట్రీ? హి, హి, హి.. ఇండస్ట్రీ పట్నంలో– మీ ఫ్యాక్టరీలో ఫుల్‌పత్తి, వాళ్ల అమ్మను బలి చేస్తావా? మధుబనీ శైలిలో మర్మజ్ఞుడు. ప్రవక్త, అధికారిగా వ్యవహరిస్తూ లోక కళ్యాణ వాతావరణానికి కళ్లు గప్పి నీవేమో నీ ప్రైవేటు చాంబరులో కూర్చుంటావు.

ఫుల్‌పత్తి, వాళ్లమ్మ వీళ్లే కాకుండా, వందల కొద్దీ కళాకారులు నీ స్లాటర్‌ హోమ్‌లో బలిఅవుతూ ఆక్రందనలు చేస్తారు.’’ అని అడుగుతున్నట్లు అనిపించింది.ఈ వేళ తను ఫుల్‌పత్తితో స్వయంగా మాట్లాడుతాడు.ఈ వేళ ఫుల్‌పత్తి కొంచెం శాంతంగా ఉంది. తన వాకిలి పక్కనున్న గోడపైన అమ్మ గీసిన నెమలి లేఖలపైన రంగు పూస్తోంది.ఆమె దగ్గరికి వెళ్లి సనాతన్‌ అడిగాడు, ‘‘నాట్యం చేసేది మగ నెమలా లేక ఆడ నెమలా?’’‘‘నీవెప్పుడైనా నెమలి నాట్యం చూశావా?’’‘‘ఈ అడవిలో ఉండే కుగ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ ప్రతి వర్షాకాలం నెమళ్లు అరవటం వింటారు. అడవిలో అవి నాట్యం చేయడం కళ్లారా చూస్తారు. అసలు మీరు ఏమి చెప్పదలచుకున్నారో స్పష్టంగాఎందుకు చెప్పరు?’’ ‘‘అదే.. అదే.. మీరు మళ్లీ ఒకసారి ఆలోచించుకోండి!’’‘‘మాటిమాటికీ ఆలోచిస్తే ఏమవుతుంది? ఆలోచించాల్సి వస్తుంది. ఒకేసారి సనాతన్‌ బాబుగారు, మీరు తీసుకుని వెళ్లాలని ఉంటే ఆమె కూడా రావాలనుకుంటేఅమ్మను తీసుకెళ్లండి. అంతేగాని నన్నేమీ అడక్కండి.’’‘‘నాకు తెలుసు. అది వచ్చిన రోజే విన్నాను కదా!’’‘‘మీరు మమ్మల్ని ఏమనుకుంటున్నారు? మమ్మల్ని కూడా బొమ్మల్లోకి జమకట్టారా?’’‘‘అంటే’’‘‘అంటే మీరు డబ్బులిచ్చి ఏమైనా కొనగలరనుకుంటున్నారు.’’‘‘కొనటమా? లేదే! నేనే అమ్ముడుపోవాలనుకుంటున్నాను.’’‘‘సనాతన్‌ బాబు, మీరు చదువుకున్న వాళ్లు. విషయాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు.’’సనాతన్‌ బాబు మౌనం వహించి తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. కొంతసేపాగి ‘‘సరే.. ఒకటడుగుతాను దయచేసి జవాబిస్తారా? అతను ఎవరు? అదే ఆ అదృష్టవంతుడు. మీరు వరించిన అతను ఎవరోచెప్పండి. అతని పేరు విని నేను చాలా సంతోషపడతాను’’ అని అన్నాడు.ఫుల్‌పత్తి గోడపై పింఛాన్ని విప్పి ఆహ్లాదకరంగా నాట్యం చేస్తూ ఉన్నట్లు రంగు రంగులతో చిత్రించబడిన నెమలి వైపు వేలితో చూపిస్తూ, ‘‘అతడే అక్కడ నాట్యం చేస్తున్నాడే అర్థమైందా?’’ అంది.ఒక నిట్టూర్పు విడిచి సనాతన్‌ అన్నాడు. ‘‘అర్థం చేసుకున్నా ఏమీ లాభం లేదు. సరే నాది మరొక కోరిక.. అంటే ప్రార్థన అన్నమాట.’’సనాతన్‌ తన రెండో కోరిక చెప్పుకుంటూ పోతున్నాడు. కానీ ఫుల్‌పత్తి చాలా ఉత్సాహంగా గోడపైన చిత్రించబడిన నెమలి పింఛానికి రంగులు పూస్తూ ఉంది.

ఉన్నట్లుండి నెమలి పింఛాన్ని విప్పి ఎగిరినట్లు అతనికి అనిపించింది. నెమలి అరుపులో అతని మనసులోని బిజూ బన్‌ వికసించింది. మామిడి వనంలో ఉయ్యాల్లో ఊగుతూ బారామాస పాటలు పాడే బాలికల కంఠధ్వని– బిజూబన్‌ కుహూక మయూర్‌.. చాలాసేపటి వరకు ప్రతిధ్వనిస్తూ ఉంది.పల్లెలో మరొకసారి ఈ మాట వ్యాపించింది. పోవడం లేదు. ఫుల్‌పత్తి అమ్మ ఊరు విడిచి ఎక్కడికీ పోదు. తన భర్త ఇల్లు వదిలి ఆమె ఎక్కడికీ వెళ్లదు. కానీ సనాతన్‌ ఊరిలో ఒక సెంటర్‌ తెరవాలని నిర్ణయించుకున్నాడు. పాట్నా, ఢిల్లీ, కలకత్తా నుంచి ఎన్నుకోబడిన బాలికలు, మూడు నెలల ట్రైనింగ్‌ పొందడానికి ఇక్కడికొస్తారు.అంటే ఐదువందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఇంట్లో కూర్చొనే నెలనెలా దొరుకుతాయన్న మాట. దీంతో పాటు జిల్లాలోని ఆడపిల్లలకు కూడా ట్రైనింగ్‌ ఇస్తారు. పేపర్లో కూడా ఈ సమాచారం వచ్చింది. బదరీ భగత్‌ పేపర్లో పడిన ఈ వార్తను చదివి అందరికీ వినిపిస్తున్నాడు. ఈ దఫా పేపర్లో మన ఊరి పేరు పెద్ద అక్షరాల్లో పడింది. ‘‘మోహన్‌పూర్‌ మధుబనీ ఆర్టు సెంటర్‌’’ ఈ సెంటర్‌ బిల్డింగ్‌ శంకుస్థాపనకుదేశంలోని ప్రసిద్ధిగాంచిన చిత్రకారుడు హుస్సేన్‌ను రమ్మని ఆహ్వానించారు.’’వినే వాళ్లందరూ బిగ్గరగా జయజయధ్వానాలు చేశారు. ‘‘మోహన్‌పూర్‌ గ్రామానికి జై.. మోహన్‌పూర్‌ గ్రామానికి జై..’’
హిందీ మూలం : ఫణీశ్వరనాథ్‌ రేణ్డు
తెలుగు : పి.విజయరాఘవరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement