అవధూత కథ | Funday story of the world 25 nov 2018 | Sakshi
Sakshi News home page

అవధూత కథ

Published Sun, Nov 25 2018 1:33 AM | Last Updated on Sun, Nov 25 2018 1:33 AM

Funday story of the world 25 nov 2018 - Sakshi

చాలా శతాబ్దాల కిందట ఫ్లాండర్స్‌ అనే ప్రాంతంలో ముగ్గురు యువకులు కలసి జీవిస్తుండేవాళ్లు. సత్రాలలో, వేశ్యల ఇళ్లలో విచ్చలవిడిగా ఖుషీ చేస్తూ, రకరకాల వాద్యాలను వాయిస్తూ తైతక్కలాడుతూ, రాత్రింబగళ్లు జూదం ఆడుతూ, అడ్డూ అదుపూ లేకుండా అతిగా మద్యం తాగుతూ వాళ్లు మూర్ఖంగా ప్రవర్తించేవారు. ఆ విధంగా అసహ్యకరమైన రీతిలో దయ్యాల కొంపల్లో విపరీతమైన విశృంఖలత్వంతో దయ్యాల ప్రవర్తనతో బతికేవారు. ఒకనాడు ఆ ముగ్గురూ పెందరాళే సత్రంలో కూర్చుని, మద్యం తాగడానికి సిద్ధమయ్యారు. అప్పుడు వాళ్లకొక గంట చప్పుడు వినిపించింది. ఎవరైనా చనిపోతే శవాన్ని శ్మశానానికి తీసుకుపోతున్నప్పుడు మోగించే గంట శబ్దంలా ఉంది ఆ ధ్వని. ఆ ముగ్గురిలోని ఒకడు అటుగా పోతున్న ఒక పిల్లవాణ్ణి పిలిచి, చనిపోయిన వ్యక్తి పేరేమిటో కనుక్కోమని చెప్పి, ‘‘పేరు తప్పుగా చెప్తే తన్నులు తింటావు సుమా!’’ అని బెదిరించాడు. ‘‘అయ్యా, నన్ను దండించే అవసరం లేదు. మీరిక్కడికి రావటంకన్న రెండు గంటల ముందే నాకు విషయం తెలిసింది. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చనిపోయిన వ్యక్తి ఒక ముసలివాడు. అతడు బాగా మద్యం తాగిన మత్తులో ఒక బెంచి మీద కూర్చుని ఉండగా హతుడయ్యాడు. చావు అనే పేరు గల ఒక రహస్య దొంగ వచ్చి, ముసలివాడి గుండె రెండు ముక్కలయ్యే విధంగా బరిసెతో పొడిచి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అతడు ఊళ్లోని మనుషులందర్నీ అట్లానే చంపుతాడు. ఇప్పటిదాకా దాదాపు ఒక వేయిమందిని చంపాడు. అయ్యా, అటువంటి శత్రువు మీకు ఎదురుపడక ముందే ఈ విషయాన్ని మీకు చెప్పాలనిపించింది నాకు. అతణ్ణి ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని నాకు మా అమ్మ చెప్పింది.ఇంతకన్నా ఎక్కువగా మరేం మాట్లాడలేను నేను’’ అన్నాడు ఆ పిల్లవాడు. 

‘‘ఈ పిల్లవాడు చెప్తున్నది నిజం. ఇక్కడికి ఒక మైలు దూరంలో ఉన్న పెద్ద గ్రామంలో ఇద్దరు స్త్రీలనూ, ఒక చిన్న పిల్లవాణ్ణీ, ఒక పనిమనిషినీ, ఒక మోసగాణ్ణీ చంపింది ఈ దొంగే. అతడు ఆ గ్రామంలోనే నివసిస్తాడనుకుంటాను. అదుగో అటువైపు పోతే ఆ గ్రామం వస్తుంది. మీకు హాని జరగక ముందే ఈ విషయం తెలియడం మంచిదయింది’’ అన్నాడు ఆ సత్రపు యజమాని.ముగ్గురిలోని ఒకడైన ఆ దురాత్ముడు ఇలా అన్నాడు: ‘‘వాణ్ణి ఎదుర్కోవడం అంత ప్రమాదకరమా? దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను వాణ్ణి రాచమార్గం మీదనో, చిన్న తోవ మీదనో ఎక్కడో ఒక చోట ఎదుర్కొంటాను.వినండి మిత్రులారా! మనం ముగ్గురం సోదరుల్లాగా మారి, చావు అనే మాయ ద్రోహిని చంపుదాం. ఎందర్నో చంపే ఆ దుష్టుడే ఈ రాత్రి మన చేతుల్లో చస్తాడు. దేవుని సాక్షిగా.’’ఆ ముగ్గురూ ఒకరి కోసం మరొకరు తమ ప్రాణాల్ని బలి పెడతామని ప్రతిజ్ఞ చేసి, సత్రపు యజమాని చెప్పిన దిశగా, తాగిన మైకంలో బయలుదేరారు. ‘చావుగాడిని దొరికించుకుని వధిస్తాం’ అంటూ వాళ్లు ఎన్నో భీకరమైన శపథాలు చేశారు.

ఒక మైలు దూరం పోయి కంచెను దాటుతుంటే, ఒక బీద ముసలివాడు వాళ్లకు ఎదురొచ్చాడు. అతడు వాళ్లకు నమస్కరించి, వినయంగా ‘‘అయ్యలారా, దేవుడు మీకు మేలు చేయుగాక!’’ అన్నాడు. ఆ ముగ్గురు దుర్మార్గుల్లో అత్యంత గర్విష్టి అయిన వ్యక్తి ఇలా బదులు పలికాడు. ‘‘ఓ పొగరుబోతూ! ఇవ్వాళ నీ అదృష్టం బాగా లేదు. నీ ముఖాన్ని దాచుకోవడం కోసం ఎందుకలా మొత్తం శరీరానికి ముసుగు వేసుకున్నావు? ఇంత పెద్ద వయసు వచ్చేదాకా ఎందుకు బతికి ఉన్నావు నువ్వు?’’ఆ ముసలివాడు దురాత్ముని ముఖంలోకి పరీక్షగా చూసి, ‘‘ఎందుకంటే నేను భారతదేశం దాకా నడిచి గ్రామాల్లో, పట్టణాల్లో వెతికినా తన యవ్వనాన్ని నాకిచ్చి, నా ముసలితనాన్ని తాను తీసుకునే మనిషెవరూ కనపడలేదు నాకు. కాబట్టి దేవుడు నన్ను ఎంతకాలం ముసలివాడిగా ఉండమని ఆదేశిస్తాడో అంతకాలం దాక ముసలివాడిగానే ఉండాలి నేను. నా దురదృష్టం కొద్దీ చావు రావడం లేదు నాకు. ఆ విధంగా నేనొక దౌర్భాగ్యపు దొంగముండా కొడుకులాగా విరామం లేకుండా తిరుగుతున్నాను. నా తల్లి దగ్గరికి తోవను చూపే ద్వారం అయిన నేలను పొడుగాటి కర్రతో కొట్టి, ‘నా ప్రియమైన మాతా! నన్ను లోపలికి రానివ్వు. నా రక్తమాంసాలూ, చర్మమూ, కండరాలూ ఎంతగా కృశించిపోయాయో చూడు. నాకెప్పుడు విశ్రాంతి దొరుకుతుంది తల్లీ? నా శరీరంలో భద్రమై ఉన్న హృదయాన్ని నీకు కానుకగా ఇచ్చి, నీ లోపలికి చేరుకుంటాను. ఒక గుడ్డలో నన్ను నేను చుట్టుకుంటాను’ అంటూ మొర పెట్టుకున్నా లాభం లేకపోయింది.అందుకే నా ముఖం పాలిపోయి, వాడిపోయింది. కానీ అయ్యలారా, ఒక ముసలివానితో మీరిట్లా దురుసుగా మాట్లాడటం న్యాయం కాదు, అతడు హద్దులు మీరితే తప్ప. ఈ విషయాన్ని మీరు స్వయంగా మతగ్రంథంలో చదవవచ్చు. ‘ముసలివాడు ఎదురైనప్పుడు వినయంగా, మర్యాదగా లేచి నిలబడు’ అని ఉంది అందులో. అందుకే మీరు ముసలివాడైన నాకు హాని తలపెట్టవద్దని, నేను చెప్పిన ప్రకారం చేస్తే మీరు వృద్ధులయ్యాక ఎవరూ మీకు హాని చెయ్యరనీ సలహా ఇస్తున్నాను. దేవుడు మీకు మేలు చేయుగాక! మీరెక్కడికి పోయినా నేను మాత్రం పోవాల్సిన చోటుకే పోవాలి’’ అన్నాడు.‘‘ఉహు.. నువ్వు పోలేవు నీచుడా! నిన్ను పోనివ్వనని ప్రమాణం చేస్తున్నాను. మమ్మల్ని వదిలి అంత సులభంగా వెళ్లలేవు నువ్వు. ఊళ్లలో మనుషులందర్నీ చంపే ద్రోహి అయిన చావుదయ్యంగాడి గురించి చెప్పావు. నా అనుమానం ప్రకారం నువ్వు వాడి గూఢచారివి. వాడెక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే నిన్ను చంపుతానని హెచ్చరిస్తున్నాను. యువకుల్ని చంపవలసిందిగా చావుకు అనుమతి ఇచ్చే టక్కరి దొంగగాడివి నువ్వే’’ అన్నాడు ఆ దురాత్ముల్లోని రెండవవాడు.

‘‘అయ్యలారా, చావుగాడిని కనుగొనాలని మీకు అంత కోరికగా ఉంటే, ఆ వంకర దారి మీదుగా పోండి. అతడు ఒక చోట్ల తోపులోని వృక్షం కింద ఉన్నాడని నా నమ్మకం. అక్కడే నివసిస్తాడతడు. ఆ ఓక్‌ చెట్టు కనబడుతోంది కదా? సరిగ్గా అక్కడే మీరతణ్ణి చూస్తారు. మానవులకు విముక్తిని ప్రసాదించే ఆ దేవుడే మిమ్మల్ని రక్షించి సరిదిద్దనీ’’ అన్నాడు ఆ ముసలివాడు.ఆ ముగ్గురూ అక్కడికి పరుగెత్తారు. వాళ్లు ఊహించినట్టుగానే అక్కడ ఏడు తూముల నాణ్యమైన బంగారు నాణేలు కనిపించాయి వాళ్లకు. అప్పుడు తాము వెతుకుతున్న వ్యక్తి గురించి మరచిపోయారు వారు. విలువైన ఆ బంగారు నిధిని చూసి ఆ ముగ్గురూ ఎంతగా మురిసిపోయారంటే, వాళ్లు దాని పక్కనే కూర్చుండిపోయారు. వారిలో అందరికన్నా చిన్నవాడు ఇలా అన్నాడు: ‘అన్నలారా, నేను చెప్పేది వినండి. నేనెప్పుడూ నవ్వుతూ ఆడుతూ ఉంటాను కానీ, నాకు గొప్ప జ్ఞానం ఉంది. మనం జీవితాలను సంతోషంగా, హాయిగా వెళ్లబుచ్చటం కోసం అదృష్టదేవత మనకు ఇచ్చిన నిధి ఇది. కాబట్టి దీన్ని అనుభవిద్దాం. ఒకవిధంగా ఇది మనకు దేవుడిచ్చిన విలువైన కానుక. ఇంత మంచి అదృష్టం మనను వరిస్తుందని ఎవరం ఊహించాం? ఈ బంగారమంతా మనదే కాబట్టి, దీన్ని నా ఇంటికో, మీ ఇంటికో తీసుకుపోయి గొప్ప సుఖాన్ని అనుభవించగలమా? దీన్ని పగటిపూట తీసుకుపోతే మనం పెద్ద దొంగలమని భావించి పట్టుకుని, మనను ఉరి తీస్తారు. ఈ నిధిని సాధ్యమైనంత వివేకంతో, చాతుర్యంతో రాత్రిపూట తీసుకుపోవాలి.మనం ఒక నాణెపు బిళ్లను ఎగరేసి, అది ఎవడిని సూచించే విధంగా పడితే వాడే వేగంగా రహస్యంగా పట్టణానికి పోయి ఆహారాన్ని, మద్యాన్నీ తీసుకు రావాలి. మిగతా ఇద్దరూ ఈ నిధిని గుట్టుగా కనిపెట్టుకుని ఉండాలి. రాత్రయ్యాక అందరమూ కలసి నిర్ణయించుకున్న చోటుకు దీన్ని తరలించాలి.’’

ఆ నాణెపు బిళ్ల అందరికన్న చిన్నవాడైన దురాత్మునికి అనుగుణంగా పడటంతో అతడు వెంటనే పట్టణం వైపు వెళ్లిపోయాడు. అప్పుడు ఆ మిగిలిన ఇద్దరిలో ఒకడు మరొకనితో ఇలా అన్నాడు: ‘‘నువ్వు నా సోదరుని వంటి వాడివి కనుక నేను చెప్పింది వింటే లాభపడతావు. మనం ముగ్గురం పంచుకోవటానికి పుష్కలమైన ధనం ఉందిక్కడ. వాడు వెళ్లిపోయాడు కదా. ఇది మనిద్దరికే చెందేలా నేనొక ఉపాయాన్ని చెబితే, నేనొక గొప్ప స్నేహితునిలా నీకు సహాయం చేసినవాణ్ణి అవుతానా లేదా?’’‘‘అదెలా సాధ్యమో తెలియదు నాకు. ఈ నిధి దగ్గర మనమిద్దరం కాపలా ఉన్నామని వాడికి తెలుసు. ఏం చేద్దాం? ఏమని చెప్పుదాం?’’ అన్నాడు ఆ రెండవవాడు.‘‘నువ్వు రహస్యంగా ఉంచుతానంటే నీకో విషయం చెప్పనా? మనం ఏం చెయ్యాలో క్లుప్తంగా చెప్తాను విను’’ అన్నాడు మొదటి దురాత్ముడు.‘‘సరే చెప్పు, నిన్ను మోసగించను’’ ‘‘మనమిద్దరం ఉన్నాం కనుక, ఒక్కడి బలం కన్న మనిద్దరి బలమే ఎక్కువ అవుతుంది. వాడొచ్చిన తర్వాత, సరదా కోసం ఆటాడుతున్నట్టుగా వాణ్ణి నువ్వు పట్టుకో. అప్పుడు నేను కత్తితో వాడి ఛాతి పక్కలోంచి పొడుస్తాను. తర్వాత నువ్వు కూడా నీ కత్తితో వాణ్ణి పొడవాలి. అప్పుడు ఈ బంగారాన్నంతా మనమిద్దరమే పంచుకుందాం మిత్రుడా! ఆ తర్వాత మనం బాగా మద్యం తాగుతూ, జూదమాడుతూ ఇష్టమొచ్చినట్టుగా భోగవిలాస జీవితాన్ని అనుభవిద్దాం. వాణ్ణి చంపటానికి మనిద్దరికీ అనుమతి దొరికిందనుకో’’ అన్నాడు మొదటివాడు.పట్టణానికి వెళ్లినవాడి మనసులో ఆ బంగారు నాణాల ఊహే మళ్లీ మళ్లీ కదలాడింది. ‘ఓ భగవంతుడా! ఆ బంగారమంతా నాదే అయిపోతే, ప్రపంచంలో ఎవ్వడూ నా అంత సుఖంగా బతకడు.’ ఇలా ఆలోచిస్తూ దయ్యం వంటి ఆ దురాత్ముడు ఆఖరుకు తన ఇద్దరు సహచరులకు విషం ఇచ్చి చంపాలని నిశ్చయించుకున్నాడు. సైతాను ఆ దురాత్ముణ్ణి పూర్తిగా ఆవహించి, భవిష్యత్తులో వాడికి అనంత దుఃఖాన్ని కలిగేలా చేసింది. వాడు వెంటనే ఒక మందుల దుకాణంవాడి దగ్గరకుపోయి, ఎలుకల విషాన్ని ఇవ్వమన్నాడు. తన పెరట్లో పెద్ద పందికొక్కు ఉన్నదనీ, అది తన కోడిని చంపిందని, ఆ పందికొక్కును చంపటం కోసం విషం అవసరమని చెప్పాడు. ఆ దుకాణంవాడు ‘‘నేనిచ్చే విషాన్ని గోధుమ పిండిలో కలిపి పెడితే, దాన్ని తిన్న ఏ ప్రాణి అయినా ఆలస్యం లేకుండా చస్తుంది. అవును, ఎంత తొందరగా అంటే ఒక్క మైలు దూరం నడిచే లోపలే దాని చావు సంభవిస్తుంది’’ అన్నాడు.

శాపగ్రస్తుడైన ఆ దురాత్ముడు విషం డబ్బాను గట్టిగా పట్టుకుని, పక్క వీధిలోకి ఉరికి, ఒకడి దగ్గర మూడు సీసాలను అరువు తీసుకున్నాడు. రెండింటిలో విషాన్ని పోసి, మూడవ దాంట్లో తన కోసం కేవలం మద్యాన్ని మాత్రమే పోసుకున్నాడు. ఎందుకంటే శ్రమపడి రాత్రంతా బంగారాన్ని మోసుకు రావాలనుకున్నాడు. తర్వాత తన సహచరుల దగ్గరికి ప్రయాణమయ్యాడు. తర్వాత జరిగిన విషయం గురించి చెప్పాల్సిన అవసరమేముంది? పథకం వేసుకున్న విధంగానే ఆ సహచరులిద్దరూ మూడో దురాత్ముణ్ణి చంపారు. మిగిలిన ఇద్దరిలోని ఒకడు ‘‘ఇక మనం కూర్చుని హాయిగా మద్యం తాగి, ఆ తర్వాత ఈ శవాన్ని పూడ్చేద్దాం’’ అన్నాడు. మద్యపాన కార్యక్రమం మొదలుపెడుతూ వాడు ఒక సీసాలోంచి కొంచెం మద్యం తాగి, మిగిలిన దాన్ని తాగమని అదే సీసాను సహచరునికిచ్చాడు. విధివశాత్తు ఆ సీసాలో ఉన్న మద్యంలో విషం కలిపి ఉంది. ఆ విధంగా వాళ్లిద్దరూ మరణించారు. చనిపోయే ముందు వాళ్లిద్దరూ ఎంత అవస్థపడ్డారు అన్న విషయాన్ని క్రీట్స్‌ అవిసెన్నా ఏ శ్లోకంలోనూ, ఏ ఆశ్వాసంలోనూ రాయనంత అద్భుతంగా వర్ణించాడు. విషం పెట్టిన దురాత్ముడూ, హంతకులైన ఇద్దరు సహచరులూ ఆ విధంగా ప్రాణాలు వదిలారు.
- ఇంగ్లిష్‌ మూలం : జెఫ్రీ చాసర్‌
- అనువాదం: ఎలనాగ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement