ప‌రకాయ ప్ర‌వేశం | Funday:New story of the week 25 nov 2018 | Sakshi
Sakshi News home page

ప‌రకాయ ప్ర‌వేశం

Published Sun, Nov 25 2018 1:17 AM | Last Updated on Sun, Nov 25 2018 1:17 AM

Funday:New  story of the week 25 nov 2018 - Sakshi

‘‘ఏమండోయ్, కాఫీ తాగేసి త్వరగా తయారయారంటే వేడి వేడి పెసరట్లు మీకిష్టమైన అల్లం పచ్చడితో  వడ్డిస్తాను’’ ఒక చేతిలో కాఫీ కప్పునీ, మరో చేతిలో ఆవేళ్టి న్యూస్‌ పేపర్నీ పెట్టేసి హడావిడిగా వంటింట్లోకి దూరింది నా శ్రీమతి.  నా అలవాట్లనీ , ఇష్టాయిష్టాలని గమనించుకుని వాటికనుగుణంగా నడుచుకునే నా భార్య సుచిత్ర అంటే నాకు ప్రాణం. ఇంజనీరింగ్‌ చదువుతున్న మా ఒక్కగానొక్క కొడుకు రోహన్‌ పద్ధతిగా ఉంటాడు. పడగ్గదిలో కూర్చుని పేపర్‌ చదువుతున్న నాకు హాల్లో నుంచి మా సుపుత్రుడు వాళ్ళ అమ్మతో పెద్దగొంతుకతో వాదిస్తుండడమూ, ఆవిడేమో కొడుక్కి నచ్చజెప్పే ప్రయత్నం చేయడమూ తెలుస్తోంది. ‘‘అమ్మా, మన ఇంటెదురు బంగాళాలోని కృష్ణమోహన్‌ అంకుల్‌ వున్నారే, ఆయన వాళ్ళ అబ్బాయికి, అదేనమ్మా నా క్లాస్‌మేట్‌ మదన్‌కి పుట్టినరోజు బహుమతిగా కారు కొనిచ్చారు. నా పుట్టినరోజుకి కారు కాదు కదా కనీసం ఒక చిన్న బైక్‌  కూడా కొనివ్వలేదు నాన్న. ఆ అంకులూ, నాన్నా కలిసే చదువుకున్నారు కదమ్మా, కాలేజీ మొత్తమ్మీద నాన్నేమో ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకుంటే అంకుల్‌ మాత్రం అత్తెసరు మార్కులతో పాసయ్యారని నాన్నే చెబుతుంటారుగా! అలాంటిది, అంకుల్‌ చక్కగా సొంత బిజినెస్‌ పెట్టి అంతెత్తుకి ఎదిగితే, నాన్నేమో ఎదుగూబొదుగూ లేని గవర్నమెంట్‌ ఉద్యోగంలో కూరుకుపోయారు. ముడుపులని ముట్టుకునేది లేదంటూ మడికట్టుక్కూర్చున్నారు. ఎంత చాతకానితనమమమ్మా అది ! నువ్వైనా కాస్త చెప్పొచ్చుగా నాన్నకి’’ \ రోహన్‌ మాటలకి షాక్‌ తిన్నాను. ‘‘మా వాడికి నా మీద వున్న అభిప్రాయం ఇదా ? వీడి దృష్టిలో నేను చేతకాని వెధవనా?’’  ‘‘డబ్బుతో అన్నీ కొనుక్కోలేమురా నాయనా. ఉన్నంతలో సర్దుకుపోవడంలో వున్న సుఖం ఎందులోనూ లేదు’’ 
కొడుకు మాటలకి బాధపడ్డ మనసు మా ఆవిడ మాటలకి కాస్త తేరుకుంది.

‘‘డబ్బుతో కార్లనీ , బైకులనీ కొనగలము కానీ సరదాలనీ, సంతోషాలనీ కొనలేము రోహన్‌. మన పక్క ఫ్లాట్‌లో వుండే మమత ఆంటీని చూడు, ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఎంత ఆనందంగా వుంటుందో! వాళ్ళాయన శంకర్రావ్‌ ఊరూపేరు లేని ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగస్తుడు. అయితే ఏం, భార్యని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు!  రోజూ ఠంఛన్‌గా సాయంత్రం అయిదుగంటలకల్లా ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చేస్తాడు.  వారంవారం భార్యాభర్తలిద్దరూ కలిసి సరదాగా సినిమాలకి వెళ్తారు. మీ నాన్నలాగా భార్య  మొహాన నాలుగు డబ్బులు విదిలించేసి ‘నీకిష్టమైనవి కొనుక్కో’ అనకుండా ఆవిడకి తోడుగా దగ్గరుండి  సెలెక్ట్‌ చేసి మరీ ప్రతీ పండక్కీ కొత్త నగలనీ, చీరలనీ కొంటాడు. పుట్టినరోజులనీ, పెళ్లిరోజులనీ వాళ్ళెంత సరదాగా జరుపుకుంటారో నీకూ తెలుసుగా! అదీ జీవితమంటే. దేనికైనా పెట్టి పుట్టాలి!’’నిర్వేదంగా వినిపిస్తున్న మా ఆవిడ మాటలకి నిర్ఘాంతపోయాను. ‘‘సుచిత్ర మనసులో నా పట్ల అంతటి  అసంతృప్తి పేరుకుపోయిందా?’’  రెండు చేతులా డబ్బులని సంపాదించే కృష్ణమోహన్, భార్యతో రోజంతా సరదాగా గడిపే శంకర్రావ్‌లాంటి వాళ్ళవే నిండైన జీవితాలన్న విషయం యిప్పుడిప్పుడే నా మనసుకి బోధపడసాగింది.  పరకాయప్రవేశం చేసైనా సరే ఆ కృష్ణమోహన్, శంకర్రావ్‌ల శరీరాల్లో దూరి సిసలైన సంతృప్తిని తనివితీరా అనుభవించడమే కాకుండా వాళ్ళని చూసి నేర్చుకోవలసినదంతా నేర్చుకుని వాళ్లకిమల్లే నేనూ నా భార్యాబిడ్డల్ని సంతోషపెట్టాలన్న వాంఛ పెరిగిపోసాగింది. అసంభవమని తెలిసినా ‘‘స్వామీ, ఒక్కసారి వాళ్లిద్దరి మనసుల్లో దూరి నిజమైన సంతృప్తిని అనుభవించే అదృష్టాన్ని నాకు కల్పించవూ’’ అంటూ నా ఇష్టదైవమైన శివుడిని నాకు తెలీకుండానే రెండు చేతులూ జోడించి భక్తితో వేడుకున్నాను. ‘‘‘ఓం శంభో శంకరా’ అంటూ భక్తితో నన్ను స్మరించుకుని ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటావో ఆ వ్యక్తి శరీరంలోకి నీ మనసు ప్రవేశించగల వరాన్ని నీకీ క్షణమే ప్రసాదిస్తున్నాను.’’ ‘‘ధన్యుడను స్వామీ’’‘‘శుభమస్తు’’ అంటూ ఆశీర్వదించి అంతర్ధానమయాడు పరమశివుడు.

‘ఓం శంభో శంకరా’ అనుకుని ఆ పైన శంకర్రావ్‌ పేరుని తలచుకున్నదే తడవుగా మనసు వాయువేగాన వెళ్లి శంకర్రావు శరీరంలోకి ప్రవేశించింది. మా ఆవిడ చెప్పింది నిజమేలాగుంది. వాళ్ళావిడ భుజం చుట్టూరా చెయ్యేసి సరదాగా మాట్లాడుతూ మాల్‌లో షాపింగ్‌ చేస్తున్నాడు శంకర్రావ్‌. ఈ వేళ ఆదివారమేమీ కాదే!  ఆఫీస్‌కి సెలవు పెట్టాడేమో మరి.  అటువైపు ఫోన్లో మాట్లాడుతున్నది అతని బాస్‌ కాబోలు, వినయంగా సమాధానమిస్తున్నాడు. ‘‘సార్, మా బామ్మకి సీరియస్‌ అయితే ఐసీయూలో పెట్టారండీ, అందుకే ఈవేళ ఆఫీస్‌కి రాలేకపోతున్నా’’ ‘బీప్‌’  అంటూ శబ్దం రావడంతో ఫోన్‌లో వచ్చిన మెసేజ్‌ ని చదువుకుని హుషారుగా నవ్వుకున్నాడు శంకర్రావ్‌. ‘‘మమతా డార్లింగ్, ఆఫీస్‌ నుండి ఒకటే ఫోన్లు, అర్జెంటు పని. యిలా వెళ్లి అలా పని ముగించుకుని వచ్చేస్తానే, ఈలోగా నువ్వు నీ షాపింగ్‌ పని పూర్తి చేసుకో’’ అంటూ ఆగమేఘాల మీద బయల్దేరాడు. ‘‘మీరెప్పుడూ ఇంతే, నాతో షాపింగుకని రావడం, వచ్చిన పదినిమిషాలకే ఆఫీస్‌ పనంటూ వెళ్ళిపోవడం. ఛ ఛ.’’ వాళ్ళావిడ విసుక్కుంటున్నా విననట్లుగానే వెళ్లిపోయాడు శంకర్రావ్‌. అతనితో పాటే నా మనస్సూనూ ! శంకర్రావ్‌ బైక్‌ ఒక చిన్న ఇంటి ముందు ఆగింది.  ‘‘ఇతను పని చేసేది మరీ ఇంత చిన్న ఆఫీస్‌లోనా?’’ ఈలోగా తలుపులు తెరిచి వాకిలికి అడ్డంగా వయ్యారంగా నిలబడ్డ ఓ  ముప్ఫైరెండేళ్ళ పడతి నడుం మీద సుతారంగా వేళ్లతో మీటుతూ ఆమె భుజం మీద చెయ్యేసి ఆ యింట్లోకి.., కాదు కాదు, సరాసరి ఆమె బెడ్రూమ్‌లోకి ప్రవేశించాడు శంకర్రావ్‌.  ఉన్నపళాన ఇంటికి వెళ్లి మా ఆవిడని తీసుకొచ్చి ఇదంతా చూపించి ‘‘వీడి గురించేనా నువ్వంత గొప్పగా మాట్లాడింది?’’ అంటూ నిలదీయాలనిపించింది.  ఛ ఛ, చూసింది చాలు. ఇలాంటి మోసగాడి శరీరంలో యిక ఒక్క క్షణమైనా వుండలేను బాబూ !

శివనామస్మరణ చేసుకుని కృష్ణమోహన్‌ శరీరంలోకి చేర్చమంటూ మనసులో ప్రార్థించాను.మురికి కూపంలాంటి శంకర్రావ్‌ దేహం నుంచి బయటపడ్డ నా మనసు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని కృష్ణమోహన్‌ శరీరంలోకి ప్రవేశించింది. అసలు కృష్ణమోహన్‌ శరీరంలో మనసు ఉండవలసిన చోటంతా ఖాళీ !మనస్సనే ఛాయలే లేకుండా మనిషి వుండడం నాకెంతో అయోమయంగా తోచింది. ఇంతలో ఏవో ఫైళ్ల ని చేత్తో పట్టుకుని ఛాంబర్‌ లోకి వచ్చి కృష్ణమోహన్‌కి ఎదురుగా కూర్చున్నాడు ఒక వ్యక్తి. ‘‘మూర్తీ, ఆ గవర్నమెంట్‌ ఫ్లైఓవర్‌  కాంట్రాక్టు విషయం ఏమైంది? ఆ ఆఫీసర్‌తో డీల్‌ విషయం మాట్లాడావా?’’‘‘సార్, ఆ పోస్ట్‌లోకి కొత్తగా బదిలీ అయి వచ్చిన ఆఫీసర్‌ చాలా స్ట్రిక్ట్‌. ఎంత పెర్సెంటేజీ ఆఫర్‌ చేసినా అతనొప్పుకోవడంలేదు.’’‘‘పోనీ డబ్బు కాకుండా అతనికి మరేవైనా బలహీనతలున్నాయేమో కనుక్కున్నారా?’’‘‘ ఆడవాళ్ళ పిచ్చి బాగా ఉందని తెలిసింది సార్‌.!’’ ‘‘మరింకేం, వాడికి కావలసిన పిల్లని పంపిస్తే సరిపోతుందిగా ! ‘‘‘‘ కొత్త అమ్మాయిలని పట్టుకోవడం చాలా కష్టంగా వుంది.’’రెండు క్షణాల పాటు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ‘‘ప్రస్తుతానికి నా పీయే రజిత ఉందిగా , దాన్ని ఎర వేసేయండి’’‘‘ఆ పిల్ల యిలాంటి పనులకి ఒప్పుకోదు సార్‌ ’’‘‘కొత్తగా మాట్లాడుతున్నావేమిటి మూర్తీ? గతంలో ఎంతమంది కన్నెపిల్లలని బలవంతంగా మనమిలాంటి పన్లకి ఉపయోగించుకోలా? అంతగా ఆ పిల్ల బెట్టుచేస్తే ఏ కాఫీలోనో రేవ్‌ డ్రగ్‌ కలిపిచ్చేయండి. డ్రగ్‌మత్తులో ఏం జరిగిందీ ఎవ్వరికీ గుర్తుండదు. ఇవి కూడా నేనే చెప్పాలా?’’ చిరాకుపడ్డాడు కృష్ణమోహన్‌.‘‘అలాగే సార్‌’’మూర్తి వెళ్ళిపోయాక చేత్తో ఒక ఫైల్‌ ని పట్టుకుని మరొక వ్యక్తి ప్రవేశించాడు. ‘‘ఏవయ్యా గుప్తా, నాల్గు నెలలుగా ఆ టేబుల్‌ నుండి మన మెట్రో కాంట్రాక్టు ఫైల్‌ అరంగుళం కూడా కదలడం లేదు. ఎంతాలస్యంజరిగితే మనకంత నష్టమని తెలీదా నీకు?’’ వచ్చిన వ్యక్తిని గద్దించాడు కృష్ణమోహన్‌.‘‘ఏం చేయమంటారు సార్‌? ఆ సీట్‌లో వున్న రామరాజు సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే. ఎన్ని ప్రలోభాలు చూపినా అతను దేనికీ లొంగట్లేదు’’‘‘సరే, యింక చేసేదేముంది. లేపించేయ్‌ ఆ శాల్తీని’’సింపుల్‌గా చెప్పేసి టేబుల్‌ మీద ఉంచిన ప్లేట్‌ లోని బిస్కెట్లని తింటూ టీ తాగసాగాడు కృష్ణమోహన్‌. భయంతో మనసు జలదరించింది.అప్పుడే ‘నోట్ల రద్దు’ అనే వార్త చూసి కృష్ణమోహన్‌కు గుండె పోటు వచ్చింది.కష్టం మీద ‘ఓం శంభో శంకరా’ అంటూ ఈశ్వరుడ్ని ప్రార్థించి అక్కడి నుండి బయటపడింది నా మనసు. ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చి అడ్డమైన దుర్గంధాలన్నీ అంటించుకుని వచ్చిన మనసుకి నా శరీరాన్ని చేరుతూనే అంటుకున్న మురికంతా మటుమాయమైపోయి ఒళ్ళంతా తేలికయినట్లపించింది. 

‘‘మళ్ళీపడుకున్నారేమిటండీ ? లేవండీ’’మా ఆవిడ మాటలకి దిగ్గున లేచా ! ‘‘ఏమండీ, ఈ విషయం విన్నారా? మన ప్రక్క ఫ్లాట్‌ శంకర్రావ్‌ లేడూ, అతనికి ఇదే ఊళ్ళో చిన్నిల్లుందటండీ! ఆ సంగతి తెలిసినప్పటి నుంచి పాపం వాళ్ళావిడ ఒకటే ఏడుస్తోంది. ఏమైనా నాకుమల్లే అందరికీ శ్రీరాముడిలాంటి భర్త దొరకడమంటే మాటలా చెప్పండి? ’’ నా సమాధానంకోసం ఎదురు చూడకుండానే నేను ఖాళీ చేసిన కాఫీకప్పు తీసుకుని వెళ్ళిపోయింది సుచిత్ర. ఆవిడలా వెళ్లిందో లేదో యిలా పరిగెత్తుకుంటూ వచ్చాడు మా పుత్రరత్నం.‘‘నాన్నా ,  మన కృష్ణమోహన్‌ అంకుల్‌కి గుండెపోటు వస్తే  హాస్పిటల్‌లో చేర్పించారట! పోలీసులకి ఆయన గోడౌన్లలో రద్దు చేసిన పెద్దనోట్ల కట్టలు కోట్లకొద్దీ దొరికాయట! కాలేజీలో తన పరువుపోయిందని చెప్పి వాళ్ళ అబ్బాయి మదన్‌ క్లాసులకి రావడం మానేశాడు. కాలేజీమొత్తం ఇదే చర్చ నాన్నా. ‘పై రాబడి వచ్చే అవకాశాలున్న వుద్యోగం చేస్తూ కూడా ఈ కాలంలో నిజాయితీగా ఎంతమంది వుంటారండీ? మన రోహన్‌ నాన్నలాగా  నీతిగా, పరుల సొమ్ము ఆశించకుండా నిబద్ధతతో జీవించేమనుషులని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు’ అని మా లెక్చరర్లంతా అంటుంటే నాకెంత సంతోషమేసిందో తెలుసా!  ఐయాం వెరీ ప్రౌడాఫ్‌ యూ నాన్నా.’’నా చేతులని పట్టుకుని గట్టిగా ఊపేస్తున్న మా వాడి కళ్ళల్లో ఆ క్షణాన నాపట్ల కనిపించిన ఆరాధనా, కొద్ది ఘడియల ముందర మా ఆవిడ తన మాటల్లో నాపై వ్యక్తపరచిన నమ్మకమూ, ప్రేమా యివి కావూ అసలైన నిధులు!
- అప్పరాజు నాగజ్యోతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement